Sunday, May 10, 2015

మా త్రిచి ప్రయాణం

త్రిచి ప్రయాణం

త్రిచి లేదా తిరుచ్చి లేదా తిరుచిరాపల్లి గా పిలేవబడే త్రిచి కి వెళ్ళటానికి మైలదుతరై  ఎక్ష్ప్రెస్స్ బెంగుళూరు సిటీ జంక్షన్ నుండి వెళుతుంది అని తెలిసి రెండు నెలల ముందు నుంచే బుక్ చేసుకున్నాము. ఇదే ట్రైన్ తంజావూరు కూడా వెళుతుంది. కుంభకోణం, తంజావూరు, చిదంబరం ట్రిప్ మరొకసారి చూసుకుందాం అని ప్రస్తుతానికి త్రిచి ఆ చుట్టకపక్కల వున్నా క్షేత్రాలు చూసుకుని వచ్చేద్దమనుకుని టికెట్స్ బుక్ చేసుకున్నాము. జనాలందరూ డిసెంబర్ 31న న్యూ ఇయర్ సెలబ్రేసన్స్ లో బిజీ గా వుంటే మేము మాత్రం త్రిచి ప్లానింగ్ లో వున్నాము (మేము కూడా లేట్ గా బాగా ఎంజాయ్ చేసాము అనుకోండి తరువాత :) ). మొత్తానికి అయిదుగురు స్నేహితులం ఫిబ్రవరి 27న రాత్రి 7 గంటలకు ట్రైన్ పట్టుకుని బయలుదేరాము. త్రిచి చేరేసరికి ఉదయం సుమారు 4 గంటలు ఐంది.

ముందు ఒక విషయం మరొకసారి చెప్పాలి. త్రిచి లేదా తిరుచ్చి లేదా తిరుచిరాపల్లి ఏది అన్నాగాని ఒక్కటే.  త్రిచి చేరాక ఒక హోటల్ లో దిగాము. రెండు బెడ్లు, టీవీ తో పాటు కొద్దిగా దోమలు కూడా వున్నాయి :). తరువాత రోజు హోటల్ వాడిని అడిగితే "అల్ అవుట్" ఇస్తాను అన్నాడు. వాటితో పాటు మనం కూడా పోతామేమో అని సరేలే అని సరిపెట్టాను :). హోటల్ రంగనాథ స్వామి గుడి పక్కన ఒక ఫర్లాంగ్ అంత దూరంలో వుంది. ప్రొద్దునే అందరు కాలకృత్యాలు, స్నానాదులు అయ్యేసరికి తొమ్మిది గంటలు దాటింది. తొమ్మిది తరువాత దర్శనం బ్రేక్ వుంది. సరేలెమ్మని ఆదిత్య హృదయం చదువుకుని ఎవరికి తోచిన పూజలు వారు చేసుకున్నారు. గుడి గోపురంని చూసుకుంటూ హరే రామ మంత్రాన్ని జపిస్తుంటే ఒక రకమైన వైబ్రేషన్స్ ఫీల్ అయినాను. బ్రేక్ టైం దాటినా తరువాత దర్శనానికి బయలుదేరాము.

      ప్రధాన గుడి గోపురం దాటి, లోపల వున్న ఒక్కో గోపురం మెల్లిగా దాటుకుంటూ వుంటే ప్రపంచంలోనే అత్యదిక పెద్ద దేవాలయం - 21 గోపురాలు, 156 ఎకరాల విస్తారం, ఆళ్వార్లు మంగళాశాసనంలో కీర్తించిన 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో అతి ప్రధానమైనది, 'భూలోక వైకుంఠమ్' సార్ధకనామదేయంలా అనిపించింది. అస్సలు శ్రీ రంగ క్షేత్ర స్థలపురాణం ఒక వైచిత్రి. శ్రీ రామ పట్టాభిషేక సమయంలో శ్రీ రాములవారు విభీషణునికి లంక చేరేవరకు నేలపై పెట్టరాదన్న నియమమముతో, ప్రేమతో బహూకరించిన విమానం, వెళ్ళేదారిలో సంధ్యా వందన సమయమవటంతో ఆర్గ్య ప్రదానం కోసం కనిపించిన బాలునికి 3 సార్లు పిలిచేలోపు వస్తాను అనే షరతుతో అప్పగిస్తే, ఈలోపు బాలుడు పిలవటము, సంధ్య మధ్యలో రాలేకపోవటం, బాలుడు అది కిందపెట్టేస్తే అది శ్రీ రంగ క్షేత్రం అవ్వటం, బాలకరూపంలో వచ్చిన వాడు వినాయకుడు అవ్వటం, భక్తులను వుద్దరించటానికి భగవంతుడు చేసిన వైచిత్రి కాకా మరేమిటి :).

ఐతే వెళ్ళే దారంతా చిన్న చిన్న గుడులు, ప్రాకారాలు అన్ని కనిపించినా సిటీ మొత్తం గుడిలోకి వచేసింది ఏమో అని అనిపించింది. మొత్తం దారి అంతా వ్యాపారాలు చేసుకుంటూ పట్టణాన్ని గుడిలోకి తిసుకోచ్చేసినట్టు అనిపించింది. గుడిలో ప్రవేశించిన తరువాత అక్కడక్కడ మొత్తంగా గుడిని అభివృద్ధి చెయ్యటానికి, చాల చోట్ల పునః నిర్మాణం చేస్తున్నట్టు కనిపించింది. (ఈ పనుల్లో భాగంగా ఒక చీకటి గది లోపలి ఏదో సొరంగ మార్గం కనిపించినట్లు మొన్న ఈనాడు లో చదివే వుంటారు). గర్భగుడిలో రంగనాథ స్వామి విగ్రహం శయన రూపంలో ముగ్ధ మనోహరం గా వుంది. ఉత్సవ విగ్రహాలు లాగా విగ్రహాలు ముందు కనిపిస్తూ వాటి వెనకాల స్వామి వున్నాడు. ఆ విగ్రహాల వెనుకున కాస్త చీకటిగా ఉండటంతో స్వామిని గబ్బుక్కున గమనించలేము. మొత్తానికి దర్శనం బాగా ఐంది. కాస్త ప్రసాదాలు అవీ తీసుకుని అక్కడకు ఒక కిలోమీటరు దూరంలో వున్న పంచభూత క్షేత్రం ఐన తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం వెళ్ళి పంచభూతాలలో జలరూపానికి ప్రతీకగా కొలువై వున్న స్వామిని  దర్శించుకుందామని బయలుదేరాము. గుడిలో వున్న షాపులలో శ్రీ రంగం క్షేత్ర వైభవం వైభవాలు ఒక రెండు కొన్నాము. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది కొన్నాము. పెద్దది - వాసవి పబ్లికేషన్స్ వారిది. ఇది బాగానే వుంది. చిన్నది ఐతే చాలా కష్టం. తెలుగు రాని వారు తెలుగు రాసినట్టు, వాటిలో తెలుగు అవగాహనకు కాస్త కష్టంగా వుంది. అచ్చు తప్పులు, భాష విషయంలో కొద్దిగా సంస్కరించాలి.

    
      జంబుకేశ్వరం వెళ్లేసరికి మధ్యానం అవుతుంది. గుడిలో స్వామికి అభిషేక సమయం జరుగుతుంది కావాలంటే  లోపలికి పంపుతారు టికెట్ వెల 250/- అని చెప్పారు. అంతకన్నా మహాదృష్టమా! స్వామీ అనుకుంటూ అందరమూ అభిషేకానికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేటపుడు ద్వారం కొంచెం చిన్నగా ఏనుగు దూరేటంత పెద్దదిగా లేకపోవటం గమనించాము. చాగంటి కోటేశ్వరావు రావు గురువు గారు చెప్పిన విషయాలు, స్థల పురాణం జ్ఞప్తికి వచ్చాయి. వాటిని ప్రతిఫలిస్తూ ద్వారం మీద బొమ్మలు వున్నాయి. జంబూక మహర్షి జంబూక (నేరేడు) చెట్టు రూపంలో శివుని గూర్చి తపస్సు చెయ్యటం వల్ల ఆ మహర్షి పేరుమీదుగా జంబుకేశ్వరం వచ్చింది. కోచెంగణ్ణన్ (యెర్రని కన్నుల గలవాడు) అనే చోళరాజు పూర్వజన్మలో సాలె పురుగు. శ్రీకాళహస్తి స్థలపురాణ గాథ తెలుసు కదా ! అలా ఇక్కడ రాజు పూర్వజన్మలో సాలెపురుగు. శివ పూజ విషయంలో యేనుగు, సాలెపురుగు మధ్య యుద్ధం జరగటం, రెండు చనిపోవటం. సాలె పురుగు యొక్క శివ భక్తీ ఫలితంగా ఈ జన్మలో రాజుగా  పుట్టడం, కానీ పూర్వజన్మ వాసనా ఫలితంగా శివ భక్తితో పాటు, ఏనుగు పైన వైరము అలానే కొనసాగటం జరిగాయి. అందుకే రాజు 700 పైచిలుకు ఆలయాలు నిర్మించిన కూడా, స్వామి దగ్గర గర్భగుడి ద్వారం ఒక మనిషి పట్టేటంత, ఏనుగు దూరనంతది నిర్మించాడు. కర్మ, పగ, కార్పణ్యాలు పేరుతో కూడిన జీవితాలు, వాటి తాలూకు వాసనలు జన్మజన్మాంతరాల కొనసాగింపుతో, అవి ఎంత దూరం తిసుకోపోతాయో గురువు గారు ఈ విషయంగా ఉదాహరణతో చెప్పారు. ఇక్కడే అఖిలాండేశ్వరి అమ్మవారు, శివుని గురురూపంగా ఆరాదించినందువల్ల ఇక్కడ వారిరివురికి కళ్యాణం చెయ్యరు.

     ఇంక గర్భగుడిలోకి వెళ్ళినతరువాత లోపల అభిషేకం జరుగుతుంటే మెట్లమీద కూర్చుని చూస్తున్నాము. గోడకి చిన్న చిన్న రంద్రాలు వున్నాయి. వాటిలోంచి స్వామిని, స్వామి కి జరిగే అభిషేకం చూడవచ్చు. అభిషేకం చాలా బాగా జరిగింది. జల లింగం అన్నది ప్రతిఫలిస్తూ తరువాత దర్శనంలో నీటి ఊట లింగం కింద నుంచి వస్తూండటం గమనించాము. ప్రసాదం స్వీకరించి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అనేక వుపాలయాలు, దేవత విగ్రహాలు వున్నాయి. కెమరాకు టికెట్ వుంది. ఫోటోలు అవి ఆలయ ప్రాంగణంలో కొంత దూరం వరకు (ద్వజస్తంబం, ఆలయ ప్రదక్షిణం) అనుమతిస్తున్నారు.

మధ్యానం కొంచెం విశ్రాంతి తీసుకుని స్నానాదులు చేసుకుని సాయత్రం మలైకొట్టై ఉచ్చిపిళ్ళైయార్ అని రాక్ టెంపుల్ పైన వున్న గణపతి ని దర్శించుకోవటానికి బయలు దేరాము. రాక్ టెంపుల్ దర్శించుకుని తీరవలసిన ప్రదేశం. 400 పైగా మెట్లు వున్నాయి. మధ్యలో అనేక ఉపాలయాలు వుండటం వల్ల ఆగి, ఆగి ఎక్కటం వల్ల శ్రమఅంతగా తెలియలేదు. అనేక ఉపాలయాలు దర్శించుకుంటూ కొండకోమ్మున ఉన్నట్టి గణపతిని చేరుకొని దర్శనం చేసుకున్నాము. గుడి మూసేస్తారేమో అని ఉరుకులు పరుగులు పెట్టమేమో మొత్తానికి స్వామి దర్శనం తరువాత కాస్త విశ్రాంతిగా కిందకు వస్తుంటే అనేకమంది మెట్ల మీద, పక్కన కొండ చరియలు మీద కూర్చుకుని  ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. సరేలెమ్మని మేము కూడా కొన్ని సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని ఒక పదిహేను నిముషాలు కూర్చుని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక రోడ్ మీదకు వెళ్ళాలి. రోడ్ మీద నుంచి మెయిన్ రోడ్ మీదకు ఒక అర కిలోమీటరు దూరం వుంటుంది ఏమో. అక్కడే కొంచెం క్రిందిగా గణపతి గుడి వుంది. అంటే అస్సలు చెప్పాలంటే అక్కడ గుడి నుంచి కొండ ప్రారంభం అవుతుంది అనుకోవచ్చు. అక్కడ కూడా దర్శనం ఐయ్యాక మీరు మెయిన్ రోడ్ వెళ్ళాలంటే చెప్పులు చేత్తోపట్టుకుని ఈ క్రింది గుడి నుంచి వెళ్ళవచ్చు అన్నారు. అంటే ఒక్క గుడి బిల్డింగ్ అనుకుంటే ఒక్క బిల్డింగ్ దాటితే సరి అవతల రోడ్ కి వెళ్లిపోవచ్చు. చేత్తోపట్టుకోవటమో, మరొకటో గుడిలో చెప్పులు అని ఎందుకో మనసొప్పలేదు. ఎన్నో కష్టనష్టాలకు వోర్చి తీర్ధయాత్రలు చేస్తారు. చిన్న చిన్నవి గానే కనిపిస్తున్నా ఎందుకో కొన్ని విషయాలలో సర్దుకుపోలేము కదా :). మీరు వెళ్ళితే వెళ్ళండి నేను మాత్రం తిరిగి వస్తాను అని ఒక కిలోమీటరు చుట్టు తిరిగి వచ్చి మా వాళ్ళను కలిసాను :(. మొత్తంగా ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం లేకపోవటం, కొండపైకి వాహన దారి లేకపోవటం వల్ల మా స్నేహితుడు ఒకరు దర్శనం చేసుకోలేకపోయారు. రోప్ వే నో, మరొకటో అభివృద్ధి చేస్తే, వృద్దులు, వికలాంగులు, పిల్లల్లు మొదలైన వారికీ సౌకర్యం గా వుంటుంది. మా స్నేహితుడి కి ఈ ఒక్క గుడి విషయంలో మినహా, మా ట్రిప్ అంతా బాగా జరిగింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇందాక శ్రీ రంగనాథ ఆలయ క్షేత్ర కథ చెప్పాను కదా, పిల్లవాడు ఆ విమానాన్ని కింద పెట్టిన పిమ్మట, ఇంక కదలటం లేదన్నకోపంతో విభీషణుడు ఆ బాలుడిని తరిమాడు. అలా తరిమి, తరిమి ఎట్టకేలకు పట్టుకుని తన పిడికిలితో ఆ బాలుడి తలమీద గట్టిగా కొట్టాడు. అంతే స్వామి నిజరూపంతో దర్శనమివ్వటం జరిగింది. ఐతే అప్పటి దెబ్బ వల్లన వచ్చిన వాపు (బొప్పికట్టడం అంటారు కదా ) ఇప్పటికీ చూడవచ్చు అంటారు. 

ఇక తరువాత, ఏమైనా తిందామని తిరుచ్చి దగ్గరలోనే చదివిన మా వాడికి ఫోన్ చేస్తే బనానా లీఫ్ అని ఒక రెస్టారెంట్ వుంటుంది అక్కడకు వెళ్ళండి. బావుంటుంది అంటే వెళ్ళాము. అది శాఖాహారం, మాంసాహారం రెండు వున్నాయి. సెపరేట్ సెక్షనులు ఐతే లేవు. ఇంటి నుంచి బయటకు వచ్చాము అంటే ఇంక తప్పదు కదా. సరేలెమ్మని కాస్త బట్టర్ నానులు అవీ ఆర్డర్ చేసాము. ఫుడ్ పరవాలేదు. రెస్టారెంట్ లో తినటం ఐయ్యాక ఇంకా రూంకి వెళ్ళిపోయాము.

ఇంకా రెండో రోజు మొత్తం మూడు గుడులలో దర్శనం జరిగింది. వయలూర్ మురుగన్ టెంపుల్, సమయపురం మరియ్యమ్మన్ టెంపుల్, వెక్కాళియమ్మన్ టెంపుల్. ఇంకా చాలా ఆలయాలు చూడలేకపోయాము విరలిమలై మురుగన్ & తిరుపత్తూర్ బ్రహ్మ ఆలయం (బ్రహ్మపురేస్వరార్ - ఇక్కడ మీ ఫేట్ చేంజ్ అవుంతుంది అని స్థల పురాణం :) ). వాటిలో రెండు. మూడురోజులు ఐనా చాలదేమో మరి అన్నీ చూడాలంటే :)

ఇంకొంత సమాచారం :


శ్రీ రంగం గురించి ఇక్కడ చదవండి.

తిరువనైకావల్ లేదా జంబుకేశ్వర జలలింగం
గురించి ఇక్కడ చూడండి.

వయలూర్ మురుగన్ టెంపుల్ గురించి ఇక్కడ చూడండి.

వెక్కాళియమ్మన్ టెంపుల్ గురించి ఇక్కడ చూడండి

సమయపురం మరియ్యమ్మన్ టెంపుల్ గురించి ఇక్కడ చూడండి.

ఒక ఆటో మాట్లాడుకుని మురుగన్ టెంపుల్ కి వెళ్ళాము. చాలా పురాతన గుడిలా, నిరంతర అభిషేకాదులు, ధూప, దీపాదులతో పూర్ణత్వం చెందినట్లుగా వుంది. అక్కడ దర్శనం ఐయ్యాక వెక్కాళియమ్మన్ టెంపుల్ కి వెళ్ళాము. వెక్కాళియమ్మన్ టెంపుల్ పక్కనే మరియ్యమ్మన్ టెంపుల్ వున్నట్టు గూగుల్ మాప్స్ లో చూపించింది. కానీ వెక్కాళియమ్మన్ టెంపుల్ వెళ్ళాక తెలిసింది ఏమిటంటే గూగుల్ మాప్ లో చూపించిన మరియమ్మన్ టెంపుల్ లోకల్ టెంపుల్ అని తెలిసింది. ప్రసిద్దికెక్కిన మరియ్యమ్మన్ టెంపుల్ అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్లు దూరం అని తిలిసింది. వెక్కాళియమ్మన్ టెంపుల్ లో అమ్మవారికి పైకప్పు వుండదు. అప్పుడే అభిషేకం టైం ఐంది. అభిషేకం టికెట్స్ తీసుకున్నాము. అమ్మకి ఎదురుగా పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంది. చాలా అద్భుతమైన దర్శనం. సాక్షాత్తు అమ్మ ఎదురుగా నిలిచివున్నట్టుగా వుంది. ఎన్ని పూజల, సత్కర్మల ఫలితమో అనుకున్నాము. అక్కడ నుంచి వెక్కాళియమ్మన్ టెంపుల్ కి ప్రయాణం కట్టాము

ఇక్కడో విషయం చెప్పాలి అమ్మవారి ఆలయం లో ఒక పెద్దాయన పరిచయం ఐయ్యరు. నుదిటిన విభూతి రేకలతో ముఖంలో తేజస్సుతో వుపాసకులులాగా తోచారు. ఆయనే మరియ్యమ్మన్ టెంపుల్ దూరం గురించి చెప్పారు. అంతేకాదు ఆటో అతనితో కూడా మాట్లాడి తమిళంలో మేము ఉంటున్న అడ్రస్ కూడా రాసి ఇచ్చారు ఎక్కడైనా తప్పిపోతామేమో అని. అమ్మ కృప అంటే ఇలానే వుంటుంది ఏమో. దిక్కుతోచని స్తితిలో అంతా ఐపోయింది అనుకున్న సమయంలో మేజిక్ చేస్తుంది. అంతే సమస్య కాస్త దూదిపింజంలా ఎగిరిపోతుంది. అద్గది కదా అమ్మ శక్తి అంటే :). ఆవిడే పిలిచి ఆవిడే దర్శనం ఇప్పిస్తుంటే ఇంక మనం చెప్పేదేముంది.

వెక్కాళియమ్మన్ టెంపుల్, అత్యంత ప్రసిద్ది కెక్కిన సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటైన "పళని" తరువాత, రెండో అత్యధిక ఆదాయం ఆర్జించే టెంపుల్ గా చెప్పారు. చెప్పినట్టుగానే చాలా రద్దీగా వుంది. సరేలెమ్మని స్పెషల్ దర్శనం తీసుకున్నాము ఒక సంచిలో ప్రసాదాలు ఇచ్చారు. స్పెషల్ దర్శనం వేగంగానే జరిగింది. అంత మంది ,అమ్మ దర్శనం కోసం అన్ని వ్యయ ప్రయాసలతో అంత వేచి చూసి దర్శనం చేసుకుంటుంటే,  ఏదో ప్రివిలైజు దర్శనం అని చెప్పి మనం ముందు పోవటం, కొంచెం బాధ గానే వున్నా, ఇన్ని దర్శనాలు ఇస్తున్న భగవంతుని అనుగ్రహంకి కృతజ్ఞతలు, స్పెషల్ దర్శనం కి క్షమాపణలు ఒకేసారి చెప్పుకుని సరిపెట్టుకోవలిసి వచ్చింది. ఐతే మదురై ట్రిప్ లో ఈ విషయం అనుభూతికి, అవగాహనకి వచ్చింది. తరువాత మదురై ట్రిప్ లో చెబుతాను ఆ విషయం :). 

దర్శనాలు చేసుకున్నాక వచ్చి భోజనం చేసి కొంచెం విశ్రాంతి తీసుకుని, లాడ్జి ఖాలీ చేసి బయటకు వచ్చి ఆటో వాడిని రైల్వే స్టేషన్ కి ఎంత అని అడిగితె యథావిదిగా 250 రూపాయలు చెప్పారు. ఆంధ్ర వాళ్ళకి తమిళనాడులో ఎక్కడైనా ఇంతేలాగా వుంది :P. అక్కడకు దగ్గరలోనే ఒక బస్సు స్టాప్ వుంది. డ్రైవర్ ని అడిగితే రైల్వే స్టేషన్ కి వెళుతుంది అని చెప్పారు. మనిషికి 6 రూపాయలు తీసుకుని రైల్వే స్టేషన్ దగ్గర దింపారు. మొత్తం 30 రూపాయలతో ఐపోయింది. తమిళం నేర్చుకోవటమో, లేకపోతె వచ్చినవాడిని తీసుకోవటమో మంచిది అనిపించింది :). ట్రిప్ అంతా చాలా బాగా జరిగినందుకు, అన్ని దర్శనాలకు, అంతా దయకు, స్వామి అమ్మవార్ల కరుణకు ఉప్పొంగిపోతూ, విశేషాలు నెమరువేసుకుంటూ 'నమ్మ' బెంగలూరుకి పయనమయ్యాము.