ద్రాక్షారామం:
పిఠాపురం దర్శనాదుల తరువాత కాకినాడ వెళ్లి ద్రాక్షారామం లేదా దక్షారామంకి బస్సులో వెళ్ళాను. ద్రాక్షారామం కాకినాడకి 32 కిలోమీటర్లు దూరంలో వుంటే, రాజముండ్రికి 60 కిలోమీటర్లు దూరంలో వుంది.
దక్షారామం లేదా ద్రాక్షారామం, పురాణాలలో మనం విన్న దక్షుడు నిరీశ్వర యాగం తలపెట్టడం, యాగానికి వెళ్లి అవమానంతో సతీ దేవి యోగాగ్నిలో భస్మం అవ్వటం, వీరభద్ర ఆవిర్భావం, దక్ష యజ్ఞ విధ్వంసం ఇవన్నీ ఇక్కడే జరిగాయి. ఇక సతీవియోగంతో మృత శరీరంతో శివుడు విరాగిగా తిరుగుతుంటే, విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని 18 ఖండాలుగా ఖండిస్తే అవి 18 చోట్ల పడి 18 శక్తి పీఠాలుగా (అష్టా దశ శక్తి పీఠాలు) అలరారుతుండటం కూడా మనకు తెలిసిందే. ఆపైన తారకాసుర తపస్సు, శివుడు ఆత్మలింగ వర ప్రదానం, తారకాసుర ఆగడాలు, పార్వతీ కళ్యాణం, అనంతర 'కుమార సంభవం' తదుపరి సంఘటనలు. తారకాసుర సంహార నిమిత్తం కుమారస్వామి సంధించిన అస్త్రం శివ ఆత్మ లింగాన్ని 5 ముక్కలుగా ఛేదిస్తే అవి పడిన ప్రదేశాలే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పంచారామాలు.
ద్రాక్షారామం పంచారామాలలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటిగా, వ్యాస కాశీగా, త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ మూల విరాట్ట్ బీమేశ్వర స్వామి కాగా, అమ్మవారు దాక్షాయిణి. భీమేశ్వర స్వామి స్వయంభు లింగరూపంలో 14 అడుగుల ఎత్తు వుంటారు. ఆలయంలో క్రింద దర్శన అనంతరం పై అంతస్తులో పూజాదికాలతో మళ్లీ దర్శనం చేసుకుంటారు. అంటే రెండు అతస్తులలో వుంటుంది. ఇక్కడ లక్ష్మి నారాయణుడు క్షేత్రపాలకుడిగా వున్నాడు. ఇక్కడ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లొ ద్వాదశ (12) శక్తి పీఠంగా మాణిక్యాంబ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది. మన రాష్ట్రానికి త్రిలింగ దేశం గా పేరు రావటానికి కారణమైన మూడు క్షేత్రాలలో ఒక క్షేత్రం ద్రాక్షారామం కూడా.
మరిన్ని విశేషాలు వికీపీడియాలో చదవండి మరి
ఇక ఇక్కడ నేను వెళ్ళినపుడు దేవాలయం పక్కనే ఒక సత్రం (పైడి సత్రం అనుకుంట) వుంది. అక్కడ ఉచిత భోజనం కూడా పెడతారు అని చెప్పారు. అడ్మిషన్ ఏమి అవసరం లేదు. ఆ సత్రం డాభా పైన బాత్రుములూ అవి వున్నాయి. అక్కడ కాస్తా మొహం కడుక్కుని రిలాక్స్ అవ్వవచ్చు. ఇది చౌల్ట్రి వాళ్ళ సత్రం విరాళాలు అవి తీసుకోము అని చెప్పారు.
అలా కొద్దిగా ఎండగా వుంది. ఇంకా గుడి తియ్యలేదు అని చూస్తుంటే అప్పుడే గుడి తీసారు. గుడి తీసిన వెంటనే మొదటి అడుగు మనదే :). స్కూల్ పిల్లలు వాళ్ళూ వచ్చారు. ఉత్తరాది వారు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఎక్కువ మంది వచ్చినపుడు పూజారులే గైడులుగా మారుతారు అనుకుంట :). స్పెషల్ దర్శనం ఇక్కడ కూడా పది రూపాయలే. అంతరాలయ దర్శనం వుంటుంది. కోనేరు అంత పరిశుబ్రంగా వున్నట్టు కనిపించలేదు ఇక్కడ. ఇంకా అభివృద్ధి చెయ్యాలి. ఇక్కడ దర్శనం పూర్తి ఐంది.
బిక్కవోలు.
ద్రాక్షారామ దర్శన అనంతరం, బిక్కవోలు వినాయకుడి దర్శనం చేసుకుందామా అని అనిపించింది. బిక్కవోలుకి ద్రాక్షారామం నుంచి కంటే కూడా రామచంద్రాపురం నుంచి బస్సులు బాగా వుంటాయి అని తెలిసింది. సరే అని ఒక షేరింగ్ ఆటో పట్టుకుని రామచంద్రాపురం వెళ్లి అక్కడ నుంచి బస్సులో బిక్కవోలు చేరుకున్నాను.
బిక్కవోలుకు దగ్గర రైల్వే స్టేషన్ సామర్లకోట (సమాల్ కోట అని రైలు రిజర్వేషన్ లో వుంటుంది). బిక్కవోలు నుంచి కేవలం 10 కిలోమీటర్లు దూరం. బిక్కవోలు కాకినాడకి 31 కిలోమీటర్లు కాగా రాజముండ్రికి 39 కిలోమీటర్లు దూరంలో వుంటుంది.
బిక్కవోలులో నేను దర్శించిన క్షేత్రాలు :
గోలింగేశ్వర స్వామి ఆలయం & లక్ష్మి గణపతి ఆలయం (బిక్కవోలు వినాయకుడు)
బస్సు స్టాప్ దగ్గరే గోలింగేశ్వర స్వామి ఆలయ ఉండటంతో మొదట ఇక్కడే దర్శనం చేసుకున్నాను. ఆ తరువాత బిక్కవోలు వినాయక స్వామి ఆలయ దర్శనానికి వెళ్లాను. బిక్కవోలు వినాయకడు 11 అడుగుల ఏక శిలా విగ్రహమూర్తి, మహిమ గల దేవుడు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. ఇక్కడకు వచ్చిన భక్తులు స్వామి చెవిలో కోరిక నివేదించుకుని తీరిన తరువాత మళ్లీ వచ్చి దర్శనం చేసుకుంటారు. నిజాయితీతో కూడిన ధర్మబద్ధమైన కోరిక తప్పక తీరుతుంది అని ఆలయంలో స్వామి పక్కనే ఒక ప్రకటన కనపడుతుంది. ప్రాణాపాయ సమయంలో నేను కోరిన కోరిక అక్కరకు వచ్చి, ఫలించి, రక్షించటంతో, స్వామి దర్శనానికి ఎపుడెపుడు వెళ్ళాలా అని ఎదురుచూసిన నాకు, అప్పటికే ఆలస్యమైనా ఎట్టకేలకు అదేరోజు యాత్రలో స్వామి దర్శనం ఐంది. స్వామి దర్శనం అనుగ్రహించాడు అంటే కరెక్ట్ గా వుంటుంది.
బిక్కవోలు ఇతర ఆలయాలు, సమాచారం కొరకు ఇక్కడ నొక్కండి.
ఏ.పి.యస్. అర్.టి.సి. వాళ్ళు పంచారామాల ప్యాకేజి అని పంచారామాలు ఆలయాలు అన్నీ ఒకే రోజులో దర్శించుకునేలాగా అందిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వారిని సంప్రదించగలరు.
అంతర్జాలంలో లభించే ఇతర ఉపయోగకర లంకె. రాజచంద్ర గారి సైట్ నుండి
No comments:
Post a Comment