Sunday, June 28, 2015

శృంగేరి శ్రీ షణ్ముఖ టెంపుల్, రాజరాజేశ్వరి నగర్, బెంగలూరు.


ఈరోజు రాజరాజేశ్వరి నగరి, బెంగలూరులో వున్న శృంగేరి శ్రీ షణ్ముఖ ఆలయ దర్శనం చేసుకుందామని నలుగురు స్నేహితులం కాబ్ లో బయలుదేరి వెళ్ళాము. మేము వుండే చోటుకు 14 కిలోమీటర్లు దాకా వచ్చింది. వెళ్లేసరికి ఉదయం 9:30 గంటలు దాటింది. చల్లటి గాలులతో, ఆహ్లాదంగా వుంది. బెంగలూరు కొన్ని సంవత్సరాల ముందటి వాతావరణంలా, సిటీ కి దూరంగా, పచ్చటి బయళ్ళుతో, కొండ ప్రాంతం చాలా బావుంది.

దూరంగా విసిరివేసినట్టుగా వుండే కొండలమీద, షణ్ముఖ స్వామి ప్రేరణతో శృంగేరి శారద పీఠం యొక్క పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ స్వామి, డా. ఆర్. అరుణాచలం అనే కాంట్రాక్టర్ నియామకంతో నిర్మించబడినట్టి ఆలయం ఇది. ఈ ఆలయం షణ్ముఖ స్వామి సార్ధక నామదేయం ప్రతిఫలించేలా, ఆరుముఖలతో, ఆలయం అంతా స్టార్ ఆకారంతో నిర్మించబడింది.

దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిది, వైవిధ్యమైనది అనేట్టుగా ఈ ఆలయ గోపురం, ఆరుముఖాలతో షణ్ముఖ స్వామి రూపంలో వుంటుంది. ఆపైన గోపురం 2500 క్రిస్టల్స్ తో వుండి, సూర్య భగవానుడు ఎటు వైపు వున్నా, ఆ కిరణాలూ ప్రతిఫలించబడేటట్లు, ఒక రైన్ బో సృష్టించేలా  అమర్చబడ్డాయి. అంతే కాదు సూర్య కిరణ కాంతిని మూలవిరాట్ మీద ప్రసరించేలా (సూర్య కిరణ అభిషేక) 2 అడ్డంగా 2 నిలువుగా సెన్సార్లు అమర్చి రోజు మొత్తం మీద, సూర్యకిరణాలను వీలు అయినంతగా వడిసిపట్టేల అద్భుతంగా నిర్మించారు.

మనం ఆలయంలోకి ప్రవేశించటంతోనే విఘ్నేశ్వరుడు సింహవాహన రూఢుడై, పంచముఖ గణపతి రూపంలో దర్శనం ఇస్తాడు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కోదిశనుంచి ఒక్కో రంద్రం గుండా స్వామిని ఇన్ని ముఖాలతో దర్శనం చేసుకునేలగా ఏర్పాటు చెయ్యటం విశేషంగా వుంటుంది. పరమ శివున్ని సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాల దర్శనం చేసుకుంటాము కదా అలా. కాకపోతే ఒక్కో రంద్రం గుండా కొన్ని ముఖాల దర్శనం అవుతుంటుంది అన్నమాట :). ఇదే విధానం ఆలయం పైన షణ్ముఖ దర్శనంలో కూడా పాటించారు. కాకపోతే ఒకటే రంద్రం వెనుకగా వుంటుంది.

గణపతి దర్శనం ఐన తరువాత శివాలయం వుంది. ఇక్కడ పరమ శివుడు, స్పటిక శివలింగంగా దర్శనమిస్తున్నాడు. కుడిపక్కగా  అపీత కుచలాంబ (పార్వతి) అమ్మవారు దర్శనమిస్తే, ఎడమ పక్కగా చందికేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆలయం లోపలికి వెళ్ళేటపుడు దక్షిణ మూర్తి స్వామి వారు చిన్ముద్రతో కనిపిస్తారు. 


శ్రీ షణ్ముఖ ఆలయం లోపలి వెళ్ళేటప్పుడు బియ్యం, అటుకులు, నెయ్యి ఇతర పదార్ధాలు స్వామికి సమర్పించటానికి అమ్ముతున్నారు. మొత్తం సెట్ 620 రూపాయలు అనుకుంటా. విడిగా కూడా కొనుక్కోవచ్చు. లోపల అవి సమర్పించటానికి కొన్ని డబ్బాలు ఏర్పాటు చేసారు. అందులో వేసేస్తే స్వామికి చేరినట్టే. స్వామికి ఇక్కడ తులాబారం ఏర్పాటు చేసారు. కొన్ని విశిష్ట తిథులలో లేదా భక్తుల కోరిక మేరకు పుట్టిన రోజు లేదా సంవత్సరానికి ఒకరోజు ఏర్పాటు చేస్తాము అన్నట్టు ఒక బ్యానర్ కనిపించింది. ఆలయంలో స్వామి వల్లీ దేవసేన సమేతుడై దర్శనమిచ్చాడు. ఆలయం గర్భ గుడి మీద వేసిన ఆరుపడైవీడు క్షేత్రాలతో పాటు శృంగేరి మఠం పెయింటింగ్స్ ముచ్చటగొలిపి మా మదురై ట్రిప్ స్మృతులను గుర్తుకుతెచ్చి పారవశ్యానికి లోను లోనుచేసాయి. ప్రదక్షిణలో వెనుక వైపు సంపూర్ణ దర్శనం అని రాసి వుంది. అక్కడ నుంచి చూస్తే పూజ జరుగుతున్నస్వామి, వెనుకగా వున్న మూడు ముఖాలు కనిపించాయి.

మేము ఆలయ దర్శనం చేసుకుని కిందకి వచ్చిన వెంటనే కింద కరుమరియ్యమ్మన్ అమ్మవారి ఆలయం కనిపించింది. మైకులో లలిత సహస్రం జరుగుతున్నట్టు వినిపిస్తుంది. లోపలి వెళ్ళిన వెంటనే ఎడమ పక్కగా హోమారంబ ప్రయత్నాలు, కొంతమంది మహిళా భక్తులు లలిత సహస్రం చదువుతున్నారు. అమ్మవారు పాలరాతి విగ్రహంలా, సంతోషి మాతలాగా దర్శనమిచ్చారు. ఇక్కడ మండపంలో ద్వాదశ రాసులు కనిపించాయి. ఎవరి రాశి కెదురుగా, వారు కింద నుంచుని దండం పెట్టుకున్నాము :). హారతి, తీర్థప్రసాదాలు తీసుకుని బయలుదేరి వచ్చేసాము.

మరొకవిషయం ఏమిటంటే, శ్రీ శృంగేరి షణ్ముఖ ఆలయం కొండ మీదకి, కారుతో పైకి వెళ్ళేలా ఒక దారి వున్నట్టు తెలిసింది, అక్కడే కింద నుంచి చూస్తే ఒక దారి కూడా కనిపించింది. అదే కావచ్చు. అంతేకాక మెట్లదారితో పాటు పక్కన ఫుట్ పాత్ లాగా, మెట్ల మార్గంకి ప్రత్యామయంగా, సమాంతరంగా పైకి నిర్మించారు.  

ఆలయ వేళలు కోసం ఫోటో చుడండి. ఇతర సమాచారం నెట్ లో లభిస్తున్నది చూడగలరు.

http://www.sringeri.net/branches/karnataka/bangalore/rajarajeswari-nagari
https://www.facebook.com/ShrungagiriSriShanmukhaTemple/info?tab=page_info
http://prayanika-thejourney.blogspot.in/2012/10/hill-temples-of-bangalore-part-1.html