ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, తమిళ సంస్కృతికి పుట్టినిల్లు ఐన మదురై మీనాక్షి, సుందరేశ్వరుల దర్శనం గాంచాము. కంచి కామాక్షి, మధుర మీనాక్షి అంటూ తరచుగా వింటుంటాము. అలా వినటమే కానీ అస్సలు ఈ క్షేత్రాలు ఎక్కడ వుంటాయి, ఎలా వుంటాయి ఇత్యాదివి మనం ఇంటి నుంచి బయటకు వస్తే గాని తెలియవేమో !
అన్ని యాత్రల లాగా ఈ యాత్ర కూడా మరువలేని అనుభూతులను, భగవంతుని అపార విభూతులలో కొన్నిటిని అనుభవైకవేద్యం చేయించింది.
ఇతర ఆలయాలు వాలే కాక ఇక్కడ మొదట మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే, సుందరేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం విశేషం. అందుకే కాబోలు చాగంటి కోటేశ్వర రావు గురువు గారి ప్రవచనం లో ఒక చోట - తమిళనాట పెళ్లి సంబందాలు చూసేటపుడు అడుగుతారు అంట మీరు మదురై వారా లేకపోతె చిదంబరం వారా అని, మదురై వారు అంటే ఆడపిల్ల పెత్తనం అని, చిదంబరం వారు అంటే మగపిల్లవాడు యజమాని అని గల కుటుంబం అని (మన ఆంధ్ర కుటుంబాలులో లాగా పెత్తనం అనుకోండి. అన్ని కుటుంబాలు కావనుకోండి :) ).
ఒక్కోసారి అదృష్టం, దురదృష్టం గురించి ఆలోచిస్తే వింతగా అనిపిస్తుంది. కర్మ సిద్దాంతం ఏమి చెబుతుంది ? మంచికి మంచి చెడుకి చెడు. అంతే కదా ! ఒక వ్యక్తి భగవత్ సేవలో తన నైపుణ్యాన్ని వినియోగించాడు అనుకుందాం. ఒక వాద్యకారుడు, ఒక గాయకుడూ లేదా ఒక నాబోటి ఒక సామాన్యుడు అన్నదానం చేస్తుంటే తానో చెయ్యి వేసి వడ్డించే వాడో. ఇదే తదనంతరం పుణ్యంగా పరిణమించి, ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా ఆ సమయానికి అన్నం దొరకటం లాంటివి అన్నమాట. అదే భగవత్ కార్యానికి చెయ్యి ఇచ్చేవాడికి మరో విధంగా కీడు జరుగుతుంది అని చెప్పను కానీ రాబోయే కీడుని ఆపలేము అని చెప్పవచ్చు. భగవంతుడు తన సేవ చెయ్యలేదు కాబట్టి లేదా ధర్మాన్ని కాపాడలేదు కాబట్టి చెడు చేసాడు అని కాదు అర్థం. రాబోయే చెడుకి ముందు ఒక మంచి పని చెయ్యటం ద్వారా దాన్ని తగ్గించటం, లేదా రూపుమాపటం చెయ్యటం అన్నమాట. అంటే ఒక చెడు జరగటానికి ముందు ఇచ్చే అవకాశం. ఎందుకంటే భగవంతుడు మనలా నిర్దయుడు కాదు. ఒక చిన్న ఉదాహరణ ప్రతీ విజయవాడ మీదగా ఇంటికి వెళతాను. ఎప్పుడూ దుర్గ గుడికి వెళతాను. ఒకసారి ఇంతకు ముందు వెళ్ళలేదు. హాస్పిటల్ లో పడ్డాను వచ్చాక ! అంటే వెళ్ళలేదు కాబట్టి పడలేదు. ప్రతిసారి దర్శించుకుంటున్నా కాబట్టి ప్రతీసారి ఏదో ఒక ఆపద నుండి కాపాడబడ్డాను అని అర్థం :).
మా కొలీగు ఒకతను మదురై ట్రిప్ కి వెళ్లేముందు ఒక రోజు ముందు చెప్పమని చెప్పాడు. అలా చెబితే వి.ఐ.పి దర్శనం చేపిస్తాను అని చెప్పాడు. రెండు కారణాల వల్ల అన్యమస్కం ఐపోయాను. భక్తి పరంగా ఆతనే గాక, వాళ్ల కుటుంబ సభ్యులను వంక పెట్టలేము. కానీ ఉద్యోగ బాధ్యతా ధర్మంలో మాత్రం చాలా నిర్లక్ష్యం. స్వధర్మాన్ని మరిచే అలాంటి వారి దగ్గర సాయం పొందటం ఒక కారణం ఐతే అన్ని వేలమంది అన్ని అవసోపనాలు పడి దర్శించుకుంటుంటే మన మాత్రం ఆ ప్రత్యేక హోదాని పొంది దర్శనం చేసుకోవటం నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. మొదటి కారణం బలవత్తరమైనదే, అనంగీకారం అనిపించి తనకి చెప్పలేదు. వారి వూరు వెళ్ళిన విషయం వచ్చాక తరువాతెప్పుడో చెప్పాను.
ధర్మో రక్షిత రక్షితః వూరికేపోలేదు ఆ ధర్మ చింతన పూర్వక నిర్ణయం. మాకు వి.ఐ.పి దర్శనం లభించకనే లబించింది. మేము వెళ్ళిన రెండు సుబ్రమణ్య క్షేత్రాలలోను స్వామి ఎదురుగా నిలుచున్నాము. నిలుచున్నంతసేపూ కూడా అందరిని కదలమని చెప్పేవారే కాని ఏదో మంత్రం వేసినట్టు మమ్మలిని మాత్రం కదలమని చెప్పనే లేదు. ఎవరైనా చెబితే కదులుదామని అనుకుంటే ఎవరు చెప్పటం లేదు. మమ్మల్ని తప్ప అందరిని కదలమంటున్నారు :). తనివి తీరేవరకు చూడమనట్టుగా స్వామి అలా చిరునవ్వులు పూయిస్తుంటే, మోదకపూర్వక మోములతో బయటకు వచ్చాము :).
అంతే అప్పుడే ఇపొయినది అనుకుంటున్నారా ? ఇంకా షాక్ తినేవిషయం ఏమిటి అంటే మదురై నుండి రైల్ లో వెళ్ళేటపుడు మా బోగీలో మా బెర్త్ ఎదురుగా నిఖార్సైన పోలీసు ఆఫీసర్ ఆయుధం ధరించి రాత్రి అంతా కాపు కాయటం :). అమ్మ ఒడిలో పడుకున్నట్టు చాలా హాయిగా పడుకున్నాము. సామాన్యులకి అలా పోలీసులు రావటం కి కారణాలు వెతుకుతుంటే నాకు మా దర్శనానికి కొనసాగింపు వి.ఐ.పి భద్రత కనిపిస్తుంది. సుప్రీం కమాండర్ అఫ్ ది ఫోర్సెస్ - దేవసేన నాయకుడు, కుజుడికి అది దైవం (పోలీస్, మిలిటరీ ఈయన కంట్రోల్ అని చెబుతారు కదా) సుబ్రహ్మన్యుడి దర్శనం సంగతి మరిచిపోయారా. ఫలితాలు అలానే ఉంటాయి మరి :).
ఇక మా యాత్ర విషయానికి వస్తే టూటికోరన్ ఎక్ష్ప్రెస్స్ లో బెంగలూరు సిటీ జంక్షన్ నుంచి మదురై జంక్షన్ వరకు రిజర్వు చేసుకున్నాము. రైలువాళ్ళను ఒక విషయం లో అభినందించాలి. సరిగ్గా అన్ని క్షేత్రాలు ప్రొద్దునే బ్రాహ్మీ ముహూర్తకాలం లో చేరుకునే లాగా వెసులుబాటు కలిపించారు :). మేము ప్రొద్దునే స్టేషన్ దగ్గర దిగేసరికి ఆటో వాళ్ళు బాగా వున్నారు. యధావిదిగా టెంపుల్ దగ్గరలో ఒక లాడ్జి తీసుకున్నాము. పరవాలేదు. టెంపుల్ లో అష్టకాళ్ళ మండపం గుండా వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఆ మండపం లో ప్రవేశించగానే కుడి పక్కన మనకి అర్జున్ సినిమాలో "మధుర మధురకర మీనాక్షి కాశి లో విశాలాక్షి...." అంటూ చూపించిన ఆలయ కోనేరు మెట్లు కుడిపక్కన కనిపిస్తాయి. ఎదురుగా వినాయకుడు కనిపిస్తాడు. ఎడమ పక్కన అమ్మవారి ఆలయం కి ప్రవేశం. అమ్మవారి ఆలయ ప్రవేశం ఐయ్యాక వినాయకుడి దర్శనం వచ్చే దారిలో చేసుకోవచ్చు. అక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తాయి. అక్కడ కెమెరా టికెట్ కొనుకున్ని స్పెషల్ దర్శనం తీసుకున్నాము. స్పెషల్ దర్శనం రెండు రకాలు. ఒకటి 50 కావచ్చు అమ్మవారిది కానీ అయ్యవారిది కానీ ఏదో ఒక స్పెషల్ దర్శనం వుంటుంది 100 రూపాయలు ఐతే ఇద్దరిది స్పెషల్ దర్శనం వుంటుంది. దర్శనం అద్భుతం గా అవ్వటం ఒక ఎత్తయితే రెండు సార్లు ఐంది రెండురోజులలో.
పజ్హముదిర్చోలై లేదా పలముథిర్చొలై ఒకానొక ఆరుపడైవీడు క్షేతాలలో మదురై కి 16 కిలోమీటర్ల దూరంలో వుంది. కాగా మరొకటి క్షేత్రం. తిరుప్పరకుండ్రమ్ మరొక క్షేత్రం. అది మదురై కి 8 కిలోమీటర్లు దూరంలో వుంది. అలగర్ కోవెల్ లేదా అజ్హహర్ కోవెల్ మదురైకి 21 కిలోమీటర్లు దూరం లో వుంది. పెరియార్ బస్సుస్టాండ్ నుంచి, మత్తుథవాని (మెయిన్ బస్సు స్టాండ్ అనుకుంటా) తిరుప్పరకుండ్రమ్ కి బస్సులు వున్నాయి (నంబర్స్ 5,14,22,48,49,52). అక్కడ కనుక్కుని ఎక్కండి. జర్నీ ఆహ్లాదంగా వుంటుంది. ఏంటో ఏదో కొత్త ప్రపంచం లో వున్నట్టు వుంటుంది. గమ్యం గురించి తెలుసుకాని, మన మనుషులు కారు, మన ఆహారం కాదు, మన స్వభావమో కాదో కూడా తెలియదు. మనకి అప్పటిదాకా వున్నా ప్రపంచం మొత్తం వేరు ఐనట్టు బలే చిత్రం గ ఉంటుది అలా ఒక కొత్త ప్రదేశంలో మనది కాని ఒక ప్రపంచంలో మనదైన ఒక భక్తి భావాన్ని నమ్ముకుని వెళ్ళేటప్పుడు :).
విమాన సౌకర్యం కూడా వుందండోయ్!
దేవస్తానం వేళలు :
ఉదయం 5 గంటల నుంచి 12:30 వరకు,
సాయంత్రం 4 గంటల నుంచి 10:30 గంటల వరకు
(http://www.maduraimeenakshi.org).
(కంచి ఆలయ విశేషాలు మదురై అన్న పుస్తకం లో చాలా బాగా వివరంగా ఇచ్చారు. యందు చేతనో కష్టపడి, ఇష్టపడి రాసాక డిలీట్ ఐపోయింది రికవరీ కాలేదు దైవాదేశం లేదు అని ఇవ్వలేకపోతున్నా మన్నించగలరు :( ).
సరే కానివ్వండి అంతర్జాలం లో రాజా చంద్ర వారు, సరసబారతి వారు మంచి సమాచారం అందించారు అనే కాబోలు ఇలా జరిగింది. సరే మీరు కూడా తప్పక చూడండి.
రాజ చంద్ర మదురై సమాచారం ఇక్కడ నొక్కండి.
సరసభారతి వారి సమాచారం కోసం ఇక్కడ నొక్కండి.
వికీపీడియా అదనపు సమాచారం కొరకు ఇక్కడ నొక్కండి