Saturday, September 5, 2015

తిరుత్తణి ట్రిప్

తమిళనాడులో ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా పేరుగాంచిన ఆరుపడైవీడు క్షేత్రాలలో ఐదవది ఐన తిరుత్తణి క్షేత్ర దర్శనం ఇటీవల చేసుకున్నాము. ఇక క్షేత్ర వైభవానికి వస్తే జ్ఞానశక్తి ధరుడిగా స్వామి పేరు గాంచటానికి కల కారణం ఇక్కడ సుబ్రహ్మన్యుడి భక్తికి మెచ్చి శివుడు ఇచ్చిన  'జ్ఞానశక్తి' అనే 'ఈటె'. అంతే కాదు. సూరపద్మునితో యుద్ధం తరువాత వల్లీదేవికై బోయరాజులతో చేసిన చిన్నపాటి యుద్దాల తరువాత స్వామి శాంతించి ఈ క్షేత్రంలో కోలువైనట్టుగా స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ క్షేత్రానికి 'తణిగై' లేదా 'శాంతపురి'గా పేరు వచ్చింది. ఇదే కాక ఈ క్షేత్ర ఇతర విశేషాలను తెలుసుకోవాలంటే మాత్రం క్రింది లింకులు చూడండి మరి.




విశేషాలు తెలుసుకున్నారు కదా !. ఇంకా మా ట్రిప్ గురించి చెబుతాను వినండి. బెంగళురు నుండి అరక్కోణం కి ట్రైన్ రిజర్వేషన్ చేసుకుని శుక్రవారం రాత్రి బయలుదేరి తెల్లవారుఝామున అరక్కోణం చేరుకున్నాము. అక్కడ నుండి లోకల్ ట్రైన్స్ తిరుత్తణికి వున్నాయి కానీ అవి కుదరకపోవటంతో ఆటో ఒకటి తీసుకుని బయలుదేరాం. తమిళనాడులో ఆటో తీసుకుంటే ఒక 10 రెట్లు బస్సు ఛార్జ్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మిగతా ప్రాంతాలలో పోలిస్తే ఇక్కడ భక్తి ఎక్కువ. ఇంకా జీవనోపాధికి వనరులు కూడా అవేనెమో అనిపిస్తుంది. సరేలెమ్మని ఒక లిస్టు ఇచ్చి ఎన్ని కవర్ అవుతాయో తెలుసుకున్నాము. ఆలయం వారి రూం ఒకటి తీసుకున్నాము 300 అడ్వాన్సు మరియు 300 అద్దె 24 గంటలకి. అస్సలు ముందు రోజే బుక్ చేసుకుందని ఫోన్ చాలా సార్లు చేసినా కలవలేదు. అదే అడిగితే ఫోన్ పని చేస్తుంది అని చెప్పారు :(. ఒక రూంకి మూడు బెడ్లు వున్నాయి. బానే వుంది. అక్కడ స్నానాదులు కావించుకుని, దర్శనానికి వెళ్ళాము.

స్వామి గుడి ప్రాంగణంలోకి అడుగుపెడుతూనే స్పెషల్ దర్శనం 100 రూపాయలుగా కనపడింది. అంతేకాదు మా అదృష్టం ఏమిటంటే టికెట్ తీసుకుని వెళ్ళిన వెంటనే అభిషేకానికి కూర్చోవటం. నిజంగా ప్రణాళికతోటే వెళ్ళిన వారికి కూడా ఒక్కోసారి దర్శనం కూడా అవ్వదు. అదేంటో స్వామికి మా మీద అంత ప్రేమ  :). అభిషేకం పూర్తయి ప్రసాదాలు తీసుకున్నాము. బయట షాపులో 100 రూపాయల ప్రసాదాల సెట్ డిస్కౌంట్ లో అమ్ముతున్నారు. అంతేకాక విడిగా కూడా వున్నాయి. అందరు తలో ప్యాకెట్ తో పాటు విడిగా ప్రసాదాలు స్వీకరించి వెనక్కి వస్తుంటే, అక్కడ ఉప్పు, మిరియాలు వేస్తున్న దృశ్యం కనపడింది. మేము మెట్లదారి గుండా కాకుండా నేరుగా సరాసరి కొండపైకి దారిలో ఆటోలో వచ్చేయ్యటం వల్ల రాజ చంద్ర చెప్పిన ఉప్పు, మిరియాలు వేసే చోటు మిస్ ఐయ్యాము అనుకున్నాం కాని నిజానికి టికెట్ కౌంటర్ ఎదురుగా వుంది. ఒక 10 రూపాయలు ఇస్తే ఉప్పు, మిరియాల ప్యాకెట్ ఇస్తారు. అక్కడ ఒకామె (జీవనోపాది ఇందాక చెప్పాను కదా :) ) దిష్టి తీసి, అక్కడే వున్నా మంటలో వేసి మనల్ని కూడా వెయ్యమంటుంది అంతే అయిపొయింది :). ఇంక తిరిగి వెనక్కి బయలుదేరాము.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. జ్యోతిష్య శాస్త్రంలో 27 జన్మ నక్షత్రాలకి అనుగుణంగా ఎవరి జన్మ నక్షత్రాన్ని బట్టి వారు దర్శించవలసిన ఆలయాలు వున్నాయి. జన్మ నక్షత్ర సంబందిత ఆలయాన్ని ఏడాదికి ఒక్కసారి ఐనా దర్శించటం ద్వారా ఆయ గ్రహ దేవతల అనుగ్రహాన్నిపొంది సత్ఫలితాలతో పాటు సకల శుభాలు పొందవచ్చు. జన్మ నక్షత్రం తో పాటు, రాశికి సంబందించిన ఆలయాలు కూడా వున్నాయి అని తెలుస్తుంది. అలాగే జన్మ నక్షత్రానికి అనుగుణమైన శ్లోకం కూడా వున్నట్టు తెలుస్తుంది. సత్ఫలితాలకు రోజు చదువుకుంటే మంచిది అని కూడా తెలుస్తుంది. సరే ప్రస్తుతానికి మీకు జన్మ నక్షత్ర ఆలయాల లిస్టు కావాలా ?


పరమశివుడు ఆనంద నృత్యం  చేసినట్లు చెప్పబడే ఐదు ప్రదేశాలలో ఒకటి తిరువలంగాడు (రత్తినసబై (రత్తి - రత్నం). మేము మొత్తంగా ఆటో మాట్లాడుకుని మొదట తిరుత్తణి, తిరువళ్లూర్, తిరువలంగాడుతో పాటు షోళింగుర్ (వీటి గురించి వరసగా చెప్తాను) కూడా దర్శించుకున్నాము.

శ్రీ వడారన్యేశ్వర స్వామి కొలువై వున్న ఈక్షేత్రంలో ముందుగ భద్రకాళి అమ్మావారిని దర్శించిన తరువాతనే శ్రీ వడారన్యెశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అది ఎందుకో మిగిలిన స్థల పురాణం, ఇతర విషయాలు
 
అస్సలు అరక్కోణం పేరే చిత్రం గా వచ్చింది. ఈ పట్టణానికి ఆరుకోణాలలో ఆరు పుణ్యక్షేత్రాలు వుండటం వల్లన ఆరు కోణంగా పిలిచినట్లు క్రమేణా 'అరక్కోణం'గా మారినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ ఆరు క్షేత్రాలు ఏమిటంటే తిరువలంగాడు, తక్కోలం, కాంచీపురం, తిరుమాల్పూర్, షోళింగుర్ మరియు తిరుత్తణి.

తిరువళ్లూర్ వీర రాఘవ స్వామి

స్వామిని ఒక చేయి తిరిగిన డాక్టర్ గా పరిచయం చెయ్యాలేమో :). అవును ఇక్కడ స్వామి శేషునిపై తూర్పుముఖంగా శయనించి, కుడిచేతితో ఆశీర్వదిస్తున్నట్టు కనపడతాడు. కమలంలో బ్రహ్మ గారు ధ్యానంలో వుండటం కూడా గమనించవచ్చు. తలకింద వున్న మందుల సంచి చూస్తే నేను ఎందుకు డాక్టర్ గా పరిచయం చేసానో అర్థం అవుతుంది :). అంతేకాదండోయ్ ఈ క్షేత్రం ఆళ్వార్లు కీర్తించిన 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి. సరే మరి స్వామికి వైద్య వీర రాఘవ స్వామిగా పేరు ఎలా వచ్చిందో, పులిపిర్ల తో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు కోసం ఉప్పు మిరియాలు ఎక్కడ సమర్పిస్తారో, అలాగే వీరభద్రుడు దక్ష యజ్ఞ విద్వంసంలో భాగంగా దక్ష సంహారం వల్ల వాటిల్లిన బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడటానికి తీర్థేస్వర స్వామిని (ఆలయం కోనేరు ప్రక్కనే) ప్రతిష్టించి, ఆరాధించిన విషయం తో పాటు, మిగతా విషయాలకు ఇవి చూడండి.





'షోళింగుర్' నే కడిగా చలం (ఘటికా చలం) (తిరుకడిగై) అని కూడా అంటారు. ఈ పుణ్య క్షేత్రం వెల్లూరు జిల్లాలో తమిళనాట వుంది. చోళరాజులు బాగా అభివృద్ధి చేసునట్లుగా తెలుస్తుంది. అంతేకాదు ఇది 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి. ఒక కొండపై హనుమ శంఖ, చక్రాలతో దర్శనమిచ్చి, ఆశ్చర్యానికిలోను చేస్తే, మరొక కొండపై నారసింహుడు యోగముద్రలో కనిపించి మరింత ఆశ్చర్యానికి గురిచేస్తాడు. 'ఘటికా'చలం (గడియ లేదా కడిగై = 24 నిముషాలు, అచలం=కొండ) ఘటికాచలంగా మారింది. స్వామి సప్తరుషులకు 24 నిమిషాలపాటు దర్శనమిచ్చి ఘటికా చలంగా మార్చాడు. స్వామి సన్నిదిలో ఒక్క గడియ గడిపితే చాలు మీ పాపరాశి ద్వసం అయి ముక్తి కరతలామవుతుంది అని భక్తులు నమ్ముతారు. ప్రహ్లాదుడికి స్వామి ఇక్కడ యోగ రూపం లో దర్శనమిచ్చాడు. సరే ఇపుడు మీరు లక్ష్మి నరసింహ స్వామిని దర్శించాలి. అదే మన యోగ నరసింహ స్వామిని, జస్ట్ 1400 మెట్లు ఎక్కవలసి వుంటుంది. ఆటో వాడు షార్ట్ కట్ లో పైకి తీసుకుని వెళతాను అని చెప్పి, పైకి తీసుకుని వెళ్ళాడు కానీ కాకపోతే ఒక 50 మెట్లు తప్పించి వుంటాడు :). ఇంతకీ మీకో సందేహం రావాలి కదా ? మీరు చెప్పినవి మొత్తం మెట్లా లేకపోతె ఎక్కే మెట్లా అని :). ఎక్కటానికే 1400 మెట్లు. మళ్ళీ దిగటానికి 1400 మెట్లు :). అంత 'వీజీ'గా పోతాయ పాపాలు :P. ఆంజనేయ స్వామి కొండకి ఐతే 650 మెట్లు (ఎక్కటానికి & దిగటానికి 650+650). లక్ష్మి నరసింహ స్వామి దర్శనం అనంతరం ఆంజనేయస్వామి దర్శించాలి అన్నారు ఐతే అప్పటికే సాయంత్రం 6 కావస్తుండడంతో ఇక్కడ గుడితో పాటు ఆంజనేయ స్వామి గుడి కూడా మూసివేస్తారు అని తెలిసింది. అలా ఒక పది మెట్లు ఎక్కి రండి ఫార్మాలిటికి అన్నాడు. మనసులోనే క్షమాపణ చెప్పి అలా చేసి వచ్చేసాము :(. (పట్టు వదిలేది లేదు అనుకోండి మళ్లీ... చూద్దాం). మీరైనా మాలాగా కాకుండా  వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితులలోను సాయత్రం రెండు ఆలయాల దర్శనాలు 5-6 లోపు పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకోండి.

షోళింగుర్ గురించి మరికొంత ఇక్కడ చూడండి.

తత్కాల్ లో ఆరోజే టికెట్స్ వుండటం వల్లన మళ్ళీ సోమవారం నుండి యథావిధిగా ఉద్యోగవిథులకు హాజరుకావాలని ఆ రోజే రాత్రే బయలు దేరివచ్చాము. అరక్కోణం కి ట్రైన్ చాలా ఆలస్యంగా వచ్చింది. మొత్తానికి ఎక్కువ లేట్ అవ్వకుండానే బెంగుళూరుకి కాస్త అటు ఇటుగా టైంకి చేరిపోయము.