Wednesday, March 2, 2016

నంది హిల్స్, బెంగలూరు.

అస్సలు ఏ టూర్ కి రావటం లేదు అని, అప్పటికే కొంత మందికి వివాహ యోగ్యత, మరికొందరికి వైవాహిక జీవిత ప్రయాణ అర్హత, మరికొందరు ప్రయత్నాపూర్వక శ్రమ ఇన్నీ కలగలసి స్నేహితులు బలవంతంతో నంది హిల్స్ కి ప్రయాణం కట్టవలసి వచ్చింది. అదేంటండి టూర్స్ బానే వేస్తారు కదా ! మీ స్నేహితులు అలా అనటం ఏమిటి  అనేరు, వీళ్ళు చెప్పే ట్రిప్స్ జాలీ ట్రిప్స్ గురించి. 

సరే లెండి ఇక నంది హిల్స్ విషయానికి వస్తే ఒకసారి వెళ్లాను కాని, స్నానం  చెయ్యలేదని శివాలయంలోకి వెళ్ళలేదు.  ఐతే ఈసారి అయినా దర్శనం చేసుకోవాలి అని అనుకున్నదే తడవుగా జాలి ట్రిప్ కి సరే అని చెప్పి 'స్పిరిట్యువల్' ట్రిప్ (పెద్ద మాట అనుకుంట) కింద మార్చేసాను. :)

నంది హిల్స్ బెంగుళూరుకి 60 కిలోమీటర్లు దూరం లో ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో వుంది. నంది హిల్స్ వెనుకగా దొడ్డబల్లాపుర దగ్గరలో ఘాటి సుబ్రహ్మణ్య అని బెంగుళూరులో మూడు ప్రఖ్యాతి వహించిన సుబ్రహ్మణ్య క్షేత్రాలులో ఒకటి వుంది. కుక్కే సుబ్రహ్మణ్య, నాగలమడక సుబ్రహ్మణ్య మిగిలిన రెండు - తమిళనాడులో ఆరు పడైవీడు లాగా అన్నమాట.  

సరే ముందు నంది హిల్స్ గురించి మరికొంత ఇక్కడ చదవండి. 
లంకె 1 
లంకె 2 

ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి ఇక్కడ చూడండి.

అర్ధరాత్రి చలిలో నా వల్ల కాదు బాబు అని ఒకడు అంతకు ముందే ఆగిపోయాడు అప్పటికే తన జర్కిన్ వేసుకోమని ఒక స్నేహితుడు ఇస్తే ఎందుకో తీసుకోలేదు కాని తగిన మూల్యం చెల్లించినట్లు అయ్యింది. చెప్పులు, దుస్తులు అనేకాదు కాని ఒకరు వాడిన వస్తువులు పెద్దలు ఎపుడు వేసుకోవద్దు అనే చెబుతారు. అవి సూక్ష్మ స్థాయిలోనే కాదు, కర్మ స్థాయిలోనూ ప్రభావితం చేస్తాయి అని న వ్యక్తిగత అనుభవం. అలా వేసుకోకపోవటం వాళ్ళ దానికి తగిన మూల్యం చెల్లించాను అనుకోండి. అది వేరే సంగతి.    

మైసూరు ట్రిప్, విజయవాడ వెళ్ళేటప్పుడు రైల్ లోది లాంటివే మళ్లీ చలి అనుభవం అయింది. ఎముకలు కోరికే చలి అంటే అదే అనిపించింది. దేవాలయం దర్శనం అని రాత్రి వంటి గంటకు తల స్నానం ఒకటి ఐతే, సాదా టీ షర్టు వేసుకుని వెళ్ళటం ఇంకో హైలైట్. 

మొత్తానికి అందరం మెల్లగా బయలుదేరాం. హైవే మీద ప్రయాణం. చలిగా, ఆహ్లాదంగా సాగిపోతుంది. చలి మెల్ల, మెల్లగా  పెరుగుతుంది. వెన్నులోంచి వణుకు మొదలయ్యింది. ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ఒకానొక దశలో ఇంకా తట్టుకోలేము అన్ని పరిస్థితి కూడా వచ్చేసింది. వెనుకనున్న నాకే అలా వుంటే ముందు బండి నడిపే అబ్బాయికి ఎలా వుంటుందో అర్థం చేసుకోండి. 

జ్ఞాపకాల తెరలు తెరలుగా వచేస్తున్నాయి. ఇదే ఆఖరి మజిలి అనిపించింది. ఇంకా చెయ్యవలసిన పనులు, నా ఆత్మ ఈ శరీరం తీసుకున్నాక సాధించవలసిన గమ్యం ఏమిటి, ఎంత వరకు వచ్చింది. అస్సలు మొదలయ్యిందా లేదా ! ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, జీవితపు చరమాంకం ఇలా వుంటుందా !.  మా తాత గారు శ్రీ రామ నవమి ఏర్పాట్లలో తిరుగున్నపుడే ఉన్నప్పుడే స్వర్గస్తులయ్యారు.   అదే పునరావృతం కాబోతుందా !. ఏమో నిజంగా భగవత్ అన్వేషణలో పోవటం కూడా అదృష్టం అనే అనిపించింది. చేతులు, పాదాలు స్పర్శ కోల్పోయాయి. అలా ముందుకు సాగిపోతున్నాము.

హైవే నుంచి ఘాట్ రోడ్ కి మళ్ళాలి ఒకచోట. అక్కడ ఒక 'టీ' షాప్ కనిపించింది. అందరు 'టీ' లు తాగాము. అందరికి ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది. అన్ని అవయవాలు పని చేస్తున్నట్టు సాధారణ స్థితికి వచ్చినట్టు అనిపించింది. మేము అలా అందరికి 'టీ' చెప్పగానే  మా వాడు ఒకడు అల్లం టీ గురించి వాకబు చేసాడు. ఒక పక్క ప్రాణాలు పోతుంటే వీడికి రుచి కావలిసి వచ్చింది అన్నట్టు అందరు ఒక 'చూపు' చూసారు. వాడు ఇవన్ని పట్టించుకోకండా 'టీ' కాచే ఆమె ను అడిగాడు. ఆవిడ ఇదే ఎక్కువ అనే భావంతో, 'లేదు' అని చెప్పినట్టు అనిపించింది :p.

మొత్తానికి నంది హిల్స్ చేరుకున్నాము. సుమారు తెల్లవారుఝామున గం.4:30 నిం. కావస్తుంది. చలి మంటలు వేసుకుంటూ యువత మంచి ఉత్సాహంగా పాటలు పాడుతూ కనిపించారు. మేము కూడా చలి మంట వేసాము. ప్రాణం చాలా హాయిగా వుంది. ఏమి కర్మ జీవితాలు స్వామి :). 

సాధారణంగా ఇక్కడ పైకి వెళ్ళటానికి ఉదయం 6 గంటల తరువాత మాత్రమే అనుమతిస్తారు. పోలీస్ చెక్ పోస్ట్ వుంటుంది. వాళ్ళు వచ్చిన వాహనాల నంబర్స్ తీసుకుని, డ్రైవింగ్ లైసెన్స్ చూసిన తరువాతనే పంపిస్తారు.  ఆరోజు ఏమీ తిసుకోకండా కొంచెం త్వరగానే వదిలేసారు. కొండ మలుపులలోంచి పై, పైకి ఎవరికి వారు వాయు వేగంతో దూసుకుపోతున్నారు. మేము కూడా :).

చోళుల కాలం లో ఆనంద గిరిగా పిలువబడినట్లు, యోగ నందీశ్వరుడు ఇక్కడ ప్రార్థించినట్లు అయన పేరుమీదుగా తదనంతరకాలం ఈ పేరు వచ్చినట్లు, టిప్పుసుల్తాన్ కట్టించునట్లుగా నందిదుర్గ గా పిలిచినట్లు, కొండ ఆకారం పడుకున్న నంది లాగా ఉన్నందువల్ల  ఈ పేరు వచ్చినట్లుగా 'వికీ' ద్వారా తెలుస్తుంది. నంది గ్రామంలో వున్న భోగ నందీశ్వర ఆలయం 9 వ శతాబ్ధానికి చెందినిగా కూడా తెలుస్తుంది. మరిన్ని విశేషాలు పైన వున్న వికీ లింక్ లో చూడగలరు.       

ఇంకా మేము కొండ పైకి వెళ్ళిన తరువాత సూర్యోదయం పాయింట్ కి చేరుకున్నాము. ఉదయించే సూర్య భగవానుని చూస్తుంటే మనస్సు మెల్లగా ధ్యానం లాంటి పరవశ స్థితి లోకి వెళ్లి పోతుంది.  చూట్టూ సెల్ఫీ క్లిక్స్ తో బయటకు వస్తున్నా, వారి రక, రకాల ప్రదర్శనలతో మధ్య, మధ్య బయటకు వస్తున్నా కూడా ఆ తాదాత్య్మతలో, ఆనందంతో మనసు పెదాలను అనుసరించగా,  'ఆదిత్య హృదయం' తో స్వామిని కీర్తించటం మొదలు పెట్టాను. 

కాస్త సోషల్ ఫోబియా అడ్డుపడుతున్న కానీ మొత్తానికి పూర్తి చేశాను. భావుకత, పరవశం, అలంకారాలు, కళలు, కవితలు ఏవి అయితేనేమి నిషేదిత పదాల జాభితాలు కొత్త తరాలు చేర్చేసాయి అనిపించింది. ఇక్కడ మనం విషయం పై కేటగిరి కాబట్టి విభిన్నంగా కనపడవలసి వచ్చింది. 

రోజూ క్రమం తప్పకుండ శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, కొన్ని స్వప్న దేవతా దర్శనాలు పొందిన మా స్నేహితుడు ఈ 'విభిన్న' అనుభవాన్నించి దూరంచేసి మందలో కలుపుతాడు అంటే వాడు ఫోటోలకు మంచి పోజులు ఇస్తున్నాడు. స్వామి ఇప్పటికిదే ప్రాప్తం అని సాయత్రం మళ్లీ బాగా చేసుకుంటా అని అక్కడికి ఆపేసాను :).  

ఒకటి రెండు లొకేషన్స్ లో ఫోటో సెషన్ అంతా అయ్యాక మేము కొందరము పైన వున్న శివాలయ దర్శనానికి వెళ్ళాము. నీళ్ళు చల్లగా వున్నాయి కాళ్ళు కడుగుకుంటుంటే. పురాతనంగా, ఒక కొండ గుహలో చెక్కిన గుడిలాగా వుంది. సాష్టాంగం చేస్తున్న ఋషుల దర్శన చిత్రాలు గుడిలోపల నేల మీద చెక్కినవి కనపడ్డాయి. గుడిలోనే కోనేరు కనపడింది. దర్శనం అయ్యాక గుడి బయటకు వస్తుంటే, గుడి ప్రక్కగా రెండు చిన్న గుళ్ళు - విఘ్నేశ్వర, ఆంజనేయ స్వాములు కొలువైనవి కనపడితే వాటి దర్శనం కూడా చేసుకున్నాము.   

దర్శనాలు అయ్యాక ఇంకొన్ని లొకేషన్స్ లో ఫోటోలు అవీ తీసుకున్నాము. పైన గాంధీ మందిర్ ఇంకొన్ని ప్రదేశాలు చూసాము. ఒకచోట మా వాడు ఫోజు సరిగా ఇవ్వలేదు అని వేరే వాడు అలిగి కాసేపు కనపడలేదు. సరే అని మేము కిందకు దిగుతుంటే వచ్చి కలిసాడు. ఎక్కడకు వెళ్లావు అంటే 'సూసైడ్ పాయింట్' (శిక్ష పడిన ఖైదీలను ఈ పాయింట్ నుంచి తోచి వేసేవాళ్ళు, కొండ కింద పడి మరణించే వాళ్ళు అని తెలియవస్తుంది) అని చెప్పి, మీరు 'మిస్' అయ్యారు అన్నాడు. ఎందుకు 'మిస్' అయ్యమో అర్థం అయ్యింది.  భగవత్ నీడలో బతికే వాడికి ఏవి కనపడాలో అవే కనపడతాయి, ఏవి కనపడకూడదో అవి ఎన్నటికి కనపడవు కదా ! అనిపించింది :) 

ఇంక పైన అల్పాహారం చేసాము. ఒకటి, రెండు హోటల్స్ వున్నాయి. వేడి, వేడిగా తిని ఇంక మధ్యాహ్నం కావస్తుండటంతో ముందు అనుకున్నట్లుగా బయలుదేరి, 1 గంట కల్లా తిరిగి వచ్చేసాము. అదండీ అలా గడిచిపోయింది ఆ వారాంతం ట్రిప్ :).