Monday, April 25, 2016

స్వామిమలై, కుంబకోణం, చిదంబరం మరియు నవగ్రహ ఆలయాలు - మా మూడు రోజుల యాత్ర

మా ట్రిప్ ముగిసిన తరువాత మొన్నా మధ్య భాగవతం చదువుతుంటే వరానికి, అనుగ్రహానికి భేదం చెబుతూ పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా అంటాడు. కోరిన కోరిక తీర్చటం వరమైతే, ఏది మేలో అది చెయ్యటం అనుగ్రహమవుతుంది. వరంలో గ్రహీత అహంకారం వుంటుంది. ప్రాప్తవరుడు కోరిన వరాన్ని సంపాదించి ఆ వర గర్వంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కాని అనుగృహీత స్వామీ 'దేహ, ప్రాణాలను నీ చేతిలో పెట్టాను' అని, భగవంతుడు మనస్సులో ఎలా స్పురింపచేస్తే అలా ప్రవర్తిస్తూ, సుఖ, దుఃఖాలకు అతీతంగా 'త్వమేవ శరణం నాస్తి' అన్నట్లు జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇక వరదాత విషయానికి వస్తే వరం ఇవ్వటంతోనే అతని బాధ్యత ముగుస్తుంది. ఇది భిక్షువుకి భిక్షం లాంటిది అన్నమాట. అటుపైన వరగ్రహీత సుఖ, దుఃఖాలతో  వరదాతకి పనిలేదు. కాని ప్రపన్నుని విషయంలో అలా కాదు, కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకోవలిసిన బాధ్యత వరదాతదే. ఈ విషయం శ్రీ కృష్ణ భగవానుడే చెప్తూ, కోటిమంది ఆర్తులను, అర్థులను భరించవచ్చు కాని ఒక్క ప్రపన్నుని మాత్రం భరించలేము అని అంటాడు.  హిరణ్యకశిపాద, రావణాదులు ప్రాప్తవరులు అయితే, భీష్మాదులు ప్రపన్నులు లేదా అనుగృహీతలు.

మరొక విషయం , ఒకసారి నారదుడు, శ్రీ కృష్ణుడిని కొంతకాలం ద్వారకలో వుంటూ సేవించాలి అని అనుకుంటాడు. అలానే సేవిస్తాడు కూడా. అయితే కాస్త పురాణ జ్ఞానం ఉన్నవారికి ఇక్కడొక సందేహం రావచ్చు - నారదుడికి నిరంతరం సంచరించేటట్లు దక్షశాపం వుండనే వుంది కదండీ మరి అది ఎలా సాధ్యమయ్యింది అని. కారణమేమిటంటే భగవదుపాసనాపరులకు ఎటువంటి శాపం కూడా భగవదుపాసన నుంచి దూరం చెయ్యలేదు. శాపం యొక్క శక్తి, భగవచ్ఛక్తి నిరూపణకే గాని స్వతంత్రోక్తులు కాదు. శక్తివంతుని మించిన శక్తి ప్రవర్థిల్లలేదు. ఇది చిదంబరం స్థలపురాణంలోనే వుంది.

మొదటి పేరా లో చెప్పిన విషయం మనందరం జీవితంలో ఏదో ఒకసమయంలో అనుగ్రహీతలం అని భావించేది ఐతే (ఈ ట్రిప్ విషయంలో మేము అనుగ్రహీతలం అని పూర్తిగా నమ్ముతున్నా), రెండవ విషయం చిదంబరం స్థలపురాణానికి సంబందించిన నిరూపణ.

పంచభూత లింగ క్షేతాలలో ఒకటిగా పేరుగాంచినది, పంచభూతాలలో ఆకాశ తత్వానికి ప్రతీకగా, పరమ శివుని ఆనంద నృత్యం చేసిన ప్రదేశంగా, తిల్లాయి అడవులలో పతంజలిగా వచ్చిన ఆదిశేషుని కోరికమీద, తేనెటీగల కంటే ముందుగా పువ్వులను సేకరించి స్వామికి అర్పించాలి అని దృష్టిని, పులి పాదములును  పొందిన వ్యాఘ్ర పాదర్ (పులి కాల్ముని) కు స్వామి తన ఆనంద తాండవం చూపిన స్థలంగా, మంత్రాధి దేవత మంత్రానికి కట్టుబడి వుండాలి అని తన నియమం ప్రకారం కట్టుబడి వుంటుంది కాని సమస్త వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, విధులు, నియమాలుకు అతీతమైనది భగవంతుని తత్వం అని, స్వామి శక్తి తెలియక ఋషులు మంత్రించి పంపిన పాములను తన శిరస్సున, మేడలో, భుజాలకు దరించటంతో, తమ ప్రయత్నం విఫలం అవటంతో భయంకరమైన పులిని పంపితే దాన్నీ చర్మం వలచి నడుముకి కట్టుకుంటే, చివరగా తమ తపశ్శక్తి యావత్తూ ఉపయోగించి 'మయలకన్' అనే రాక్షసిని పంపితే, దాన్ని కూడా తొక్కి పెట్టి ఆనంద నృత్యం చేసి వారి అహంకారాన్ని పటాపంచలు చేసి పరమశివుడి ఆనంద తాండవం చిసిన మహత్తర దివ్య క్షేత్రం ఈ చిదంబర క్షేత్రం.

చిదంబరం క్షేత్రం యొక్క మహాత్తుకు మచ్చుకి ఒక విషయం తీసుకుంటే అది శిల్ప సంపద, దీని గురించి చెబితేనే ఒక పుస్తకం అవుతుంది అన్నది విడ్డూరం కాదు. సరే చిదంబరం లో స్వామిని గురించి చెప్పాలంటే ....  

ఇక్కడ స్వామి మూడు రూపాలుగా దర్శనమిస్తాడు -

పూర్తి రూపం - నటరాజ స్వామి
అసంపూర్ణ రూపం - చంద్రమౌళీశ్వర స్పటిక రూపం
అదృశ్య రూపం - గర్భగుడిలోని ఖాలీ ప్రదేశం (ఆకాశానికి ప్రతీకగా నిరాకార రూపం).

చిదంబరం గురించి వికీపీడియా లో ఏముందో చూడండి ముందు
చిదంబర ఆలయం

చిదంబర ఆలయం 2వ లంకె

చిదంబరం స్తవం :

చిదంబరం గురించి అంతర్జాలంలో వున్న మరి కొన్ని ఉపయుక్త లంకెలు:

లంకె 1

లంకె 2

లంకె 3 

లంకె 4
                                                     
                                                                    *  *  *

కుంభకోణం గురించి ముందుగా కొంత సంక్షిప్తంగా -

ప్రళయానంతరం పునః సృష్టి నిమిత్తం - బ్రహ్మ శివుని ఆదేశం మేరకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, అమృతం, పుణ్య తీర్ధాలు మరియు మృత్తిక ఇతరాలు ఒక కలశంలో భద్రపరచగా, అది ప్రళయానంతరం ఒక చోటకి కొట్టుకుని వచ్చింది. శివుని మహిమోపేతమైన భాణాఘాతంతో దాని పై వున్న మూత, కింద కుండ భాగం వేరు వేరుగా పడ్డాయి. అలా పడినవే కుంభం (కుండ) మరియు కోణం (పై మూత). అవి కలిసే ఇప్పుడు మనం పిలుస్తున్న 'కుంభకోణం'గా వచ్చింది. 'విప్రనారాయనుడి'గా ప్రఖాతి వహించిన తొండరడిప్పాడ్ ఆళ్వారు, గణితంలో అసాధారణ ప్రజ్ఞ పాటవాలు కలిగిన రామానుజంలే, కాదు మరెందరో పుణ్యాత్ముల జన్మస్థలం కుంభకోణం. ఇక్కడ వున్న పురాతన ఉన్నత విద్య వల్లనే కాబోలు 'కేంబ్రిడ్జ్ అఫ్ ది ఈస్ట్'గా కుంభకోణం ప్రఖ్యాతి వహించింది. అంతకాడు ఇక్కడ 12 సంవత్సరాల కొకసారి 'మహా మాహామ్' ఉత్సవానికి అనే లక్షల్లో భక్తులు వచ్చి తరిస్తారు.    

                                                            *  *  *

సుమారు నాలుగైదు సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన ఇది.

ఎందరో యువకులు కలలు కనే కార్పోరేట్ ఉద్యోగం సంపాదించి కళ్ళు చెదిరే ఐదంకెల జీతం, వారాంతపు సెలవులు, సమాజంలో గౌరవం, అదీ, ఇదీ ఏమిటి ఏది కావాలంటే అది అందుకునే 'రంగుల ప్రపంచం'లోకి అతి కష్టం మీద అడుగుపెట్టిన జీవితం.

తను చదువుకున్న, నేర్చుకున్న విలువలు ఒక వైపు, విలువలకు పాతరవేసి వలువలు వూడదీసే రంగుల మాయ ప్రపంచం మరొకవైపు, తీవ్రమైన ఆధ్యాత్మిక భావోద్రేకం ఒక వైపు, శుద్ధ భౌతికవాదం మరొకవైపు. అంతు తెలియని, అల్లకల్లోల జీవితం ఒకవైపు, గమ్యం తెలియని ప్రయాణం మరొకవైపు.

ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఆధ్యాత్మిక ప్రపంచం ఆమడదూరం అవతల. భౌతిక ప్రపంచం అడుగు దూరంలో ఇవతల. పూర్తి వైరాగ్యం కాదు, కూర్చుని భౌతిక సుఖాలని అనుభవించే మనస్సు కాదు.

శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు నడుస్తూ వుంటే - రాముడు బ్రహ్మంగాను, లక్ష్మణుడు జీవుడిగాను, మధ్యలో సీత మాయగాను ఆధ్యాత్మిక రామాయణంలో చెబుతారు. అమ్మా ! నువ్వు కొంచెం పక్కకి తొలగి దారి ఇస్తే నేను పరబ్రహ్మాన్ని దర్శిస్తాను అని లక్ష్మణుడు మాయను (సీతమ్మను) ప్రార్ధించినట్లుగా రామాయణాన్ని ఆధ్యాత్మిక కోణంలో చెబుతారు.

రావణుని చెరలో వున్న సీతమ్మ జీవునిగా, రామున్ని పరమబ్రహ్మంగా భావిస్తే - సీతమ్మ వారు రాముని చేరటానికి మధ్యలో వున్న తనది కాని ప్రపంచం, నిరంతరం క్షోభపెట్టె రాక్షసులు, రావణుని వాగ్భాణాలు, ఎక్కడ వున్నాడో, ఎలా వున్నాడో, ఎప్పుడు వస్తాడో, జీవించి వుండగా మళ్ళీ చూస్తానో లేదో అన్న బాధతో, ఆశతో, భయంతో, ఇంకా ఎపుడు చేరుకుంటానో అన్న వేదనతో, తీవ్ర పరితాపంతో కూడిన జీవితం సీతమ్మ వారిది. ఆలోచిస్తుంటేనే భయం, బాధ గొలిపే అనుభవం. నిత్యం అవకాశవాదులు, తోడేళ్ళు వంటి మనుసులు, రాక్షస మాయకు తగ్గని మాయా నవ్వుల కార్పోరేట్ ప్రపంచం ఈ యువకుడి జీవితంలో ఆధ్యాత్మికత అనే హోమజ్వాలలో  ఆజ్యం పోసినట్టు అయ్యింది. నాడీ జ్యోతిష్యం గురించిన తెలిసిన ఆ యువడుడికి - తెరచాప లేని నావల కొట్టుకుపోతున్న జీవితానికి నాడీ జ్యోతిష్యం తెరచాప అయ్యిందా లేదా ? ? ?

జ్యోతిష్యం అందునా నాడీ జ్యోతిష్యం గురించి చాలా విని వుండటం వల్ల, ఇంకా నాడీ జ్యోతిష్యం గురించి సమాచారం సేకరించి సేకరిస్తుంటే, మలేషియాలో ఒకరు ఈ విషయమై భారత దేశానికీ వచ్చి పరిశోధన చేసినట్లు చెప్పారు. వారితో మాట్లాడి మ్యాప్ ని కూడా సరిగా చూడని ఆ యువకుడు, సరాసరి జీవితాన్ని, దాని లక్ష్యాన్ని వెతకటానికి వైదీశ్వరన్ కోవెల్ కి పయనమయ్యాడు.

90% పైగా నమ్మకశ్యం కానీ వారే గాని, ఒకవేళ మిగత పది శాతంలో కూడా దొరకటం కష్టం అని చివరగా చెన్నై లో వున్నా ముగుగేశన్ అనే వ్యక్తి నెంబర్ ఇచ్చారు. ఇంతా చేస్తే, ఆయన ఇప్పుడు చెప్పటం లేదు అని వేరే వారి నెంబర్ ఇచ్చారు. సరేలెమ్మని ఇతన్ని ఐనా కలుద్దామని వైదీశ్వరన్ కోవెల్ వెళ్ళిన ఆ యువడుడికి 'సాయంత్రం వస్తారు' అనేది అక్కడి సమాధానం. అతని దగ్గర పనిచేసే అతను జాతకం చెబుతాను అని, అతను చెప్పిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు నువ్వచ్చిన సమయం సరి అయిన సమయం కాదు అని. చెప్పినదాంట్లో నమ్మేవిషయలు కంటే కూడా నమ్మని నిజాలే ఎక్కువ వున్నట్టు అనిపించటంతో, అది చాలక 42 రోజుల పూజ అని మరొక మొత్తం చెప్పాడు. నిస్సహాయత ఒకవైపు, బాధ మరొకవైపు నలుపేస్తుంటే ఆ యువకుడు పక్కనే 'ఏదో' ఒక ఆలయం వుంటే దర్శనం చేసుకుని, మనస్సులో ఏదో తెలియని అసంతృప్తి, కొంత ఏదో కొత్తగా తెలుసుకున్నసంతృప్తి కాస్త నిరాశ రక,రకాల ఆలోచనలు, భావోద్వేగాలతో బయటకు వచ్చి దగ్గరలో వున్న మరోక్షేత్రం చిదంబరం అని తెలుసుకుని ఒక బస్సు ఎక్కి చిదంబరం చేరిన అతనికి గుడిలో ఎక్కడకు, వేళ్ళలో ఎలా వెళ్ళాలో తెలియక, భాష రాక బయట వున్న చిదంబర నటరాజుకి మొక్కి వెనక్కి వెళ్లి పోయాడు.  కానీ ఆ రోజు ఆ కుర్రాడికి తెలియదు కొన్ని సంవత్స రాల తరువాత 'సరి అయిన' సమయం రాబోతుంది అని ...! ! !

                                                    *  *  *

మొదటి రోజు స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి దర్శనం దొరికింది. ఆరు పడైవీడు క్షేత్రాలుగా పేరు గాంచిన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఇక్కడ స్వామి పరమశివునికి ప్రణవానికి అర్థం చెప్పాడంటారు (ప్రణవ ఉపదేశం). సకల విద్యలకు ఆలవాలము, మూర్తీభవించిన జ్ఞాన స్వరూపం ఐన పరమ శివునికి మళ్ళీ ఉపదేశం ఏమిటి అనుకుంటున్నారు ఏమో, "పుత్రాధిచ్ఛేద్ పరాజయం" ఈ తండ్రికిన తన కొడుకు చేతులో ఓడిపోవటంకు మించిన ఆనందం ఏముంటుంది. సరే మిగత విశేషాలును మోహన్ కిషోర్ గారు అద్భుతంగా విశదీకరించారు. మరి ఇక్కడ చూడండి.

ఇక్కడ దొరికే స్వామి విభూతి ప్రసాదం ప్రసాదం కౌంటర్ లో అమ్ముతారు. మరచిపోకుండా తీసుకోండి.

మరొక విషయం చెప్పాలి.  మేము నవగ్రహ ఆలయాలకు వెళ్ళే దారిలో అమ్మవారి ఆలయాలకు - అయ్యప్పలు తలమీద ఇరుముడి తీసుకుని వెళ్ళినట్లు మూట పెట్టుకుని వెళుతూ కనిపించారు. వారు అలా కొన్ని మైళ్ళు నడుచుకుంటూ వెళ్లి అమ్మవారి ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకుంటారు అని అది ఒకరోజో, రెండు రోజులో పడుతుంది అని, వెళ్ళే దారిలో అక్కడక్క్కడ గ్రామాలలో ఇచిన అల్పాహారాన్ని సేవిస్తారు అని తెలిసి వారి భక్తికి నిజంగా రకరకాల భావోద్వేగాలకు లోనయ్యాము. వీల్లనేనా మనం వి.ఐ.పి. టికెట్స్ తీసుకుని దాటి పోయి దర్శం చేసుకుంది అని మనస్సు కొంత కుదుపుకు లోనయ్యయింది. ఒక్కోసారి కొంతమందిని చూసి వీళ్ళకెందుకు ఇంత అదృష్టం అది వుద్యోగంమో, వ్యాపారమో మరేదో అస్సలు ఏమి వున్నాయి 'అర్హతా,నైపుణ్యాలు' అనుకుంటాము కానీ, నిజంగా వీళ్ళ భక్తికి అమ్మ వీళ్ళని ఎక్కడ కూర్చోపెట్టాలో అనిపిస్తుంది.
                                                   
                                                                *  *  *

రెండో రోజు మొట్టమొదటనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయ్యింది. దర్శనానికి తెర వేసి వుంది. చాలా సమయం తీసుకునేలా వుంది వెళ్ళిపోదామా అని ఒకవైపు అనుకుంటున్నారు మరోవైపు ఈరోజు మొట్ట మొదట ఆలయం, పైగా శని వారం కూడాను. ఎట్టి పరిస్థితుల్లలోను స్వామి దర్శనం చేసుకునే వెళ్ళాలి అనుకున్నాము. నిజంగా ఒక అడుగు భగవంతుని కోసం వెస్తే 10 అడుగులు స్వామి మన కోసం వేస్తాడు అనేలాగా ఆ రోజు అన్నీ కూడా అద్భుత దర్శనాలే. నవగ్రహ ఆలయాల్లో మిగిలిన మిగతా 7 ఆలయాలు కూడా దర్శనం చేసుకున్నాము. తిరునల్లార్ శనీశ్వరుని ఆలయం చేరుకొని, అక్కడ స్నానం చేసి, బట్టలు విడిచిపెట్టి స్వామి దర్శనంతో ఆ రోజు యాత్ర ముగించాము.
                                 
                                                                  *  *  *
 
మూడోరోజు నేను తంజావూరు ప్రఖ్యాత బృహదీశ్వరాలయం చూడాలనిపించి తంజావూరు వెళదామంటే నాతో వచ్చేవారు లేరు. మా గ్రూప్ లో ఇద్దరు చిదంబరం చూడాలి అనుకున్నారు. నేను ఇంతకు మునుపే వెళ్లాను కాబట్టి ముందు ప్రణాళికలో అనుకోలేదు. ప్రవచన చక్రవర్తి అయిన మన గురువు గారు 'తిరుకడయూర్' గురించి ఇంతకు ముందే ఒకచోట ప్రవచనంలో చెప్పివున్నారు. ఎవరైతే అక్కడ కోనేటిలో స్నానం చేసి శివ దర్శనం చేస్తారో వారికి యమ దర్శనం వుండదు అని. ఆ ఆలయంతో పాటు దగ్గర ఆలయాల దర్శనానికి వెళ్ళాలి అని మరో ఇద్దరు అనుకున్నారు. నాకు ఎటూ పాలు పోలేదు. ఆ ఇద్దరిలో ఒకరు చిదంబరం ఇంతకు మునుపు దర్శించుకోలేదు. ఐనా అటు వెళ్ళవలసి వస్తుంది. నాకు కూడా ఇంక ఒక్కడినే తంజావూరు వెళ్లాలని లేదు. అలా అని అంతదూరం వెళ్లి రూంలో ఒక్కడినే కూర్చోవాలని కూడా లేదు. సరేలెమ్మని ఆఖరి నిమిషంలో చిదంబరం వెళ్ళాలి అని నిశ్చయించుకుని బయలుదేరాను. చిదంబరం వెళ్ళాక తెలిసింది ఎంత అదృష్టవంతుడినో :). మనం వెళ్ళాలి అనుకోవటం కాదు మన 'డెస్టినీ' మనలని తీసుకుని వెళుతుంది :).

మేము చిదంబరం వెళ్లేసరికి చాలా కోలాహలంగా వుంది. గుడి ముందే ఒక స్టాప్ వుంది అక్కడ బస్సు ఆగింది. ఎదురుగా ఒక గోపురం దారి వుంది. అక్కడ గణపతి స్వామి ఆలయం వుంటే, అక్కడ దర్శనం చేసుకుని, అక్కడ నుంచి గుడి ప్రాగణం నుంచి ప్రధాన ఆలయం లోపలికి ప్రవేశించాము.

వెళ్ళగానే మనకు కనిపించే నటరాజ స్వామి ఒక మనిషి ఎత్తు అరుగు మీద గర్భాలయంలో ఆనంద తాండవ నృత్యంలో దర్శనమిస్తారు. గర్భగుడి చుట్టూ భక్తులు నిండిపోయి 'హాలా హల' భక్షణ చేసినవాడిని చూడాలని 'కోలాహలం' గా వున్నారు. దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే మగవారు పై చొక్కా నడుముకు కట్టుకుని, లేదా తీసివేసి దర్శనం చేసుకోవాలి. ఇవి ముఖ్యంగా దక్షిణ కర్ణాటక ఆలయల్లో, కేరళ ఆలయాలలోను చూస్తుంటాము. ఇక్కడ కూడా ఆ పద్దతే.

గర్భాలయం అరుగుమీద ఒక పూజారి కూర్చుని విభూతి ప్రసాదం ఇస్తుంటే అవి తీసుకున్నాము. దేవాదాయ శాఖ ఆధీనంలో లేని ఒకానొక ఆలయం ఈ ఆలయం.

గర్భగుడి చుటూ వున్న ఖాలీ ప్రదేశం చూసుకుని భక్తులు అందరూ ఆత్రుతగా నిలబడి నిరీక్షిస్తున్నారు. మేము కాసేపు చూసి వెళ్లి పోదామనుకుంటే పక్కన వున్న ఆయన వారించారు. ఉండమని చెప్పారు. కాసేపు చూసి, మళ్లీ వెళదామనుకుంటే మళ్లీ వారించి చెప్పారు. ఇది మళ్ళీ మళ్ళీ దొరికే అవకాశం కాదు అందుకే ఇంత మంది ఇంతలా నిరీక్షిస్తున్నారు అని  ఇంగ్లీష్ లో చెప్పారు. ఆ సమయం రానే వచ్చింది.

పూజరులందరూ చాలా శ్రద్ధా, భక్తులతో చూస్తుండగా మరొక పూజారి రెండు పెట్టెలలో స్వామి వారి స్పటిక లింగం, స్వామి విగ్రహం తీసుకుని వచ్చారు. అభిషేకం మొదలు అయ్యింది. రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నారు. సరిగా కనపడక పోయిన ఎలాగోలా చూస్తుంటే నా హైట్ ఎందుకు ఉపయోగపడదేమో అనుకున్నా. కానీ, అన్నా ఇప్పుడు అనిపిస్తుంది ఈ విషయంలో ఎంత అదృష్టవంతుడినో అన్న మా వాడి మాటల వింటూ అభిషేకం చూస్తున్నా. ఇంతలో మా వాడు ఆనందంతో కూడిన మాటలు తడబడుతుంటే పక్కనున్న భక్తుల సంభాషణ గురించి చెప్పాడు.

మన దేశీ భక్తుడు పంచకట్టుతో, ఎంతో తన్మయత్వంతో వున్న తన విదేశీ స్నేహితునితో నవ్వుతూ ఇలా అడిగాడు.
Ask Shiva in whose heart you stay  !!!


దానికి ఆయన సమాధానం.
In everyone's heart here  !!!

ఆ మాటలతో మనస్సు ఉద్వేగంతో శరీరం రొమాంచితమయ్యి కళ్ళు చెమర్చాయి.

                                                             *  *  *

భగవంతుని సంపూర్ణ అనుగ్రహం పొందామనటానికి ఈ యాత్ర ఒక ఉదాహరణగా చెప్పుకోవాలేమో !. ఎందుకంటే డిసెంబర్ 25న,  మేము ఆరోజు ప్రొద్దునే లాడ్జి లో దిగగానే ట్రిప్ గురించి డ్రైవర్ మరియు లాడ్జి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక రోజులో నవగ్రహ ఆలయాల దర్శనం చాలా  కష్టం అని, ఒకటిన్నర రోజులలో అయితే చేసుకోవచ్చు అని అన్నారు. సరే అని రెండు రోజులలో స్వామిమలైతో పాటు నవగ్రహ ఆలయాలు మరికొన్ని చుట్టుపక్కల ఆలయాలతో మాట్లాడుకున్నాము.

ఆరోజు మేము స్వామి మలై తో పాటు, రెండు నవగ్రహ ఆలయాల దర్శన భాగ్యం పొందాము. శుక్రవారంతో పాటు 3 రోజులు వరసగా సెలవలు వచ్చి కుంభకోణం యాత్రకి బీజంపడటం యాదృచ్ఛికం కానే కాదు. సూక్షంగా ఆలోచిస్తే డిసెంబర్ 25 రోజు దత్త జయంతే కాదు, కోరల 'పూర్ణిమ' కూడా. మాకు ఆ రోజు దర్శనం అయిన ఆలయాలు 'గురు', 'చంద్రులవి' :). నాకు ఇప్పుడు నడిచే మహా, అంతర్ధశలు చంద్రుడిలో గురు :). నాతో వచ్చిన మరొక ఇద్దరివి 'కుంభ' రాసులు. వెళ్ళింది 'కుంభ'కోణం. అంతే కాదు మేము వెళ్ళిన కొద్దిరోజులకు 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే 'మహా మహం' ఎప్పుడు వస్తుందో తెలుసా ! (The Mahamagham is celebrated once in 12 years on the day when "జుపిటర్" and the "మూన్" are in Simha rasi and the Sun in "కుంభ" rasi on the full moon day in Masi. This typically happens once in 4,332 days, says Shiva Shankara Gurukal at the Kumbeswarar temple, who is witnessing the fourth Mahamagham since 1980.).

ఇప్పుడు చెప్పండి సందేహాలు ఇంకా ఏమైనా మిగిలి వుంటే :). ఈ స్పురణా ఆలోచన క్రమాన్ని, విశ్లేషణను ఇంతటితో ఆపేద్దాం లేకపోతె భావోద్వేగాలు చుట్టుముట్టి ఈ 'మెటీర్యలిస్టిక్' ప్రపంచానికి దూరమయిపోయే ప్రమాదం వుంది. :).

మేము వెనుకకు రావటానికి కూడా అంతకు ముందే 'స్లీపర్' బస్సు బుక్ చేసుకుని వున్నాము. సరి అయిన సమయానికే బయలుదేరింది. వెళ్ళే దారితో భోజనానికి ఆపాడు. ఎక్కడో చెప్పనా ? అది 'తంజావూరు'. బస్సు వెళుతూ వుంటే తంజావూరు ఏదో కోటలాగా కనపడింది. తంజావూరు కి ఏదో శాపం వుంది అని అంటారు. అదేమిటో కింద చదవండి.

తంజావూరు లంకె 1

తంజావూరు లంకె 2  

క్లుప్తంగా చెప్పాలంటే, శాపం ప్రకారం పెద్ద అధికారంలో వున్న నాయకులూ అధికారాన్ని కోల్పోతారు అని. రాజ రాజ చోళుడు చెప్పిన అపచారానికి అది శపించబడినట్టు తెలుస్తుంది. అతను చివరలో ఆత్మహత్య కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పెద్ద పెద్ద అధికారంలో వున్నవారు గాని నా(మన) బోటి సామాన్యులు కాదు అని కూడా తెలుస్తుంది. అందుకని ఎక్కువ ఆలోచించవద్దు :). అయితే ఇది మనబోటి వారికీ కూడా వర్తిస్థుందా అనే సంఘటన ఆ తరువాత రోజు జరిగింది :).

రాత్రి మాటలు చెప్పుకుంటూ నిద్రపోయిన మాకు మధ్యలో పెద్ద శబ్ధం వచ్చింది. బాగా అలసిపోయి నిద్ర మత్తులో ఉన్నామేమో సరిగా పట్టించుకోలేదు. లేచి చూసేసరికి పగిలిన అద్దాలు బస్సులో నేలమీద పడి వున్నాయి. ఒక  కుటుంబం వాళ్ళు - భార్య, భర్త, పిల్లలు గాజు పెంకులు తలనుంచి తీసుకుంటూ గాయాలను తుడుచుకుంటున్నారు. కొంచెం బాధపడుతూ ఏమయ్యింది అని కనుక్కుంటే మా వెనుక బెర్త్ అద్దాన్ని టాంకర్ కొట్టినట్లు, ఆ అద్దాలు బ్రద్ధలై ఇంత బీబత్సం జరిగినట్టు తెలుసుకుని వెన్నులో వణుకు పుట్టింది.

మేము బస్సు దిగి వచ్చాక, తరువాత రోజు స్నేహితుడు నాకు ఆ రాత్రి కలలో పురాతన విగ్రహాలు కనిపించాయి అని చావు కబురు చల్లగా చెప్పాడు ( అలా కనిపిస్తే వాడికి 2 లేదా 3 రోజులలో ప్రమాదం జరగబోతుంది అని - కాలు లేదా చెయ్యి విరిగేటంత దెబ్బ ఏదో తగలబోతుంది అని సూచన). ఇది వరమా ! శాపమా !.

పై సంఘటన జరిగిన కొద్దిరోజులకు మాటల మధ్యలో స్వప్న దేవతా దర్శనాల పొందాడు అని చెప్పాను కదా ! ఆ స్నేహితుడు ఇలా చెప్పాడు. కుంబకోణం ట్రిప్ కి రెండు రోజుల ముందు కలలో మనకందరికీ కుంబకోణం లో ప్రమాదం జరిగినట్టు, ఐతే ఎవరికి ఏమి కాలేదు కదా ! ఇంకా బాధ ఎందుకు అని కలలోనే అంటుంటే, శివుడు నవ్వుతూ చూస్తున్నట్టు కూడా చెప్పాడు. ఎవరికి ఏమీ కాలేదు కదా అనవసరంగా మీరు భయపడతారు అని చెప్పలేదు ఆ విషయం అని, వీడూ నవ్వుతూ  చెప్పాడు :).

సృష్టిలో ఎన్ని చిత్రాలు, విచిత్రాలు. ప్రమాదం పుట్టించేవాడు, తప్పించేవాడు ఒక్కడే కదండి. ఈ విశాల సృష్టిలో ఎన్ని అవతారాలు, ఎన్ని విభూతులు. ఇసుకరేణువులను లెక్కపెట్టవచ్చు కాని నా విభూతలను లెక్కించలేము అని సాక్షాత్తు ఆ స్వామే భాగవతంలో కృష్ణ పరమాత్మ రూపాన చెప్పాడు. స్వామే పూనుకుంటే మీకడ్డు నిలిచేదెవ్వరు. మిమ్మాపెదెవ్వడు... ! ! !.

                                                                      *  *  *

మా చిదంబరం ట్రిప్ నుంచి వచ్చిన చాలా రోజులు వరకు మనస్సు అంత ఒక రకమైన ఉత్తేజంతో, ప్రశాంతతతో వుండేది. మాకే చిత్రంగా వుండేది. ఆ అనుభూతి చాలా రోజులు వెంటాడింది. అలా మా అనుభూతులు నెమరు వేసుకుంటూ వుండగా, కొన్ని రోజులకి మాతో వచ్చిన వారిలో ఒక స్నేహితుడు ఒక రోజు చెప్పాడు. వాళ్ళ వూరి గుడి పూజారితో 6 నెలలు నుంచి శివుని జన్మ నక్షత్రం అయిన 'ఆర్ధ' లో అభిషేకం చేయించాలి అని ఎన్నిసార్లు అనుకున్నా కుదరటం లేదు అని బాధపడుతూ ఉండేవాడు అంట. చిదంబరం వెళ్లి వచ్చిన విషయం ఆ పూజారి గారితో పంచుకుంటుంటే ఆయన అన్నారంట ! నువ్వు కోరుకున్నట్లుగా అభిషేకం జరిగింది కానీ ఇక్కడ కాదు చిదంబరంలో !!!  మీరు వెళ్ళిన రోజు అభిషేకం జరిగిన సమయం 'ఆర్ధ' నక్షత్రంలో అని :).

                                                                  *  *  *

ఐదు సంవత్సరాల పూర్వం నటరాజ స్వామి రూపం (విగ్రహం రూపం - పూర్తి రూపం) దర్శనం చేసుకుని వచ్చిన ఆ యువకుడికి ఆ రోజు తెలియదు వైదీశ్వరన్ కోవెల్ లో తను దర్శనం చేసుకున్న ఆలయం కుజుడు లేదా చెవ్వాయి అనబడే గ్రహ దేవతా స్వరూపానికి సంబంధించిన  ఆలయం అని, కుంబకోణంలోనే కాదు, తమిళనాటనే కాదు, దేశంలోనే ప్రఖ్యాత వహించిన నవగ్రహ ఆలయాల్లో ఒకటి అని, అది కుజ ఆలయం అని 5 సంవత్సరాల తరువాత 'సరియైన' సమయం వచ్చినప్పుడు తెలిసింది. అయన కారకత్వాలలో వున్నా అడ్డంకులను తొలగించి, ఆశీర్వాదం కొరకే అక్కడికి తన 'విధి' తీసుకుపోయింది అనీ.

చిదంబరంలో ఎక్కడ, ఏమి చూడాలో కూడా తెలియక అక్కడ వున్న నటరాజ స్వామి విగ్రహానికి మొక్కిన అజ్ఞానం, తిరిగి 5 సంవత్సరాల తరువాత ఇచ్చిన అత్యద్భుత దర్శన సుజ్ఞానంలో కలిసి మాయమైపోయింది. 5 సంవత్సరాలకు ముందు నటరాజ స్వామి విగ్రహ రూపంలో దర్శనం మాత్రం ఇచ్చి సంపూర్ణ రూపం (భౌతిక), మళ్ళీ అదే విధి స్పటిక లింగ దర్శనం (అసంపూర్తి రూపం) ((భౌతికత - ఆధ్యాత్మికత / భోగి - యోగి ( సగం ప్రయాణం పూర్తయ్యిందా ?)) ఇప్పించింది అనీ, ఇంక మిగిలిన ఆ చిదంబర రహస్యం (నిరాకారం) ఒక్కటీ తెలిసుకుంటే ఈ ప్రయాణం ఆగినట్టే అనీ.

                                                                   * * *