Saturday, December 16, 2017

దొడ్డ గణపతి టెంపుల్ - బసవన్న గుడి, బెంగుళూరు

బసవనగుడి, బుల్ టెంపుల్, దొడ్డ గణపతి టెంపుల్ - బసవన్న గుడి ఇపుడు బెంగుళూరు లో ఒక ఏరియా పేరు. అది పెద్ద నంది పేరు మీద వుంది. ఈ నంది కూడా దొడ్డ గణపతి ఆలయంలోనే వుంది.

కన్నడ లో 'దొడ్డ' అంటే 'పెద్ద' అని అర్థం. ఏకశిలా విగ్రహ రూపంగా గణపతి మనలోని ఇక్కడ అనుగ్రహిస్తాడు.

దొడ్డ గణపతి ఆలయంలో వెనుకగా లోపలి వెళ్ళితే ఇతర ఉపాలయాలు, పెద్ద విగ్రహరూపంలో బసవన్నగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. చుట్టూ వున్న పార్క్  అంత మెయిన్ రోడ్ లో కూడా వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అభివృద్ధి పోకడలు అంతగా విస్తరించక చాలా ప్రశాంతంగా ఉంటుంది.

క్రీ.శ. 1537 లో కెంపెగౌడ ద్వారా నిర్మితమైనట్లుగా తెలుస్తుంది.

జస్ట్ ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే గవి గంగాదేశ్వరుడి ఆలయం కూడా వుంది. తప్పక దర్శించండి. చాలా పురాతనమైనది. ఒక గుహలో ఉన్నట్టు ఉంటుంది. ఇవి రెండు కూడా బెంగళూరు టూరిస్ట్ ప్లేస్ లిస్ట్ లో వున్నవి మరి.

బసవన్న గుడి / బుల్ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ చదవండి.





























Sunday, November 26, 2017

శ్రీ భూ నీళా సమేత సత్యనారాయణ స్వామి - రంగాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.


రెండవ అన్నవరంగా ప్రసిద్ధికెక్కిన రంగాపురం గ్రామంలోనే మన సత్యనారాయణ స్వామి భూ నీళా సమేతంగా భక్తులని అనుగ్రహిస్తుంటాడు.

తెలుగునాట సత్యనారాయణ స్వామి అనగానే మనకి వివాహం, తదనంతర సత్యనారాయణ వ్రతం, వ్రత కథే గుర్తుకు వస్తుంది. ఇవన్నీ కాదు అంటే సరాసరి అన్నవరమే గుర్తుకువస్తుంది. అసలు 'వ్రతం' అని శుభలేఖలో చూస్తేనే టక్కున సత్యనారాయణ స్వామి వ్రతం అని గుర్తుకు వచ్చేస్తుంది ఇక చెప్పేదేముంది. వివాహ సంస్కారం, తదనంతర స్వామి వ్రతం అవిభాజ్యమైనవి. 'సత్యనారాయణ', 'సత్య' పేర్లతో మనకి నిత్యమూ కనిపించే మన చుట్టూ వున్న మనుషులు మనకి అనునిత్యం ఆ స్వామిని గుర్తు చెయ్యబోతారుగానీ మనకే ఆ స్పృహ ఉండదు. అది వేరే విషయం అనుకోండి. అసలు విష్ణుభగవానుని అవతార రూపమే మన సత్యనారాయస్వామి. ఈ అవతార ప్రయోజనమే భక్తులను కష్టాలనుంచి గట్టెకించటం. అవేమిటో ఇక్కడ  మరియు ఇక్కడ చదవండి.  

సన్నిహిత మిత్రులొకరు, ప్రఖ్యాతి వహించిన సత్యనారాయణ స్వామి ఆలయం మీకు దగ్గరే వుంది అనేవరకు కూడా మనకి పెద్దగా తెలియదు. అక్కడో, ఇక్కడో కొద్దిగా విన్నా గాని భౌగొళికంగా జ్ఞానం శూన్యం, దేవుడి 'కోసం' 'పని గట్టుకుని' వెళ్ళటం వూళ్ళో  తక్కువ కదా ! అందుకే అప్పటిదాకా పోలేదు. చిన్నప్పుడెప్పుడైనా వెళ్లానేమోగాని గుర్తులేదు.  

మొత్తానికి స్వామి అనుగ్రహంతో ఇంట్లోవాళ్ళు, తెలిసినవాళ్ళు, ఆఖరికి గూగులమ్మ సలహా, సూచన, సహాయంతో ఈమధ్యనే నేను, ఒక స్నేహితుడితో కలిసి, స్వామి దర్శనం చేసుకున్నాము.. ఆ విశేషాలు. 

రంగాపురం ఆలయంలోనే భూ నీళా సమేత సత్యనారాయణ స్వామితో పాటు వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు దర్శనం ఇస్తారు. ఫోటోలలో కనిపించినట్లు మనం ఆలయంలోకి వెళ్ళగానే ఏదో నాలుగు పోర్షన్ల ఇల్లు లాగ కనిపిస్తుంది. ఇటు నుంచి, అటు చివరకు దేవతామూర్తుల ఆలయ దర్శనం జరుగుతుంది. 

మేము వెళ్లేసరికి అక్కడ ఒకటి రెండు కుటుంబాలు వ్రతంలో పాలుపంచుకుంటూ కనపడ్డారు. వ్రతం టిక్కెట్లు, దక్షణ అవీ అడిగి తెలుసుకోండి. డివైడ్ టాక్ వచ్చింది ఇంతకుముందు మా వాళ్లు వెళ్ళినప్పుడు.:)  

తల్లిగారు కాలం చేసాక ఒక మంచి శుభం కార్యంతో మొదలెట్టాలని మా కుటుంబ సభ్యులు స్వామి దయ వల్ల వ్రతంలో పాలుపంచుకున్నారు. నేను అప్పుడు వెళ్ల లేకపోవటం వల్ల ఈసారి దర్శనంకి వెళ్ళానన్నమాట.

రంగాపురం గ్రామం జిల్లా హెడ్ క్వార్టర్స్  - ఏలూరుకు 32 కిలోమీటర్ల దూరంలో లింగంపల్లి మండలంలో ఉంది. 

'ద్వారకా తిరుమల' కూడా ఏలూరు నుండి వచ్చే దారిలోనే ఉంటుంది. కాకపోతే ఏలూరు నుంచి వచ్చేటపుడు మీరు మెయిన్ రోడ్ కుడిపక్కగా లోపలకి ప్రయాణిస్తే ద్వారకా తిరుమల / ఈస్ట్ యడవల్లి వెళ్తారు. రంగాపురం మెయిన్ రోడ్డ నుంచి ఎడమపక్క లోపలకి వెళుతుంది. కామవరపుకోట దగ్గర రోడ్ మారాలి ఎటు కావాలంటే అటు. వెళ్ళవచ్చు. బైక్ / కార్ జర్నీ ఐతే బావుంటుంది. ఇంకా షార్ట్ కట్స్  ఉండి ఉండవచ్చు. నాకు పెద్దగా తెలియవు.  బస్ సౌకర్యం వుంది. దగ్గరి రైల్వే స్టేషన్ ఏలూరు రైల్వే  స్టేషన్ అనుకుంటున్నా.

ఇకపోతే దర్శనం విషయానికి వస్తే భక్తులు పెద్దగా లేకపోవటంతో తొందరగానే అయిపొయింది. మొత్తం ఆలయం, పరిసరాలు చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. మెయిన్ రోడ్ పైనే వున్నాగాని పల్లెటూరు కాబట్టి పెద్దగా రణ, గొణ ధ్వనులు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఆలయ దర్శనం తనివితీరా చేసుకుని, ఆలయంలో కాసేపు గడిపి ఇంక వెనక్కి  బయలుదేరాము. 

వచ్చేదారిలో కామవరపుకోట వీరభద్ర స్వామి గుడికి వెళ్ళాము గాని ఆలయం మూసివేశారు. ఆలయం మెయిన్ గేట్ మాత్రం తెరిచారు. వాసవి క్లబ్ వారి మీటింగ్ జరుగుతున్నట్టు వుంది మేము వెళ్లేసరికి. మొత్తానికి స్వామి దర్శనం మాత్రం దొరకలేదు. 

మా ఊరునుంచి కామవరపు కోట వెళుతుంటే 'అడ్డరోడ్డు'లో వున్న సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో పాటు, కామవరపుకోట వీరభద్ర స్వామి దర్శనం కూడా, ద్వారకా తిరుమల దర్శన ముందే టోకున అనుగ్రహించేసాడు ఆ శివస్వామి. ఎందుకంటె రంగాపురం ఆలయం ద్వారకా తిరుమలవాసుని దత్తత ఆలయం కాబట్టి :). భీమవరం, ద్వారకాతిరుమల విశేషాలు (భీమవరం & ద్వారకాతిరుమల వెళ్లిన ట్రిప్స్) ఇంతకు ముందు పోస్టులలో వున్నాయి కదా :).