Saturday, September 30, 2017

పునః దర్శన ప్రాప్తిరస్తు !!! (ద్వారకా తిరుమలేశుని పునః దర్శనం)

కళ్ళు చెదిరే క్యాచ్ గురించి వినే వుంటారు మరి కళ్ళు చెదిరే దర్శనం గురించి విన్నారా ?

అవును నిజంగా ఇది నిజం.

ద్వారకా తిరుమల గురించి ఇంతకు మునుపు పోస్టులలో వివరాలు పంచుకున్నాను. అందుకని మళ్ళీ మొత్తం రాయటం లేదు. 

మదర్ చనిపోయాక ఏటి సూతకంలో భాగంగా ఎక్కడైనా పరోక్ష దర్శనాలు, ఆవిడ పేరు మీద ఏదో తోచిన పుణ్యకార్యాలే గాని ఎక్కడా కూడా ధ్వజస్తంభం దాటి గుడి లోపలికి పోలేదు. గోదావరీ జిల్లాల్లో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల దర్శనానికి కూడా ఈ నియమంతోనే బయటనుంచి దర్శనమే కానీ ధ్వజస్తంభం దాటిపోలేదు.

సాధారణంగా ఆచరించవలిసినవి, నిషేధాలు, నియమాలు  చెయ్యాలిసినవి చేయకూడనివి (Do's & Dont's) వంటి విషయాలు తెలిపే గ్రంథాలు ఏమిటంటే ధర్మ సింధు & నిర్ణయసింధు.

అవి అప్పటికి చదవలేదు. అంతేకాక కుటుంబాచారం, కుటుంబ పురోహితుడు సలహా మేరకు కూడా ధర్మం మారుతుంది కాబట్టి మా కుటుంబ పురోహితుడు చెప్పిన ప్రకారం ధ్వజస్తంభ నియమము పాటించటం మొదలుపెట్టాను.

స్నేహితులతో కలిసి మునుపు ద్వారకా తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు మొదట శివాలయంకి వెళ్లి, కాళ్ళు కడుక్కుని అక్కడ నుంచే దర్శనం చేసుకున్నా. కొంతమందిని ఆలయాల ప్రవేశం నిరాకరించారు అని ఎక్కడైనా చదివినప్పుడు తెలియలేదు కాని వారి బాధ అనుభవంలోకి ఐతే మాత్రం వచ్చింది. ఐతే పెద్దలు మహోన్నత దృష్టితో పెట్టిన నియమాలు ఎప్పుడూ కూడా కాలాతీతమైనవే. ఇకపోతే ఏదోలా దైవ దర్శనం దొరికిన సంతృప్తి కన్నా కూడా, దగ్గరనుంచి దర్శనం అవ్వలేదే అనే బాధ బాగా బాధ పెట్టింది. అక్కడ దర్శనం పూర్తి అయిన తరువాత వేంకటేశ్వరుని ఆలయంలో కూడా అంతే. 100/- టికెట్ తీసుకుని కూడా నియమయానికి లోబడి 'క్యూ' లోనికి వెళ్లి మళ్ళీ బయటకు వచ్చాను. మీరు మీ చాదస్తం అనుకునేలోపు మీకో విషయం చెప్పాలి.

మొన్న భీమవరం ట్రిప్ గురించి చెప్పాను కదా !. ఆ తరువాత మా స్నేహితుడు అటు నుంచి వాడు, ఇటు నుంచి నేను ద్వారకా తిరుమల దర్శనం చేసుకుందామని బయలుదేరి వచ్చాము. మొదటగా శివాలయం దగ్గరకు రాగానే ఉద్విగ్నతకు లోనయ్యాను. ఎందుకంటె ఏటి సూతకం పూర్తి అయ్యింది కదా ఇంక ఆలయం లోపలికి వెళ్ళ వచ్చు అని సంతోషం ఒకవైపు, స్వామి దర్శనం దొకరబోతున్న అనందం మరోవైపు. ఆలా వచ్చి పూల కొట్టులో పూలు తీసుకుందామని కొట్టతనితో మాట్లాడుతుండగానే పూజారి గారు అక్కడికి రానే వచ్చారు.

ఏమ్మా ! అభిషేకం చేయించుకుంటారా ! అని అడగనే అడిగారు.

అప్పటికప్పుడు కాదు అని చెప్పటానికి కారణం లేదు. స్వామి అనుగ్రహం గురించిన  ఆలోచన, సంతోషం రెండూ పొందే వ్యవధి కూడా లేదు :).

వెంటనే పూజ సామాను తీసుకుని లోపలకి వెళ్ళగానే శరీరం రోమాంచితమవుతుండగా అభిషేక దర్శనం, శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రంతో స్వామి ప్రార్థన రెండూ జరిగిపోయాయి.

కొన్ని నెలల కిందట స్నేహితులతో వచ్చి, వారందరు లోనికి దర్శనానికి వెళ్ళితే నేను ఒక్కడినే దూరంగా, వంటరిగా బాధపడిన మనః క్షోభకి స్వామి ఇచ్చిన కళ్ళు  చెదిరే అభిషేక దర్సనం - అనుగ్రహంకాక ఇంకేమిటి !

దేవుడున్నాడు. వింటాడు అనే దానికి మరొకసారి ఇది నిదర్శనం కాదా !

అష్టోత్తరంలో నిత్యమూ జపించే 'సర్వజ్ఞః' తత్వదర్శనమైన ఋషుల వాక్కుకి మన అనుభవపూర్వక నిరూపణ కాక మరేమిటి !

ఇదంతా ఒక ఎత్తు ఐతే వేంకటేశ్వరుడి దగ్గర ఉచిత దర్శనం ఇంకా బావుంది. అక్కడ శివాలయంలో  ఐతే ఇక్కడ వేంకటేశ్వర ఆలయంలో అవ్వుద్ది అంతే ! అది అంతే ! ఎందుకంటె స్వామి స్తోత్రంలో ఇంకో నామం 'విష్ణువల్లభా' ! 

ఇప్పటికింకా అవ్వలేదు. 1,116 /-  రూపాయలతో శాశ్వత సేవలు రూపేణా సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తున్నారు ఆలయ కమిటీ వారు. గోసేవ, అన్నదానం లాంటివి అన్నమాట, ఆ మొత్తం కట్టి చేపించుకోవచ్చు. ఐతే ఈసారి 'గోసేవ' కిద్దామా అని అలోచించి కౌంటర్లో వున్న మేడం గారి నడిగితే అవి ఎప్పుడూ ఉంటాయి అండి. 'స్వర్ణ' గోపుర తాపడ అవకాశం మళ్ళీ  దొరక్క పోవచ్చు. అందుకని ఇది చేసుకోండి అని చెప్పారు. నాకు వెంటనే భీమవరం 'బంగారం' సంఘటనలు లీలగా కళ్ల మీద కదలాడి, సంతోషంగా  ఆ సేవకే రాయమన్నాను.

ఇంక ఈ సంఘటన గురించి ఇప్పుడు నామాలు, స్తోత్రాలు, దేవతలు వారిమధ్య  సంబంధాలు, రెఫెరెన్సులు చెప్పను గాని ఒక్క మాట / పాట

విశ్వచైతన్యం / బ్రహ్మమొక్కటే .....పరబ్రహ్మమొక్కటే....!


ద్వారకా తిరుమల ఆలయం






కుంకుళ్లమ్మ ఆలయం (ఇది కొండ దిగి వచ్చాక సంతాన గోపాల స్వామి ఆలయం దారిలో ముందుగా దర్శనం అవుతుంది. రెండు ఆలయాలు కొంచెం దూరంలో పక్క,పక్కగా దర్శనమిస్తాయి)


సంతాన గోపాల స్వామి ఆలయం


దక్షిణ దిక్కు మెట్ల దారి. మా చిన్నప్పుడు ఇటు వైపు నుండి వచ్చేవాళ్ళము. ఇప్పుడు వాహనాల వల్ల తూర్పు దిక్కునుంచి వస్తున్నాము. ఊరివాళ్ళు ఇటు వైపు నుంచే వస్తారు. ఇదే సెంటర్ ఏరియా.






శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈస్ట్ యడవల్లి (ద్వారకా తిరుమల నుంచి ఒక నాలుగు / అయిదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం)






ద్వారకా తిరుమల ఆలయ, సేవల మరింత సమాచారం కోసం...






Sunday, September 24, 2017

భీమవరం ట్రిప్

పంచారామాలు అయిదు ఐతే వాటిలో రెండు పాలకొల్లు, భీమవరంలలో వున్నాయి. పరమేశ్వరుడు పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరుడిగా పూజలందుకుంటుంటే, భీమవరంలో సోమేశ్వర స్వామిగా మనలని అనుగ్రహిస్తాడు. 

ఈ రెండు క్షేత్రాల దర్శనం చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉండేది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకి స్వామి అనుగ్రహం అవకాశరూపంలో ఈ మధ్యనే దొరికింది. 

బెంగళూరు నుంచి శేషాద్రి ఎక్ష్ప్రెస్స్ లో చక్కగా బ్రాహ్మీ ముహర్త కాలంలో భీమవరంలో దిగటం చాలా సంతోషం అనిపించింది. ఆలా చేరితే చక్కగా తయారయ్యి  ప్రొద్దునే దర్శనం చేసుకోవచ్చు. అందునా మన షెడ్యూల్ కి చాలా బావుంటుంది. మా స్నేహితుడి చెల్లెలు భీమవరమే ఇచ్చారు కాబట్టి వాళ్ళు  రిసీవ్ చేసుకోవటం అక్కడే తయారయ్యి ఆవిడ స్కూటర్ తీసుకుని ఆలయ దర్శనానికి బయలుదేరటం జరిగిపోయాయి. చిత్రం ఏమిటీ అంటే వాళ్ళ  ఇల్లు భీమేశ్వరాలయం దగ్గరే, ఎడమ వైపు వెళ్ళితే మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం, కుడి వైపుకు పొతే సోమేశ్వరాలయం అర్థనారీశ్వర తత్వంలాగ వుంది కదండీ !!!

ఇక మా ప్రయాణమే ఒక చిత్రంగా జరిగింది ఒకటి రెండు రోజులముందు అనుకున్నాము అలా ఏదో కలలా జరిగిపోయింది. 

భీమేశ్వర ఆలయంలో స్వామి, మహిషాసురమర్ధిని అమ్మవారిని దర్శించుకుని, ఇతర వుపాలయాలు కూడా దర్శించుకుని అక్కడనుండి మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకోవటానికి బయలుదేరాము. 

మావుళ్ళమ్మ అమ్మవారి గురించి ఇంతకుముందే ఒక స్నేహితుడు నిడదవోలు ట్రిప్లో చెప్పాడు అని చెప్పాను కదా!. జీవితంలో ఒక్కసారి అయినా చూడాలి అనిపించే రూపం ఇక్కడ అమ్మవారిది. విగ్రహ స్వరూపం చాలా పెద్దది. నిండా అలంకారంతో, ఆభరణాలతో ధగ, ధగా మెరిసిపోతున్న అంత పెద్ద అమ్మవారి స్వరూపం చూసి ఆలా మంత్రం వేసినట్టు ఉండిపోతారు కానీ అది రోమాంచిత అనుభవం మాటలతో చెప్పేది కాదు నోటికి అందేది కాదు. ఇంక అమ్మవారి ప్రత్యక్ష దర్శనం చేసినవారి పరిస్థితి ఏమిటో కదా ! సరే అక్కడ కొంచెంసేపు గడిపి, స్త్రోత్రాలు అవీ చదువుకుని ఇంక సోమేశ్వర స్వామి ఆలయ దర్శనానికి బయలుదేరాము. 

భీమేశ్వర ఆలయంలో సువర్ణ కిరీటం చేయిస్తున్నారు. అందుకు అమ్మవారికి ఆసక్తి వున్న భక్తుల నుంచి బంగారం స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని అందిస్తున్నారు. అలాగే మావుళ్ళమ్మ అమ్మవారి గుడిలో కూడా స్వీకరిస్తున్నారు. భక్తులు మొక్కుబడులు రూపంలో కూడా బంగారపు మొక్కులు మొక్కుకుని తీర్చుకుంటారు అని తెలిసింది. అత్తిలిలో కూడా ఇలాంటిదే చేస్తున్నారు కాని ఎక్కడా కూడా ఏమీ చేయలేకపోయాము. కనీసం గ్రాము / లేదా తగిన మొత్తం అనుకుంట వాళ్ళు  స్వీకరించేది. తక్కువ మొత్తం ఇవ్వాలనుకుంటే హుండీలో వెయ్యమన్నారు మిగతా వాటికైనా ఉపయోగపడుతుంది అని. ఈ అనుగ్రహం దొరకలేదు అని బాధపడితే అది ద్వారకా తిరుమలలో ఆ బాధ పోయినది ఎలా అనేది ముందు చెబుతాను చదువుతూ వుండండి :). 

సోమేశ్వర ఆలయంలో కూడా స్వామి / అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్కడనుంచి ఇంటికి వచ్చి మిగతా ఆలయాల గురించి ఆరా తీస్తే యనమదుర్రు శివాలయం గురించి తెలిసింది. చాగంటి వారు ప్రవచనంలో అద్భుతంగా చెప్పారు.
ఆయన చెప్పింది అతిశయోక్తి కాదు మమ్ముటికి అద్భుతమైన ఆలయం అని అంటారు ఆలయ దర్శనం తరువాత. కానీ సమస్త బ్రహ్మాండాన్ని పోషించే పరమాత్మకు మాత్రం భక్తుల పోషణ కరువైనది.  అవును నిజమే ! అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతుంది ఇంత ప్రశస్తమైన ఆలయం. భౌతిక సుఖాల మోజులో పడి భగవంతుని, భగవత్తత్వాన్ని మర్చిపోతున్నాము కదా ! చాలా బాధాకరమయిన విషయం.

సరే ఆ విషయాలు పక్కన పెడితే, భీమవరం నుంచి యనమదుర్రు వెళ్లే దారి సింప్లీ సూపర్బ్ . చుట్టూ పల్లెలు, చేపల చెరువులు, చల్లని గాలి, పచ్చని పైరు, అబ్బో  ఏదో సినిమాల్లో చూపించే కోనసీమ గుర్తుకు తెప్పించింది. చాలా ఆహ్లాదంగా వుంది. మనకి స్వామి ఏదీ అంత త్వరగా అనుగ్రహించడు, అనుగ్రహిస్తే అదిరిపోద్ది అది ప్రయాణమైనా & ప్రమోదమైనా. అద్గదీ సంగతి. 

సరే యనమదుర్రు ఆలయంలో అభిషేకానికో, మరి శుభ్రపరచుదామనో గాని వెళ్లేసరికి  చక్కగా నిజ రూప దర్శనం జరిగింది. యనమదుర్రు ఆలయ విశేషాల గురించి ఈ ప్రవచనం చూడండి.

https://www.youtube.com/watch?v=w-2-F1U_Vvs 

సరే అక్కడనుండి తిరిగి పాలకొల్లు హడావిడిగా వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికే ఆలయం మధ్యాహ్నం విరామ సమయం అనుకుంట 12:20 కావొచ్చింది మేము లోపలకి వెళ్లేసరికి. అప్పుడే మూసేస్తున్నారు. స్వామి దర్శనం ఐతే దొరికింది గాని అమ్మవారిది ఇతర ఉపాలయాలు అప్పటికే మూసేసారు. మళ్ళీ  4 గంటలకు కాబోలు ! సరే అని పెనుగొండ (పెనుకొండ - అనంతపురం దగ్గర వున్నది వేరు) బయలుదేరాము. 'పండు' మెస్ అనుకుంట భోజనం బావుంటుంది అంటే అక్కడ  సుష్టిగా భోజనం చేసాము. తరువాత కన్యకాపరమేశ్వరి ఆలయం దగ్గరికి చేరుకుంటే ఇంకా  ఆలయం తెరవలేదు. ఆ పక్కగా చాలా పెద్ద మరొక ఆలయం కడుతున్నారు. అక్కడ ఆలయం దారిలో అమ్మవారి విగ్రహం ఒకటి వుంది చాలా పెద్దది.  చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ అమ్మవారి ఆలయం సాయంత్రం సుమారు 4 గంటలకు తెరిచారు దర్శనం చేసుకుని అక్కడినుండి అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి బయలుదేరాము.


కన్యకాపరమేశ్వరి అమ్మవారి గురించి ఇక్కడ చూడండి. 

మార్గమధ్యంలో నత్తా రామేశ్వరం హోర్డింగ్ కనపడింది. అరె! ఎప్పుడో పశ్చిమ గోదావరి జిల్లా పుణ్యక్షేత్రాలు గురించి చూసిన ఆలయాల్లో, ఇది కూడా ఒక ఆలయం అని గుర్తుకు వచ్చింది. మునుపు ఈ ఆలయానికి వెళ్ళచ్చు అని ప్లాన్ చేద్దామనుకున్నాము. అయాచితంగా అది మేము వెళ్లే దారిలోనే తారసపడటం నిజంగా మా అదృష్టం అనిపించి ఆనందం వేసింది. ఇందాక చెప్పా కదా ! స్వామి అనుగ్రహం గురించి. ఏది ఇచ్చిన అంతే వర్షమే :)      

నత్తా రామేశ్వర స్వామి దర్శనం చేసుకుని అత్తిలి వెళ్ళాము. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లీ,దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు. చూడగానే మీరు ఆశ్చర్య పోతారు ఎందుకంటె నేను అలానే ఆశ్చర్యపోయాను కాబట్టి. ఆలయం చూస్తే మా మద్ది ఆంజనేయస్వామి క్షేత్రం గుర్తుకు వచ్చింది. ఇక అక్కడ కూడా దర్శం చేసుకున్నాము. స్వామికి అక్కడ కూడా బంగారంతో కిరీటం చేసే విషయమై కమిటీ వారు బ్యానర్ పెట్టారు. సరేలెమ్మని ఏదైనా చిన్న మొత్తం ఇద్దామని ఆలయ కమిటీ వారిని కలిస్తే కనీసం గ్రామైన ఐతే తీసుకుంటాము లేకపోతె మాములు విరాళంగా రాయమన్నారు. అది నిజమే అనిపించింది ఎందుకంటె దానికి కూడా వెయ్యి మంది దాతలు (?) కావాలి కదా ! వారితో సరే అని స్వామి అనుగ్రహంగా తోచినది పూజారిగారికి ఇచ్చి రశీదు తీసుకుని తాడేపల్లిగూడెం చేరుకొని అక్కడనుండి నేను మా వూరు వచ్చేసాను. మా స్నేహితుడు భీమవరం వెళ్ళిపోయాడు.

ఇంకేముంది కథ కంచికి, మనం ఇంటికి :). 

నత్తా రామేశ్వరం గురించి మిగిలిన విషయాలు 
ఇక్కడ చదవండి.

అత్తిలి వల్లీ,దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం గురించి ఇక్కడ చూడండి.