Sunday, September 30, 2018

'వీసా బాలాజీ' దర్శనం


ఇదేమిటి ఇలా వుంది టైటిల్ అనుకుంటున్నారా ??? (లేదు అంది మాకు తెలుసా దేని గురించి చెబుతున్నారో అంటే ఒకే :) ).

చిలుకూరు బాలాజీనే ఇపుడు మనం చెప్పుకుంటున్న వీసా బాలాజీ.

ఈ ఆర్టికల్ మొదలుపెట్టిన తరువాత జరిగిన అనేక పరిణామాలు వల్ల రెండోసారి స్వామి వారి దర్శనం జరిగింది. పరీక్షలకి లోనుకావడం కూడా జరిగింది. బహుశా ఇది ఆఖరి ఆర్టికల్ కావచ్చు.

మేము ఆదివారం మధ్యాహ్నం లంచ్ చేసి దర్శనానికి వెళ్ళాము. ౩ గంటల నుంచి ౩.౩౦ వరకు ఆలయం శుభ్రం చెయ్యటానికి ప్రదక్షిణాలు ఆపుతారు. కనుక దాన్నిబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. శని, ఆదివారాలలో రద్దీని బట్టి భక్తుల ఆలయం వారు ప్రదక్షిణలు నియంత్రిస్తారు. కాబట్టి వచ్చేవారు దానికి తగినట్టు ప్లాన్ చేసుకోవాలి. నిన్న మా స్నేహితుడు రద్దీ తక్కువ వుంది కాబట్టి ప్రదక్షిణలు గంట నుంచి గంటన్నర లో పూర్తి చేసుకున్నాడు. అదే మాకు ఆదివారం మధ్యాహ్నం 4 గంటల పైనే (౩౦ నిమిషాలు బ్రేక్ తో సహా) పట్టింది. మాకు వచ్చేముందు ప్రదక్షిణలు భక్తులు బాగా రద్దీ ఉంటే ఆపేస్తారు అని విన్నాము కాబట్టి సోమవారం అయినా చేసుకుని మొక్కుతీర్చుకోవాలి అని ముందుగా ప్రణాళిక తో వచ్చాము. ఆ బాలాజీ దయవల్ల ఆదివారం రోజే అయిపొయింది.

బ్రాహ్మణ భోజనం లభించును అని ఆలయం వెనుక ఏర్పాటు ఉన్నట్టు తోచింది. మా సత్రం ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే వుంది. వసతి, భోజనం ఏర్పాట్లు బానే వున్నాయి.

ఆలయం బయట వాహనాలకు సదుపాయం వుంది. పార్కింగ్ పక్కనే గ్రామ దేవత ఆలయం వుంది. అది లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలియదు. ఈసారి చూడటం వల్ల దర్శనం చేసుకున్నాను. కానీ ఆలయం మధ్యాహ్నం మూసివేసివుంది. అమ్మవారికి అలంకారం బాగా చేశారు.

ఆలయం లోపల సెల్ ఫోన్ కౌంటర్ వుంది. చెప్పులు పెట్టడానికి బయట ప్రైవేట్ వ్యక్తుల ఏర్పాటు కూడా కనపడింది. షాపులు వాళ్లు, బిచ్చగాళ్ల సమస్య  ఎక్కువగా వుంది. ఆలయం లోపల దర్శనం తరువాత వచ్చిన దారినే రానివ్వటం లేదు. అలా రాకూడదు అన్నారు. అందుకే బయటకు వచ్చే ద్వారం దాటగానే శివాలయం కనిపిస్తుంది. బావుంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకోండి. కొన్ని పుస్తకాల షాపులు, ఆడవారికి షాపింగ్ చేసుకోవటానికి (తక్కువ ఖర్చులో) మంచి టైం పాస్ అక్కడ షాపులు.

ఆలయ పరిరక్షణ, పూజారుల సంక్షేమం కోసం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు వారు బానే పోరాడుతున్నారు. ఇక్కడ ఆలయం లో హుండీ కూడా ఉండదు. ఏమైనా మనం డొనేషన్ ఇస్తే ఆ మొత్తాలే నిత్య కైంకర్యాలకు వాడతారు. ప్రభుత్వం బారినపడకుండా, ఆలయ పవిత్రత కోల్పోకుండా పెద్ద యుద్ధమే చేస్తున్నట్టు వున్నారు. ఇలాంటి విషయాలలో భక్తులు అండగా ఆలయం వారికి ఉండాలి.

అభివృద్ధి మంచిదే. కానీ అది వెర్రితలలు వెయ్యకూడదు. ఆలయం ఆధ్యాత్మికతను ప్రతిభింభించాలే గాని అది విహారకేంద్రం కాకూడదు.  ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర, మూలాలు, నిర్మాణాలు దెబ్బతీసే ఎటువంటి అభివృద్ధి అయినా జరగకుండా ఆస్తికులు, చరిత్రని కాపాడే నాస్తికులు కలిసిరావాలి. విజయవాడ కనకదుర్గ ఆలయం విషయంలో అవి చూసాము. పుష్కర కాలం క్రితమే ఆలాంటి కామేశ్వర అస్త్రం అన్న పేరుమీద ఆలయంలో అభివృద్ధి పేరిట జరిగిన అక్రమాలు, కట్టడాలు ఆలయ పూజారి గారు పుస్తకం విడుదల చేసారు. భక్తి అంటే కళ్ళుమూసుకుని కోరికలు కోరుకుని అదే కళ్ళుమూసుకుని అన్యాయాలను సహించటం కాదు అని నా ఉద్దేశ్యం. పోరాటం చెయ్యక పోయిన కానీసం మద్దతు తెలపటం, సహాయ సహకారాలు అందించాలి.

ఒక గుడిలో నెయ్యి దీపం నిరంతరాయంగా ఒక నెల వెలగటానికి ౨౦ గోవులను పెంచవలసి ఉంటుంది అన్న చాగంటి వారి పలుకులు వినైనా చిన్న ఆలయాల, పూజారుల కోసం సత్వర ప్రత్యేక నిధిని ఏర్పాటు చెయ్యవలసి వుంది.

సరే ఏంటో స్వామి గురించి మొదలు పెట్టడం అది ముందుకు తీసుకునివెళ్లేలోపు గడ్డు పరిస్థితులలో పునః దర్శనం జరగటం చిత్రంగా వుంది. 

 అనంత పద్మనాభస్వామివి.... అనంతమైన లీలలు. 

Sunday, July 22, 2018

అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం & వ్రతం

బ్రహ్మాన్ని నీ కొంగుకి ముడివేసుకో. అప్పుడు నువ్వు  ఏ పని చేస్తున్నా, ఏ స్థితిలో వున్నా బ్రహ్మైక స్థితిని కలిగి ఉంటావు అన్న రామకృష్ణ పరమహంస పలుకులు మనం రామకృష్ణ పరమహంస కథామృతంలో చదువుతాము. ఆ విషయం గురించి వివరిస్తూ రామకృష్ణులు  ఏమంటారంటే... ఒక ఇంట్లో పనిచేసే పనిమనిషి ఎల్లప్పుడు ఆ ఇంటి యజమాని తాలూకు బిడ్డలను లాలిస్తూ, ఆ ఇంట్లో మిగతా పనులు చేస్తున్నా కూడా మనసెల్లపుడు ఇంట్లో వున్న తన బిడ్డల గురించిన ఆలోచన మీద ఉంటుంది. పని అయిపోగానే తన ఇంటికి చేరుకొని బిడ్డను దగ్గరకు తీసుకుని లాలించి, పాలిస్తుంది.  

భగవద్ విభూతలను, ప్రేమను, అనుగ్రహాన్ని చవిచూసిన వారెల్లరు కూడా రామకృష్ణుల బోధించిన పై విషయాన్నీ అనుభవంలో చవిచూసి ఉంటారనిపిస్తుంది. భగవంతుని గురించిన ఆలోచనలు పైనుంచి పడుతున్న నిరంతర నీటి ధార వలె ఎడతెగని ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంటాయి. చేసే వృత్తితో సంబంధం లేకుండా భగవంతుని తో అనుబంధం వున్నవాడు నిరంతరం ఏ స్థితిలో వున్నా, ఎలా వున్నా అవిచ్ఛిన్న భగవంతునితో అవినాభావ సంబంధం కలిగి ఉంటాడు.

అన్నవరం క్షేత్ర దర్శనంతో మరొకసారి స్వామి అనుభూతులు, లీలలు అనుభవంలోకి వచ్చాయి. అనంతమైన అయన లీలలు ఎంతచెప్పుకుంటే మాత్రం అవుతాయా !!! ఇంకొన్ని ఎప్పటికీ మిగిలే ఉంటాయి అన్ని విషయం తెలిసిందే కదా !!!


ఇన్ని చెప్పుకున్నాగానీ స్వామి పెట్టే పరీక్షలకి నాబోటి వాడు తట్టుకోగలడా !!! 

ప్రారంభంలో కోరికలతో అజ్ఞానంతో కూడిన ఆశ, తరువాత ఫలితాలపై వచ్చే ఆనందం, ఇలా చెయ్యకపోతే దేవుడు శిక్షిస్తాడేమోనన్న భయం, మనకెందుకులే అనుకుంటూ ఒక ప్రయత్నం చెయ్యటం, పక్కవాళ్ళు చేస్తున్నారని వారి లాగే ఎదవ ఇమిటేషన్స్ (సారీ ఇంపాక్ట్ కోసం వేసిన పదం) ఇలా ఒక్కోడి భక్తి 'లైఫ్ సైకిల్' మొదలైతే  మళ్ళీ , మళ్ళీ  వచ్చే ఫలితాలు నమ్మకాన్ని ప్రోది చేసి దృఢనమ్మకంగా మారిస్తే, భక్తిలో వచ్చే ఆటుపోట్లు మన నమ్మకాన్ని పరీక్షకు గురి చేస్తాయి. సెన్సెక్స్  లాగ మన మానసిక స్థితి బాగా ఫ్లక్త్యువేట్ అయిపోతుంటుంది ఈ దశల్లో. పరీక్ష నెగ్గిన ప్రతీసారి దృఢ నమ్మకం ఇస్తే, భవిషత్, ఎక్కడి గొంగళి అక్కడే వేసినట్టు వుండే జీవితం అది పెట్టే పరీక్షలకి భయాన్ని, విసుగు, కోపాన్ని కూడా ఇస్తాయి. భక్తిలో వచ్చే బాధ్యత భయానికి గురిచేస్తుంది. ఇవన్నీ దాటాక కొంతకాలానికి అయోమయం స్థితిలోకి వస్తాము. గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసే ప్రయోగాలకి ఇలా తయారవుతాడు (మన అదృష్టానికి(!) మనకి దారి చూపే గురువు కూడా ఉండడు కాబట్టి తప్పదు) :). ఇవ్వన్నీ దాటాక ప్రశాంతంగా అంటీ అంటనట్టు, ముట్టీ ముట్టనట్టు మన కర్మ (పని) మనం చేస్తూ ఉంటాము. ఇదండీ షార్ట్ గా 'భక్తి లైఫ్ సైకిల్'.  ఆ పైవాడు ఆడించే ఈ పరమపద సోపాన పటంలో ఒక్కో ఇక్కకి ఒక్కో అనుభవం. చూద్దాం పండించే వాడు ఆడిస్తున్నాడు ఏమి చేస్తాడో !!!!    

తూర్పు గోదావరి జిల్లా అంత పచ్చని పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది. అన్నవరం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా పట్టణీకరణ రక్కసి బారిన పడకుండా కొండల నడుమ పచ్చని వాతావరణంలో సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో అలరారుతుంది. 

అన్నవరం గుడి కి చేరుకున్నాక కొండపైకి వెళ్ళటానికి మెట్ల దారి, రోడ్ దారి వుంది. షేర్ ఆటోలు అవీ వున్నాయి. మెట్లదారి మొదట్లోనే స్వామి వారి పాదాలు వున్నాయి. అక్కడ చేతివేళ్ళతో భక్తులు కోరికలు నివేదించుకోవటం కనపడింది. మెట్లదారిలో అమ్మవార్ల గుడులు వున్నాయి. అవి దర్శించుకుని పైకి వెళ్ళాక ప్రసాదం కౌంటర్లు కనపడతాయి.

అక్కడనుంచి రెండు దార్లు కనపడతాయి. ఒక దారిలో రామచంద్ర ప్రభువు ఆలయం మొదటనే కనపడుతుంది. ఏ దారిలో అయినా కొన్ని మెట్లు ఎక్కితే ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడ నుంచి మొబైల్స్ అవీ పెట్టి 'క్యూ' లైన్స్ లో ఆలయం లోపలి వెళ్ళితే స్వామి వారు మొదటి ఫ్లోర్ లో దర్శనం ఇస్తారు. అక్కడ చూసుకుని కింద ఫ్లోర్ లో యంత్రం దర్శనం ఉంటుంది. 50 రూపాయలు టికెట్ తీసుకుంటే దగ్గరకెళ్ళి అర్చన చేసుకోవచ్చు. 

ఆలయంలో గోశాల, నీడ ఆధారంగా పనిచేసే సూర్య గడియారం, పాలాభిషేకంకి మేము సిద్దంగా ఉన్నట్టు చెట్టుకింద నాగ / సుబ్రహ్మణ్య  / ఆంజనేయ స్వామి మూర్తులు మనోహరంగా దర్శనమిస్తాయి. పైన ఆలయం సమీపంలో అద్దెకు లభించే ఆలయపు గదులు 200 రూపాయల నుంచి ఉంటాయి అన్నట్టుగా తెలిసింది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కనుక ఒక సారి టెంపుల్ సైట్ చూడగలరు. మేము అన్నవరం వాసవి సత్రంలో వున్నాము. మాకు ఇచ్చిన రూమ్ సరిగా లేక రాత్రి నిద్ర సరిగా పట్టలేదు. భోజనం బాగానే వుంది.

సత్యనారాయణ స్వామి అనగానే ముందుగా మన ఇళ్లలో గుర్తుకు వచ్చేది సకల శుభాలు కలిగించే స్వామి వారి వ్రతం మా పెళ్ళి అయిన తరువాత మొదటిసారి వ్రతం జరిగితే, రెండో సారి పెళ్లి మొక్కు తీర్చుకోవటం కోసం రెండవ అన్నవరంగా పేరు గాంచిన రంగాపురం లో రెండో సారి వ్రతం చేసుకోవటం జరిగింది. మళ్ళీ ముచ్చటగా మూడోసారి ఏకంగా అన్నవరంలో మూడుసారి అది కూడా పెళ్లి మొక్కుబడి లో భాగంగా జరగటం స్వామి వారి ఆపార అనుగ్రహమే కాని మనం నిమిత్తమాత్రులమే. స్వామి అనుగ్రహం ఈరూపేణ వెంట, వెంటనే దొరికింది అన్నమాట. 

ఇక వ్రతం వివరాలు & మిగతా విషయాలగురించి వస్తే...

మొదటి స్లాట్ ఉదయం ౫.౩౦ నుంచి మొదలు అవుతుంది. శ్రీకాళహస్తి వలే వ్రతానికి మండపాల బట్టి ఒక్కో రేట్ వుంది. కనీసం 200/౩౦౦ రూపాయలు టికెట్ ఒకటి తీసుకోవాలి ఒక దంపతులకి. మేము ఐతే బావుంటుంది అంటే 400 రూపాయల టికెట్ తీసుకున్నాము. బయట ఆరు కొబ్బరికాయలు, అరటిపళ్ళతో పూజ సెట్ అమ్ముతారు.  పూజకి వచ్చేటప్పుడు అది తెచ్చుకోవాలి. పసుపు, కుంకుమ వగైరాలు సరి చూసుకోండి. మేము సత్రంలో అమ్ముతున్నారు అంటే కొన్నాము గాని ఎందుచేతనో వాటిలో పసుపు మిస్ అయింది. అందుకే మీరు కొనేటప్పుడు పూజ సామాగ్రి సెట్ సరి చూసుకోండి.

పూజ మొత్తం కలిపి ఒక గంట నుంచి రెండు గంటల దాకా పడుతుంది. టికెట్ తీసుకుని మండపంలో కూర్చోవటం దగ్గర నుంచి వ్రత పరిసమాప్తి స్వామి దర్శనం అన్ని కలిపి ఒక రెండు నుంచి మూడు గంటలు పట్టవచ్చు. ఒక పూజారి గారు మైకులో వ్రత కథతో పాటు వివరాలన్నీ కూడా తెలుగు, హిందీ లో చెప్పారు. కన్నడ / తమిళ్ ఏదో ఒక భాషలో కూడా  చెప్పారో లేదో గుర్తులేదు. మీకు ఏ బాషా రాకపోతే పక్కవారిని చూసి ఫాలో అయిపోవటమే :). 

కొందరు పూజారులు బ్యాచ్ కింద వచ్చి భక్తులతో సంకల్పం అవీ చేయిస్తారు. తరువాత ప్రధాన పూజారి గారు వ్రత కథలు చెబుతారు. గణపతి పూజ, ఆవాహన, నవగ్రహ పూజ మిగతావి కూడా చేయించి సత్యనారాయణ వ్రతం మొదలుపెడతారు. వ్రతం పూర్తి అయ్యాక కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించాక మనకి స్వామి ప్రసాదం అందచేస్తారు. తరువాత పూజారి గారి దక్షిణతో అక్కడ నుంచి స్వామి దర్శనానికి బయలుదేరటమే . ఇది స్థూలంగా వ్రత వివరం. నాకు తెలిసింది, తోచింది చెప్పాను ఇంక మీదే లేట్. సత్యనారాయణ స్వామి పూర్తి ప్రసన్నవదనంతో, అనుగ్రహదృక్కులతో వున్నారు. మరి తొందర పండండి :).  

ఆలయం వారి వెబ్ సైట్

ఆలయం పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. సాయంత్రం పూట కాసేపు అక్కడ స్వామి ని తలుచుకుంటూ చల్లని వాతావరణాన్ని, ఆనంద తరంగాలని అనుభూతిలోకి తెచ్చుకోండి.

తలపులమ్మ లోవ అన్నవరంకి అతి దగ్గర వున్న మరొక ప్రసిద్ధి క్షేత్రం. కొండపైన అమ్మవారు అనుగ్రహిస్తారు. అన్నవరం నుంచి ఆటోలు ఉంటాయి. షేరింగ్ కష్టం. మేము తుని రోడ్ద నుంచి లోపలి వెళ్ళాలి అక్కడ దాకా వెళ్లి ఒక గంటసేపు నిరీక్షించిన ప్రయాణికులు లేక ఆటో మాట్లాడుకుని వెళ్ళవలసి వచ్చింది. కనుక మీరు ఆలోచించుకుని అన్నవరం లో ఆటో మాట్లాడుకోవటమో లేదా అనేది పరిస్థితులనుబట్టి నిశ్చయించుకోండి.     

తలుపులమ్మ తల్లి ఆలయం వాహన పూజలకు చాలా ప్రసిద్ది. చుట్టుపక్కల జిల్లాలు వాళ్ళు , వాళ్ళ, వాళ్ళ వాహనాలు కొన్నప్పుడు సెంటిమెంట్ గా ఇక్కడే పూజ చేయిస్తారు. అమ్మ వారు వాహనాలు ప్రమాదానికి గురికాకుండా, తమను రక్షిస్తుందని ఇక్కడివారికి బాగా విశ్వాసం. 

ఆలయం, అమ్మవారి దర్శనం చాలా బావుంది, బాగా జరిగాయి. వంట చేసిపెడతాము అని లోకల్స్  ఆడవారు వచ్చే జీపులు, వాహనాల వెంటబడి అడగటం కనిపించింది. 

అక్కడ నుంచి తిరిగి అన్నవరం చేరుకొని మా యాత్ర ముగుస్తుంది అనుకునేంతలో పిఠాపురంలో శ్రీ పాద వల్లభ దర్శనం కోసం ఆగటంతో, పురుహూతికా అమ్మ వారి పూర్వాలయంతో పాటు ఊరి బైపాస్ రోడ్ దగ్గర వున్న అమ్మవారి ఆలయం, కుక్కుటేశ్వర స్వామి ఆలయం, ఇతర వుపాలయాల దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. 

ఇక్కడ షేర్ ఆటోలు పొద్దుపోయేదాకా ఉంటాయి కనుక పెద్ద సమస్య  ఉండదు. ఏదోలా బ్రేక్ జర్నీలు చేసుకుని నెట్టుకు రావచ్చు. దాదాపు తూర్పు గోదావరి మొత్తం షేర్ ఆటో సర్వీస్ వుంది. కనుక పెద్దగా బస్సు లు గురించి ఆందోళన పడనవసరం లేదు.  
   












































Sunday, April 1, 2018

శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన వివాహం వైభవం ప్రవచనంలో నేను కొన్ని పాయింట్లు నాకోసం నోట్ చేసుకున్నా, మీకెవరికైనా ఉపయోగపడతాయేమో చూసుకోండి.


* part 1 12:౦౦ కన్యాదానం సమయంలో పెళ్ళికొడుకు అంగీకారం తెలుపుతూ "ఓం స్వస్తి"  అనాలి.

* part 2 17:00 వధువుతో శచీదేవి శ్లోకాలు , గౌరీ తపస్సు  వరకు చేపిస్తే జీవితంలో వైధవ్యం రాసి వున్నా శచీదేవి అడ్డుపడుతుంది.

part ౩ 18:00 పుట్టమన్ను / పాలికలు కన్యాదాత విధులు వివరణ.   

* part 2 20:00 గోళ్లతీత సంబరంలో సువాసినులు గంధం తీస్తే, తండ్రి వరస వారు మూడు నిలువు  చారికలు గోళ్లు తగలకుండా వేళ్లతో పెళ్ళికొడుకుపై గీస్తారు. అవి ఆరిన తరువాత తల స్నానం (మంగళ స్నానం) చేపిస్తారు. (బ్రాహ్మణేతరులు ఐతే అఱివేడు కుండలతో స్నానం). బాసికం కట్టాలంటే శైవారాధకులు (శివ భక్తులు కట్టాలి ఎందుకంటె విష్ణువు అల్లుడుగా చూస్తారు). 

* part 2 28:00 గొడుగు & చెప్పులు. గొడుగు & చెప్పులు బ్రహ్మ  స్థానంలో  వున్న వారికి దానం ఇవ్వాలి. పెళ్లికొడుకికి తరువాత ఇచ్చినా దోషం లేదు (రెండు జతలు కావాలి గొడుగు & చెప్పులు). 

* part 2 36:00 part 2 పెళ్ళికొడుకు తూరుపు దిక్కుగా బయలుదేరాలి, రాజద్వారం  దాటేటప్పుడు జ్యోతులు పట్టుకుని సువాసినీలు ఎదురు రావాలి. వారి తరువాత్త  నీటి  కుండలతో  వదిన  అక్క  వరసవాళ్లు  ఎదురు  రావాలి  అప్పుడు  పెళ్లి  కొడుకు  రాజద్వారం  దాటతాడు . తరువాత  ఎదుర్కోలు ఉత్సవం  అత్తగారు  తేనెతో లేదా  పానకంతో  ఎదురువస్తారు. అత్తగారు ఒక చిన్న గ్లాస్ తో  అల్లుడికి  ఇచ్చి  తాగమంటుంది.

* part 2: 45:59 గౌరీ  పూజలో  పార్వతి  పరమేశ్వరుల మూర్తి కి  పూజ  చేసుకోవాలి.  ఒక్క   అమ్మవారి కాదు . బుట్టలో  కూర్చుని  గౌరీ  పూజ  చేసుకోవాలి.  పీటల మీద  కూర్చుకుని  కాదు .

* part 3: 01:00 మేనమామ  మాత్రమే  బుట్టలో  పెళ్లికూతురిని  తీసుకెళ్లాలి . మేనమామ  లేకపోతె , మేనమామ  వరసైన  వాళ్ళు మాత్రమే  తీసుకెళ్లాలి . పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు మధ్యలో  తెర పెడతారు  ఆ  తెర శచీ దేవి.

బూట్లతో  / చెప్పులతో  వేదిక  మీదకి ఎవరు రాకూడదు. ఫోటోగ్రాఫర్ తో  సహా, ఎందుకంటె వేదమంత్రాలతో దేవతలు వస్తారు కాబట్టి. 

* part 3 10:30 పెళ్ళికొడుకు దర్భతో  మంత్రం  చెప్పి  నీట  ముంచి  పెళ్లికూతురు నొసటి  మీద పైకి తుడుస్తాడు.

* part 3 15:00 అత్తా మామలు  "కంద"  (ఒక  బుట్టతో  పూలు  & మరొక  బుట్టతో  పళ్ళు) తీసుకెళ్లాలి.  దానితో పెళ్లికూతురు గౌరీ పూజ చేసుకోవాలి.

* 18:00 కన్యాదాత  కొత్త  దర్భాసనం  కొనాలి.  వేదిక  మీదకి  వచ్చాక  పెళ్లి  కొడుక్కి  ఆసనం  వేయాలి  (వచ్చేది  విష్ణువు  అని  వేద  మంత్రాలు చెబుతున్నాయి).

* part 5 04:00 తెర  (శచీ  దేవి ) మీద  రాతలు  రాయకూడదు. తెర సువాసన భరితంగా ఉండి తీరాలి . గంధం రాయాలి . పసుపు  పెట్టాలి , అలాగే  పరిమళ ద్రవ్యాలు అదమాలి. రెండు  స్వస్తిక్  మర్క్స్  మధ్యలో  శ్రీకారం  రాయాలి . తరువాత  పెద్దలెవరైనా  పట్టుకుంటారు  అటు  ఒకరు  ఇటు  ఒకరు. మెల్లిగా దించుతారు తరువాత.

part 5 13:00 పళ్లెంలో కాళ్ళు  కడిగేటప్పుడు ముందు  కుడికాలు  పెట్టాలి. తరువాత  ఎడమ  కాలు  పెట్టాలి. 

part 5 14:00 మయీ  మయీమ్  మంత్రం  మామ  గారు  కాళ్ళు  కడుగుకొనేటప్పుడు  తేజస్సు  పోకుండా పెళ్లి కొడుకు చెబుతుండాలి తెలియకపోతే పేపర్ పై రాసుకుని చెప్పుకోవాలి.
(మయీ మయీమ్ మహా మయీమ్  యశో మయీమ్  ఇంద్రియం వీర్యం ) 

part 5 14:35 కన్యాదానం లో  అమ్మాయిని  పుచ్చుకుంటావా అన్నపుడు ఓం  స్వస్తి  పెళ్ళికొడుకు  అనాలి  (మీరు  అన్నది  నిజమగుగాక అని అర్థం).

part 5 16:50 సంప్రదదతే  తుభ్యం నమః  అని  పురోహితుడు  అన్నా కానీ మనం  ఇది మాములు దానం కాదు కాబట్టి ప్రతిపాదయామి అని వారికి చెప్పవలెను  - సంప్రదదతే ( (మామూలు దానం కాదు కాబట్టి తృతీయ విభక్తి వెయ్యకూడదు) అని కన్యాదాత  అనకూడదు . "ప్రతిపాదయామి" అని  చెప్పాలి. పురోహితుడు ఆలా చెప్పకపోతే  "ప్రతిపాదయామి"  అని  ముమ్మారు  కన్యాదాత  మనసులో అనుకుంటే సరిపోతుంది.

part 5 19:23 పెళ్లికూతురు పట్టుకునే కొబ్బరి బొండం మీద పేర్లు  / పెయింట్స్  రాయటం, సూదులు  గుచ్చటం  చెయ్యకూడదు. ఎందుకంటే అది పార్వతి పరమేశ్వర స్వరూపం. కొబ్బరిబోండం  / గంధపు  చెక్క  / గుమ్మడి తో  పెళ్లికూతురు చేతిలో  పట్టుకుని బుట్టలో కూర్చుకుంటుంది.

మహాసంకల్పం జాగ్రత్తగా వినాలి సభికులందురు.

జీలకర్ర  బెల్లం  కొద్దిసేపు  ముందు  మాత్రమే  తయారుచేయాలి

part 5 29:30 డోలు  సన్నాయి  మాత్రమే  మంగళ ధ్వని వాయిద్యాలు .

part 5 36:00 అత్తగారు  ఆవు  పెరుగు , నెయ్యి , కొత్త  సీసా  పుట్ట  తేనే  తో కలిపి పెడతారు. ఇది మధుపర్కం  అంటారు. 

part 6 ఫోమ్  / నురుగు  చల్లుకోకూడదు ( ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి ఒక భాగం నురగలో ప్రవేశపెట్టాడు కాబట్టి).

part 6 13:00 6 యుగాచిద్రాభిషేకం  చేస్తారు  ... తరువాత  పెళ్ళికొడుకు  దర్భతో  పెళ్లి కూతురు లలాటం పైకి తుడుస్తాడు అందుచేత భవిష్యత్ లో ఏమైనా వైధవ్య యోగాలుంటే పోతాయి.   

part 6 అక్షతలు వెన్ను విరగని బియ్యము వాడాలి . వేదిక  మీద  కుర్చీలు  వేయించకుండా  ఉండాలి. ఎందుకంటె వేదమంత్రాలతో ఇంద్రాణి దేవతలు వస్తారు .

part 6 22:00 కపిలవచనము  (తలంబ్రాలు ) తడిపి  ఆరబెట్టినా  బియ్యం  మాత్రమే  వాడాలి తలంబ్రాలకి  మారె  ప్లాస్టిక్  / పదార్దాలు  వాడకూడదు. ఒకసారి పోసుకున్నపుడు సంతానం, ఒకసారి  పోసుకున్నాడు  పాడిపంటలు  ఒకసారి  పోసుకున్నాడు  ధన  సమృద్ధి,  ఆఖరున  ఆడపిల్ల అంటుంది మనకి త్యాగం లభించుగాక అని. మిగిలిన  తలంబ్రాలు  ఆమంత్రకంగా  పోసుకుంటారు.

part 6 27:00 పెళ్ళికొడుకు  మంత్రంతో (నేను చూసినటువంటి ఈ నిరీక్షణ సుముహూర్తు అనుగ్రహం అనుగృహాణంన్తు - సుముహూర్తం గురించి సభలో అరవాలి. సభికులందరు చెప్పులుదీసి "ఇతి సుముహూర్తోస్తు" అని అనాలి. 

part 6 28:42 సభలోని పెద్దలకి   కన్యాదాత చందనం రాయాలి. కన్యాదాత లేకపోతే కన్యాదాత  అన్నదమ్ములు గాని రాయాలి. ఆడవారు ఆడవారికి  రాయాలి .

పచ్చ అన్నం  అమ్మవారి  అనుగ్రహం  కాబట్టి  తప్పనిసరిగా పులిహోర  & బూరె వేస్తె విందు (మృష్టాన్న భోజనం) పూర్తయ్యి నట్టే 

Wednesday, March 28, 2018

పిఠాపురంలో పల్లకి సేవ ('శ్రీ పాదుల' అపార అనుగ్రహ వీక్షణం).


"Strike while the iron is hot" అని ఇంగ్లీష్ లో ఒక సామెత. ఇది దత్తాత్రేయుల ఒకానొక అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభులకి సరిగ్గా సరిపోతుందేమో అని అనిపిస్తుంది. అనంత బ్రహ్మాండాలు, గెలాక్సీలు ఆయనలోనే ఇమిడి ఉంటే ఈ సామెతలు ఒక లెక్కా ! ఇంతకీ  ఆ సామెత ఎందుకు చెప్పానంటే స్వామి, భక్తుల పాప కర్మల వల్ల వచ్చే అనంతమైన కష్టాలను కాస్త కష్టంతో గట్టెక్కిస్తాడు కాబట్టి. జన్మాంతరాలలో అనుభవించవలసిన చెడు కర్మల ఫలాలను కొద్దిపాటి శిక్ష(ణ)కు గురిచేసి తీసివేస్తాడు కాబట్టి. ఇది నేను చెప్పే మాట కాదు సుమండీ! స్వామి వారి పారాయణ గ్రంధం చెప్పే మాట. 

శ్రీపాద శ్రీ వల్లభు చరితామృతం పుస్తకం నా చేతికొచ్చికొన్ని సంవత్సరాలైనా  ఈ మధ్యనే అయన అనుగ్రహం మంత్రరూపేణ కలగటంతో పాటు పారాయణ గ్రంధం పూర్తిచెయ్యటం కూడా సంభవించాయి. 

పుస్తకం పారాయణ చేసేటప్పుడు ఒక్కోసారి నిజంగా భయం వేస్తుంది. ఏమిటి ఇంత పెద్ద శిక్ష స్వామి అతనికి అంత నిర్దయగా వేసాడు అనిపిస్తుంది. కాని ఆ శిక్షకు గురి అయినా వ్యక్తులు చేసిన పూర్వ కర్మ, గత & ప్రస్తుత జన్మ తీరుతెన్నులు గురించి తరువాత సందర్భాలలో వివరించినప్పుడు మాత్రం తల తిరిగిపోతుంది. కేవలం అది కొద్దిపాటి శిక్ష(ణ)గా మనం అంగీకరించి, ఆ రూపేణా వారి అనుగ్రహించిన తీరు చూసి  ఆశ్చర్యంతో, ఆనందంతో చేతులెత్తి మొక్కుతాం. అవన్నీ సరైన నిర్ణయంగా (మనమెవరం ఆ విశ్వేశ్వరుడు నిర్ణయాలు సమీక్షించడానికి) మనసులోనే అంగీకరిస్తాం. 

స్వామి వారు పీఠికాపురంలో జన్మించటం దగ్గరనుంచి వారి మహిమలు, లీలలు (వారిని గురించి ఇలా అన్నానో లేదో..... కుక్క అరుస్తుంది పక్కింట్లో :). దత్తాత్రేయుల పాదాల దగ్గర నాలుగు వేదాలు నాలుగు కుక్కల రూపంలో వుండడటం మీకు తెలిసిన విషయమే కదా !. అదే ప్రతీకాత్మకంగా ఇలా కొన్ని సంఘటనలు మనకి అనుభవం అవుతుంటాయి), కురువపురంలో స్వామి వారి తపస్సు దాకా అన్ని విషయాలు వున్నాయి. ఈ గ్రంధం సప్తాశ్వ పారాయణ గ్రంధంగా దొరుకుతుంది.  

ఉద్యోగపరమైన ఇబ్బందులు తట్టుకోలేక, చివరి ప్రయత్నంగా స్వామిని మనస్సులోనే దర్శనానికి వస్తానని ఇలా కోరానో లేదో, ఆలా ఇబ్బందులు మాయమయ్యాయి. జగన్నాటక సూత్రదారి కదా ఆయన. కష్టాలు తెచ్చేది, తీసేది అనీ ఆయనే కదా ! కష్టమూ ఆయనే. సుఖమూ ఆయనే. ఇంకా ఉద్యోగ కష్టాలు తీరాయి. మరి మొక్కు తీర్చాలి కదా ! తప్పదు అని సమయం కోసం వేచి చూస్తుంటే, వ్యక్తిగత విషయంగా ఇంటికి వెళ్ళవలసి వచ్చి రాజముండ్రికి ఫ్లైట్ దొరికింది. అక్కడనుంచి 2 గంటలు బస్సు  జర్నీ పిఠాపురానికి. పిఠాపురానికి నేరుగా రాజముండ్రి నుంచి బస్సులు లేవు అని చెప్పారు. అందుకని సరాసరి సామర్ల కోట వెళ్లి అక్కడనుంచి పిఠాపురానికి ఆటో పట్టుకుని పిఠాపురం చేరుకున్నాను. జిల్లాలో అన్ని చోట్ల దగ్గర దూరాలకు ఆటో సౌలభ్యం బావుంది.  

పిఠాపురం విశేషాల విషయానికి వస్తే.... ముందుగా పిఠాపురం వూరు సమీపిస్తోందనగా రోడ్ జంక్షన్ దగ్గర కనిపించే కుక్కుటేశ్వర స్వామి ఆలయం, అందులోనే అష్టాదశా శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా అమ్మవారి ఆలయం, కోనేరు దర్శించుకోవచ్చు. పిఠాపురం పాదగయగా ప్రఖ్యాతి వహించింది (అందుకే శ్రాద్ధం, పిండప్రదానాలు ఎక్కువగా కనపడతాయి). శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం కూడా పిఠాపురమే. బ్రహ్మహత్యా నివారణ కోసం ఇంద్రుడు స్థాపించిన అయిదు వైష్ణవాలయాలలో ఒకటైన కుంతీమాధవ స్వామి ఆలయం కూడా పిఠాపురంలో దర్శించుకోవచ్చు. అలాగే అమ్మవారి పీఠికా అమ్మవారు అని చాలా చిన్న ఆలయం నిజానికి ఇదే అమ్మవారి శరీర భాగం పడిన చోటు అని ఇక్కడ అభివృద్ధికి అవకాశం లేక కుక్కుటేశ్వర ఆలయంలోకి మార్చారు అన్నట్టు తెలియవచ్చింది. సరే ఇంతకు ముందు పిఠాపురం దర్శనం అయినపుడు విశేషాలు అన్నీ పాత వ్యాసంలో విశదంగా రాసాను కాబట్టి మళ్ళీ  అవన్నీ చెప్పటంలేదు  పాతది ఆర్టికల్ చూడగలరు.

వికీపీడియా లో చూడండి ఒకేసారి పిఠాపురం గురించి... 

శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థాన్ ఆలయపు వెబ్ సైట్ కోసం ఇక్కడ చూడగలరు. 

ఈసారి పిఠాపురం దర్శనం ప్రధానంగా శ్రీ పాద శ్రీ వల్లభుల దర్శనం మొక్కు తీర్చుకోవటం గురించి అని చెప్పాను కదా! ఆలా పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ దత్తక్షేత్ర ఆలయంలోకి ప్రవేశించటంతోనే భజనలు వినబడుతున్నాయి. ఐతే ఒక విషయం చెప్పాలి. వూళ్ళో  ఆలయానికి దారి కనుక్కుని వెళ్ళేదారిలో ఆలయ ఆస్తులు అక్రమార్కుల తీరును నిరసిస్తూ ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిభిరం కనపడింది. 

గుడిని, గుడిలో దేవుడిని మింగే రాక్షసులు తయారయ్యారు అనిపించింది. దర్బారు సమయంలో అలాంటి వారిని ఆలయంలో లోపలికి రానిచ్చి తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు దుడ్డు కర్రతో స్వామి కఠినంగా శిక్షిస్తాను అని స్వయంగా చెప్పిన పారాయణ గ్రంథ వ్యాక్యాలు ప్రకటన రూపంలో ఆలయంలో కనిపిస్తాయి. అది చూసాకైనా స్వామి సర్వాంతర్యామి, ఎవరికి ఎప్పుడు ఎలా శిక్ష'ణ' జరపాలి తెలిసినవాడు అన్న ఆలోచన ఆ అక్రమార్కులకు రాదు. వారి కర్మ ఆలా వుంది. నాకు మాత్రం స్వామి వాళ్ళ పని పడతాడు అన్న ఆలోచనతో మన: స్థిమితం వచ్చింది. 

కౌంటర్ లో వున్న వారి దగ్గరనుంచి షాపుల వాళ్ళదగ్గర వరకూ కూడా ఎవరూ కదిలిస్తే పెద్దగా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడటం లేదు. మాట్లాడదలచుకోవటం లేదు అనటం నిజానికి సబబుగా ఉంటుంది. ప్రభుత్వం అజమాయిషీ లోకి వెళ్ళింది అని మాత్రం చెప్పారు. 

అనంత పద్మనాభ స్వామి ఆలయం దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు రాజ మార్తాండ వంశ కుటుంబీకులు ఆలయం బయట వున్న పంపుదగ్గర కాళ్ళు  జాగ్రత్తగా కడుగుకొని వెలుపలికి వస్తారంటా. ఎందుకంటే అక్కడ ఆలయపు ఇసుకరేణువులు కాళ్ళకి అంటుకుని వచ్చేస్తాయి అవి కూడా స్వామి సంపదే, స్వామి సొత్తు తిన్నట్టు అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఆలా చేసేవారు అని చెప్పేవారు. 

చూసారా ఎంతలో ఎంత తేడా. ఇంతకు ముందు చెప్పిన వారికి, ఈ రాజకుటుంబీకులకి.. అప్పటికీ, ఇప్పటికీ. ఎంత తేడానో కదా!. సౌకర్యాలు పెరిగిపోతున్నాయి కాని వ్యక్తిత్వాలు చచ్చిపోతున్నాయి. కాని వారి కర్మ కాలిన రోజున మాత్రం అన్నీ లైన్ లోకి వస్తాయి. ఆ రోజున మాత్రం జీవితం దానికదే అర్థం అయిపోతుంది!!!    

ఆ తరువాత కౌంటర్లో వున్న అయన విభూతి ప్రసాదం ఇచ్చారు. అది తీసుకుని స్వామి పాద ముద్రలు బయట కూడా వున్నాయి (ఆలయం లోపల వుండే అసలు పాదాలు - మనకి పుస్తకం మీద కనిపించేవి. అవి ప్రొద్దున అభిషేకం సమయంలో అనుకుంట దర్శనంకి అవకాశం ఇస్తారు అని చెప్పారు). అవి దర్శించుకుని ఆలయంలోకి అడుగు పెట్టాను. 

స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను. హమ్మయ్య !!! మొక్కు చెల్లించుకున్నాను అన్న సంతోషంలో వున్నాను. సరే అని కౌంటర్లో ఏమైనా సేవలు ఆ రోజుకి మిగిలి ఉన్నాయా అంటే పల్లకి సేవ వుంది 7 గంటలకి. కాని సేవ చెయ్యాలంటే పంచె కట్టుకోవాలిసిందే అని చెప్పారు. సరే అని పక్కన షాప్ లో కొత్త పంచె ఒకటి తీసుకుని హడావుడిగా నా బట్టలు వాళ్ళని అభ్యర్ధించి అక్కడ పెట్టి, పరుగు పరుగున టికెట్ తో పల్లకి సేవ కోసం మిగతా వారితో కలిసి కూర్చున్నాను.

పల్లకి సేవ మొదలు పెట్టేముందు అందరి పేరున పూజ చేసి పల్లకి ఎత్తించారు. అసలే అలాంటి మనకి అలవాటు లేదు. మరో పక్క కంగారు, భయం. ఏమి చేస్తే ఏమంటారో అని. అందరు పల్లకి ఎత్తి పట్టుకున్నారు. కాని పట్టుకునేలోపే అందరు పట్టుకోవటం వాళ్ళ నాకు పట్టుకోవటమే గగనం అయిపొయింది. దేవుడా మొత్తానికి చివరన దొరికింది అని సంతోష పడేలోగా, అటు కాదు ఇటు తిరగాలి అన్న పిలుపుతో నాతోపాటు అందరూ అటు నుంచి ఇటు తిరిగారు.. నాకు సంతోషం, కంగారు, భయం అన్నీ ఒకేసారి రెట్టింపు అయ్యాయి. ఎందుకంటె ఇటు తిరగగానే, ఇటు నుంచి నేనే ఫస్ట్ అన్నమాట. ఆఖరున వున్న నేను, స్వామి అపార అనుగ్రహం వల్లన, వరసలో మొదటి స్థానానికి వచ్చేసాను అన్నమాట:). ఇలాంటప్పుడే అయన మీద నమ్మకం & ప్రేమ రెండూ ఎక్కువ అయిపోయేవి :)..

మనకేమో ఇలాంటి సేవలు అవీ అలవాటు లేదు. పద్ధతులు అసలే తెలియవు. అక్కడ ఆలయ కమిటీ పెద్దాయన కూడా బాగా కంగారు పెడుతున్నారు. ఆ కంగారుకి నేను కంగారు పడుతుంటే లోపల పంతులు గారు ఒక స్మైల్ ఇచ్చారు మాకు అలవాటే అనో లేక నా భయాన్ని, ఆందోళనని అర్థం చేసుకొని దైర్యంగా వుండటానికో.  ప్రతిగా చిరునవ్వు  నవ్వా.. 

అక్కడ మరాఠి భక్తులు ఎక్కువగా వున్నారు. సిద్దమంగళ స్తోత్రం, దిగంబరా దిగంబరా శ్రీ పాద శ్రీ వల్లభ దిగంబరా భజన, నామఘోషతో ఆలయం పరిసరాలు అదిరిపోతున్నాయి. మనసు అనేకసార్లు తన్మయత్వానికి లోనవుతుంది. పంచె వేడికి తడిసిపోతుంది. ఒక పక్క చెమటలు, మరోపక్క కాస్త ఆందోళన. పల్లకి ఒక్కో దిక్కు దగ్గర కొంతసేపు ఆపటం భక్తులతో వింజామరలు స్వామికి వీయించటం. స్తోత్రాలు, పాటలు వాహ్ ! జన్మానికో శివరాత్రి లాగా జన్మనికో పల్లకి సేవ అనిపించింది. మొత్తంగా గంట దాకా పట్టింది. మా పల్లకి ఒక ప్రదక్షిణ పూర్తి అయిన తరువాత వేరే వారి కోసం ఇమ్మంటే, పల్లకి పట్టుకున్న నా స్థానాన్ని ఇచ్చాను. కాని అప్పటికే నిజంగా చాలా వత్తిడికి లోనవడం, నా ఇతర ఆరోగ్య సమస్యలు వల్ల శ్రీ పాదులు మధ్యలో కొంచెం రెస్ట్ ఇచ్చాడు అనిపించింది. నా స్థానంలో పట్టుకున్న వారేమో అవకాశం, అనుగ్రహం అని అనుకున్నారు. తరువాత ప్రదక్షిణకి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చ్చారు. మొత్తానికి పల్లకి సేవ ఎలా జరిగిందని ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతః !!!     

పొద్దునే నిశ్చయ తాంబూలాలు పెట్టుకుని తెల్లవారగట్ల 02:50 కి ఇంటికి చేరుకున్న  మొట్టమొదటి వ్యక్తిని బహుశా ఈ ప్రపంచంలో  నేనే అనుకుంట :). అసలైతే సమయానికి ఇంటికి వెళ్తానో లేదో అనుకున్నవాడిని చెప్పాలంటే చాలా త్వరగానే పంపించాడు మా స్వామి. అసలేమైందంటే... 

పిఠాపురంలో దర్శనం అయ్యేసరికి సుమారు 10 అయిపొయింది.  పీఠికా అమ్మవారి ఆలయం తప్ప ఇంకేమి దర్శనం అవ్వలేదు. నేను ఐతే సంకల్పంలో అవన్నీ చేసుకుంటానని గాని అవన్నీ దొరుకుతాయి అని కాని ముందు అనుకోలేదు. ఇక అక్కడ ముగించుకుని డబ్బుల కోసం పిఠాపురంలో ఏ.టి.యం లు చాలా ట్రై చేశాను. ఒక్క  ఏ.టి.యం కూడా పనిచేయలేదు. సమాల్ కోట అదేనండి మన సామర్ల కోట చేరుకున్నాక ఒక ఏ.టి.ఎం. కష్టం మీద దొరికిందనుకుంటే రెండువేల నోటు వచ్చింది. ఇంకేముంది చిల్లర కోసం చెప్పులు అరిగేలా తిరిగాను. దొరకలేదు. చివరకు బస్సు స్టాండ్ లో వున్న షాపులో దొరికింది గాని వున్న ఒక్క బస్సు  వెళ్ళిపోయింది. 

రాజముండ్రి రావటానికి రెండు రూట్స్ వున్నాయి. బయట రోడ్ మీద చాలాసేపు వేచిచూశాక ఒక ఆటో అతను వచ్చాడు. అతను రాజముండ్రి వెళ్తున్నా అంటే ఇంకా కొద్దిమంది ప్రయాణికులు వున్నారు నాలాగే అని అన్నాను. కాకపోతే బైపాస్ రూట్ అదేనండి రెండో రూట్ కాకపోవటంతో తనకి పెద్దగా ఆసక్తి లేకపోయినా మొత్తానికి వచ్చాడు. వెళుతూ చెప్పాడు. సర్ వచ్చే దారిలో ఒక కార్ టైర్ పంక్చర్ ఐతే జాకీ ఇచ్చి సహాయం చేశాను అని, ఆలా రోడ్ మీద ఒక్కో సరి ఇబ్బంది వచ్చి ఆగిపోతే సహాయం చెయ్యాలి అని, ఆ సమయంలో సహాయం చెయ్యాలి సర్ అని చెప్పుకొచ్చాడు. దారి మధ్యలో అతను చెప్పినట్టు పాపం హిందీ లారీ డ్రైవర్స్  ఇద్దరు అడ్రస్ పట్టుకుని, వచ్చేవాహనాల వాళ్ళ సహాయం కోసం చూస్తున్నారు. ఆటో ఆపి అడ్రస్ చెబితే మనకి వచ్చిరాని హిందీలో వాళ్ళకి రూట్ చెప్పాను. 

ఇంకా మనుషుల్లో మంచితనం దాగివున్నది అని ఆ ఆటో అతన్ని చూస్తే అనిపించింది. కొన్ని వందల చందమామ నీతి కథల పుస్తకాల నీతిని, సమాజంలో చాలా సాధారణంగా బతికే కొందరు వ్యక్తులలో చూడవచ్చు. ఉన్నత విలువలు, వ్యక్తిత్వాలు కలిగిన అతి సాధారణ వ్యక్తులు కనపడితే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఇదే కాదు, నేను ఏదో ఒకటి చేసి బతకగలను అన్న ఒక పట్టభద్రుడికి లేని ఆత్మవిశ్వాసం కూడా సమాజంలో ఏదో ఒక పని చేసుకుని బతికేసేవాడికి ఉంటుంది నిజంగా అదే ఆశ్చర్యం.   

సరే వెనక్కి వస్తే..., రాజమండ్రి చేరుకున్నాక  తనకి కొంచెందూరం ఎక్కువైనా బస్సు స్టాండ్ దగ్గర దింపాడు. నేను వంద నోటు తీసుకోమని ఇస్తే మొత్తం వద్దని మిగతా చిల్లర డబ్బులివ్వబోయాడు. నేను కాదని కొంత ఎక్కువగానే ఇచ్చాను. ఖచ్చితంగా ఇలాంటి వారిని ప్రోత్సహించాలి తీరాలి. ఎందుకంటె మంచితనం, విలువలు మనలో కూడా ఇంకా చచ్చిపోలేదు అని నా నమ్మకం. అలాగే స్వార్థ పూరిత ప్రపంచానికి ఇంకా బలిపశువు అవ్వలేదు అని కూడా ఒక నమ్మకం.   

ఒక మనిషకి - ఐతే దేవుడే మన బాగోగులని చూసుకుంటాడు అన్న నమ్మకం అయినా. 
 ఉండాలి లేకపోతే తన విలువలమీద తనకి నమ్మకం అయినా ఉండాలి. ఆటో మీటర్ మీద ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవారు ఈ రెండు కాక మూడో రకం "అవసరాలు" ఒత్తిడి చేసేవాళ్ళు అనుకోవాలేమో. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది. టీవీ. పత్రికల పొడ సోకని పల్లెటూళ్ళకి పారిపోతే కొంతైనా 'మన' అన్నది దొరుకుతుందేమో అని  !!!  

రాజముండ్రి వచ్చాక, రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే బస్సు లు ఉంటాయి అంటే వెళ్లిన ఒక పది నిమిషాలలో అన్నట్టుగానే ఒక బస్సు  వచ్చింది. కాస్త మెల్లగా వెళ్లినా గాని చాలా సౌకర్యంగా జాగ్రర్తగా మొత్తానికి ఇల్లు చేరుకున్నాను. చేరేసరికి తెల్లవారగట్ల 02:50 అయింది. అప్పటికి పడుకున్నాను. 


ఆలా అన్ని ఇబ్బందులు వచ్చినా కూడా స్వామి అనుగ్రహంతో వాటన్నిటిని అధిగమించి మొత్తానికి స్వామి దర్శనంతో పాటు నా ఎంగేజ్మెంట్ కూడా బాగా జరిగిపోయింది. 

ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి. 

"and, when you want something, all the universe conspires in helping you to achieve it" పాల్ కొయిలో "అల్కెమిస్ట్" అన్న పుస్తకంలో చెబుతాడు. 
    
సింపుల్ గా చెప్పవయ్యా అంటే నువ్వు  భగవంతుడిని నమ్మడమే తరువాయి. తరువాత అయన చూపించే మిరాకిల్స్ కి కొదవా !!! వస్తువో, వ్యక్తో, ప్రకృతో అంతటా ఆయనే. అన్నీ ఆయనే....  అద్భుతాలు చూపిస్తాడు. తట్టుకోలేరు. గంజాయి తాగే సాధువులో, ప్రేమ ఫెయిల్ అయినా ప్రేమికులను సినిమాలలో ఎలా చూపిస్తారో తెలుసుకదా ! అంతకన్నా ఆ ఇంటెన్సిటీ దారుణంగా ఉంటుంది మరి. ఆ తరువాత మీ ఇష్టం. ఆలోచించుకొని భక్తిలోకి దూకండి :).

కొసమెరుపు
-------------

పల్లకి సేవ చేద్దామా ! వద్దా ! అదేమో పద్ధతులు, నియమాలు మనకి తెలియవు. తెలిసి తెలియక సేవలో పాల్గొనాలో వద్దో, మళ్ళీ  ఏమి ఇబ్బందులు వచ్చి పడతాయో, పెద్ద పని పెట్టుకుంటానేమో అని డైలమాలో ఉండగానే,  భక్తులందరూ పల్లకి సేవ చేయరా అన్న చరణంతో ఆలయాన్ని అప్పుడు మారు మోగిస్తున్నారు ఇంక స్వామి ఆదేశం వచ్చాక చెప్పేదేముంది తప్పదు కదా !!! మీకైనా, నాకైనా మరి :).








శ్రీ పాదుల ఆలయంలో వున్న ప్రసాదం హాలు. ప్రసాదం చాలా బావుంది.


ఇంతకు ముందు అమ్మవారి పీఠికాలయం అసలుది వూళ్ళో  వున్నది అని చెప్పాను కదా ! ఆలయానికి ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు. నేను శ్రీ పాదుల ఆలయం నుంచి వస్తూ ఇలా బయటకు వచ్చాను.