Saturday, February 10, 2018

లేపాక్షి, అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్


బెంగళూరు నుంచి ఒక రోజులో చుట్టివచ్చే ఒకానొక ఆలయం ఏది అంటే లేపాక్షి అని చెప్పవచ్చునెమో ! ఎందుకంటె ఇది బెంగుళూరు నుంచి 120-130 కిలోమీటర్లు దూరంలో వుంది కనుక. ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారి కూడా కాబట్టి ఫ్లైఓవర్ లు, హైవేలలో వెళ్లిపోవచ్చు.

బెంగళూరు నుంచి రెండు పెద్ద అద్దె మోటార్ సైకిల్స్ తీసుకుని మేము నలుగురు స్నేహితులు మొన్న ఆదివారం లేపాక్షి బయలుదేరి వెళ్ళాము. చలి చాలా మటుకు తగ్గింది అనే చెప్పవచ్చు. వెళ్లే దారంతా విశాలంగా, వాతావరణం కొంచెం చలిగా ఆహ్లాదంగా ఉండబట్టి ప్రయాణం బాగానే సాగింది.

సుమారు 9 గంటల సమయంలో ఆలయానికి చేరుకున్నాము. ఒక ఆరుకిలోమీటర్లు తగ్గుతుంది అంటే ఘాట్ రోడ్ లో వెళ్ళాము. అది నిజంగా 'ఘాటు రోడ్' అని చెప్పవచ్చు. ఎందుకంటె దాదాపు 10  కిలోమీటర్లు పైన రోడ్ వేస్తున్నారు. డ్రైవింగ్ కష్టం అయింది అనే చెప్పాలి. అందుకే వచ్చేటప్పుడు హైవే మీద నుంచే వచ్చేసాము.

లేపాక్షి ఆలయ చరిత్రకి వస్తే... 'లే' 'పక్షి' అని శ్రీరాముడు సీతమ్మవారిని రక్షించటానికి శాయశక్తులా పోరాడి రెక్కలు తెగి చావు బతుకులమధ్య  ఊపిరిలూదుతున్న జటాయువుకి మోక్షం ప్రసాదించిన పుణ్య స్థలమే ఈ లేపాక్షి. 'లే' 'పక్షి', అదే క్రమేణా లేపాక్షిగా మారింది అన్న విషయం కూడా మనం చిన్నపుడు చదువుకున్నాము.

కూర్మ పర్వతం మీద వేంచేసిన 'వీరభద్రుడు' ఇక్కడ ప్రధాన ఆలయంలో మూల విరాట్టుగా ఆలయంలోకి ప్రవేశించగానే దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు. ఆ పక్కనే దుర్గా అమ్మవారు కూడా దర్శనమిస్తారు. పాపనాశేశ్వరుడు అనుకుంట ఒక పక్కగా లింగరూపంలో దర్శనమిస్తాడు. అమ్మవారు ప్రదక్షిణ చేసి వస్తుంటే కనపడతారు. ఇక్కడి వీరభద్రుడు చాలా మహిమ గలవాడిని చెబుతారు (కొసమెరుపు ఉందిలెండి :) ).

 అక్కడ దర్శనాలు పూర్తిచేసుకుని ఆలయం ప్రదక్షిణ పూర్వకంగా చూద్దామని ఎడమవైపు వెళ్ళగానే అక్కడ వేలాడే స్తంభం చూసాము. అటు తరువాత నాగలింగం ఆనాటి వంట సామాగ్రి, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి వారి విగ్రహం ఆపక్క వున్న స్వామి పాద ముద్ర మొదలైనవి కూడా చూసుకున్నాము. గైడ్ సర్వీస్ వుంది కాబోలు ఎవరికో ఒక గైడ్ ఆలయం చూపిస్తూ కనపడ్డారు (ఆంజనేయ స్వామి పాదముద్ర వెతుకుతుంటే పరోక్షంగా ఆయన వల్లే చూడగలిగాము).

ఇక్కడో విషయం చెప్పాలి మిగతా దేవాలయాలలో దేవుడు బయటనుంచి చూస్తే కనిపిస్తాడు కాని వీరభద్ర స్వామి ఉగ్ర రూపం కాబట్టి నేరుగా స్వామి చూపులు ఊరి మీద పడకుండా ఉండేలా తలుపులు కొంచెం పక్కగా జరిపి కట్టి ఉంటాయి.స్కాందపురాణం ప్రకారం లేపాక్షి 108 శైవ క్షేత్రాలలో ఒకటి. అంతే కాక ఈ ఆలయాన్ని అచ్యుత రాయల మంత్రి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా కట్టించాడు అని, రాజుకి ఈ విషయం తెలిసి వేసే శిక్ష ముందుగా తానే వేసుకున్నాడు అని రెండుకళ్ళూ పీకి అక్కడ ఆలయ దక్షిణ గోడలకు విసిరికొట్టాడని ఇప్పుడు అక్కడ గోడలపై కనిపించే రెండు ఎర్రటి గుర్తులు ఆనవాళ్లుగా స్థానికులు చెబుతారు. ఒకటిలో మూడోవంతు నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోవటానికి కారణం కూడా అదేనట. అసలు విరూపాక్ష అనేదే శివుడి ఒక నామం అంటే సూర్య, చంద్రాగ్నులు కన్నులుగా కలిగినవాడు కాబట్టే విరూపాక్షుడు అయ్యాడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులకు అవి ప్రతీక. మూడు కన్నులవాడు ముక్కంటి అని చిన్నపుడు చెప్పుకునేవాళ్ళము కదా !

లేపాక్షి గురించి మరొక అబ్బురపరిచే విషయం ఏమిటంటే ఇక్కడి శిల్పకళ. విజయనగర రాజుల శిల్పకళకు వారి శిల్ప శైలికి ఆనవాలుగా అనిపిస్తుంది. గుడిలోపల పైకప్పుల మీద కలంకారీ చిత్రాలు చాలా బావుంటాయి కాని అవి బాగా పాతబడి సరిగా కనిపించటం లేదు. స్తంబాలమీద చెక్కబడిన శిల్పాలు ఓపికగా చూడాలి. ఎవరు చూసినా కెమెరా కన్నులలో నుంచి చూసేవారేకాని అన్ని తీసి పక్కనబెట్టి మైమరిచి చూసేవాళ్ళు  ఐతే ఎవరు కనపడలేదు (నాతో సహా :P). జీవితాలు 'డిజిటల్ - 'మయం'' 'మాయం' 'మన్యం' కదా ! 

ఆలయం చుట్టు ప్రదక్షిణ పూర్వకంగా నడుస్తుంటే ముందుగా పెద్ద విఘ్నేశ్వరుడు విగ్రహరూపంలో కనిపిస్తాడు. అక్కడ ప్రార్థించి ముందుకు వెళ్లి కుడిపక్కకు తిరగగానే అక్కడ అబ్బురపరిచే నాగలింగం కనిపిస్తుంది. ఇక్కడ నాగలింగం, ఆలయం బయట మెయిన్ రోడ్ లో వున్న పెద్ద నంది దేశంలోనే ఎంతో అరుదు.

అక్కడ దేవాలయ దర్శనం అయ్యాక లేపాక్షి నంది వున్నచోటికి వెళ్ళాము. అక్కడ చూసుకుని పక్కన వున్న నందిని హోటల్ బావుంటుంది అంటే అక్కడ కాస్త ఎంగిలిబడి బయలుదేరి వచ్చేసాము. ఆ పక్కన జటాయు విగ్రహం ఏదో నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నట్టు చెప్పారు కాని అటు వైపు పోలేదు.

ఈ నెలలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫోటోలలో బ్యానర్ ఫోటో కూడా తీసా. చూడగలరు.  అంతర్జాలంలో కొంత సమాచారం లభిస్తుంది. కొన్ని లింక్స్  ఇచ్చాను  చూడండి.

వీరభద్ర స్వామి దేవాలయం గురించి ఇక్కడ చూడండి.


లేపాక్షి గురించి ఇక్కడ చూడగలరు.


లేపాక్షి గురించిన మంచి న్యూస్ ఐటెం ఇక్కడ చూడండి.


రాజేంద్ర వినోద్ గారి షార్ట్ ఫిలిం లింక్.


మొత్తానికి ఆలా స్వామి దయతో లేపాక్షి యాత్ర ముగించుకుని తిరిగి జాగ్రత్తగా బెంగళూరు చేరుకున్నాము.

కొసమెరుపు చెప్పేముందు....,

 మొన్న ఏలూరు దగ్గర గాలాయగూడెం అమ్మవారి జాతరకు వెళ్ళేటప్పుడు కామవరపుకోట వీరభద్ర స్వామి దర్శనంకి సాయంత్రం హడావుడిగా వెళ్ళితే తలుపులు తాళం వేసి వున్నాయి అదేమీ స్వామి అనుకుని జాతరకి వెళ్ళిపోయాము.

విజయవాడ పెద్దమ్మ అదేనండి బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరనుంచి పిలుపు వస్తే మళ్ళీ వెళ్లకపోతే అదో తంటా అని వెళ్ళితే స్పెషల్ దర్శనం చేయించుకోమంది. జీవితంలో అంత దగ్గరనుంచి చూడటం మొదటిసారి. మూడు వందలు టికెట్ వెల. కాని వృధాగా ఎన్నో అనవసర విషయాలకో, హాస్పిటల్కో, సినిమాలకో వందలు,వేలు ఖర్చుపెట్టేస్తాము కాని ఆరోజు దర్శనానికి పెట్టడంలో మాత్రం ద్రవ్య వినిమయం, ద్రవ్య శుద్ధి లాంటి పదాలు అనుభవంలోకి వచ్చాయి అనిపించింది. ఒక రూపాయి డిబ్బీలో వెయ్యటం, బిక్షగాడికి వెయ్యటమో, పోగొట్టుకోవటమో, ఖర్చుపెట్టడమో ఏదైనా కాని వున్న రూపాయే. కాకపొతే వినియోగించేవాడి విచక్షణ మీద దాని వినియోగం విలువ కట్టడమో, కట్టలేకపోవడమో జరుగుతుంది.

ఈ సోది అంత మాకెందుకు ఆ కోసమెరుపేదో చెప్పు స్వామీ అంటే... వీరభద్రుడు, కనకదుర్గ అమ్మవారు మళ్ళీ ఒక్క వారంలోనే ఇక్కడ లేపాక్షి ఆలయంలో దర్శనమివ్వడంతో నా ఫీజులు ఎగిరిపోయాయి.

ఎక్కడో వందలకిలోమీటర్ల దూరాన దర్శనం మివ్వని స్వామి మళ్ళీ లేపాక్షిలో అదే దర్శన మివ్వటం, ఆ పక్కనే 'దుర్గా' అమ్మవారి దర్శనం కూడా జరగటం, ట్రిప్ జరిగేసమయానికి వింటున్న దక్షారామ ప్రవచనంలో వీరభద్ర ఆవిర్భావ ఘట్టం.... 'ఏకం సత్ విప్రాః  బహుదా వదంతి'. కొన్నిటికి హేతువు సైన్స్ దృష్టిలో చూడకూడదు.       

లేపాక్షి దర్శనానికి ముందు వారం జరిగిన సంఘటన - సెలవ అయిపొయింది ఇక ఇంటి నుంచి బెంగళూరుకు బయలుదేరే సమయం వచ్చింది అని అనుకుంటూ ఈసారి బెజవాడ టెంపుల్ దర్శించుకోవటానికి వెళ్లాలా ? తప్పదా ? వెళ్లకపోతే ప్రతీసారిలాగే ఏదో ఒకటి నెగటివ్ జరుగుతుంది వెళ్ళితే ఆ వచ్చే సమస్య  పోతుంది అని ఆలోచిస్తూ పక్కన పెట్టిన నా చిల్లర డబ్బులలో ఐదు రూపాయల కాయిన్ కనపడితే కొంత యథాలాపంగా, కొంత భయపడుతూనే వెనక్కి తిప్పా. ఇంకేముంది అమ్మవారు. అది కూడా మన బెజవాడ పెద్దమ్మ ...కనకదుర్గమ్మ !!! ఇంకేం చెప్పాలి ... వుంటా.

రవి ప్రకాష్.