Thursday, December 25, 2014

శ్రీ కాడు మల్లిఖార్జున, నందికేశ్వర, గంగమ్మ & లక్షీ నరసింహ ఆలయాలు, మల్లేశ్వరం, బెంగళూరు - 2

మొన్న మేము వెళ్ళినప్పుడు నందీకేశ్వర, గంగమ్మ, నారసింహ ఆలయాలు అప్పటికే మూసివేసారు అని చెప్పాను కదా!. ఈరోజు క్రిస్మస్ సెలవు రోజు కదా అని సాయంత్రం వెళదాము అని బయలుదేరాము. సాయంత్రం 6.30 గంటల  ప్రాంతంలో చేరుకున్నాము. ఆలయాలు అన్నీ తెరచే వున్నాయి. మొదటగా నందీశ్వర ఆలయంకి వెళ్ళాము. కాళ్ళు కడుక్కుని అలా లోపలికి వెళ్ళామో లేదో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా స్వామి ఆలయ అంతర్భాగం బంగారు రంగుతో దగ దగ మెరసిపోతూ కనిపించింది. అప్పుడే స్వామికి తెరవేసి పూజ చేస్తున్నారు. నందీశ్వరుని నోటి నుండి శుద్ధ జలంతో స్వామికి అభిషేకం అవుతూ కనిపించింది (వీడియో చూడండి). శివలింగం, నందీశ్వరుని నోటి నుండి సన్నని ధారగా ఏకదాటిగా పడుతున్న శుద్ధ జలం, ఎదురుగా కోనేరు, చుట్టూ మెట్లమీద జనం అన్నీ కనిపిస్తున్నాయా (ఫొటోస్ చూడండి).

అభిషేకంకి అంత సేపు కూర్చోలేని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే అన్నట్టు స్వామి, మెట్లమీద వెనక్కి కూర్చుని చక్కగా కోనేరు నీటిలో స్వామి ప్రతిబింబాన్ని, జలచరాలు తాబేళ్లు, వింత చేపలు కలియ తిరుగుతుంటే, చల్లని సాయత్రం, ప్రకృతి వడిలో చూడటం చక్కని అనుభూతి. ఆలయ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉత్తరాదివారి ఆలయంకి వచ్చినట్టు అనిపించింది. నంది నోటి నుంచి పడుతున్న శుద్ధ జలం మనం ఫిల్టర్ చేసే నీరు కన్నా కూడా శుద్ధంగా వుంది. మేము బాటిల్ ఒకటి ఆలయం నుంచి కొనుక్కున్నాము. అభిషేకం పూర్తయి, ప్రసాదం తీసుకుని వచేటప్పుడు ఆలయవేళలు గురించి అక్కడ వున్న ఆలయ సిబ్బందిని ఒకరిని అడిగాను.  ధనుర్మాసం కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం లో ఆలయం తెరచి 10 గంటల కల్లా మూసివేస్తున్నారు అని చెప్పారు. మిగత రోజుల్లో ఉదయం సుమారు పన్నెండు గంటల వరకు తెరచి వుంటుంది అని చెప్పారు.

ఆలయ దర్శనం ముగించుకుని రాత్రి 7.45 కావస్తుండటంతో మళ్ళీ మిగతా గుడులు మూసివేస్తారేమో అని ఆత్రుతతో పరుగున గంగమ్మ దర్శనంకి వెళ్ళాము. గుడి లో అమ్మవారిని చూస్తుంటే కంచి కామాక్షి అమ్మ వారు గుర్తుకు వచ్చారు. దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక ప్రక్కగా అమ్మవారి విగ్రహం ఒక తొమ్మిది అడుగులు వుంటుంది ఏమో గాజు గదిలో వుంది. మనలిని ఆశ్చర్యచకితులను చేస్తూ, ముగ్ధ మనోహరంగా అమ్మవారి నిజరూప దర్శనం తమ జీవితంలో పొందలేనివారు, ఒక్కసారి ఐన పొందితే చాలు అనుకునే వారు అక్కడ చూస్తే చాలు అన్నట్టు అనిపించింది. అంత బావుంది అమ్మవారి విగ్రహం. సాక్షాత్తు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అక్కడ.

గంగమ్మ ఆలయ దర్శనం ఐయ్యాక మేము లక్ష్మి నరసింహ స్వామి ఆలయం లోకి ఇలా వెళ్ళామో లేదో అలా తలుపులు మూసివేసారు. చాలా బాధ వేసింది. ఈసారి కూడా మొన్నటి లాగానే జరుగుతుంది అనే బాధ మనసులో నుంచి కళ్ళలోకి వచ్చేలోపుగా ఒక వింత (?) జరిగింది. ఆలయం వారికి తెలుసో ఏమిటో ఒక జంట వచ్చారు. అంతే ఇంకా చెప్పేదేముంది వాళ్ళుతో పాటు మా దర్శనం కూడా అయిపొయింది :) మొదటిసారి ఆలయంకి వచ్చినపుడు ఆలయ దర్శనం కాలేదు కదా అన్న బాధతో, నిస్సహాయతతో మావాడితో సరదాగా అన్నాను నీకు ఎమ్మెల్లే తెలుసా లేదా మంత్రి తెలుసా అని. అది స్వామి గుర్తుపెట్టుకున్నాడు కాబోలు! మూస్తున్న, మూసిన తలుపులు తెరిపించి మరీ నరసింహ స్వామి లక్ష్మి సమేతుడై దర్శనమిచ్చాడు. ఏమి ఇవ్వగలం స్వామికి, రెండు చేతులు జోడించి కైమోడ్పులు తప్ప !

తరువాత మళ్లీ ఒకసారి కాడు భ్రమరాంబా సమేత మల్లిఖార్జునుని స్వామిని ఇతర దేవతా దర్శనం చేసుకుని సంతోషంతో తిరిగి వచ్చేసాము.


Address: 15th Cross, Temple Street, Vyalikaval, Malleshwaram, Bengaluru – 560 003 Ph: 080 - 23566146 Landmark:
BJP Office / Kaadu Mallikharjuna Devastanam.


















 

Saturday, December 20, 2014

శ్రీ కాడు మల్లిఖార్జున, నందికేశ్వర, గంగమ్మ & లక్షీ నరసింహ ఆలయాలు, బెంగళూరు.




































మరాఠ రాజు శివాజీ సోదరుడు వెంకోజి 17 వ శతాబ్దంలో, అశ్వత వృక్షాల నడుమ, ఒక పెద్ద రాతి మీద కాడు మల్లిఖర్జున స్వామి ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. అస్సలు ఈ ఏరియా పేరు (మల్లేశ్వరం) కూడా ఈ స్వామి పేరుమీదనే వచ్చినట్టు చెబుతారు. గత వారం రోజుల నుండి త్రిచి వెళ్ళాలి అనీ, శివన సముద్రం వెళ్ళాలి అనీ, ఇంకా చాల ఆలోచనలు చేసాము కాని. రకరకాల కారణాలు - రైలు టికెట్లు దొరకకపోవటం చేతనూ, ఇతర చిన్న చిన్న పనుల చేతనూ అన్యమనస్కంగా వున్నాము. సరేలెమ్మని మళ్లేశ్వరం దగ్గరవున్న శ్రీ నందికేశ్వర ఆలయం కి వెళ్ళాలి అని శుక్రవారం అనుకున్నాము ఈరోజు శనివారం బయలుదేరాము. ఐతే దురదృష్టవశాత్తు (?) ఆలయం 10 గంటల కల్లా మూసివేస్తారని తెలిసింది. మేము 10 గంటలకే వెళ్ళాము. లోపల వున్నా కొద్ది భక్తులకు మాత్రం బయటకు రావటానికి ఆలయం గేటు తెరుస్తున్నారు. ఇంత తొందరగా మూసి వెయ్యటం ఎక్కడ చూడకపోవటంతో కూడిన  ఆశ్చర్యం, దర్శనం కాలేదని కొద్ది బాధ కలిగింది.

ఇంక ఈ నందికేశ్వర ఆలయం 1999లో బయటపడినట్టు గా చెబుతారు.కార్బన్ డేటింగ్ ప్రక్రియలో ఈ ఆలయం 7, 000  సంవత్సరాల పురాతనంగా తేలటం ఆశ్చర్యం గొలిపే విషయం ఐతే ఇంత రద్ధీ ప్రాంతంలో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బయలుపడకుండా వుండడం మరింత ఆశ్చర్యపడే విషయం.

నందికేశ్వర ఆలయంలో నంది నోటినుండి వెలువడే నీరు శివ స్వామిని అభిషేకం చేస్తుంది. అస్సలు ఈ నీరు ఇక్కడ నిరంతరాయంగా అభిషేకిస్తూనే వుంటుంది. ఈ నీరు యొక్క మూలం ఎక్కడో, ఎవరికీ తెలియడం లేదు. వృషభావతి నది మూలం పుట్టుక ఇక్కడే అని చెబుతారు.

కాడు మల్లిఖార్జున ఆలయంలో, కుమారస్వామి ఆలయం కూడా వుంది. పెద్ద ఆలయ సమూహంలా లక్ష్మీనరసింహ ఆలయం, గంగమ్మ ఆలయంతో పాటు ఇక్కడ 4 పెద్ద ఆలయాలు వున్నాయి. అనేక అంతరాయాలు, వుపాలయాలు వున్నాయి. పార్వతి, వినాయక, శక్తి గణపతి, విష్ణు, చందికేశ్వర, ఆంజనేయ, నవగ్రహ, నాగ ప్రతిమలూ, వుపాలయాలు అంతటా పూజలు అందుకుంటున్నాయి.

ఈరోజు శని త్రయోదశి కావటం చేత దేవాలయం పరిసరంలో నూనె బట్టని దీపంలో వేసి, అర్చనతో దర్శనం చేసుకున్నాము.
 
ముఖ్య గమనిక:
పదిగంటల లోపు దర్శనం చేసుకోవాలి అన్ని ఆలయాలు ఇక్కడ. దాదాపు నాలుగు ఆలయాలు ఇక్కడ వుంటే కేవలం కాడు మల్లిఖార్జున స్వామి ఆలయం మాత్రం 12 వరకు వుంటుంది. మిగతావి అన్ని 10 గంటల కల్లా మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రమే 5 గంటలకు. 

పక్కనే వెంకటేశ్వర భవన్లో ఉపాహారం స్వీకరించాము. అద్భుతంగా వుంది. ఆలయం వాళ్ళు నిర్వహిస్తే ఎలా వుంటుందో అలా వుంది :).

కొసమెరుపు చెప్పలేదు కదా ! అర్చన జరిగేటప్పుడు ద్వజస్తంబం వరకూ భక్తులు నిలుచున్నారు. మేము ద్వజస్తంబం పక్కనే వున్నాము. అలా మల్లిఖార్జునుడిని స్మరిస్తూ భక్తిభావం లోకి వెళుతుంటే ఆకస్మాత్తుగా ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కాని ఒక సీతాకోక చిలుక మా పైన తిరుగుతూ ప్రదక్షిణగా ఆలయంలోకి వెళ్ళీ వెళ్ళనట్టు ఒక ప్రదక్షిణ చేసింది. అది ఎలా వచ్చినట్టు అలా వెళ్ళిపోయింది...........! భక్తులు ఇంకా అలా చూస్తున్నారు. మనకి కొత్త ఏమిటండి అలవాటే కదా ! ఎన్ని చూసాము ఆయన విభూతులు :).  
 

Useful links & sources:
---------------------------

http://www.bangalorebest.com/discoverbangalore/sightseeing/religion/temples/Mallikarjunaswamy.php

http://timesofindia.indiatimes.com/bangalore-times/7000-year-old-temple-in-Malleswaram/articleshow/129602326.cms


http://www.newindianexpress.com/cities/bengaluru/article1472267.ece