ఈరోజు ఆదివారం. ఎప్పటినుండో సూర్యనారాయణ ఆలయ దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పటికీ వీలుకావటం లేదు. నిన్న రాత్రి మరొక ఇద్దరు స్నేహితులతో చర్చించి ఈరోజు ఉదయం దర్శించుకోవాలి అని భావించాము. అనుకున్నట్లుగానే ఉదయం ఒక ఆటో పట్టుకుని (కపర్దీ" అని ముమ్మారు స్మరణ చేసుకొని (పాత పాపాలు, కర్మలు అడ్డుపడకుండా)) దొమ్ములూర్, పాత ఎయిర్ పోర్ట్ రోడ్ ప్రాంతంలో వున్న సూర్య నారాయణ ఆలయంకి చేరుకున్నాము. భక్తుల తాకిడి బానే వుంది. గుడి పక్కనే సూర్య నారాయణ స్వామి ఆలయం వారి కళ్యాణ మండపం వుంది.
ఆలయ విశేషాలకొస్తే, సూర్యనారాయణ స్వామి వారి ఆలయం శ్రీ పటేల్ డి. ఆర్. కృష్ణా రెడ్డి అనే అయన చోళ నిర్మాణ శైలిలో 1995 సంవత్సరంలో నిర్మించినట్లుగా, సిద్ధ గంగా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శివ కుమార్ స్వామిజీ చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలియవస్తుంది.
సూర్యనారాయణ స్వామికి ప్రధాన దైవంగా ఆలయాలు చాలా అరుదు. కేవలం వుపాలయాలే కాని ప్రత్యేకించి ఒక ఆలయంని నిర్మించటం అన్నది కేవలం సుర్య భగవానుని సంకల్పం, ఆశీర్వాదమే కానీ మరొకటి కాదు అనిపిస్తుంది. ఇలాంటి విషయంలో దాతల వితరణ కూడా కాస్త కష్ట సాధ్యమే. ఆదరణ వున్న దేవతలకే కాని మిగిలిన దేవతల విషయంలో గుడి నిర్మాణం వంటివి చాల కష్టసాధ్యమని దైర్యం చేసి అంటున్నాను (క్షమించ ప్రార్ధన).
కోణార్క్ సూర్య దేవాలయం, అరసవల్లి లేదా హర్షవల్లి సూర్య దేవాలయం వంటి ఆలయాలు దర్శనం చేసుకోలేని వారు, ఆయా ఆలయాల దర్శన ప్రాప్తికి మార్గం సుగమం చేసుకోవాలి అనుకునే వారు తప్పక దర్శించుకోవాలిసిన ఆలయం ఈ సూర్యనారాయణ స్వామి ఆలయం.
సూర్య నారాయణ స్వామి ఆలయంలో అనేక వుపాలయాలు వున్నాయి. శివుడితో పాటు, శనైశ్చరుడికి, వైష్ణవి మాతకి, నవ గ్రహాలకు, ఇతర దేవతలకు వుపాలయాలు వున్నాయి.
ఆలయం అత్యంత పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. ఎటువంటి గందరగోళాలు లేకుండా చాల ప్రశాంతంగా వుంది. ప్రసాదం కూడా చాలా బావుంది. నాకు పూణే - నారాయణపూర్ దగ్గర వున్న బాలాజీ ఆలయం గుర్తుకు వచ్చింది. ఎంతో అంకితభావం ఉంటేనే కాని ఇలా సాధ్యం కాదు.
సూర్య రధం 32 అడుగులతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అదీ రథసప్తమి రోజు వందలాది భక్తులతో లాగబడుతుంది అని తెలియవచ్చింది.
దర్శనం కొంచెం సమయం తీసుకున్న ప్రతీవారి పేరునా అర్చన చేసారు. ఎటువంటి టికెట్ లేకపోవటం గమనార్హం :). వేడి వేడి ప్రసాదాలు స్వీకరించి ఆలయం నుంచి బయలు దేరి వచ్చేసాము.
కొసమెరుపు ఏమిటంటే, మేము ఎక్కిన ఆటో స్వామి అయ్యప్ప దీక్షలో వుండటం. మాతోపాటే దర్శనం కి వచ్చి, మాతోపాటే తిరిగివేనక్కి రావటం. దీన్నే స్వామి కార్యం స్వకార్యం అంటారేమో :).
ఆలయ వేళలు: సోమ-శని 8:00-12:00 & 5:00-8.30 ఆదివారం 6:00-1:00 & 5:00-8:30
ఆలయ చిరునామా: శ్రీ సూర్య నారాయణ ఆలయం, కే. ఆర్. కాలని, దొమ్లూర్ లేఅవుట్ (ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్) బెంగుళూరు, కర్ణాటక. ఫోన్: +91-80-25350386 మెయిలు: info@suryatemple.org
సైన్సూ, ఆధ్యాత్మికత రెండూ ఒక చోట కలుస్తాయి అంటే ఆధ్యాత్మికత వేత్తలకు భౌతిక వాదులకు కోపం వస్తుంది ఏమో :). కాని నిజం ఒక భక్తుడికి సుస్తి చేస్తే ఎక్కడికి వెళతాడు. ఒక భౌతికవాదికి భౌతిక ప్రపంచంలో సంతృప్తి లేకపోతె చివరకు ఏమి చేస్తాడు. మౌలిక మైన ప్రశ్నలేమో !!! కాశీకి పొతే కాటికి పోయినట్టే అని భావించేవారు పూర్వం ప్రజలు. అంటే అంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. అస్సలు యెంత కాలం పడుతుందో, అస్సలు వెళతాడో లేదో, వెళ్ళిన తిరిగి వస్తాడో లేడో అనుకుంటూ జీవితపు చివరి మజిలి భగవంతుడు ఒక్కడే అని నిశ్చయించుకుని కాశికి పోయేవారు. తరాలు మారాయి (తలరాతలు గురించి అడగకండే :)) సైన్సు, సాంకేతికత పెరిగాయి. ఇప్పుడు కాశికి పోవాలంటే విహంగ వీక్షనతో రివ్వున పోతున్నారు. మంచి, చెడు పరస్పర విడదీయరాని అర్థం కానీ విషయలేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. బ్రిటిష్ వాడు రైళ్ళు వేసి సంపదను దోచేసాడు అన్నది చెడ్డ విషయం ఐతే, ఎన్నో పుణ్య క్షేత్రాలకు ఈ రైలు ప్రయాణం ద్వారానే భక్తులు తీర్ధయాత్రలు చేసుకోవటం ఇందులో దాగి వున్న మంచి విషయం. ఇంత ఉపోద్గాతం ఎందుకు చెబుతున్నాను అంటే ఇవన్ని మొన్న మేము శనివారం / ఆదివారం నాడు చేసిన మైసూరు యాత్ర తాలూకు విషయాలు. శని వారం నైట్ 11:55 కి ట్రైన్ పాసెంజర్ నైట్ క్వీన్ (పేరు కనపడలేదు ట్రైన్ మీద). పాసెంజర్ అనో ఏమో మొత్తం కన్నడ లో వుంది. ఫ్లాట్ ఫాం నెంబర్ 6 అని చెప్పారు. 6 ఫ్లాట్ ఫాం కనపడింది కాని ప్లాట్ఫారం 5 కనపడలేదు. మర్చిపోవటానికి అవకాశం వుండదు అనుకుంటూ :), ముందుకు నడుచుకుంటూ పొతే షాప్స్ దాటాక అప్పుడు కనిపించింది ఫ్లాట్ పం 5. ట్రైన్ నెంబర్ సహాయంతో అది మేము ఎక్కవలసిన ట్రైన్ అని నిశ్చయించుకుని ఎక్కాము. అన్ని భోగీలు చూసుకుంటూ వెళుతుంటే సరుకు భోగీలలో కూడా ఎక్కేసారు. ఎక్కడ చూసినా నిండా జనం. అసంతృప్తితో ఎవరైనా బతుకుతుంటే ఒకసారి ఆ ట్రైన్ చూపిస్తే ఏంటో కొంత ప్రేరణ కలిగించిన వాళ్ళం అవుతావేమో అన్నట్టుగా వుంది అక్కడ పరిస్తితి. 4 గంటలకు చేరవలసిన ట్రైన్ 3.30 నిమిషాలకే చేరిపోయింది. మొదటిసారి వెళ్ళవలసిన దానికంటే ముందుగా ట్రైన్ వెళ్ళటం చూడటంతో ఆశ్చర్యానికి లోనయ్యాము. యధావిధిగా మా ప్రణాళిక లేమికి తగట్టు ఆటోవాడిని ఒకడిని పట్టుకున్నాము. 6 లేక 7 లాడ్జులు తిరిగి ఒక దాంట్లో దూరి స్నానాదులు కానించాము. మేము వున్నది తవర బస్సుస్టాండ్ అంట. సిటీ బస్సు స్టాండ్ కి వెళ్లి అక్కడ 201 నెంబరు బస్సు ఎక్కాము. 17 రూపాయలు ఛార్జ్. కొండ పైకి దాదాపు 8 కిలోమీటర్లు వుంది. వ్యాయామం చేసేవాళ్ళు, జాగింగు చేసేవాళ్ళు, ఇంకొందరు సైకుళ్ళు తొక్కుకుంటూ పైకి రావటం కనిపిస్తుంది. వాతావరణం చాలా ఆహ్లాదంగా, చలిగా అనిపించింది. గుడి ప్రవేశం ఉదయం 7.30 గంటలకు అని చెప్పారు. మేము 7 కల్లా లైనులో వున్నాము. స్పెషల్ దర్శనం 100 రూపాయలు అని చెప్పారు. లైన్ రష్ తగ్గుతుంది అంతేకాని దర్శనం అందరితో పాటే యధావిధిగా జరుగుతుంది. అష్టాదశ శక్తి పీటాల గురించి ఇక్కడ చూడండి. చాముండేశ్వరి అమ్మ వారి గురించి ఇక్కడ చూడండి. ఇంకా మైసూరు & ఆలయ విశేషాలు. స్థలపురాణం విషయానికి వస్తే అష్టాదశ శక్తి పీటాలలొ ఒకటి, మహిషాసుర మర్ధినిగా మనం కొలుచుకునే అమ్మ, మహిషుడిని సంహరించిన ప్రదేశం కూడా ఇక్కడే. మహిషూరు కాస్తా మైసూరు కాలక్రమేనా వాడుకలో అయినది. శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రతకు ప్రజలు బయపడుతుంటే తపస్సు చేసి అమ్మవారిని శాంతమూర్తిగా చేసారు అని ప్రతీతి. శాంతమూర్తి అనుకుంటే ఏమో అనుకునేరు, సరిగ్గా మీరు అక్కడ వైబ్రేషన్స్ ఫీల్ ఐతే తెలుస్తుంది. ఇప్పటికీ ఇంకా యెంత శక్తివంతంగా వున్నాయో! బయపడకండి మనకి అంత రిసీవింగ్ ఎపుడో పోయింది :). అమ్మవారి దర్శనం బాగా జరిగింది. కొబ్బరి కాయలు ఒక పూజారి గారు కొడుతున్నారు. అక్కడే ప్రసాదం కౌంటరు వుంది. ఆలయం బయటకూడా ప్రసాదం అమ్ముతున్నారు. అన్నదానం 15000 రూపాయలుగా వుంది పూజ వివరాలలో. ఇతర వివరాలు సైట్లో ఆన్లైన్లో చూడాలి. ఆలయం లోపల మా వాడు ప్రసాదం కౌంటరుకి వెళ్ళినప్పుడు ఒక చిత్రం జరిగింది. "భ్రమరాంభిక" యే స్వయంగా వచ్చినట్టు మా వాడి శివ పూజలకు దర్శనం ఇచ్చినట్టు ఒక సీతాకోక చిలుక వాడికిచ్చిన ప్రసాదం మీద వాలింది. అలా వాలటం నాకు ఆశ్చర్యానికి గురి చెయ్యలేదు మా వాడి భక్తి తలచుకుంటే. ఈలోపు మా వాడు ప్రసాదంతో వచ్చాడు. వాడికి చూపించాను. అమ్మవారు అక్కడ చూసావు కదా ఇక్కడ కూడా చూడు అని :). చాల సంతోష పడ్డాడు. ఇంతలో మనసులో, స్వామీ నేనూ ఏదో ఒక మోస్తరు భక్తుడినే ఆలోచన వస్తుంటే చటుక్కున నా మీద కొచ్చి వాలింది. ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. ఆలయం లోపల అలా జరిగితే, ఆలయం బయటకు వచ్చిన తరువాత ఇంకో విచిత్రం జరిగింది. కొద్దిపాటి తేడాలతో సృష్టిలోని సంఘటనలు మళ్లీ, మళ్లీ జరుగుతతాయి అంటుంటారు కదా. రామాయణం ఎన్నో యుగాలలో ఎన్నో సార్లు జరిగింది అని ఉదాహరణగా చెబుతారు. అలా ఇంతకుమునుపు కంచిలో ఆవు (నంది ) సంఘటన గురించి చెప్పాను కదా. అలానే ఇక్కడ కూడా జరిగింది. బయటకు వచ్చి ప్రసాదం తిందామని కూర్చుంటే దూరంగా ఆవు కనిపించింది. మేము ప్రసాదం తినేముందు దానికి తినిపిద్దామని అనిపించి చెరో అరటిపండు ప్రసాదం తినిపించివచ్చాము. సరే అని ఇంక ప్రసాదం తింటుండగా, వచ్చింది మనవాళ్ళే, నువ్వూ పోయి వాళ్ళతో కూర్చిని తిను అని శివయ్య ఆజ్ఞాపించినట్టు ఎలా చూసిందో ఎలా వచిందో గాని దూరంగా మెట్ల మీద కూర్చున్న, మా మీదకు వచ్చేసింది. సేమ్ సీను రిపీట్ :). ప్రసాదం అక్కడ పెట్టేయటం అది ఆవురావురమని తినేయ్యటం. ఇంకా కొన్ని జీవాలు (?) బెంగళూరు రూంలో వెయిట్ చేస్తుంటాయి. మాకు రూంలో మళ్లీ చోటు వుండదని మిగిలన ప్రసాదాలు తీసుకుని వచ్చేసాము :). ఇంక ఆలయం బయట ఒక బుట్టలో రెండు కొబ్బరికాయలతో పాటు పూలు పండ్లు, తామరపువ్వు కూడా కలిపి 120 రూపాయలు తీసుకుంటారు. మీరూ ఆలయంకి తీసుకుని వెళ్ళండి వీలయితే. ఆలయం పక్కనే చంద్రేశ్వరుడు, నారాయణ ఆలయాలు వున్నాయి. అవి దర్శనం చేసుకుంటే అమ్మవారి ఆలయం చుట్టు ఒక ప్రదక్షిణ చేసినట్టు నిర్మించారు. అక్కడ నుంచి శ్రీరంగ పట్నం 20 కిలోమీటర్లు వుంటుంది. దారి చూస్తా వుంటే కోన సీమ గుర్తుకు వస్తుంది. బస్సువాడు మాత్రం ఈ సంవత్సరానికి కరువు బత్యం లేనట్టే అంటే ఎలా వుంటుందో అలా తోలాడు. చాలాసార్లు ఇదే చివరి యాత్ర అనిపిస్తుంది :). ఐతే కండక్టరు చాలా నిజాయితీగా వున్నాడు చిల్లర వుంచుకోమంటే చిల్లర వచ్చాక, తెచ్చి ఇచ్చాడు. మన బాపతు వాళ్ళని చూసినప్పుడు బలే ముచ్చట వేస్తుంది కదా :p. ఆలయం ప్రధాన రహదారికి దగ్గరగానే వుంటుంది. ఆలయంలో, శయనరూపంలో యోగనిద్రలో వున్నట్టు వున్నా విష్ణువుని చూసినప్పుడు బలే ఆనందం వేసింది. శైవం ఎక్కువై వైష్ణవం తక్కువ అయిపొయింది రా నీకు ఈ మధ్య అని స్వామి రప్పించుకున్నట్టు వుంది నా పరిస్థితి. ఆలయం త్రిరంగా క్షేత్రాలలో మొదటిది. ఆలయం గురించి, మహావిష్ణువు శ్రీ రంగనాథ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూవున్న మిగిలిన రెండు త్రిరంగక్షేత్రాల గురించి ఇక్కడ చదవగలరు. మైసూరు వచ్చేసరికి భోజనం టైము ఐంది అని ఒక ఆటోవాడిని మంచి వెజ్ హోటలుకి తీసుకెళ్లమన్నాము. విష్ణు ప్రియ అని హోటల్ కి తీసుకెళ్ళాడు. మావాడికి నడుస్తుంటే యెదురు తగిలి తూలాడు. అన్నా! కష్టమేమో అన్నాడు. లైటు అన్నాను. చాలా లైటుగా వుంది టేస్టు :). మధ్యానం నుంచి ప్యాలస్సు చూడటానికి వెళ్ళాము. ప్యాలస్సు చూస్తూ ఇవన్ని రాజులు ఆస్తులు కదా మరి గవర్నమెంట్ ఎలా తీసుకుంది అన్నాడు మావాడు. రాజరికం ఒక గవర్నమెంటు ప్రజాస్వామ్యం మరొక గవర్నమెంటు అది పోయి ఇది వచ్చింది అందుకే తీసుకున్నారు అని సర్దిచెప్పాను. ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజాభరణాలరద్దు, బ్యాంకుల విలీనం వగైరా అప్పటి సంఘటనలు వినేవుంటారు కదా మీరు ! మైసూరు లో చూడటానికి చాలా ప్రదేశాలు వున్నాయి. మా ట్రిప్ జాలీ ట్రిప్ కాదు. పైగా అంత టైం కూడా లేదు కాబట్టి అంతగా పట్టించుకోలేదు. సాయంత్రం మా రైలు 6:40 కి. పాపం చాలా మందికి రిజర్వేషన్ లేదు. స్లీపర్లో ఎక్కువ సీట్లు ఖాళీగా వుండటంతో, కుటుంబాలతో వచ్చేశారు. 10 గంటలు కల్లా బెంగళూరు చేరుకున్నాము. కొసమెరుపు ఏమిటంటే మొన్న నేను హాస్పిటల్ లో పడి ప్రాణాలతో బయటపడ్డాను కదా, అప్పుడే ఈ క్షేత్రానికి వెళ్ళాలన్న బీజం పడింది. ఆ హాస్పిటలు పేరు చెప్పనే లేదు కదా! "చాముండి హైటెక్ హాస్పిటల్" :). శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు మరి :)