అష్టాదశ శక్తి పీఠాలు 18 ఐతే అందులో 2 తూర్పు గోదావరి జిల్లా, ఆంద్ర ప్రదేశ్ లో వున్నాయి.
అష్టాదశ శక్తి పీఠాలు అంటే ఏమిటి అవి ఎలా ఏర్పడినవి, వాటి ప్రాముఖ్యం మొదలైన ప్రాథమిక సమాచారానికి ఇక్కడ చూడండి.
బెంగుళూరు నుండి స్పెషల్ ప్రీమియం ట్రైన్ (పండగ స్పెషల్ అనుకుంట) సామర్ల కోట వరకు వస్తుంది అని తెలిసి బుక్ చేసుకున్నాను. గత రెండు లేదా మూడు సంవత్సరాల నుంచి అమ్మ అనుగ్రహం కోసం వేచి చూస్తే ఒకేరోజు రెండు శక్తి పీఠాల దర్శనమయ్యింది. సామర్ల కోటలో బస్టాండ్ / రైల్వే స్టేషన్ పక్కనే పంచారామాలలో ఒకటైన బీమేశ్వరాలయం వుంది. మునుపు ఇక్కడ దర్శనం చేసుకున్నాను.
పంచారామాలు గురించి ఇక్కడ చూడగలరు.
పంచారామాల ఈ బుక్ రచించిన పి.యస్.యమ్. లక్ష్మి గారి సైట్ లో కూడా విలువైన సమాచారం వుంది .
ద్రాక్షారామం, పిఠాపురం సామర్ల కోటకి చేరో పక్క వుంటాయి. పిఠాపురం, సామర్లకోటకి ఒక దిక్కులో 13 కిలోమీటర్లు దూరం లో వుంటే, ద్రాక్షారామం మరోపక్క 45 కిలోమీటర్ల దూరం వుంటుంది. తూరుపు గోదావరిలో ఎటుచూసినా 30 కిలోమీటర్ల వరకు షేరింగ్ ఆటో కనెక్టివిటీ చాలా బావుంటుంది. బెంగలూరులో షేరింగ్ ఆటోలు వుండవు కానీ గోదావరి జిల్లాల్లో బోలెడు :). సామర్ల కోట నుంచి ద్రాక్షా రామం బస్సులు తరచుగా వుండవు. గంటకొకటి ఉంటుందేమో. కాకినాడ నుంచి ఎక్కువగా వుంటాయి. కాకినాడకి వెళ్లి అక్కడ నుండి కోటిపల్లి బస్సులు పట్టుకుని వెళ్ళాలి. పిఠాపురంకి రైల్వే స్టేషన్ కూడా వుంది. సౌకర్యాన్ని బట్టి వెళ్ళవచ్చు.
పిఠాపురం వూరి జంక్షనులో కుక్కుటేశ్వర ఆలయం వుంది. కుక్కుటేశ్వరుడు, రాజరాజేశ్వరి మాతతో కలిసి భక్తులను అనుగ్రహిస్తాడు. అష్టాదశ శక్తిపీఠాలలో 10వది పురుహూతిక శక్తి పీఠము. అది కూడా ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలో వుంటుంది.
పిఠాపురం ఆలయ కోనేరులో అందరు స్నానాలు చేస్తూ కనిపించారు. నేను సామర్ల కోటలో లాడ్జి తీసుకుని బేగ్ అక్కడ పెట్టేసి స్నానాదులు అక్కడే చేసి రావటం వల్లన కొద్దిగా కోనేరు జలం శిరస్సున జల్లుకుని వచ్చేసాను. స్పెషల్ దర్శనం టికెట్ 10గా రూపాయలుగా వుంది. పురుహూతిక ఆలయంలో సంకల్ప సహితంగా, అమ్మ నామాలతో పంతులు గారు పూజ బాగా చేసారు.
బయటకు వచ్చేటప్పటికి నాకిష్టమైన నిలువుదోపిడి జరిగింది :). ఈసారి పక్కన డెబిట్ కార్డ్ వుంది గాని స్నేహితులు లేరు :). చెప్పుల స్టాండ్ అతను ఐదు రూపాయలు ఇస్తే ఆటో వాడు సెంటర్ లో దింపుతాడు సర్ అని అన్నాడు. మన ఆర్ధిక పరిస్తితి తెలియదు కాబోలు. లేకపోతె ఎందుకు అంత ధైర్యం చేస్తాడు :). సరే చూస్తాను అని చెప్పి వచ్చేసాను. ఏ.టి.యమ్.లు వెతుక్కుంటూ బయలుదేరాను. అన్ని స్టేట్ బ్యాంకులవే కనపడ్డాయి కాని "అవుట్ అఫ్ సర్వీస్". ఇలాంటి సమయంలోనే భగవంతుని పరీక్షలు వుంటాయి. ఏమైనా పశ్చాతాపం ఉందేమో అని అమ్మ పరీక్ష పెడుతున్నట్టు లీలగా స్ఫురణకి వచ్చింది. ఐతే నిర్వికారంగా వుంది నా మనస్సు. మొత్తానికి ఎండలో ఒక రెండు కిలోమీటర్లు నడిచివుంటాను. ఈసారి ఎవరు లేనప్పుడు నిలువు దోపిడీ వద్దులే అనిపించింది :). స్వామి గజేంద్ర మోక్షంలో పరుగిడునట్టు మన కోసం పరుగుపెట్టించడం బాగోదు మరి !. అయినా అమ్మదయ వుంటే కుంటి వాడు నడుస్తాడు. మూగవాడు మూక పంచశతి చెప్తాడు. మనభోటి వాళ్ళ కష్టాలు ఎంత ! చెప్పలేదు కదా ఏ. టి.యమ్ అడ్రస్ అడిగితే, సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టులో చూపించినట్టు ఒకాయన బండి మీద తీసుకెళ్ళి మరీ దింపాడు ఏ. టి.యమ్ దగ్గర :). అద్గది అమ్మ అంటే !
ఇక ఇక్కడ క్షేత్ర వృత్తాంతము, ప్రాధాన్యము ఈ విధంగా వున్నాయి.
పాద గయా క్షేత్రం.
త్రిగయా క్షేత్రములలో పాదగయా క్షేత్రము అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఇది అతి ప్రాచీన శైవ క్షేత్రము. గయాసుర సంహారార్ధము శివుడు కోడిరూపం దాల్చిన పుణ్యక్షేత్రం. గయాసురుడి ప్రార్ధన మేరకు స్వామి కుక్కుటేశ్వరుడిగా, 'స్వయంభు' గా అవతరించిన క్షేత్రం.
కృతయుగములో గయాసురుడనే దానవేంద్రుడు ఉండేవాడు. అతను విష్ణువుని గురించి తపము ఆచరించి, భూమిపై వున్న అన్ని క్షేత్రాలు, తీర్థాలు కన్నా తన శరీరము అత్యంత పుణ్యప్రదము అవ్వాలని కోరుకొనెను. అట్లే అని వరము నొసంగెను. గయసురుడిని చూచినంతలోనే పంచ మహాపాతకాలు పోయెను. అతని శరీరం నుంచి వచ్చే గాలి తాకినా క్రిమి, కీటకాదులుగ జన్మలు ఎత్తిన పాపాత్ముల పాపములు హరించెను. లెక్కకు మిక్కిలిగా గయాసురుడు ఆచరించిన యజ్ఞములు, పుణ్య కార్యాలుకు ఇంద్ర పదవి వరించెను. ఎందుకంటే శత క్రతువులు ఆచరించిన వారికి ఇంద్ర పదవి వస్తుంది అని ఎల్లప్పుడు పెద్దలు చెబుతారు కదా !.
పదవీచ్యుతుడైన ఇంద్రుడు పదివేల సంవత్సరాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమై వరము కోరుకోమనేను. అంత ఇంద్రుడు, గయాసురుడు ఎన్ని సత్కార్యాలు ఆచరించినా, అతని అనుచరుల దుష్కృత్యాలు, పాపకార్యాలు, యజ్ఞ,యాగాల హవిస్సులను అడ్డుకుని దేవతలు బలహీనం చెయ్యటం, తద్వారా సంభవించిన కరువుకాటకాలు, క్షామము ఇత్యాదులన్నీ ఏకరువు బెట్టి, గయసురుడి సంహారం కోరెను. త్రిమూర్తులు వరము నోసంగెను.
గయాసురుడి సంహారార్ధము సామ, దాన, భేద, దండొపాయాలలొ, దానోపాయమును ఎంచిరి. సద్బ్రాహ్మనుల వేషాలలో గయసురుడి దగ్గరకు వెళ్లి, లోక క్షేమంకోసం తామొక యజ్ఞము తలబెట్టితిమి అని పలికిరి. అది 7 రోజుల పాటు వుంటుంది అని అనెను. అంత గయాసురుడు సంతోషించి, యజ్ఞ సంబారాలు కావలెనా, ధనము కావలెనా, యజ్ఞ వేదిక కావలెనా, ఏమి కావలెనన్నా ఇచ్చెదనని యజ్ఞం కోసం శరీర త్యాగానికైనా సిద్ధమేనని పలికెను. అప్పుడు వారు, ఈ యజ్ఞము సామాన్యమైనది కాదు, ఈ భూమి ఈ యజ్ఞాన్ని భరించలేదు. సకల పుణ్యతీర్థాలు సకల జనాల పాపాల వల్లన కలుషితమవుతున్నాయి. కావున భూమిపై అత్యంత పుణ్యప్రదేశమైన నీ దేహమే యజ్ఞ వేదిక కావలెను అని పలికిరి. ఐతే ఒక్క షరతు. ఈ ఏడు రోజుల పాటు నీ దేహము నిశ్చలంగా ఉండవలెను అని, కదిలినచో నిన్ను సంహరించెదమని పలికెను. అంత దానవేశ్వరుడు సంతోషించి, తన అంగీకృతి తెలిపెను.
గయాసురుడు తన దేహమును అమితంగా పెంచి, బీహారు, గయా వద్ద తల (ఇక్కడ బ్రహ్మ), ఒరిస్సా జాజిపూర్ వద్ద నాభి స్థానం (ఇక్కడ విష్ణువు), పాదాలు పరమ పవిత్రమైన పిఠాపురం క్షేత్రమందు (ఇక్కడ శివుడు) ఉంచెను. అంత త్రీముర్తులు ఒకేసమయంలో యజ్ఞమారంబించెను. గయాసురుడు తన యోగశక్తి ప్రభావంతో శరీరమును నిశ్చలముగా ఉంచెను. ప్రతి రోజు గయాసురుడు బ్రాహ్మీ ముహూర్తకాలం (కోడికూత జాము అని వాడుకలో వ్యవహరిస్తారు) ప్రకారం రోజులు లెక్కించ సాగెను. ఆరు రోజులు గడిచెను. మరొక రోజు గడిస్తే యాగం పూర్తవుతుంది. ఇంద్రుడు మరొక రోజు గడిస్తే యాగం పూర్తవుతుంది అని, తన వరము సంగతి గుర్తుచేసేను. అంత విష్ణువు సలహాతో శివుడు కోడి రూపము దరించి, లింగోద్భవ కాలంలో (మహాశివ రాత్రి రోజు అర్థరాత్రి) కొక్కొరోకో అని కుక్కుట ధ్వని చేసెను. అది విని గయాసురుడు 7 రోజులు పూర్తయినవి అని శరీరం కదిలించెను. అప్పుడు వారు గయసురుడిని సంహరిస్తామనిరి. గయాసురుడు సంకట స్తితిలో పడి, దివ్యదృష్టితో జరిగిన విషయములన్నీ గ్రహించెను. త్రిమూర్తులు మరణదండన విదించు వార్కి ఆఖరి కోర్కె దీర్చుట ధర్మము. కావున కోరిక కోరుకోమ్మనేను. గయాసురుడు మరణించేవారికి ఇంకా ఇచ్ఛాలు ఏముంటాయి. ఐన కోరుకోమ్మనిరి కావున కోరుకుంటున్నాను. నేను చనిపోయిన తరువాత, నా దేహం త్రిగయా క్షేత్రములుగా వర్దిల్లునట్లు, అందు త్రిమూర్తులు వసించునట్లు, అవి మూడు శక్తి పీఠములుగ విరజిల్లునట్లు, ముఖ్యముగా మానవులు చనిపోయిన తరువాత తమ పితరుల కోసం చేయు శ్రాద్ధ, పిండ ప్రదాన, తర్పనాదులు ఈ క్షేత్రములో చేయువారికి పునరావృత్తి రహితమైన (మరల పుట్టుకలేక), బ్రహ్మ పదము కలుగునట్లు, ఎక్కడైనా గయా నామోఃశ్చరణ పలితంగా చేయు పితృ కర్మల వలన మాత్రమే గయా శ్రాద్ధ పలము తద్వారా పితృముక్తి కలుగునట్లు వరము కోరుకొనెను. అట్లే అని వరమునిచ్చి గయాసురుడిని వధించి, ముక్తిని ప్రసాదించెను.
త్రిగయ క్షేత్రాలు మూడుగా వున్నాయి - శిరో గయ, నాభి గయ, పాద గయ.
శిరో గయ : బీహారు రాష్ట్రమున, ఫల్గుని నదీ తీరమున కలదు. గయాసురుడి శిరస్సు గల ప్రదేశము. ఇక్కడే విష్ణు పాదముల అలయమున్నది. మంగళ గౌరీ అను శక్తి పీఠము కలదు.
నాభి గయ : ఒరిస్సా లోని జాజిపూర్ లో కలదు. గిరిజ దేవి శక్తిపీఠము కలదు. గయాసురుడి నాభి వున్న ప్రదేశము. యజ్ఞ స్వరూపమైన బ్రహ్మ వున్న ప్రదేశము.
పాద గయ : పిఠా పురము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కార రీతులలో పాద నమస్కారము విశిష్ట మైనట్లు, త్రిగయ క్షేత్రములలో ఈ క్షేత్రము ప్రఖ్యాతి గాంచినది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవము. పురుహూతిక అమ్మవారి శక్తి పీఠము ఇక్కడనే కలదు.
పిఠాపురము స్వయంభు శివ క్షేత్రము. గయాసురుడి సంహారార్ధము శివుడి కోడి రూపము ధరించిన పుణ్య క్షేత్రము ఇదే. కుక్కుటేశ్వరుడిగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు. అయ్యవారి దేవేరిగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి, లలిత సహస్ర నామంలో చెప్పినట్లు "కుమార గణనాదాంభ" చతుర్బుజ గణపతి, కుమార స్వామిలను ఇరు పార్శలలోను కలిగి పూజలందుకుంటున్నది.
అష్టాదశ శక్తి పీఠములలో 10 వ శక్తి పీఠము, అమ్మవారు పురుహూతిక దేవిగా ఇక్కడ పూజలందుకుంటున్నది. అమ్మవారి ఖండిత శరీరములో పిరుదులు పడినచోటు పిఠాపురము. పీఠ భాగమునకు అధిస్ఠాన దేవత కాబట్టి పీఠాంభిక గాను, పురుహూతి (ఇంద్రుడు) విద్యోపాసన పలితంగా, అతనిని అనుగ్రహించి, అతని కోరిక మేరకు పురుహూతిక దేవి నామముగా ప్రసిద్ధి గాంచారు.
పీఠికాపుర దత్త మహత్యము:
శ్రీ గురుచరిత్ర లో పేర్కొన్న శ్రీ పాద శ్రీ వల్లభులు, సుమతి, రాజశర్మ దంపతులకు దత్తాత్రేయ స్వామి వరానుగ్రహ ఫలితంగా జన్మించి అనేక మహత్తులను గావించినది ఇక్కడే. ఆనాటి కాల వివాహ యోగ్యత ప్రకారం వివాహం కాని పాదనేత్రములు లేని సోదరులకు అవి ప్రసాదించి, తల్లి తండ్రులను ఆనందింపచేసినది కూడా ఇక్కడే. ముక్తికాంతను చేపట్టి (సన్యాసం), అనేక క్షేత్రాలు దర్శించి దత్త భక్తిని విశేషంగా స్వామి ప్రచారం చేసారు. ఇప్పటికి స్వామి ప్రతీరోజు ఇక్కడ బిక్ష ఎవరో ఒకరి ఇంట స్వీకరిస్తారని ప్రతీతి. యోగులుకు నిజరూప దర్శనంతో, తనను నమ్మి కలిచే సామాన్య భక్తులకు ఏదో ఒక రూపంతో స్వామి స్వయంగా మాట్లాడుతారు అని ఇప్పటికీ చెప్పుకుంటారు.
స్వామి వారి క్షేత్రం లో, మండల ధారణా చేసిన వారికి, గురుచరిత్ర సప్తాహ పారాయణ చేసేవారికి, మండలంపాటు 108 ప్రదక్షిణలు చేసేవారికి కోరిన కోరికలు తీరటం ఇక్కడి భక్తులకు అనుభవైకవేద్యం.
పిఠాపురం మహత్యం, సందర్శన విధి, ఇక్కడ క్షేత్ర వృత్తాంతము, ప్రాధాన్యము, ఏలా నది మహాత్మ్యము మరియు ఇతర వివరాలకి దేవస్థానము వారి పుస్తకము (పీఠికాపురి క్షేత్ర మహత్యము - స్థలపురాణము - పాద గయా క్షేత్రము) కౌంటరులో లభించును. వెల పది రూపాయలు. పిఠాపురాన్ని దర్శించ గోరు భక్తులు ఒక 15 నిముషాలు వెచ్చించి చదువుకుంటే (ముఖ్యంగా పాద గయ క్షేత్ర సందర్శన విధి పుటలు) పూర్తి అవగాహనతో, దర్శనం బాగా చేసుకోవచ్చు.
మీకు ఇంకో విషయం చెప్పాలి. పిఠాపురంలో ప్రసిద్ధి గాంచిన ఆలయాలలో మరో ఆలయం కుంతీ మాధవ స్వామి ఆలయం. వృతాసురుడిని చంపినందుకు వచ్చిన బ్రహ్మహత్యాపాతక నిర్మూలన కోసం ఇంద్రుడు ఐదు చోట్ల వైష్ణవాలయాలను నిర్మించాడు. అవే పంచ మాధవ క్షేత్రాలు. పంచ మాధవ క్షేత్రాలు వరసగా
కాశిలో బిందు మాధవ స్వామి ఆలయం
ప్రయాగలో వేణి మాధవ స్వామి ఆలయం
పిఠాపురంలో కుంతీ మాధవ స్వామి ఆలయం
తిరుచిరాపల్లి లో సుందర మాధవ స్వామి ఆలయం
రామేశ్వరం లో సేతు మాధవ స్వామి ఆలయం
ఇతర వివరాలకు దేవాలయం వారి వెబ్ సైటు చూడగలరు : www.kukkuteswaraswamypadagaya .com
ఫోను : 08869 - 252477 - 251445.