Wednesday, December 30, 2015

నాగమంగళ ఆలయాలు, కర్ణాటక

కాలభైరవులు ఎంత మంది ? అదేమిటండి అలా అడిగారు ! మాకు తెలిసీ ఒక్కరే అని అంటారా ? సరే కాలభైరవుడికి ఎన్ని రూపాలు ? మళ్లీ అలాంటి ప్రశ్నే అడిగారు. మాకు తెలిసి మళ్ళీ ఒక్కరే ! ఒక్క రూపమే !
సరే ఐతే చదవండి !.

మొదటగా మేము సిద్దలింగేశ్వర స్వామి వారి దర్శనంతో ప్రారంభించాము. ఇది యెడియూర్, కునిగల్లు తాలూక, కర్ణాటక. ఈ ఆలయం అంటున్నాము కానీ అస్సలిక్కడ 15వ శతాబ్ధానికి చెందిన వీరశైవ సాంప్రదాయానికి చెందిన వీరశైవ సాధువు 'తొంతాడ సిద్దలింగ' అనే అయన నిర్వి కల్ప సమాధి చెందిన చోటు. మరిన్ని వివరాలకు ఇక్కడ చూడగలరు.

సరే మేము ఆలయం లోనికి అడుగుపెట్టేసరికి సరిగ్గా అలంకారానికి తెర వేసారు. ఎంత సమయం పడుతుందో తెలియదు. ముందుగా అనుకున్న ఆలయం కూడా కాదు. డ్రైవర్ చెప్పాడు బావుంటుంది, చుట్టుపక్కల ప్రఖ్యాతి వహించిన ఆలయం అని. సరే ఏది ఐతే అది కానిమ్మని దర్శనం కోసం ఎదురు చూస్తున్నాము. కాసేపు ఎదురు చూసాక తెర తీసారు. అంతే స్వామిని చూడాలి ఆ సౌందర్యం, మనబోటి వాళ్ళ వల్ల కాదు కానీ శంకరులే రావాలి అనిపించింది. చాలా ఆనందం వేసింది. దర్శనం చేసికుని బయలుదేరాము. మీకు ఇక్కడో విషయం చెప్పాలి.

మా వాడు ఎక్కడ చదివాడో తెలియదు కాని మోక్షం గురించిన విషయం - కార్తీక మాసంలో లక్ష ద్వీపార్చన చేసిన వారికి వైకుంఠమ్ నుండి విష్ణు పార్శదులు అనుకుంటా, స్వామి గీతాలు పాడుతూ ఆకాశ విమానంలో వైకుంఠానికి తీసుకుని పోతారు అని.

అంతే ఇంక ఎలా చెయ్యాలి అని మొదలుపెట్టాము. గూగుల్ వల్ల కాదు కాని మనమే మార్గం వెతకాలి అని కూర్చున్నాము. కోటి దీపాలు పెట్టే తిరువనంతపురం తప్ప ఎక్కడా లేదు దేశం మొత్తం మీద అని అర్థం అయింది. అక్కడకి వెళ్లి చెయ్యటం సాధ్యమయ్యె విషయం కాదు . కనుక ఇక్కడే అయితే 365 వత్తులు దొరుకుతాయి అని, మొత్తం ఎన్ని పెట్టాలి, ఎన్ని రోజులు పడుతుంది, కొంచెం బడ్జెట్ కూడా కుస్తీ పట్టాము. మొత్తానికి ఒక ప్రణాళిక తయారు అయ్యింది.

పూలు అమ్మ్మే ఆవిడతో రోజు నెయ్యి వగైరా పురమాయించాడు. ఆవిడా ఇంకొక్క చిట్కా చెప్పింది. ఒకే ప్రమిదలో 365x10 చొప్పున. ప్రొద్దున, రాత్రి ఎప్పుడు వీలు ఐతే అప్పుడు పెట్టుకుంటూ వచ్చాడు. మొత్తానికి లక్ష దగ్గరకొచ్చేసరికి, వేరొక స్నేహితుడు వివిధ దేవతా ఆలయాలు ప్రతిష్టాపన చేస్తున్నాము అని ఆహ్వాన పత్రం పంపడము, తరువాత వైభవంగా ఆ ఘట్టం ముగిసిపోవటం, ఆ ఫోటోలు పంపటం కూడా చేసాడు. అవి పంపుతూ కోటి దీపాలు పెట్టమని చెప్పాడు. అంతే ఉత్సాహంగా ఎలా చేసారు అని అడిగాము. లక్ష వత్తులు అని ఒక వట్టి పెద్దది దొరుకుంతుంది. అలాంటివి వంద పెట్టాము అని అన్నాడు. ఇంక ఏమైనా చెప్పాలా :).

అంతే ఇంక లక్ష వత్తుల ప్రణాళికలోకి తక్కిన సైన్యం రెడీ అయింది. అరకేజీ నెయ్యి, ఒక వత్తి, ఒక పెద్ద ప్రమిద అంతే భగవంతుని ఆశీర్వాదంతో లక్ష వత్తుల యజ్ఞం ముగిసిపోయింది అందరికి :).

మొదట చెప్పిన మావాడు ఐతే 5 లక్షలు పెట్టాడు మొత్తం కలిపి. స్వామి ఎన్ని సార్లు మోక్షం ఇస్తావో ! ఎన్ని విమానాలు పంపుతావో !  నీ ఇష్టం మరి :)
 
సరే తరువాత అక్కడ దర్శనం ముగించుకుని,  రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగి, సాక్షాత్తు పరమ శివుడి తపస్సు చేసి నాథ సాంప్రదాయాన్ని నెలకొల్పినట్లుగా పేరు గాంచిన ఆదిచుంచనగిరి లేదా శ్రీ ఆది చుంచనగిరి మహా సంస్థాన్ దర్శనం చేసుకున్నాము.  ఈ క్షేత్రం నాగ మంగళ తాలూకా, మండ్య జిల్లాలో కర్ణాటక రాష్ట్రములో వుంది. మైసూరుకి 60 కిలోమీటర్లు కాగా బెంగలూరు ఒక 150 ఉండవచ్చు.

ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు, ప్రధాన దైవం సిద్దేశ్వర రూపంలో పరమ శివుడు. ఈ మఠం కర్ణాటకలో 'ఒక్కలిగ'ల ప్రఖ్యాత ఆరాధనీయ క్షేత్రం. ఇక్కడే బిందు సరోవరం అనే పుష్కరిణి వున్నది. నిస్సంతానవంతులకు, ఈ పుష్కరిణి స్నానం ఫలం చేకూరుస్తుంది అని ఇక్కడ నమ్మకం.

అమ్మవారు ఇక్కడ స్థంబాలమ్మ, గుడిలో స్వామికి ఒక పక్కగా స్థంబాలమ్మ కనిపిస్తుంటే, ఆది స్థంబాలమ్మ గుడికి దారి అన్నట్లు, స్వామికి పక్కనే క్రిందుగా మెట్లు కనిపిస్తాయి. అక్కడ దీపపు వెలుగులో అమ్మవారిని చూడాలి నిజంగా ఆ వైభవంకి సాక్షాత్తూ అమ్మవారు ఎదురుగా వున్నట్లు అబ్బురానికి, ఆనందానికి గురిచేస్తుంది.
 
గుడి ఆవరణలో గమనిస్తే ఒక్కో స్థంబం మీద ఒక్కొక్క కాలభైరవుడి రూపం కనిపించి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏమిటి కాలభైరవుడికి ఇన్ని రూపాలు ఉన్నాయా అని ఒక్క క్షణం వింతగా అనుభూతికి, ఆశ్చర్యానికి గురి చెందుతాము.

అలా దర్శనం చేసుకుని ఇంకొంచెం కొండమీదకు అడుగుపెడుతున్నాము అనుకుంటుండగానే, ఎడమ వైపు ఒక ముప్పయి అడుగుల నాగేంద్రుని రూపం కనిపించి మరోసారి అబ్బురానికి గురి అవుతాము. ఇంకొంచెం అలా పైకి వెళుతుంటే, ఎడమ ప్రక్కగా విఘ్నేశ్వర స్వామి విగ్రహం చెక్కుతున్న ఒకతను మిగతా వారితో పని చేస్తూ కనపడ్డాడు. మా వాడు తనతో చెప్పాడు, మీరు చాలా పుణ్యాత్ములు. చేసి పనిలో తృప్తి వుంటుంది, పైగా పుణ్యకార్యం. స్వామి ఆశిస్సులు వున్నాయి మీకు అని. తను ఆనందం చెందినట్లు కనపడింది. ప్రతి ఒక్కరూ ఏదో భుక్తి కోసం, నాలుగు రాళ్ళు కోసమే కదా కాకపోతే ఇలాంటి సేవ, సంతృప్తి కూడా వుండడం నిజంగా పూర్వజన్మ సుకృతం, విద్య, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు పూర్తిగా పూర్వ జన్మ సుకృతం అని పెద్దలంటారు కదా :).

ఇంకొంచెం పైకి వెళ్ళాక అక్కడ బయట శివలింగ రూపంలో స్వామి దర్శనం చేసుకుని గుడిలో అడుగుపెట్టాము. అక్కడ ప్రధాన అర్చకుడు వేరే ఎవరితో పూజ చేయిస్తూ వుండటం కనిపించింది. బయట ఒక పిల్లవాడు 7 సంవత్సరాలు వుంటాయేమో, ముద్దు, ముద్దుగా పూజ చేయిస్తున్నాడు. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాకా, గుడి పక్కన ఒక పెద్ద బండరాయి పక్కన చిన్న దారి మార్గం కొండ పైకి వుంది. అలా పాకుకుంటూ పైకి వెళుతుంటే,  అరుణాచలంలోని మోక్ష ద్వారం, కంచిలోని కైలాసనాథ ఆలయం ఆలయం  గుర్తుకు వచ్చాయి.

ఆ పైన కొండ మీద ఇంకొక 8 సంవత్సరాల అబ్బాయి, ఇంతకుముందు పిల్లాడి అన్నయ్య అనుకుంటా. శివుడికి పూజ చేస్తూ కనిపించాడు. అస్సలు అంత ఎత్తుకు ఎక్కడమే కష్టం అనుకుంటే ఈ పిల్లలు చలాకిగా ఎక్కుతూ, దిగుతూ వుండటం ఆశ్చర్యం అనిపించింది. పిల్లలు కదా ! అంత కొండపైన చిన్న గుహలాగా వుంది ఆలయం. నుంచుని వుండటం కూడా కుదరదు. అక్కడ అలా ఆ పిల్లవాడు పూజలు చెయ్యటం నిజంగా ఏ జన్మలోని పుణ్య ఫలమో భగవత్ అనుగ్రహం అలా వర్షించింది. పిల్లవాడి వాచకం చాలా బావుంది. తెలిసినంతలో పూజ అదీ బాగా చేసి కన్నడలో స్థలపురాణం కూడా చెప్పాడు. తోచిన దక్షిణ ఇచ్చాము. ఇంకా పైన రెండు గుడులు వున్నాయి, మార్గం కూడా సరిగా లేదు, పైకి దోవ లేదు అన్నట్లు తెలిసింది కానీ, కొండలు పట్టుకుని ఫోటోలు దిగుతూ కొంత మంది కనిపించారు. ఇప్పటికి ఇదే ప్రాప్తం అని కొండ దిగి ప్రధాన ఆలయానికి వచ్చేసాము.

అక్కడ నుంచి ప్రసాదం కోసం చూస్తుంటే అన్నదానం సత్రంకి వచ్చాము. మేము వెళుతుంటే మా వాడు లడ్డు తీసుకుని వస్తుంటే ఒక భైరవుడు (కుక్క) వెంట వచ్చాడు. కాలభైరవ క్షేత్రం ఇది అని స్పురణకు వచ్చి మా స్నేహితుడిని ఒక లడ్డు పెట్టమన్నాను. ఒక పక్కగా పెట్టి వస్తుంటే అక్కడ సెక్యూరిటీ అతను విసుక్కుంటున్నాడు తొందగర వెళ్లి భోజనం చెయ్యమని. కొంచెం మనసుకి కష్టం అనిపించినా, పనివారితో పనులు చేయించటం వల్లనేమో అనుకుని కొన్నిఉద్యోగాలు అంతేనేమో అనిపించింది.

ఉన్నదాంట్లో చాలా నాణ్యతగా ప్రసాద భోజనం వేడి, వేడిగా పెట్టారు. రుచి ఆకలితో వున్నవాడినే అడగాలి :). చాలా బావుంది. అలా ముగించుకుని మునుపటి మఠాధిపతి స్వామి సమాధి దర్శించుకుని, సరస్వతి హాలు, గార్డెన్, ఇంకా అక్వేరియం ప్రదేశాలు చూసుకుంటూ వస్తుంటే, కొన్ని కుక్కలు కూడా ఆ పక్కనే బోనులో వున్నాయి.  అవి బోనులో వుండటం వల్ల  కాబోలు చాలా దిగాలుగా వున్నట్టు కనిపించింది. సరే అని ఇంక సౌమ్యకేశవ ఆలయంకి బయలుదేరాము.

అదనపు సమాచారం కోసం,

మఠంవారి సైట్

వికీపీడియా



కాలాతీతుడిగా, కాశీక్షేత్ర పాలకుడిగా, మహాశివుని రౌద్రావతారంగా, భక్తీ రక్షణలో సాటిలేని వాడిగా  మరెన్నో విశేషాలుకు పేరుగాంచిన కాలభైరవ స్వామి గురించి మరింత ఆసక్తికర సమాచారం కోసం ఇవి చూడండి.

సరసభారతి

తెలుగు భక్తి

తెలుగు బంధు  


అక్కడ నుంచి సౌమ్యకేశవ ఆలయానికి ప్రయాణమయ్యాము. సౌమ్యకేశవ ఆలయం 12వ శతాబ్ధానికి చెందిన హొయసల కాలంనాటిది. ఈ ఆలయం మైసూరుకు 62 కిలోమీటర్లు దూరంలో వుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం సౌమ్యకేశ్వరుడు. ఎడమ ప్రక్కగా, రుక్మిణి సత్యభామలతో శ్రీ కృష్ణుడు, కుడిప్రక్కగా లక్ష్మి నరసింహస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయం గ్రహదోష నివారణ పూజలకు ప్రసిద్ధి. వీర భల్లాల II కాలంలో అగ్రహారంగా ప్రఖ్యాతి వహించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు పురావస్తు శాఖ వారి సంరక్షణలో వున్నట్లు తెలుస్తుంది.

కేశవా క్లేశ నాశనః  అంటారు. ఇక్కడ స్వామిని ఎవరైతే దర్శించుకుని పూజిస్తారో వారి దుఃఖాలను స్వామి తీసివేస్తాడు అని ఇక్కడ ప్రసిద్ధి.

మేము ఆలయంలోనికి వెళ్ళేసరికి చాలామంది భక్తులు వచ్చారు. ఒక రెండు కుటుంబాలవారు, మా వయసు వచ్చిన అబ్బాయి, అమ్మాయికి పూజల నిమిత్తం వచ్చారు. వాళ్ళను చూస్తే కుజ దోషం వున్నట్టు గా అనిపించింది. పూజలు అవీ బాగా చేసారు. వారితోపాటే మాకు రాహు కేతు పూజలు జరిగాయి. 45 రోజులు మా పేరుతో పూజ చేస్తాము అన్నారు 365/- అవుతుంది అన్నారు. సరే అని మేము మా వివరాలు ఇచ్చాము. అక్కడ ఒక అతను ఆలయ ప్రాశస్త్యం గురించి, ఆ పూజ వివరాలు కన్నడ, తమిళ్ లో చెప్పటం వల్ల కొద్దిగా అర్థం అయింది. మీకు ఆ వివరాలు కావాలంటే కింద లంకెలలో చదవండి.

అదనపు సమాచారం కోసం:- 

వికీపీడియా


హొయసల టెంపుల్ బ్లాగ్ 

పూజ అయిన తరువాత, భోజన ప్రసాద ఏర్పాట్లు చేసారు. ఎంత బడ్జెట్ లో పెట్టినా కూడా రుచి తక్కువలేదు, వేడి తగ్గలేదు. చాలా బావున్నాయి. ఇందాక చెప్పిన అమ్మాయి వాళ్ళ తండ్రితో కూర్చుకుని భోజనం చేస్తున్నది. మేము ఇటు కూర్చున్నాము. మా మధ్య లైన్ లోకి పూజలో కూర్చున్న ఒక జంట వచ్చారు. పిల్లలకోసం ఏమో వీళ్ళు వచ్చింది అనిపించింది. వాళ్ళు ఏదో సందర్భంగా నవ్వుతూ మాట్లాడారు. ఎదురు అమ్మాయి వాళ్ళను క్రీగంట చూస్తూ తినలేక, తినలేక తింటుంది. మా బాధ కంటే ఆ అమ్మాయి బాధ ఎక్కువగా అనిపించింది. నిజమే కదా ! ఇంట్లో వున్న ఆడపిల్ల అయితే మరీను ప్రపంచంలో ఏ విషయం మాట్లాడన్నివ్వండి. చుట్టుపక్కల ఆడవారు ఈ అమ్మాయి పెళ్లి దగ్గరకు వచ్చేస్తారు. అమెరికా వాడు ఇరాన్ మీద బాంబు వేస్తాడంటే, "ఈలోపు దీని పెళ్లి అయిపోతే బావుండును" అంటే ఇంకా ఏమి మాట్లాడుతాము చెప్పండి. మొత్తానికి ఇదే విషయం మా స్నేహితులు వచ్చేటప్పుడు మాట్లాడితే వాళ్ళు కూడా గమనించినట్లు తెలిసింది.  మొత్తానికి మా ట్రిప్ అలా ముగిసింది.

ఆ తరువాత ఒకరోజు మా టెక్ పార్క్ గేటు దగ్గర ఒక అమ్మాయితో ఒక అబ్బాయితో మాట్లాడుకుంటూ కనిపించింది. ఆ అమ్మాయే అనుకున్నా చూసిన వెంటనే. భక్తి, నిష్టలతో కూడి చేసిన పూజ ఎక్కడికి పోతుంది, ఈ పాటికే సబందం వచ్చి వుంటుంది అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోయాను. ఏమో లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.