మొన్న జనవరి 26న పబ్లిక్ హాలిడే అని, ఎప్పటినుండో బనశంకరి ఆలయం దర్శించుకోవాలి అనుకున్నది ఈరోజు ఏమైనా అవుతుందో లేదో అనుకుంటూ వుంటే మా వాడు ప్రొద్దునే 41 రోజుల శివాలయ అభిషేకంకి వెళ్ళాలి అనుకున్నది గుర్తు చేస్తూ సాయత్రం వెళ్దాము అన్నాడు. సరే అని ఆరోజు వ్యవహారాలు చూసుకుంటుంటే, ఏదో ఆఫర్ వుంది పెళ్లికి ఒక కోటు కూడా తీసుకోవాలి అని స్నేహితుడు వాళ్ళతో పాటు మరో ఇద్దరు షాపింగ్ వెళ్తున్నారు అని తెలిసింది. గుడికి సాయంత్రం వెళ్ళాలి కాబట్టి ఈలోపు వెళ్ళాలా వద్దా, వెళ్ళితే సాయత్రం గుడికి వెళ్ళగలమో లేదో అనుకుంటూ సందిగ్ధావస్థలో లో కొట్టుమిట్టాడుతూ, ఏమైనా సూచనలు వస్తాయేమో అని చూసాను. అటు కొంత, ఇటు కొంత శూచనలు వచ్చాయి :).
ఎట్టకేలకు షాపింగ్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయి వెళ్ళాను. సమయం అలా, అలా గడిచిపోయింది. గుడి, షాపింగ్ మాల్ కి దగ్గరే కాబట్టి స్నేహితుడి పిలిస్తే అక్కడకి వస్తే, ఇద్దరం కలిసిపోవచ్చు అనిపించింది. తర్కం గా ఆలోచిస్తే అది కరక్టే అనిపించినా ఎందుకో అలా చెయ్యాలి అనిపించలేదు. బాహ్య శుద్ధో, అంతర శుద్దో తెలియదు కాని ఏదో మిస్ అయ్యింది అనిపించి, వెంటనే రూం కి వెళ్లి స్నానాదులు కావించుకుని, కాస్త పూజ చేసుకుని, స్నేహితుడిని తో కలిసి ఆలయానికి ప్రశాంతంగా చేరుకున్నాను.
1915 వ సంవత్సరంలో సోమన్న శెట్టి అనే బనశంకరి అమ్మవారి భక్తుడొకడు ఈ ఆలయాన్ని కనుగొన్నట్లు, మాగడి బనశంకరి ఆలయం నుంచి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠ చేసినట్టు చెబుతారు. ఈ ఆలయంలో వున్న ఒకానొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ హిందూ దేవాలయలో ఎక్కడా లేనట్టు 'రాహు కాలం' లో పూజలు చేస్తారు. దానికి ఒక స్థల పురాణ గాథ కూడా చెబుతారు.
ముగ్గురు ప్రతివ్రతలు ఒక్కసారి రాహుకాలంలో వచ్చి అమ్మవారికి పూజ చెయ్యవలసిందిగా పూజారిని కోరతారు. అది రాహుకాలం కాబట్టి మొదట నిరాకరిస్తాడు. వాళ్ళు పట్టుబట్టగా చివరికి అంగీకరించి పూజ పూర్తి చేసి ప్రసాదం ఇవ్వటానికి బయటకు రాగా వచ్చినవారు మాయమవ్వటం గ్రహించి, వచ్చినవారు అమ్మవారి రూపాలే గాని మరొకటి కాదని తెసుకుంటాడు. ఆనాటి నుంచి ఇక్కడ రాహుకాల పూజతో అమ్మని ఆరాధించి భక్తులు అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న 'బనశంకరి' ఒక పెద్ద ఏరియా అది అమ్మవారి పేరు మీదనే వచ్చింది.
మేము వెళ్ళేసరికి ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. విద్యుథలంకారాలతో మిరుమెట్లు గొలుపుతూ శోభాయమానంగా వుంది ఆలయం. రథోత్సవం జరిగినట్టు గుర్తుగా బయట రథం ఆహ్వానం పలుకుతున్నట్లు వుంది.
బనశంకరి - వన (అడవి) శంకరి (శంకరుని శక్తి), కన్నడకి వచ్చేసరికి బన శంకరి అయ్యింది. మొన్నా మొన్నాటి దాకా ఇదంతా అడవే కదా. సరే ఈ ఆలయ విశేషాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.
ఈ ఆలయంలో ఒక దర్శనానికి సంబందించిన వరకు ఒక ప్రత్యేకత వుంది. అది మేము 50 టికెట్ తీసుకుని 'స్పెషల్' దర్శనంకి వెళ్ళాక తెలిసింది. అదేమిటంటే ఉచిత దర్శనం వాళ్ళు దేవుడికి 'దగ్గర' లైనులో వుంటే మాబోటి 'వి.ఐ.పి' లు కాస్త దూరంగా దర్శనం చేసుకుంటారు :). ఎందుకో అప్రయత్నపూర్వకంగా సంతోషంతో కూడిన చిరునవ్వు వచ్చింది. మా వాడు ఏమిటన్నట్టు చూసాడు. దర్శనం అయ్యాక దీనిగురించే చెప్పాను. ఆలయం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ, కమిటి వారు ఎవరు నిర్వహిస్తున్నారో కాని కరెక్ట్ గా నిర్వహిస్తున్నారు. మాకు అంత సమయం లేదు, అంత 'క్యూ' లో నిల్చోలేము అండి, కానీ దేవుడిని మాత్రం తొందరగా చూసేయ్యాలి, అనుగ్రహం సంపాదించేయ్యాలి, అది కూడా డబ్బులతో కోనేయ్యాలి అనుకునేవారికి ఇవ్వవలసిన ప్రాధాన్యం అదే.
ఐతే పూర్తిగా వాళ్ళను విమర్శించలేను కానీ, ఈ 'స్పెషల్' వల్ల ఏదో ఒక రూపేణా దేవాలయంకి సహాయం చేసినవారవుతున్నారు. పోనీ అమ్మ వారిని అలా అనుగ్రహిస్తున్నది అనుకోవాలి. దేవుడిని ఇంకొంచెం దగ్గరగా చూడాలన్న 'మంచి స్వార్ధం' కూడా కావచ్చు. సరే ఆ వివాదాస్పద విషయాలు పక్కన పెడితే, అమ్మవారి దర్శనం చేసుకున్నాక, పక్కనే అయ్యవారి దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ నుంచి బయటకు రాగానే, అదే ఆవరణ లో యజ్ఞం చేసినట్టు వున్నారు, అక్కడ దర్శనం అవీ చేసుకుని నవగ్రహ ఆలయం దగ్గరకు వచ్చి అక్కడ తీర్థం ఇస్తున్నారు అవి తీసుకుని, శాకంబరి మాత ఉపాలయంకి వెళ్ళాము.
శాకంబరి (శాకములను ధరించిన అమ్మ) వారి ఆలయం, ప్రధాన ఆలయం పక్కనే వుంది. ఇక్కడే దీపాలు అవీ నిమ్మ చెక్కలలొ పెడుతున్నారు. అక్కడొక నుయ్యి కూడా వుంది. తాళాలు కట్టారు వాటికి పిల్లలు కోసమో మరో కోరిక కోసమో కావచ్చు. వెనుకవైపు అన్నదానం కి ఏర్పాటు చేసినట్టు వున్నారు. వరసగా కూర్చుని తినటానికి ఏర్పాటు కనపడ్డాయి. అంతా బానే వుంది కానీ చెప్పుల స్టాండ్ గుడి ఆవరణలో ఏర్పాటు చెయ్యటం ఇబ్బందిగా అనిపించింది. బయట వదిలేద్దామనుకున్నా లోన స్టాండ్ వుంది అని చెప్పటంతో తప్పలేదు. సరే ఆ విషయం పక్కన పెడితే కొన్ని విషయాలు చెప్పాలి. అవేమిటంటే ....!
ఒక ప్రవచనంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గ్రామ దేవతలు గురించి చెప్పారు. అవి విన్న తరువాత అవగాహనతో పాటు, అనకూడదు కాని అంతకుమున్న వున్న దాని కంటే కొంచెం ఎక్కువ భక్తి కలిగింది. ముత్యాలమ్మ, తలుపులమ్మ, నూకాలమ్మ, గంగానమ్మ తదితర గ్రామ దేవతలు వినేవుంటారు. ఆయా అమ్మవార్ల పేర్లకు ఆయా ప్రత్యేకత, అనుగ్రహం వున్నాయి. మచ్చుకి చెప్పాలంటే, నూకాలమ్మ అమ్మవారి గురించి గురువు గారు ఏమి చెప్పారు అంటే, ఏదో ఒక పని నిమిత్తం ఒక గ్రామం నుంచి మరో గ్రామం పోయేవారు సరిహద్దులో వున్న నూకాలమ్మని 'అమ్మా నా కొంచెం భూమి మీద నూకలుంచమ్మా' అని ప్రార్ధించేవారంట. అమ్మ అలానే క్షేమంగా తిరిగి వచ్చేలా చేసేదంట. గాలో, ధూళో, మంత్రమో, తంత్రమో, మృగమో, మనిష్యో ఎటువంటి ఆపదలు దరిచేరనివ్వక క్షేమంగా తిరిగివచ్చేలా అమ్మ చుసుకొనేదంటా. అలా ఒక్కో అమ్మ రూపానికి ఒక్కో దయ, అనుగ్రహం. ఇన్ని అవతారాలు, ఇన్ని రూపాలు భక్తుల అనుగ్రహానికి, ధర్మ పరిరక్షణకే కదా. నిజానికి అమ్మ అనుగ్రహాన్ని చవి చూసే సంఘటనలు నాకు కలిగాయి. మా వూరి పొలిమేరలో కూడా 'నూకాలమ్మ' అమ్మవారు వున్నారు. పుష్కరాల సమయంలో స్నేహితులతో కలిసి వెళ్ళుతూ ఇక్కడ ప్రార్దించబట్టే ఆరోజు జరగవలసిన ప్రమాదాలు త్రుటిలో తప్పించుకుని ఆశ్చర్యానికి లోనయ్యము. అమ్మవారి దయకు 'అదృష్టం' అని పేరుపెట్టుకుని లేదా అదృష్టానికి ఆ 'క్రెడిట్' ఇచ్చి ఆనంద పడ్డాము.
దశావతారాలలో నాలుగవది, భగవంతుని సర్వాంతిర్యామిత్వాన్ని ప్రస్పుటించేది, భక్తుని మాట నిజం చేసేందుకు వచ్చిన అవతారమే నరసింహావతారం .లక్ష్మి(శ్రీ) తో కూడి స్వామి 'శ్రీ నారసింహుడు' అయ్యాడు. ఎన్నో కుటుంబాల కులదైవంగా స్వామి ఆరాధనీయుడు. 'యాదగిరి' అని మనుషులని పిలుచుకున్నా, 'వేదాద్రి' అని కొండలను పిలుచుకున్న అవి స్వామి మీద భక్తితోనే గాని మరొకటి కాదు. ఆలాంటి స్వామి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడగలరు.
అంతర్జాలంలో వెతికితే ఆలయం ఈ ఒక్క బ్లాగ్ దొరికింది చూడగలరు.
చుట్టుపక్కల దగ్గరలో ఇప్పటివరకు చూడనివి, స్నేహితులతో కలిసి వెళ్ళేవి, ఏవైనా ప్రసిద్ధ ఆలయాలు వున్నాయా అని విచారణ చేస్తే ఐ. యస్. జగన్నాథపురం లోని లక్ష్మి నరసింహ స్వామి ఆలయం గురించి తెలిసింది. ఇది ఇంతకు మునుపు చెప్పిన 'చిన్న తిరుపతి' అదేనండి ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లాకు దగ్గరలోనే వుంది. అంతే కాదు ఇది ద్వారకా తిరుమల ఆస్థానం వాళ్ళు, పోషణ నిమిత్తం దత్తత తీసుకోబడిన ఆలయం. భూత నరసింహ స్వామిగా అత్యంత ప్రభావవంతమైన దైవంగా కూడా స్థానికులు చెబుతారు. మనకి ఆ నోట, ఈ నోట విన్న జ్యోతిష్య విషయాలే కాని, మా మేనమామకి జ్యోతిష్యం, వాస్తులో ప్రవేశం వుంది. ఆయనని కలిసినప్పుడు ఆ ఆలయం గురించి, నరసింహ స్వామి, కుజ అంశ, ఇతర ఆధ్యాత్మిక, వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడారు. సరే ఇంక మా ట్రిప్ విషయానికి వస్తే ....
నలుగురు స్నేహితులు రెండు బైకులు మీద పొద్దునే బయలుదేరాము. ఇది జంగారెడ్డిగూడెంకి దగ్గర దారిలో ఒక పదిహేను కిలోమీటర్లు వుంటుంది. దగ్గరే కాబట్టి తొందరగానే చేరుకొన్నాము. ఆంజనేయ స్వామిని బాగా నమ్మే భక్తుడు ఒకడు మా మిత్రద్వయంలో వున్నాడు. అతని గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు...
కుటుంబ సమస్య కానివ్వండి, వృత్తిగతం కానివ్వండి. ఒక్కోసారి భగవంతుడు చేసిన మేళ్ళు అన్ని పక్కకు జరిగిపోతాయి. పాతెయ్యటానికి 6 అడుగులు కొనుక్కోలేని స్థితి నుంచి ఇప్పుడు వున్న భూమిని అమ్మి, డబ్బులు బ్యాంకులో వేసుకుంటే జీవితం గడిచిపోతుంది అన్న స్థితి వరకూ వచ్చిన విషయం, ఇంక జీవితంలో ఎందుకు పనికిరాము, ఇప్పటి వరకు గడిపిన, గడించిన జీవితం శూన్యం అనుకున్న స్థితి నుంచి లైఫ్ మనం ఊహించని దారిలో ఎత్తులకు తీసుకెళ్లటం అన్ని విషయాలు మరిచిపోతాము.
ఉద్యోగమో, వ్యాపారమో, వివాహమో, ఆరోగ్యమో కేవలం ఒకటో రెండు సమస్యలు యెంత కట్టి కుదిపేస్తాయి అంటే ఒకానొక దశలో వేదనకు గురై భగవంతుని మీద పూర్తిగా నమ్మకాన్నే కోల్పోయే పరిస్థితి దాపురించి, ఒక అసందిగ్ధతలో పడిపోతాము. చిన్ననాటి నుంచి ప్రతి మంగళ వారం దర్శనం చేసుకునే అలవాటు వున్న మా స్నేహితుడు ఒక సంవత్సరం పాటు గుడికి కూడా వెళ్ళటమే మానేసిన స్థితిలో వున్నాడంటే, సమస్యలు ఎలా ఉక్కిరి బిక్కిరి చేసాయో, భగవంతుని నుంచి ఎలా దూరం చెయ్య ప్రయత్నిస్తాయో అర్థం చేసుకోండి. మొత్తానికి ముందు కాదన్నా అందరూ కలిసి ఒప్పించటం వల్ల ఇందాక చెప్పిన మా స్నేహితుడు కూడా మాతో బయలుదేరాడు.
సంక్రాంతి సమయం కావటం వల్ల పండగ వాతావరణంతో పాటు కోడి పందాలు జోరుగా వున్నాయి. దారి అంతా సరదా సంభాషణలతో, పల్లె వాతావరణంతో సాగిపోతూ వుంది. మధ్యలో కొంత మంది పొలం పక్క రోడ్ మీద కూర్చున్న వారితో, దారి సమాచారం అడుగుతుంటే, ఒకాయన వెళ్ళండి, వెళ్ళండి ఇప్పటికే 5 అయ్యాయి అని అన్నాడు. తనేమన్నాడో కొంచెం సేపు అర్థం కాలేదు. దారి అడిగితే ఇలా అన్నదేంటి అని మిగతావి పూర్తి చెయ్యటానికే వెళ్తున్నాము అనేసి వచ్చేటపుడు తనేమన్నాడో అర్థం అయింది. ఆటను మాట్లాడింది కోడి పందాలు గురించి, మేము అడిగింది ఆలయం గురించి. రెండు ఒకే ఊరులోనే వున్నాయి. దేవుడు, దెయ్యం ఒకే సృష్టిలో వున్నట్టుగా వుంది కదా ఈ విషయం. సరేలే గాని, IS జగన్నాథపురం - కోడి పందాలకు చుట్టుప్రక్కల ప్రసిద్ది :). వెళ్ళే దారిలో దేవుడి కన్నా ముందు ఆ కోడిపందాల బేట్చ్ దర్శనం కూడా అయ్యింది. ఆ విషయం గురించి చెప్తూ, తాటి చెట్టుకింద కింద్ర కూర్చుని పాలు తాగిన చందాన అని సామెత చెబితే, 'జబర్దస్త్' బాగా ఫాల్లో అయ్యే వేరే స్నేహితుడు బ్రాంది షాప్ బయట థమ్స్ అప్ తాగిన చందాన అని అప్డేట్ చేసి నవ్వులలో ముంచెత్తాడు.
మొత్తానికి అలా మాట్లాడుకుంటూ ఆలయం దగ్గరికి చేరుకున్నాము. ఆకలి దంచేస్తుంది. వూళ్ళో వుంటే టీ, కాపీలు కూడా లేకుండా ఆలయ దర్శనం ఎంతో కష్టం అనిపించింది. ఏంటో టీ, కాపీలకు అంకితమైన జీవితాలు :(.
ఆలయం పైకి కొంత దూరం మంచి రోడ్ వుంది. అక్కడ నుంచి మెట్ల దారి వుంది. మెట్ల దారి వరకూ తారు రోడ్ వుంది. అక్కడనుంచి మాత్రం ఘాట్ రోడ్ మాత్రం వుంది. వాహనాలు పైకి నిషేధం అని బోర్డు పెట్టారు అక్కడ. ఘాట్ రోడ్ చాల ప్రమాదకరం. మేము మెట్ల దారి వరకు బైక్ మీద వెళ్లి, అక్కడ నుంచి మెట్ల ఎక్కి, పైకి చేరుకునేటప్పుడు ఒక దంపతులు ఘాట్ రోడ్ మీద వస్తూ, బండి మీద కంట్రోల్ తప్పారు. అంతే వెనక్కి వెళ్లిపోతుంటే పట్టుకున్నాము. ఎప్పుడూ కాకపోయినా కొన్నిసార్లు అయినా కొన్ని పాటించాలి. ప్రత్యేకించి ఆధ్యాత్మిక ప్రదేశాలలో అనిపించింది.
ఆకలి దంచేస్తుంది. ఆలయం కొంచెం చిన్నదే అయినా దర్శనం బావుంది. చాల స్పష్టమైన ఉచ్ఛారణతో సంకల్పసహితంగా పూజ చేయటం సంతృప్తినిచ్చింది. అదేంటో 'ఉపవాసం' అన్నదానికి అర్థ, తాత్పర్యాలు కొంచెం ప్రక్కన పెడితే, కొన్నిసార్లు పచ్చి మంచినీళ్ళు తాగకుండా దర్శనం చేసుకుంటాము, కొద్దిసార్లు మాత్రం మినహాయింపులు తీసుకుంటాము. అలానే వుంది అక్కడ నా (మా) పరిస్థితి. నా మనస్సు అసంకల్పితంగా, ఆకలి తట్టుకోలేక అస్సలు ప్రసాదం ఏం పెట్టారు అన్నట్టు చూసింది. అరటిపండ్లు, కొబ్బరికాయలు వగైరా కనపడ్డాయి. మేము ఏమీ పట్టుకెళ్ళలేదు. ఈ ఆకలికి ఒక అరటిపండు చాలు బాబు! అన్నట్టు మాత్రం మనస్సులో అనిపించింది. బయటి ఒక బ్యానర్ కట్టారు అందులో 1,116/- శాశ్వత విరాళంగా సమర్పించి అన్న ప్రసాదంలో భాగస్వామ్యులు కండి అని వుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎప్పడూ కూడా వుంటాయి కాని ఆ క్షణం ఎందుకో దానికి ఇవ్వలేకపోయాను. ఆర్థికంగా ఎంత కిందకు వచ్చేసినా స్వామి చూసుకున్నాడు ఇంతవరకు. కానీ మళ్ళీ వేరే వారిని ఇబ్బంది పెట్టాలి. లేదంటే మళ్లీ స్వామికి పని పెట్టాలి అన్న ఆలోచన వల్లనో, కొంత ప్రేరణ లోపం వల్లనో గాని మొత్తానికి దానికి ఇవ్వలేదు.
ప్రసాదాలు ఇస్తూ ఎవరు ఏమి ఇచ్చారు అని ఒక్కొక్కరికి అడిగి ఇస్తున్నారు. మనకు సంబందం లేని విషయం అని తోచిన మొత్తం ( కొంచెం పెద్దదే :) ) హుండిలో వేసి వెనక్కి తిరిగేటంతలో పంతులు గారు చేతిలో 'అరటిపండు' పెట్టారు. అప్రయత్నంగా ఆశ్చర్యం, ఆనందంతో కూడిన చిరునవ్వు ఒక్కసారి వెలిగి మాయమయింది. మనస్సు సంతోషంతో వుంది. చూసేవాళ్ళకి అర్థం కాదు కాని మనకు ఆపుకున్న ఆగని ఆనందంతో మనస్సు పరవళ్ళు తొక్కుతుంది. వెనక్కి తిరిగి మళ్లీ పంతులు గారి దగ్గరకు వెళ్లి 'ఇది వుంచండి' అని తోచినది ఇచ్చేసి వస్తుంటే ప్రసాదం ఏమైనా ఇద్దాము అని ఒక్క క్షణం ఆయన అటు ఇటు చూసినట్టుగా తోచింది. స్వామి ఇప్పటికే 'ఇచ్చేసాడు', కాదు 'ఇప్పించాడు' అనుకుంటూ ప్రసాదం పట్టుకుని వచ్చేసాను.
మేం నలుగురం కొంచెం కొంచెం ప్రసాదం స్వీకరించి, అన్నదాన సత్రం చూసి నీడపాటున కూర్చున్నాము. ఒక చిన్న పాప 'పులి హోరా' ప్రసాదం చేతి నిండా పెట్టింది :). మా వాళ్ళు మనస్సు కూడా అనందంగా, ఉత్సాహంగా వుంది ప్రసాదం తింటుంటే. ఒక విషయం యొక్క ప్రాధాన్యత వివిధ సందర్భాలలో ఎలా మారుతుందో తెలిసింది. ఆకలి దీనికి మంచి ఉదాహరణ.
కొసమెరుపు విషయం అప్పుడే చెప్పేసాను అనుకుంటున్నారా ! లేదు ముందుగా కొన్ని విషయాలు చెప్పాలి.
మొన్న విజయవాడ బస్సు స్టాండ్ లో షిరిడి కాంటీన్ పక్కన ఒక బుక్ షాప్ వుంది. ఎప్పటిలాగే యధావిథిగా బుక్స్ చూస్తుంటే 'వర్మ విత్ వోడ్కా' కనిపించింది. అది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఆధ్యాత్మిక పుస్తకాలు చూస్తుంటే 'నరలోకంలో నారసింహుడు' కనిపించింది. మళ్లీ అదే చిరునవ్వు అప్రయత్నపూర్వకంగా :). 'హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ' అని ఇంకో పుస్తకం కనిపించింది అది కూడా తీసుకున్నా.
అక్కడ ముగించుకుని రైల్వే స్టేషన్ కి వచ్చాను. ఆ సమయంలో వాతావరణానికి 'వర్మ' కరెక్ట్ అనిపించి చదవటం ఆరంబించాను. కొన్ని పేజీలు చదివాక ఒక పేజిలో రచయిత సి.రా.శ్రీ, వర్మని మొదటిసారి కలవటానికి ముంబై స్టేషన్ లో మండే ఎండలో, పడిగాపులు గాస్తూ, చెమటలు కక్కుకుంటూ, జ్యూస్ కొట్టు దగ్గర అంత వేడిలో 'జ్యూశ్' లు మీద 'జ్యూశ్' లు తాగుకుంటూ 4 గంటలు పాటి వెయిట్ చేసి తీవ్ర ఆసహనానికి లోనవటం, మొత్తానికి వర్మని కలవకుండానే వెనుతిరగటం గురించిన సందర్భం చెబుతాడు.
ఎవరి ఇంటర్వ్యూ కోసం అన్ని కష్టాలు పడ్డాడో మళ్లీ అదే వ్యక్తి 10 సంవత్సరాల తరువాత స్వయంగా కారు పంపిస్తే, ఆ ఏ.సి. కారులో, ఆనందంగా, దర్పంగా ప్రయాణిస్తూ సరిగ్గా ఆ జ్యూస్ కొట్టు దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి ఆగటంతో రచయితా ఒక్కసారిగా పూర్వ సంఘటనల జ్ఞాపకాల లోకి వెళ్లి 'కార్మిక్' సంబందం గురించి చెబుతుంటే సంతోషం ఒక్కసారిగా వేసింది. ఎందుకంటే...
ఎందుకంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాల పూర్వం మా చిన్న బండి తీసుకుని సరదాగా స్నేహితుడితో పక్క ఊరికి వెళదామనుకుని, వూర్లు దాటుతూ, దాటుతూ కొండమీద ఏదో గుడి వుంది, చూసి వద్దాం అని చూసి, వచ్చేటపుడు పెట్రోల్ అయిపోయి చెమటలు కక్కుకుంటూ తోసుకుని పక్క వూరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకుని అవసోపానాలు పడి ఇంటికి వచ్చింది. ఇప్పుడు మేము దర్శించుకున్న 'లక్ష్మీ నరసింహ స్వామి' వారి గుడే కాబట్టి :).