బెంగళూరులో, రోజూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు విథిగా కనిపించించే ప్రైవేట్ బస్సులు, అందునా తమిళనాడు బస్సులు వెనకగా సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడైవీడు చిత్రం కనిపిస్తూ, ఇంకా నా దర్శనానికి ఎందుకు రావటం లేదు ? ఆలస్యం అవుతుంది, ఎపుడు బయలుదేరి వస్తున్నావు అని పలికినట్లు అనిపించటం, నేను వస్తాను, వచ్చేస్తాను అని మనసులో అనుకోవటం షరా మాములుగా జరిగిపోతుండేది. అది ఎందుకో తెలియదు కానీ ఆలస్యం మాత్రం అయిపోయేది.
పెద్ద గుడికి వెళ్ళాలి అంటే ముందు చిన్న గుడి కెళ్ళి అర్హత సంపాదించుకున్నట్టు మహత్తర క్షేత్రాలలో అడుగుపెట్టడానికి ఒక్కో అర్హత సంపాదించుకోవాలి అని అనిపిస్తుంటుంది. ఇక పళని లాంటి క్షేత్రాలు అంటే మాటలు కాదు కదా ! ఎట్టకేలకు స్వామియే కరుణించి తన క్షేత్ర దర్శనానికి దారి చూపించాడు ఒకరోజు.
దిండిగల్ పళని దగ్గర వున్న ఒకానొక పెద్ద రైల్వే కూడలి. పళనికి, బెంగళూరు కు మధ్య సరాసరి ట్రైన్ లేదు. ఇక తప్పక దిండిగల్ వరకు బుక్ చేసుకున్నాము. బెంగళూరు నుండి బుక్ చేసుకున్న ట్రైన్ లో దిండిగల్ దిగి, అక్కడనుండి బస్సు పట్టుకుని పళని వైపు సాగిపోతుంటే...,
పచ్చని చేలు, పెద్దగా సిటీ అని కాదు, అలా అని పూర్తిగా పల్లెటూరు కాదు అనేలా, జాతీయ రహదారుల కిరుప్రక్కలా కనపడే నివాసాల్లా వేగంగా వచ్చిపోతున్న ఇళ్ళు, మంద్రమైన తమిళ సాహిత్యంతో కూడి, అర్థం అయ్యి అవ్వనట్టు (శిశుర్వోత్తి, పశుర్వోత్తి) సంగీతానికి భాషతో సంబంధం లేదు అన్నటు ప్రయాణంతో (లో) సమాంతరంగా సాగిపోతున్న పాటలు, ఈ నేలతో, గాలితో ఏదో తెలియని జన్మ,జన్మల బంధం అన్నట్టు జరిగిపోతున్న ఆ ప్రయాణం, చల్లని వాతావరణానికి సొగసులు ఆద్దినట్లు అనిపించి తెలియని ధ్యానావస్థకి లోను చేసింది.
విధి నిర్వహణలో భాగంగా, ఫలానా అవసరార్ధం పలానా ఉద్యోగితో మాట్లాడాలి అని వారి పేరు చూస్తే .....పళని స్వామి అని కనిపిస్తుంది, మరో ఉద్యోగినితో మాట్లాడాలి అని ఆమె పేరు చూస్తే ఆమె మరొక ..... పళని స్వామి నామధేయంతో కనిపిస్తుంది. బస్సులపైనే కాదు, ఇక్కడ కూడా వచ్చేసాను అన్నట్టు స్వామి కనిపిస్తుంటే ఏమి మాట్లాడగలం. పని నిమిత్తం రిమైండర్లు వేసినట్టు, దర్శనానికి మరొకసారి గుర్తుచేస్తున్నట్లు, పిలుస్తున్నట్టు అనిపించేది.
'పళని' క్షేత్రం మహిమ గురించి చెప్పేముందు ముందుగా అస్సలు ఈ క్షేత్రం తమిళనాట ఎంత ప్రసిద్ధి అంటే, తమిళనాట వున్న అన్ని ఆలయాలలోకెల్లా అధిక ఆదాయం వచ్చే ఆలయం ఆలయం 'పళని'నే. అంతేకాదు అత్యంత ప్రసిద్ధికెక్కిన, తమిళనాటలో వున్న ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలైన ఆరుపడైవీడులో ఒకానొక దివ్య క్షేత్రం ఈ పళని.
ముందు ఒకమాట....
(పళని & ఆలంపూర్ యాత్రలు చేసి చాలా నెలలు గడిచిపోయినప్పటికీ ఇప్పుడు రాయటానికి కారణం. జీవితం ఆకస్మాత్తుగా పెద్ద కుదుపునకులోనై మాతృవియోగం కలిగి భావ,వ్యాస ధార ఆగిపోయి మళ్ళీ స్వామి కైంకర్యం కోసం ఒక్కోఅడుగు వేస్తుంది. అందుకే ఇంత కాలం పట్టింది మళ్ళీ రాయటానికి, క్షంతవ్యుడిని).
సరే వెనక్కి వచ్చి, యాత్ర విషయానికి వస్తే ..,
పళని చేరుకున్నాక మొట్టమొదట చెయ్యవలసిన పని - స్వామి భక్తుడైన 'ఇడుంబన్' దర్శనం. స్వామి వున్న కొండపైన కాకుండా పక్కనే వేరే కొండపైన ఉంటుంది 'ఇడుంబన్' ఆలయం. అక్కడ ఆలయానికి మెట్లమార్గేమే వుంది. కావున నడిచే కొండపైకి వెళ్ళాలి. వేరే మార్గం లేదు నాకు తెలిసి.
పళని స్వామి కొండపైకి మూడు మార్గాలు వున్నాయి. ఒకటి మెట్ల మార్గం చాలా మంచిది. స్వామి పరిపూర్ణ అనుగ్రహానికి దారి మెట్ల దారి అని చెప్పవచ్చు. రెండోది కేబుల్ కార్ & మూడోది ట్రైన్ కార్. కొండకి మూడు దిక్కులా మూడు దార్లు అన్నట్టు ఉంటాయి ఈ మూడూ కూడా. ట్రైన్ కార్ మార్గం, లాడ్జి నుంచి దూరం అని చెప్పారు. మెట్ల మార్గం దగ్గరే అని చెప్పటంతో, మేము మెట్ల మార్గం ఎంచుకున్నాము.
స్వామి భక్తుడైన ఇడుంబన్ దర్శనం ముందు చెయ్యాలి అని తెలిసినా, కొండ ఎక్కేమార్గంలోనే భాగంగా వెళ్లే దారిలో కనిపిస్తాడు అనుకున్నాము. ఆ మార్గంలో కొన్ని చోట్ల కనిపించిన ఉపాలయాలలో చూసి ఆయనే ఇడుంబన్ అని మొక్కాము :(. మేము చేసిన పొరపాటు మీరు చెయ్యకండి. ఇడుంబన్ దేవాలయం (వేరే కొండా మీద ఉంటుంది). ముందు అక్కడ దర్శనం చేసుకుని తరువాత ఓపిక ఉంటే పళని స్వామిని కొండ కింద నుంచి మెట్ల మార్గంలోనే దర్శనం చేసుకోండి. సాధ్యం కాదు అనుకుంటే మాత్రం ట్రైన్ కార్ / కేబుల్ కార్ సహాయం తీసుకోండి.
దర్శనం కౌంటర్ లో అభిషేక ద్రవ్యాలు ఉంటేనే చూసి టికెట్ ఇస్తున్నారు. పాల ప్యాకెట్ తీసుకునివస్తే అది చూసి పాలాభిషేకం టికెట్ ఇస్తారు అన్నమాట. పాలాభిషేకం ఆ కౌంటర్ పక్కనే కొండ కింద ప్రక్కగా చేసుకోవాలి అన్నారు. కొన్ని నాగ దేవతలు ప్రతిమలు, సుబ్రహ్మణ్య స్వామి ఒక చిన్న అమ్మవారి ఆలయం కనిపించింది.
అంత మంది కౌంటర్లో వున్న తెలుగు రాదో, మరొకటో తెలియదు కాని, ఇంగ్లీషులోనే కొద్దిగా మేనేజ్ చేసి, మొత్తానికి పాలప్యాకెట్స్ అవీ దొరకవు అని స్పెషల్ దర్శనం టిక్కెట్లుతో సరిపెట్టుకుని ఆ లైన్ లోకి వెళ్ళాము.
తమిళనాడు క్షేత్రాలలో ఒకానొక అదృష్టం ఏమిటి అంటే స్పెషల్ లో గంటలతరబడి క్యూలో ఉండనవసరంలేదు (కాస్త వందో, రెండువందలో ఉంటే చాలు భగవంతుని దయవల్ల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవచ్చు). ఇక్కడ కూడా అంతే. కానీ క్యూ లైన్ దారి మాత్రం చాలా దూరం పెట్టారు.
దర్శనం చేసుకుని బయటకువచ్చి ఆనందంగా పరిసరాలు చూస్తుంటే ట్రైన్ కార్ దూరంగా పైనుంచి కిందకు భక్తులను తీసుకెళుతూ కనపడింది. చూస్తే కొంచెం దూరంగా వుంది. సరే అని కేబుల్ కార్ కి అవకాశం ఉందేమో అని విచారణ చేస్తే, భోజన సమయం కావటం వల్ల అనుకుంటా రెండుగంటలు దాకా పడుతుంది అని అన్నారు. సరే ఇంక ఇలా కాదు గాని అని మెట్లమార్గంలోనే కిందకి దిగివచ్చాము. కింద మరోకసారి విఘ్నములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాము
దర్శనీయ ప్రదేశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఇంటర్నెట్ లో చూస్తుంటే అప్పుడు కనపడింది ఇడుంబన్ దేవాలయం. అర్థం అయింది మేము చేసిన పొరపాటు. ఆటో వాడిని కనుక్కుని అక్కడికి చేరుకున్నాము. పక్కనే కొండమీద ఉంటుంది ఆలయం మొత్తంగా ఒక కిలోమీటర్ లోపు ఉంటుంది.
క్షేత్ర చరిత్ర, విశేషాల విషయానికి వస్తే..,
ఇడుంబన్ అనే రాక్షసుడు, జన్మతాః రాక్షుడైనప్పటికీ, దేవ - దానవ యుద్ధంలో అగస్త్యుని పాదాలు పట్టుకుని శరణువేడాడు. స్వతః సిద్ధంగా రాక్షసుడు అయినప్పటికీ స్వభావాన్ని విడిచి శరణు కోరాడు కాబట్టి అగస్త్యుడు అభయమిచ్చాడు. మిగిలి వున్న కొద్దిపాటి రాక్షస ప్రవృత్తిని రూపుమాపడానికి కైలాసాన వున్న రెండు కొండలను తెమ్మని అగస్యుడు ఆజ్ఞాపిస్తాడు. సరే అని అగస్త్యుని ఆజ్ఞానుసారం ఆ రెండు కొండలను తీసుకుని వెనక్కి బయలుదేరతాడు. లయకారకుడు అయిన శివుడు ఆ ఉద్ధతికి కోపించినా, ఆ రాక్షసుని అజ్ఞాన ప్రవృతి పోగట్టగలిగినవాడు కుమార స్వామి అని తలచి శాంతిస్తాడు.
ఆ కొండలను ఒక కావిడిలో చెరో పక్కా వేసుకుని బయలుదేరిన ఇడుంబన్ ఆయాసం కొద్దీ సేద దీరుదామని ఒక చోట దించుతాడు. కాసేపటి తరువాత తిరిగి అవి తీసుకుని బయలుదేరదామని అనుకుంటే ఆ కొండలు భరించలేనంత బరువు అవుతాయి. విఫలయత్నం చేస్తున్న ఆ రాక్షసుని చూసి ఆ పక్కనే చిన్న బండ మీద కూర్చుని వున్న బాలుడు పక, పకా నవ్వుతాడు. తనను చూచి నవ్వుతున్న ఆ బాలుడిని చూసి రాక్షసుడికి ఎక్కడ లేని కోపం వచ్చి యుద్ధం చేయబోతాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఇదే కాబోలు కదా :). ఆలోచన, విచక్షణ రెండూ వుండవు.
రాక్షసుడు విఫలయత్నం చేసినా ఆ బాలుడిని జయించ లేకపోయేసరికి, ఇక ఆ బాలుడు సామాన్యుడు కాదని తన అజ్ఞానాన్ని పోగొట్టడానికి వచ్చిన ఎవరో దేవతాంశ అని తెలుసుకుని శరణు వేడుతాడు. అంతట సుబ్రహ్మణ్య స్వామి తన నిజరూప దర్శనం ఇచ్చి, ఇక నుంచి ఇది ఒక గొప్ప క్షేత్రం అవుతుంది అని పలికి, తాను ఇక్కడే నివసిస్తాను అని, ముందు ముందు ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన నా భక్తులు, ముందు నీ దర్శనం చేసుకుని ఆ పిదపనే, నా దర్శనం చేసుకుంటారు అని వరం ఒసగుతాడు.
అత్యంత భక్తి శ్రద్దలతో ఈనాడు భక్తులు చేస్తున్న కావిడి ఉత్సవాలు ఆనాటి నుంచే మొదలయ్యాయి. ఆనాడు ఇడుంబన్ కావిడిన మోసుకొచ్చిన రెండుకొండలే ఈనాడు మనం పళనిక్షేత్రంలో చూస్తున్న రెండుకొండలు. ఒక కొండపై స్వామి, మరొక కొండపై ఇడుంబన్లు దర్శనమిస్తారు.
ఇది సంక్షిప్తంగా పళని క్షేత్ర చరిత్ర, దానితో ముడిపడివున్న స్వామి భక్తుడైన ఇడుంబన్ వృత్తాంతం.
మేము సాయంత్రం వెళ్లేసరికి ఇడుంబన్ ఆలయం కొండమీద పెద్దగా జనం లేరు. క్రింద ఒక షాప్ లో బ్యాగ్లు చూడమని పెట్టి, పైకి వెళ్ళాము. మొత్తంగా కలిపి ఒక వందమంది వుంటారు అనుకుంట. కానీ భక్తి విషయం లో మాత్రం వాళ్లకి వాళ్ళే సాటి అనిపిస్తుంది. భుజాన కావిళ్ళుతో, నృత్యాలతో రెండు కొండల మీద పరుగులుపెట్టి వాళ్ళు చూపించే భక్తి చూస్తే మన భక్తి ఏపాటిది అనిపిస్తుంది. ఇక్కడ భక్తి గాఢత చాలా ఎక్కువ. జ్ఞానం, కోరికలు లేదా మిగతా విషయాలేవీ (అర్థి, అర్ధార్థి ?) చూడటం లేదు కానీ కేవలం భగవంతుని కోసం పడే శారీరక, మానసిక కష్టం గురించి చెబుతున్నాను. ఆ విషయంలో వాళ్ళకే వాళ్లే సాటి.
విఘ్నాధిపత్యం కోసం వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు పోటీ పడే కథ మనకి తెలుసుకదా !!! విఘ్నాధిపత్యం వినాయకుడికి రావటంతో, చిన్నవాడైన కుమారస్వామి అలిగి భూలోకంలో ఒక కొండ మీదకి వచ్చి నివాసం ఉంటాడు (ఇందాక కథలో ఇడుంబన్ చూసింది ఈ బాలుడినే). పరమశివుడు ఆ కొండ దగ్గరికి వచ్చి బుజ్జగిస్తూ నాన్న సకల జ్ఞానానికి నీవే ఫలం (ఫలం తమిళంలో పలం, నీవు తమిళంలో నీ) రా ! అని పలికిన ప్రదేశమే ఈ నాడు మనం చూస్తున్న పళని దివ్య క్షేత్రం. ఆ పేరుమీదనే పళని దివ్య క్షేత్రం అలరారుతున్నది.
నవపాషాణాలతో (విషాలతో)ఇక్కడ స్వామి మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి తయారుచేశారని, స్వామి తొడ నుంచి తీసిన విభూతి ప్రసాదంతో కుష్టువ్యాధి గ్రస్తులకు వ్యాధి నివారణ జరిగేదని, కాలక్రమేణా తొడ భాగంలో అరిగిపోవటం మొదలయ్యింది అని, అందుచేతనే తరువాత, తరువాత ఆలా ఇవ్వటం మానివేశారని తెలియవచ్చింది.
ఇక్కడ స్వామి కౌపీనధారిగా, చేతిలో దండాయుధ ఆయుధంతో దర్శనమిస్తారు. అందుచేతనే భక్తులు స్వామిని దండాయుధపాణిగా కొలుస్తారు. స్వామినాధన్ అని, వెట్రివేల్ మురుగా అని, బాలసుబ్రహ్మణ్యన్ అని, కార్తికేయన్ అని పెక్కు నామాలతో స్వామిని కీర్తించటం పరిపాటి. రమణమహర్షి, కుమారిలభట్టు స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామి అవతారాలే గాని మరొకటి కాదు అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు శర్మ గారి వంటి పెద్దలు తమ ప్రవచనాలతో తరచుగా ప్రస్తావించటం విదితమే కదా !
పళని వివరాలు గురించి మరిన్ని వివరాలు వికీపీడియా లభిస్తున్నాయి. ఇక్కడ చూడండి.
గోవా వెళ్ళి వచ్చామండి అని ఎవరైనా అడిగితె ఏ గుడులు చూసారు అని ఒకసారి అడిగి చూడండి. ఏమి ప్రతిస్పందన వస్తుందో :). చాలా చిత్రంగా ఉంటుంది కదా ! నిజానికి చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అక్కడ కూడా ప్రఖ్యాతి గాంచిన గుడులు వున్నాయి అని.
ఉడిపి, గోకర్ణ అనగానే మనబోటి వాళ్ళకి గుడులు,గోపురాలు గుర్తువస్తే పర్యాటక ప్రదేశాల ప్రవేశ ద్వారాలుగా గుర్తుకు వచ్చేవారూ వున్నారు. అటు ప్రక్క నేను వెళ్ళలేదు కాని వీళ్ళు ఎంత మందో, వాళ్ళు కూడా అంతే అని తెలిసింది. అలాగే పాండిచ్చేరి కూడా. పాండిచ్చేరికి అరవింద ఆశ్రమం చూడటానికి వెళ్ళవచ్చు, బీచుల్లో ఆడుకుంటూ. పాడుకుంటూ ఆనందించటానికి వెళ్ళవచ్చు. భక్తి, రక్తి పక్కపక్కనే ఉంటాయి కాబోలు. అనిపిస్తుంది. చిత్రం కదా !!! :).
ఇవన్ని ఎందుకు చెబుతున్నాను అంటే ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రదేశం కొడైకెనాల్ పళనికి దగ్గరే. అలా ముట్టుకుని, ముట్టుకోనట్లు వెళతాము సరిహద్దునుంచి. పళనికి దగ్గర వున్న ఒకే ఒక రైల్వే స్టేషన్ కొడైకెనాల్ రైల్వే స్టేషన్. 'కొడైకెనాల్ రైల్వే స్టేషన్ రోడ్' (స్టేషన్ పేరు) పళని నుంచి 79 కిలోమీటర్లు దూరం.
పళని నుంచి బస్సులు తక్కువ. రెండో, మూడో బస్సులు మాత్రం బెంగళూరుకు ఉన్నట్టు వున్నాయి. అవి కూడా ఖాళీ లేకపోవటంతో ఇలా కాదు గాని అని దుండిగల్ వచ్చేసాం. అది ప్రాధాన్య కూడలి కావటంతో బస్సులు లభ్యత బానే ఉంటుంది. మేము వచ్చేటప్పుడు స్లీపర్ బస్సు దొరికింది కాని సుమారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది.
ఇక్కడ ట్రావెల్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక చిత్రం జరిగింది. పళని నుంచి దిండిగల్ చేరేటప్పుడు ఊరు బస్సు స్టాండ్ వచ్చేసింది అని ఒక చోట చూసుకోకుండా దిగేసాను. అది కాదు అని బస్సు కదిలేసరికి తెలిసిన మా స్నేహితుడు అందులో వెళ్ళిపోయాడు :(. నా చరవాణి (మొబైల్) లో చార్జింగ్ లేదు. ఎవరిని అడగాలో, ఎలా వెళ్లాలో గందరగోళానికి లోనయ్యి స్పష్టత వచ్చేలోపునే ఒక అద్భుతం జరిగింది.
అద్భుతాలు, అనుభూతులు - ఆ మాత్రం కిక్ లేకుండా మనకి యాత్రలు జరగవు కదా. అక్కడో ఏ.టి.ఎం. వుంది. అప్పుడే ఒక అబ్బాయి బాలన్స్ చూసుకుంటూ బయటకి వచ్చి ఆకస్మాత్తుగా నా వంక చూసి ఏదో పరిచయస్తుడిలా ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు అడిగాడు. అతని బండి ఎక్కడం, తాను కళాశాల విద్యార్థి అని చెప్పటం, ప్రవేట్, పబ్లిక్ అన్ని బస్సులు ఇక్కడే ఉంటాయి అని బస్సు స్టాండ్ పక్కన దింపెయ్యటం ఆపై టాటా చెప్పెయ్యటం. ఈ లోపు బస్సు దిగుతున్న మావాడికి ఎదురుగా (సర్వాంతర్యామిలా :P) నేను కనిపించటం, వాడు ఆశ్చర్యపోవటం చకచకా జరిగిపోయాయి :).
ఇంకో విషయం ఏమిటి అంటే ఈరోజు ఈ ఆర్టికల్ పూర్తి చేస్తుండగా మావాడు వచ్చాడు ఆకస్మాత్తుగా ఆరోజు పళని లో ఏ డ్రెస్ వేశాడో ఎలా వున్నదో అలాగే ఏదో పళని నుంచి సరాసరి వచ్చినట్టు :). అది చెప్పి అదే పళని ఫోటో చూపించాడు. ఇంకేముంది కథ కంచికి మనం ఇంటికి :)
ఉంటానండి,
రవి ప్రకాష్.