మునుపు ఆర్టికల్స్ లో చెప్పాను కదా లక్షవత్తుల అనుభవం గురించి. మొన్నా మధ్య ములుగు వరప్రసాద సిద్ధాంతి గారి వెబ్ సైటు చూస్తుంటే వత్తులు గురించిన సెక్షన్ లో కోటి వత్తులు గురించి చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాను. మనలో చాలా మందికి మూడువందల అరవై వత్తులు గురించి మాత్రమే ఎక్కువ పరిచయం. అలాంటి వారికి ఒకేసారి కోటి వత్తులు గురించి వింటే ఎలా ఉంటుందో గమనించండి :).
సరే ఇంక విషయానికి వస్తే, కోటి వత్తులు ములుగు.కామ్ లో ఆన్లైన్ ఆర్డర్ పెట్టాము. ధర 2500/-. రెండు, మూడు రోజులలోనే వచ్చేసింది. ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి బాక్స్ లో ప్యాక్ చేసి పంపారు. బావుంది. మొత్తం ఒక బంతిలాగా వుంది. ప్రత్యేకంగా ఒక ఒత్తి లాంటిదేమీ కనపడలేదు.
ఒక రెండు కేజీల నెయ్యి పోసాము. చేతితో కొంచెం నొక్కుదాము అంటే చేతికి పీచులాగా వచ్చేస్తుంది. అందుకే ఆలా ఉంచేసాము. మడివాలా మార్కెట్ కి వెళ్లి ప్రమిదలు కోసము వెదికాము. కానీ ఈ సైజు దొరకలేదు. అప్పటికే ఒకటి రెండు చోట్ల వెతికి ఉండటం వల్ల చివరకు అక్కడే ఒక చోట గిన్నెలాంటి కుండ దొరికింది. వందరూపాలు అయింది. అదృష్టం ఇంటికి వచ్చి చూస్తే ఆ వత్తుల బంతి చక్కగా కూర్చుంది. ఒక నలభై నిముషాలు నెయ్యి పోసి ఆ ప్లాస్టిక్ డబ్బాలోనే ఉంచేసాము.
మా వాడు రామాలయంలో సత్యనారాయణ కార్యక్రమం ఉండటం వల్ల, ఈ రోజు సాయంత్రం ఆ కార్యక్రమం మునుపే 6 గంటల తరువాత శివాలయంలో వెలిగించాలి అని సంకల్పం చేసుకున్నాము. అనుకున్నట్లు గానే శివాలయానికి చేరుకొని ఆ ప్రమిదలో పెట్టి వెలిగించాము. హమ్మయ్య భగవంతుని అనుగ్రహంతో మొత్తానికి పూర్తి చేసాము అనుకున్నాము.
చిత్రం ఏమిటీ అంటే హమ్మయ్య మొత్తానికి పూర్తి చేపించాడు భగవంతుడు అనే భావనే కానీ, ఫలితం గురించి ఆలోచన బాధించకపోవటంతో చిత్తశుద్ధి ఏమైనా మొదలు అయ్యిందా అనే ఆలోచన చేసింది:). సరే ఇంక అక్కడ ముగించుకుని వచ్చేదారిలో రామాలయం చూసుకుని ఇంటికి చేరుకున్నాను.
నాకు, మా స్నేహితుడితో పాటు చాలా మందికి వచ్చే అనుమానం ఏమిటి అంటే నిజంగా కోటి వత్తులు ఉంటాయా వాటిలో అస్సలు అని ???
నాకు తెలిసి దీపం గురు స్వరూపం. జ్ఞాన స్వరూపం. అందుకే చాలా ఆలయాలలో, దేవాలయ గర్భాలయంలో ఒకే ఒక పెద్ద దీపాన్ని ఉంచుతారు. జ్ఞానమిచ్చేవాడు గురువు. జ్ఞానం అనంతం, లెక్కకట్టలేనిది. జ్ఞానాన్ని, జ్ఞాన స్వరూపాన్ని ఎలా లెక్కించలేమో అలానే జ్ఞానానికి ప్రతిరూపమైన దీపాన్ని, వత్తులను లెక్కించలేము.
సహస్ర నామాలు అంటే వేయి నామాలు అంటారు. కానీ అనంతం, లెక్కించలేనివి అనే అర్థంకూడా ఉన్నట్లు చాగంటి కోటేశ్వర రావు గురువు గారు చాలా ప్రవచనాలలో చెప్పారు. కోటి అనే సంఖ్య సంకేత రూపమే. అంటే లెక్కించలేని, అనంతమైన జ్ఞానము.
సరే ఈ విషయాలు అన్ని అనుభవంలోకి పెరుమాళ్ తెచ్చేవరకు మనం మామూలుగానే అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి పయనించేలా చెయ్యమని ఆ దక్షిణామూర్తిని వేడుకుందాం. వుంటాను :).
కొసమెరుపు ఏమిటి అంటె ఆరోజు షష్ఠి తిథి కావటం. అంతే కాదు పళని - ఫలం (పల), నీ (నీవు)) - 'జ్ఞానాని'కి ఫలం రా కన్నా నీవు అని సాక్షాత్తు ఆ పరమశివుడే సుబ్రహ్మణ్యుడిని బుజ్జగించిన పళని క్షేత్ర వైభవ విశేషాల గురించి మరొక ఆర్టికల్ రాస్తుండటం :)
No comments:
Post a Comment