Saturday, January 28, 2017

గోశాల, కోరమంగళ, బెంగళూరు (అఖిల కర్ణాటక ప్రాణి దయ సంఘ (రి.))

     ఫలానా సమస్య వుంది అండి అని పెద్దలకు, కాస్త జ్యోతిష్యం అవగాహన వున్నవారికి చెబితే, మిగతా రెమెడీస్ గురించి కాదు కానీ, పక్షులకు ఆహారం పెట్టడం, కుక్కలకు బిస్కట్స్  తినిపించడం, సర్వదేవతా స్వరూపమైన ఆవులకు ఫలానా పదార్ధాలు రాత్రి నీళ్ళల్లో నానబెట్టి  ప్రొద్దుటే పెట్టండి అని చెప్పటం కూడా వినే వుంటారు. వాటి ఫలితాలు అనుభవపూర్వకంగా కూడా చూసాను.  

     చెన్నైలో శేఖర్ అనే కెమెరాలు బాగుచేసే ఒకతను గత పదిఏళ్ళ నుండి వేలాది పక్షులకు - చిలకలు, ఉడుతలకు ఆహారం అందిస్తున్నాడు.  ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. అవే సర్వస్వముగా బతుకుతున్న అతను లేనప్పడు అవి మరొకరు ఆహారం అందించినా తినవంట!. ఉన్న చిన్నపాటి అద్దె ఇల్లు, వచ్చే కొద్దిపాటి ఆదాయమే అతనికి జీవనాధారం కూడా. అలాంటి పరిస్థితిలో కూడా వాటిని ఆలా సాకటం నిజంగా చాలా గొప్ప విషయం కదా !. 


అతని గురించి మిగతా ఇక్కడ చదవండి 


     సరే మిగతా విషయాలను పక్కన పెడితే, గోశాల & ఇలా పక్షులకు ఆహారం అందించటం కొంచెం ఆహ్లాదం, మనసుకి ఆనందం.  వ్యక్తిగతంగా నాకు కూడా అలా అందించాలి అని ఎప్పటినుంచో ఆలోచన వుంది. కానీ అవకాశం పెద్దగా చిక్కలేదు. 


     ఇక్కడ దగ్గరలో రామాయలం పూజారి గారు - సోనీ సిగ్నల్, కోరమంగళ (బెంగళూరు) దగ్గర అలాంటి ఆశ్రమం వుంది, ప్రయత్నించండి అని ఒకరోజు చెప్పారు. 


     మొత్తానికి ఈరోజు కుదిరి వెళదామని బయలుదేరాము. మెయిన్ రోడ్ మీదనే సువిశాల ప్రాగణంలో పూర్తి వాణిజ్య కూడలిలో కనపడడం ఆశ్చర్యం కలిగించింది. అస్సలు అంత పెద్ద ఆశ్రమం నిర్వహించటం ఎంత కష్టమో అనిపించింది. అంత పెద్దది.


      ఆఫీసు సిబ్బందితో మాట్లాడాము. బయట ఒక హుండీ పెట్టారు. ఎవరైనా ఏమైనా సహాయం చెయ్యాలనుకుంటే ఆ హుండీ లో వెయ్యవచ్చు అని చెప్పారు. అంతే కాక కొన్ని స్కీమ్స్ కూడా వున్నాయి. Rs. 350 లతో మొదలవుతున్నాయి ఆ స్కీమ్స్. వివరాలు ఫోటోలలో వున్నాయి. చూడగలరు.


     బయట ఆహారం ఆఫీసు వారి అనుమతితో తప్ప పెట్టకూడదు అని రాశారు. అమావాస్య రోజు ఆవులకు అరటిపండ్లు కూడా పెట్టరాదు అని రాసి వుంది. పావురాలకు ఉదయం 6 నుంచి 8 మధ్య ఆహారం ఇచ్చే సమయం అని వుంది. 


    మేము వెళ్ళినపుడు మా చేతితో ఆవులకు ఆహారం, పక్షులకి మేత వేయించారు. చాలా ఉద్వేగంకి లోనయ్యాము :). అది ఆహారం ఇచ్చే సమయం కాకపోయినా ఒక అవకాశం ఇచ్చారు అనిపించిది. మన టైం & టైమింగ్ తెలుసుకదా :P. ఏమాట కామాటే చెప్పుకోవాలి. అంత పెద్ద ఆశ్రమ నిర్వహణకు నిర్వాహకులకు చేతులెత్తి మొక్కాలి. పని చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. 


    సరే అక్కడ ఆశ్రమం మొత్తం ఒక చుట్టూ చుట్టి, కాసేపు గడిపి తిరిగి వచ్చేసాము. మరొకసారి తప్పక వెళ్ళాలి అనిపించింది.  

  
    గమనిక : ఇక్కడ నగదు తప్ప కార్డు చెల్లింపు లేదు. అవకాశం ఉంటే ఏర్పాటు చెయ్యండి అని సూచన చేసాము. కనుక మీరు వెళ్ళినపుడు ఏమైనా సహాయం చెయ్యాలంటే నగదు తీసుకుని వెళ్ళండి. వెబ్సైటు లాంటిది కూడా ఏమి లేదు. పశువులకు ఆహారం కూడా వాళ్ళే ఇస్తారు కనుక మీరు ఏమీ తీసుకుపోవలసిన అవసరమేమీ లేదు.  

   మిగతా వివరాలకు ఫోటోలు చూసి నిర్వాహకులని సంప్రదించగలరు. 



భవదీయుడు 

రవి ప్రకాష్ 




























ఈరోజు ది. ౦౫/౦౨/౨౦౧౭ మరల ఒకసారి స్నేహితులతో దర్శించటం జరిగింది. మరికొన్ని ఫోటోలు తీశాను. చూడగలరు. దుర్గాప్ప అనే అతను అక్కడ గోవుల సంరక్షణలో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు మాట్లాడి ఉండటం వలన అతను గుర్తు పట్టి మొత్తం లోపల గోశాల లోకి తీసుకుని వెళ్లి కన్నడ నాటీ ఆవులు మిగతా జాతులు చూపించాడు.

     అక్కడే ఒక చోట రామ,లక్ష్మణలు అంటూ ఒక రెండు ఆవులు చూపించాడు. కవలలు కాబోలు. ఎప్పుడో విన్నా ఆలా. వాటిలో ఒక అవును తీసుకుని వచ్చి కింద నుంచి దూరి రమ్మన్నాడు. కన్నడ మాత్రమే వచ్చు ఆయనకి. తెలుగు అర్థం అవుతుంది కొద్దిగా. సరే అని అతను చెప్పినట్లే చేసాము. ఆలా అయిదు సార్లు చెయ్యమన్నాడు. చేసి వచ్చాము. పదివేలు ఇచ్చిన ఇలాంటి అవకాశం రాదు. చాలా మంచిది అని చెప్పాడు (ఇంతకు ముందు వచ్చినప్పుడు ౨౦ ఇచ్చాములే ఈసారి ఎక్కువ ఇవ్వాలి అనుకుంటా అనుకున్నా :) ).

పావురాల దగ్గరకి వచ్చాము. రసీదు ఉండాలి అన్నాడు. అంటే ఏదైనా చందా అన్నమాట. సరే నేను ఎలాగూ ఇవ్వాలి అనుకుంటున్నా అంటే వేరే అతనితో మాట్లాడాడు కానీ ఉండాలి తప్పదు అన్నట్టు చెప్పాడు. సరే అని మేము తలో మొత్తం ఇచ్చి రసీదులు చూపి పావురాలకు మేత వేసి కాసేపు గడిపి వచ్చేసాము.