Monday, January 23, 2017

ఆలంపూర్ జోగులాంబ అమ్మవారు - అష్టాదశా శక్తి పీఠాలు - 5వ శక్తి పీఠం


     చాలా కాలం క్రితం నాకొక వాట్స్అప్ లో ఒక అంతర్జాల మెసేజ్ వచ్చింది. అదేమిటంటే ...!

     ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థుర్ ఆషే విఖ్యాత వింబుల్డన్ ప్లేయర్. 1983లో తన గుండెకి జరిగిన ఒక శస్త్ర చికిత్సలో భాగంగా ఎక్కించిన కలుషిత రక్తం వల్ల అతనికి ఎయిడ్స్ సంక్రమించింది. 

     ఈ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా వున్న తన అభిమానులనుంచి రకరకాల ఉత్తరాలు వచ్చాయి. 

      అందులో ఒక ఉత్తరంలో తన అభిమాని కన్నీటితో ఇలా అడుగుతుంది  "భగవంతుడు ఎందుకు అలాంటి వ్యాధికి నిన్నే ఎంచుకోవాలి" అని.

     దానికి ఆర్థుర్ ఆషే ఇలా జవాబిస్తాడు....

     "ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడటం మొదలు పెడితే, 50 లక్షలమంది మాత్రమే టెన్నిస్ ఆడుకోవటం నేర్చుకుంటారు. 5 లక్షల మంది ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడితే, మళ్ళా 50 వేల మంది మాత్రమే సర్క్యూట్ స్థాయికి వస్తారు. 5 వేల మంది గ్రాండ్ స్లాంకి వస్తే కేవలం 50 మంది మాత్రమే మళ్ళా వింబుల్డన్ కి వస్తారు. వారిలో నలుగురు సెమీఫైనల్స్ కి వస్తే, ఇద్దరు ఫైనల్స్ కి వస్తారు. ఆఖరుకు ఆలా ఫైనల్ కి వచ్చిన ఇద్దరిలో కప్ పట్టుకుని విజేతకు నిలిచిన వాళ్లలో నేనూ ఒకడిని. కానీ ఆరోజు నేను అడగలేదు భగవంతుడిని "నేనే ఎందుకు" అని....... ఈ రోజు నాకు ఈ బాధ వచ్చింది కదా అని ఆ భగవంతుడిని నేను అడగకూడదు "నేనే ఎందుకు" అని.

                                         *                    *                * 

     మేము బెంగళూరు నుండి అలంపూర్ బయలుదేరాలి అని రైల్ సౌకర్యం గురించి వాకబు చేస్తే దగ్గరలో వున్న ఒకే ఒక రైల్వే స్టేషన్ - కర్నూల్ రైల్వే స్టేషన్ గా తెలిసింది.  అక్కడనుండి అలంపూర్ 23 కిలోమీటర్లు రమారమి.

     అనుకున్నట్టుగానే కర్నూల్ రైల్వే స్టేషన్ లో దిగి బస్సు స్టాండ్ కి వెళ్లి అక్కడే ఒక రూమ్ చూసుకుని మా స్నానాదులు ముగించుకుని బస్సు పట్టుకుని ఆలంపూర్ చేరుకున్నాము. ఎందుకోగానీ అష్టాదశా శక్తిపీఠాలు దర్శించుకున్నపుడల్లా అవి పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు అనిపిస్తుంది. అవి స్వార్ధ మనషుల దృష్టికి దూరంగా ఉండాలని అమ్మవారి సంకల్పంతోనో మరే కారణమో తెలియదు కాని అంతగా అభివృద్ధి కాన రాదు.

     ఆలయం దగ్గర పూలు కొన్ని తీసుకుని లోపలకు అడుగుపెట్టాము. ముందుగా ఆలయ వివరాలు గురించి కొంత తెలుసుకుందాము. 

     అలంపూర్ జోగులాంబ ఆలయం అష్టాదశా శక్తిపీఠాలలో ఐదవది. ఇక్కడ అమ్మవారి పై దవడ పంటితో సహా పడినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపంతో దర్శనమిస్తారు. అమ్మవారి ఉగ్రమూర్తిత్వాన్ని సామాన్యులు తట్టుకోలేరు అనేమో తెలియదు కానీ ఇక్కడ పక్కనే ఒక కోనేరు వుంది. ఆ కోనేరు వలన ఇక్కడ పరిసరాలు చల్లగా ఉంటాయి. 'జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాతా, సర్వార్ధ ఫల సిద్ధిదా' అని అమ్మవారిని ఇక్కడ భక్తులు స్థుతిస్తారు 

     నవబ్రహ్మ ఆలయాలు కూడా ఇక్కడే వున్నాయి. ఇక్కడ శాసనాల ద్వారా ఈ ఆలయాలు ఆరవ, ఏడవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లుగా తెలియవస్తున్నాయి. 

       పదిహేనువ శతాబ్దంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో అమ్మవారి ఆలయం ధ్వంసం అయితే జోగులాంబ, ముండి, చండి విగ్రహాలను ఇక్కడ బాల బ్రహ్మేశ్వర ఆలయంలోనే భద్రపరిచినట్లు తెలుస్తుంది. అమ్మవారికి కొత్త ఆలయం నిర్మించేదాకా భక్తులు ఒక కిటికీ గుండా ఈ ఆలయంలోనే అమ్మవారి దర్శనం చేసుకునేవారుగా కూడా తెలుస్తుంది.

     చిన్నప్పుడు చరిత్రలో ముస్లింల దండయాత్రల, క్రైస్తవుల కూసేడు యుద్ధాల  గురించి, వారి పాలనలు గురించి చదువుకున్నాము కదా అందరం. అలాంటి దండయాత్రలకు సజీవ సాక్షాలుగా నవబ్రహ్మ ఆలయాల్లో విరిగిపోయిన విగ్రహాలు కనిపిస్తాయి. ఇవి చూస్తే రక్తం మరగటం ఖాయం. మతోన్మాదమా, స్వార్ధమా, అజ్ఞానమా ఏమి అనుకున్నా దానికి అంతేలేదు. కాని ఏమి చేస్తాము. ఉన్నవాటిని పరిరక్షించుకోవడం చెయ్యటం తప్ప. వివేకానంద స్వామి కి ఇలాంటి అనుభవమే కలిగిన సందర్భం ఇంతకు మునుపు ఒకసారెప్పుడో మీతో పంచుకున్నాను. 

     వివేకానంద స్వామి ఒకసారెప్పుడో దండయాత్రలలో చిన్నాభిన్నం అయిన ఒకానొక గుడిని చూసి - ఈ విధ్వసం జరిగేటప్పుడు నేనే గనుక ఇక్కడ ఉంటే, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ విధ్వంసాన్ని ఆపటానికి పోరాడేవాడిని అనుకుంటాడు. అప్పుడు అమ్మవారు పలికిన మాటలు సర్వత్రా ఆలోచించవలసిన విషయాలు. నా సంకల్పం లేకుండానే ఇదంతా జరిగింది అనుకుంటున్నావా ? నేనే గనుక తలుచుకుంటే ఇప్పటికిప్పుడే ఇక్కడ ఏడు అంతస్తుల గుడి నిర్మించుకోగలను అని.  

     ఆలయాల విధ్వంసాలు చూసినపుడు నాకు అదే విషయం  గుర్తుకువచ్చింది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అమ్మవారి విశ్వప్రణాళిక లో భాగమే కావచ్చు. కాని వాటికి కారకులైన వారు మాత్రం పాపాలు, పర్వ్యవసానాలు అనుభవించవలసిందే. ఆ లెక్కలు మన ఊహకు కూడా అందదు. 

     ఆలయం మరిన్ని వివరాలు ఇక్కడ వికీపీడియాలో వున్నాయి. చూడండి.

     ఆలయాలు ప్రాగణంలోనే ఒక దర్గా కనపడింది. భక్తులు తక్కువగా వున్నారు. ఇక్కడ  కూడా దర్శనం చేసుకోండి అన్నట్టు నెమలిపింఛాలు ఊపుతూ పిలిచాడు కాని ఎందుకో మనసొప్పలేదు. వెళ్లకుండా వచ్చేసాము. ఈ దర్గా గురించి, దండయాత్ర గురించి కొంత వివరం వికిపీడియాలో వుంది. కావాలంటే ఇక్కడ చదవండి.


     అప్పుడు ఆ దాడులు బయటివాళ్ళు చేసారు అనుకుంటే ఇప్పుడు లోపలివాళ్ళు కొత్తరకాలుగా కొత్త దాడులు చేస్తున్నారు అనిపిస్తుంది. 

     ముహుర్తాలు పెట్టి డెలివరీలు, మద్యం దుకాణాలలో దేవుళ్ళ ఫోటోలు, బార్బర్ షాపుల్లో గాయత్రీ ఉపదేశాలు పాటలు. బాత్రూం లోకి వచ్చి మరీ వినిపించే లౌడు స్పీకర్ల మంత్రాలు ఇవి అని పలకటం కూడా ఇష్టంలేదు.  అవీ ఇవీ అని కాదు కాని అవకాశం చూస్తున్నారు కాని నైతికత చూడటం లేదు. స్వార్ధం చూస్తున్నారు కానీ భాద్యత చూడటం లేదు. నా స్నేహితుడు నెత్తి, నోరు  కొట్టుకున్నా నవమాసాలు నిండకుండానే పెట్టుకున్న ముహార్తానికి (?) ప్రీ-డెలివరీ చేసినట్టు తెలిసింది. పర్యవసానాలు చెప్పనవసరం లేదుకదా అనుభవించేది కొన్ని జీవితాలు, కొన్ని తరాలు. ఈ మధ్యనే పక్క మతంలో కి మారిన మా అన్న పాత స్నేహితుడు ఒకడు హిందూ దేవుళ్లను విమర్శించటం మొదలుపెట్టాడు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఉంటుంది ఇలాంటి వారి యవ్వారం :p.    

     సరే కాంట్రవర్షియల్  విషయాలు మనకెందుకు మన స్థాయిలో మనం వుంది. బ్యాక్ కి రండి

      నవబ్రహ్మ ఆలయాలు అన్నీ చూస్తుంటే ఆలయ ఆవరణలోనే వెనుకగా ఒక దుర్గా వుంది. ఆ వెనక పక్క శ్రీశ్రీశ్రీ కంచి కామాక్షమ్మ అమ్మవారి ఆలయం (బంగారు, వెండి బల్లి దర్శనం) అంటూ ఒక బోర్డు కనపడింది. పూజలు, అలంకరణ అవీ బానే చేస్తూ ఒక పూజారి దంపతులు కనపడ్డారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్నాము. వెండి బల్లి పటం వుంది వారి దగ్గర. కంచిలో ఎలాగో ఇక్కడ కూడా ఆలా ముట్టుకోవచ్చు అని చెప్పారు. ఆలా ముట్టుకుని దర్శనం చేసుకోండి అన్నారు సరే అని అలానే దర్శనం చేసుకున్నాము :). ఇక్కడే ఆలయం పైకప్పు మీద త్రిమూర్తుల బొమ్మలు వున్నాయి, దానికి సంబందించిన కథ, వివరాలు ఏవో చెప్పారు. ఆయన చెప్పినవి విని అవి కూడా అలానే దర్శనం చేసుకున్నాము. అక్కడ ఆలయాల దర్శనం పూర్తిఅవటంతో కొత్తగా నిర్మించిన అమ్మవారి ఆలయంకి దారి ఆ పక్కగానే వుంది. అక్కడ నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళాము. 

     చాలా పెద్ద ఆవరణతో వుంది ఆలయం. ఆలయ ముఖద్వారం వద్ద నుంచి చూస్తే సరాసరి దూరంగా అద్భుతంగా కనిపిస్తుంది. 

     అమ్మవారి గుడిలోపల కాళ్ళు కడుగుకుంటుంటే కోతులు కనపడ్డాయి దాహార్తితో పంపునీళ్లు తాగుతూ అక్కడే తిరుగుతున్నాయి. కాళ్ళు కడుక్కుని అమ్మవారి దర్శనంకి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. దర్శనం పూర్తి చేసుకుని బయట కాస్త తిని పక్కనే వున్న జోగులాంబ వాగు చూసుకున్నాము.       
   
     బయటకు వచ్చి నడుస్తుంటే - పైన ఎండ, కింద తారు రోడ్డు, చెమటతో తడిచిపోతున్న షర్ట్, దాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంటే రోడ్ పక్క రెండు షోడాలు తాగితే కొంచెం ఓపిక వచ్చి పక్కనున్న స్నేహితుడిని నడుస్తూ నీరసించిపోతున్న స్వరంతో, మాట్లాడే ఓపిక కూడా లేని స్వరంతో ఒకటే అడిగాను. 'మనమే ఎందుకు ఇలా' అని.

   మా స్నేహితుడితో జరిగిన దీని తాలూకా సంభాషణ ఏదైనా మొదట పేరాలో చెప్పిన ఆర్థుర్ ఆషే అనుభవంలాగా చివరకు ఒక్కటే మా సంభాషణం ముగింపు. దీనికి భగవంతుడు నిన్ను ఎన్నుకున్నాడు అంతే.  

    సరే అటు తరువాత ఇంకా ఏమైనా ఆలయాలు ఉన్నాయేమో అని చూస్తుంటే ఒక ఆటోతను సంగమేశ్వర ఆలయం ఇంతకు ముందు వున్న ప్రదేశం చూస్తారా అన్నాడు. అంటే ఇపుడు అక్కడ ఆలయం వుందా అని అడిగితే, ఇప్పుడు లేదు నీళ్లు తక్కువ వున్నపుడు మళ్ళీ బయటపడుతుంది. ఇప్పుడు కనిపించదు నీటిలో ములిగిపోయి ఉంటుంది అని చెప్పాడు. దానికి కూడా మూడువందల అడిగినట్టు గుర్తు. సరే అంత దూరంవెళ్లినా అక్కడ ఆలయం ములిగిపోయి ఉంటుంది అని, అప్పటికే అలసివుండటం వల్ల ఇంక వీలుకాదు అని ఇంకేమైనా ఆలయాలు ఉన్నాయేమో అని చూస్తుంటే అప్పుడు దూరంగా కనిపించింది ఒక ఆలయం. 

    ఆలయమే సంగమేశ్వర ఆలయం అని, ముంపుకి గురి అయిన ఆలయం మొత్తాన్ని తీసుకువచ్చి అక్కడ పునర్నిర్మించినట్లు తెలిసివచ్చింది. ఆలయంలో ఒకావిడ వున్నారు. కాసేపు మాట్లాడారు మాతో. ఆ ఆలయమే తన ఇల్లు అని చెబితే ఆశ్చర్యం వేసింది. భగవంతుడిని నమ్మి బతికెయ్యటం అంటే అదే అనిపించింది. మనమూ శరణాగతి చేస్తాము కాని ఒక సమస్య వచ్చిందంటే సమస్యలో కొట్టుమిట్టాడటమే కాని, మనం శరణాగతి చేసాము, మన పక్క ఆ ఈశ్వరుడు వున్నాడు అన్న నిశ్చితం, ఆత్మవిశ్వాసం మాత్రం రాదు. వచ్చినా కాసేపు వచ్చీ పోతూ వుంటుంది. మీరు చెప్పింది తప్పు అంది అని ఎవరైనా ఇది చదివి అంటె, మీరు మెట్టు ఎక్కేసారు అని,  మీలాంటి వారి దర్శనంకి  నేను ఎదురుచూస్తున్నాను అని గ్రహించగలరు. 

     కొంత ప్రాంతం యాష వల్ల, కొంత మెల్లగా మాట్లాడటం వల్ల ఆవిడ చెప్పిన అన్ని విషయాలు అర్థం కాలేదు.ఆలయ దర్శనాదులు అక్కడ ముగించుకుని మెల్లగా బయలుదేరి కర్నూల్ చేరుకున్నాము. 

     కర్నూల్ లో ఒక ఆటో అబ్బాయిని, బాబు మంచి వెజ్ ఆంధ్ర భోజనం హోటల్ కి తీసుకెళ్ళు అంటే ఒక చోట ఆపి, ఇది చాలా బావుంటుంది, ప్రయతించండి అని దింపాడు. ఆ మెస్ పేరు తెలియదు కాని చాలా బావుంది నిజంగా భోజనం. ఎన్నో దశాబ్ధాలుగా  నిర్వహించబడుతున్నట్లు చెప్పారు పద్ధతులు కూడా అలానే వున్నాయి కొంచెం అందుబాట ధరతో పాటు. 

      అక్కడ ముగించుకుని 'అతడు' మూవీలో చూపించారు కదా - కర్నూల్ కొండారెడ్డి బురుజు. అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చూసుకుని అయ్యప్ప స్వామి ఆలయం చాలా బావుంటుంది అని చెప్పారు. అందుకని అక్కడ కూడా చూసుకుని వెళదామనుకునేలోపు ట్రైన్ టైం అవ్వటంతో ఆ తొందరలో స్టేషన్ కి వచ్చేసాము. ఆ మాత్రం ట్విస్టులు, కిక్కులు లేకుండా మన యాత్రలు జరగవు కదా - ట్రైన్ రెండు గంటలు ఆలస్యం. ప్రపంచంలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం  ఇలా ఏ విషయం కలిసి వస్తుందో, రాదో  తెలియదు కానీ మాకు ఆలయాలు, దర్శనాలు పెద్దగా చెప్పాలంటే ఆధ్యాత్మికత అనుకోండి కలిసివస్తాయి. అందుకే 'గుళ్ల బ్యాచ్' అని పేరు పెట్టుకున్నాము మా గ్రూప్ లో మాట్లాడటానికి సరదాగా :).    

      ఆలయం చాలా బావుంది. కింద నవగ్రహ మంటపం, అయ్యప్ప ఆలయం, ఆవరణలో ఎత్తైన విగ్రహాలు, చెట్టుకింద దీపాలు, పై అంతస్తులో వహ్ ! అనిపించేలా అయ్యప్ప స్వామి దర్శనం. మొత్తం దర్శనం బాగా జరిగింది. ఆరోజు చాలామంచి రోజు అని దీపాలు కూడా వెలిగించాము. ఆ బయట పక్కనే శివాలయం కూడా వుంది కాని ఏదో వేదిక నిర్మించినట్టుగా వుంది ఆలయం అంటే బెంగళూరు కెంఫోర్ట్ ఆలయం లాగ అన్నమాట. అక్కడ కూడా దర్శనం చేసుకుని ట్రైన్ సమయం అవ్వటం తో స్టేషన్ కి చేరుకొని ఆనందంగా బయలుదేరి వచ్చేసాము.


                                  కర్నూల్ రైల్వే స్టేషన్ 



















                     అమ్మవారి ఆలయం  కొత్తగా నిర్మించినది అని చెప్పాను కదా ! ఆ ఆలయం






























        ముంపునకు గురియైన సంగమేశ్వర ఆలయాన్ని ఇక్కడకు యదాతథంగా తీసుకొచ్చారు









                                     నిలువెత్తు అభిమానానికి నిలువెత్తు నిదర్శనం


     చంద్రబాబు గురించి అనుకునేరు, సరిగా చూడండి శ్రీ చాగంటి కోటేశ్వర రావు శర్మ గారు



                                                       కర్నూల్ కొండారెడ్డి బురుజు




















      అస్సలు మేకింగ్ కన్నా నా ఫోటో మేకింగ్ (సెల్ఫీస్) ఎక్కువైంది  కదా :)). 

No comments:

Post a Comment