కోట సత్తెమ్మ తల్లి ఆలయంలోకి అడుగు పెడదామనుకొన్నంతలోనే ఎదురుగా నిర్మాణంలో వున్న 9 గదుల రాజ గోపురం దర్శనమిస్తుంది. గోపురం పక్క నుంచి ఆలయంలోకి ప్రవేశించటానికి ధ్వజ స్తంభం దగ్గర నుంచుంటే, కుడి ప్రక్క కాళ్ళు కడుగుకోవటానికి పంపులు కనిపిస్తాయి. అక్కడ కాళ్ళు కడుక్కుని ధ్వజ స్తంభం దగ్గర మ్రొక్కి లోపలకి ప్రవేశించాలి అని అనుకునేలోపుగానే ఒక 9 అడుగుల నల్లరాతి విగ్రహం చాళుక్యుల కాలంనాటిది అదే అమ్మవారు ఎదురుగా ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. 1936 వ సంవత్సరంలో తిమ్మరాజు పాలెం అగ్రహారీకులైన దేవులపల్లి రామ్మూర్తి శాస్త్రి గారి పొలంలో ఆయన పొలం దున్నుతుండగా నాగటి చాలుకి తగిలి బయటపడింది (సీతమ్మ తల్లి ?) అని ఆలయ సైట్ లో పొందుపరిచారు. అమ్మవారి విగ్రహం చూసి ఇంత పెద్ద విగ్రహం చూస్తుంటే మావులమ్మ అమ్మవారు, భీమవరం గుర్తుకు వస్తున్నారు. ఇంత పెద్ద రూపాలు చాలా అరుదు అని స్నేహితుడు మాటల సందర్భంగా చెప్పాడు.
లక్షలాది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవటమే కాదు సంతాన భాగ్యాన్ని కలిగించే అమ్మగా కూడా కొలుస్తారు. ఇక్కడ నైరుతి మూలన వున్న సంతాన వృక్షమే అందుకు సాక్ష్యం. ఇక్కడ క్షేత్ర పాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి. విఘ్నేశ్వరుడు, మేధా దక్షిణామూర్తి, రాజ రాజేశ్వరి అమ్మవారు, కృష్ణుడి విగ్రహాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉచిత ప్రసాద వితరణ చేస్తారు. భక్తులు ఉండటానికి రూములు సదుపాయం కూడా వున్నాయి. దేవాదాయ శాఖ అధీనంలో వుంది. (నేను తల్లి గారి సంవత్సరీకం ఒకరోజు ముందు ఆలయానికి వెళ్ళటం తటస్థించింది. అందుకని ఇంకా సంవత్సరీకం పూర్తికాలేదు అని యథావిధిగా కుటుంబ పురోహితాదేశానుసారం ధ్వజస్తంభం దగ్గరనుంచి దర్శనం చేసుకున్నాను).
అమ్మవారి ఆలయ వివరాలు, చరిత్ర, ఉత్సవాలు, సంతానార్ధులు పాటించవలసిన విధి విధానం, ఇతర వివరాలు అంతర్జాలపు లంకెలలో అత్యద్భుతంగా వివరించారు. అందుకని తలా,తోకా లేకుండా రాసిన నా రాతల అశక్తతను మన్నించి క్రింద లంకెలు చూడగలరు :).
ఆలయం వారి సైట్
అంతర్జాతీయ తెలుగు వార్తా వేదిక వారిది
వికిపీడియా
ఆలయ రాజ గోపురం నిర్మాణ విషయమై అకౌంటెంట్ వారు అనుకుంట, వారి కార్యాలయంలో కలిసి మాట్లాడాము. ఆయన అకౌంట్ వివరాలు ఇచ్చారు. ఎవరైనా ఆసక్తి వున్న దాతలు ఈ కార్యం నిమిత్తం పాటు పడాలి అనుకుంటే మీ మీ మొత్తాలను ఆన్లైన్ లో వారికి పంపవచ్చు కాకుంటే తప్పని సరిగా వారి నెంబర్ కి ఒక మెసేజ్ / కాల్ చెయ్యండి. అప్పుడు బ్యాంకు మొత్తానికి, వారి అకౌంట్ కి మొత్తాలు తేడా రావు అని చెప్పారు. అందుకని మొత్తం వేసాక ఒక మెసేజ్ / కాల్ చెయ్యగలరు.
ఫొటోస్ లలో అకౌంట్ డీటెయిల్స్ పెట్టాను చూడగలరు. దేవాలయ నిర్మాణం వంటి వాటిలో పాలు పంచుకోవటం, తద్వారా గడించే పుణ్యం వంటి విషయాలను వర్ణించలేము. భావనా మాత్రం చేతనే జీవితాలు ధన్యం అవుతాయి అని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. వుంటాను.