Tuesday, October 31, 2017

ఓంకార్ హిల్స్, బెంగళూరు, కర్ణాటక


ఒకరోజు లోకల్ ట్రిప్ ఏమైనా ఉన్నాయేమో అని గూగులమ్మని అడిగితే ఓంకార్ హిల్స్ తో పాటు ఇంకొన్ని ఫలితాలను చూపించింది. సరే అని నేను, నా స్నేహితుడు రివ్యూలు అవీ చూసి ఇక్కడకి వెళ్ళాలి అని నిశ్చయించుకుని 'ఓలా' బుక్ చేసుకుని ఒకరోజు పొద్దునే బయలుదేరాము. 

సాధారణంగా కొన్ని, కొన్ని గుడులలోను కాశీ విశ్వేశ్వర లింగము అని, లేకపోతె ఫలానా మూర్తి అని ప్రతిష్టిస్తారు. మనం చూసినట్లతే 'బ్రహ్మకుమారీస్' కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలోనూ, లేకపోతే పండగలప్పుడు జ్యోతిర్లింగాల దర్శనం అని గానీ, మరొకటి గానీ అని చెప్పి అక్కడ ఆలయాలులాగా పెడుతుంటారు. ఏదో సెట్టు / నమూనా ఆలయం లాగ కనిపిస్తుంటుంది. రిప్లికేషన్ లేదా ప్రతీక అని చెప్పుకోవచ్చునేమో అవి. నిజంగా కాశీ విశ్వేశ్వరుడో లేకపోతే నిజంగా జ్యోతిర్లింగాలు కావుకదా అన్నట్టు నా బోటివాడికి దర్శనానికి వెళ్లాలంటే కొంత నిరాసక్తంగా ఉంటుంది. కానీ ఓంకార్ హిల్స్  కి వెళ్ళాక నా అభిప్రాయంలో కొంత మార్పు చోటు చేసుకుంది. అదేమిటంటే ...

ఓంకార్ హిల్స్ బెంగళూరు లో వున్న ఒకానొక హైయెస్ట్ పాయింటు అని చెప్పవచ్చు. ఇది సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో వుంది. ఇక్కడ మత్స్య నారాయణ స్వామి ఆలయం వుంది. పక్కన ఒక భవనం అందులో శివుడి స్పటిక లింగం వుంది.  వెనుకాల గణపతి, ఆ పక్కనుంచి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లితే వనదుర్గా అమ్మవారు అనుకుంటా ఒకచెట్టు కింద దర్శన మిస్తారు. అక్కడే మత్స్య నారాయణ స్వామి ఆలయం వుంది. క్లాక్ టవర్ కూడా వుంది. ఇంక ఆలయం వారు నిర్వహించే గోశాల, వేద పాఠశాల ఉండనే వున్నాయి. మెయిన్ రోడ్ మీద నుంచి లోపలకి వచ్చే రోడ్ అంత బాలేదు. అది తప్ప మిగతా సౌకర్యాలు అన్నీ కూడా బానే వున్నాయి.

ఓంకార్ హిల్స్  రాజరాజేశ్వరి నగర్ లో వుంది. మేము ఆలయంకి బయలుదేరినప్పుడు వాతావరణం చాలా చల్లగా వుంది. ఆలయం దగ్గరలోకి వచ్చేసరికి చాలా ఆహ్లాదకారమనిపించింది. ఇప్పుడు ఇది రాస్తున్నప్పుడు కూడా అలానే వుంది :). 

వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆలయం చేరుకున్నాము. భక్తులు కొంచెం పల్చగా వున్నారు. ఆలయంకి చేరుకొని సేవలు గురించి ఆరా తీస్తే అభిషేకం వుంది అని తెలుసుకున్నాము. 

అభిషేకానికి కొంచెంసేపు నిరీక్షించాక మొదలు పెట్టారు. ఆలయం ఎదురుగా ఓంకారేశ్వరుడు దర్శనమిస్తే మిగతా పక్క  ఉపాలయాలు వున్నాయి. మొత్తం జ్యోతిర్లింగాలు వుపాలయలో దర్శమిస్తాయి.

ప్రతీ చోటా పూజ చేసారు. చాలా బాగా జరిగింది. పూజ, అభిషేకాలు అయ్యాక, నేను ఒక పంచముఖి రుద్రాక్ష వెండిలో పొదగబడింది నలభై రూపాయలు అంటే తీసుకున్నాను. అభిషేకం జరుగుతున్నపుడు పైన ఏ స్వామి పేరా అని చూస్తే శ్రీశైల మల్లికార్జునుడు అని కనడింది. ఆహా ఫలానా గుళ్లో అభిషేకం చేయిస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన రావటంతోనే ఇలా జరిగిపోతే ఎలా ఉంటుందో, ఆ రోజు అభిషేకంలో స్వామి పేరు చూడగానే అలా అనిపించి సంతోషం వేసింది.   

మిగతా సేవలు కూడా కనుకున్నాము. రాబోయే అయిదు సంవత్సరాలలో కోటి లింగముల స్థాపన ప్రాజెక్ట్ గురించి చెప్పారు.  వాళ్ళు  కోటి లింగాలలో ఉపయోగించేవి బాణా లింగాలు అనుకుంటా. సైజు చిన్న, చిన్నవిగా వున్నాయి. అవి ఒక పెద్ద శివలింగంలో వరసగా పైనుంచి, కిందకి పేర్చి పెద్ద లింగాన్ని ప్రతిష్టిస్తారు అన్నట్టు చెప్పారు. చాలా పెద్ద ప్రాజెక్ట్. కోట్లతో ముడిపడి వున్న ప్రాజెక్ట్. 

మా వాడి కల ఒక శివలింగ ప్రతిష్టాపన చెయ్యాలని. పోనిలే అక్కడ సదుపాయం వుంది అంటే అక్కడ మాములుగా మనం చూసే లింగాలు కాదు. అది కూడా 5  సంవత్సరాల పైన టైం పట్టవచ్చు అన్నారు. మొత్తానికి వాడొక మూడు రాయిస్తుంటే, నేను చేయించాలా వద్దా అని ఆలోచన చేస్తుంటే నాకు ఒక పాజిటివ్ సూచన భగవంతుని నుంచి వచ్చింది. ఇంక ఆయనే చెప్పాక నేను ఆలోచించేదేముంది అని అనుకుని నేను కూడా ఒకటి రాయించా.  

ఆ తరువాత ప్రాగణంలో వున్న మిగతా ఆలయాలు చూసుకుని, మాగడి రంగనాథ స్వామి ఆలయం చూసుకుందామనుకుంటే క్యాబ్ సర్వీసెస్ లేవు, అవి సిటీ బయట అన్నట్టు చూపించటంతో, అవుట్ స్టేషన్ బుక్ చేసుకోవటం తప్ప మరో మార్గం లేదు అప్పటికే అభిషేకం, పూజలు జగటంతో ఆరోజుకి మా యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసాము. 

మత్స్య నారాయణ స్వామిని దర్శించుకోవడం ఏలినాటి శనితో బాధ పడుతున్నవారికి ఒక మంచి ఉపశమనం, చాలా మంచిది అన్నట్టు మా స్నేహితుడు వస్తూ ఉంటే చెప్పాడు.

రెండు లింకులు దొరికాయి ఇవి చూడండి. 

http://omkarhills.org/

http://www.bengaloorutourism.com/omkar-ashram-hills.php










































Sunday, October 29, 2017

తిరుమల వేంకటేశ్వర స్వామి అనుగ్రహం - అంగ ప్రదక్షణ అనుభవం


చాలా క్షేత్రాల గురించి కొద్దోగొప్పో అనుభవాలు పంచుకున్నానుగానీ అదేంటో తిరుమల గురించి ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోతున్నా అనే కొంచెం వెలితి మనస్సులో ఎక్కడో  ఉండేది. అది ఈ పోస్ట్ తో తీరుతుంది అని భావిస్తున్నా. 

"వేం" నానావిధములైన పాపములను,
"కట" అంటే 'కట్' లేదా నాశనం చేయుట, "అచలం" కొండ. 

అర్థం అయింది కదా ! మన పాప రాశిని ధ్వంసం చేసి, మనలని విముక్తి చేసే క్షేత్రమే ఆ వేంకటాచలం.  అసలు ఆ వేంకటాచలం గురించి చెప్పాలన్నా, ఆ వేంకటా చలపతి గురించి చెప్పాలన్నా, రెండు, మూడురోజులు బస చేసి మరీ అనుభవాలతో సమగ్రంగా రాయాలి అనిపించేది. కానీ తిరుమల గురించి స్థలపురాణం, భగవంతుని విశేష సన్నిధానం గురించిన సమాచారం, విభూతులు, భక్తుల అనుభవాలు, చరిత్ర, వర్తమానం అబ్బో ఒకటేమిటి అదొక పరిశోధక గ్రంధాన్నే మించిపోతుంది అని అనుభవంలో తెలిసి ఏదో ఒకటి, రెండు అనుభవాలను పంచుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ రాయబడింది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల తరువాత తిరుమల వెళ్లటం వల్ల తిరుమల దాదాపు గుర్తుపట్టగలగనంతగా మారిపోయింది.

బెంగళూరు నుంచి ఇంటర్సిటీ ఎక్ష్ప్రెస్స్ పట్టుకుని తిరుపతి బయలుదేరాము. 2S / CC  అని కూర్చోటానికి ఉంటాయి. మేము బడ్జెట్ లో 2S బుక్ చేసుకుని వెళ్ళాము. ఏదో సిమెంట్ చప్టా మీద కూర్చుని వెళ్లినట్టు వుంది. మీరు వెళ్ళితే డబ్బులకి వెనకాడకుండా CC బుక్ చేసుకోండి. అందులో AC ఉంటుంది అంతేకాక సీటింగ్ కూడా చాలా బాగుంటుంది అని విన్నా. 

మేము స్టేషన్లో దిగి, అక్కడే వున్న తిరుమల బస్సు పట్టుకుని తిరుమల కొండ పైకి చేరుకున్నాము. బస్సు స్టాప్ లో దిగి సి.ఆర్.ఓ ఆఫీస్ కనుక్కుని వెళ్ళాము. అక్కడ అద్దె గదులు ఇచ్చే కౌంటర్ ఉంది, అక్కడ అప్పటికప్పుడే తీసుకోవచ్చు అని. అక్కడ రిజిస్టర్ చేసుకుంటే గది ఇస్తే మనకి మెసేజ్ వస్తుంది. ముప్పయి నిమిషాలలోపు గదికి చేరుకొని డబ్బులు చెల్లించాలి అన్నట్టు తెలిసింది. ఒక పక్క ఎండ మండిపోతుంది. ఆలయం వారు, వచ్చిన భక్తులకు అక్కడ పక్కగా ప్రసాద వితరణ చేస్తూ కనపడ్డారు. వేడి వేడి టమాటా రైస్ అనుకుంట. నా జీవితంలో అంత రుచి ఎప్పుడూ చూడలేదు అనిపించింది అస్సలే నాకు జాబ్ లేదేమో ఇంకా రుచిగా వుండి ఆవురావురు మనుకుంటూ తిన్నాము. 

రూమ్ కోసం పెద్ద లైన్ ఉంది. ఇంక అక్కడ అవ్వదు అనుకుని పక్కన వున్న సి.ఆర్.ఓ ఆఫీస్ లో ఏమైనా సేవలు దొరుకుతాయేమో అని ప్రయత్నిస్తే ఒక యాభయి సుప్రభాతం టికెట్స్  వున్నాయి అవి కూడా సాయంత్రం 5 వరకు ఇచ్చి వచ్చినవారిలో లక్కీ డిప్ తీసి ఎవరికి వస్తే వారికి ఇస్తాము. 6  గంటల తరువాత మెసేజ్ వస్తుంది. వచ్చాక వెంటనే 15 -౩౦ నిమిషాలలో రిపోర్ట్ చెయ్యండి అని చెప్పారు. సరే అని ఆధార్ ఇచ్చి రిజిస్ట్రేషన్ టోకెన్ తీసుకున్నాము. ఇక అక్కడ అయ్యాక ఇంక అంగ ప్రదక్షిణ వివరాలు కనుక్కోవడానికి బయలుదేరాము. 

అంగ ప్రదక్షిణ టోకెన్స్  ఇచ్చే ఆ కౌంటర్ ఆ పక్క  భవనం క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్స్  ఇస్తారు అని చేప్పారు. రోజుకి 750  టికెట్స్  అనుకుంటా. ఒక్క శుక్రవారం మాత్రం అంగప్రదక్షిణ సేవ ఉండదు కాబట్టి ముందురోజు టికెట్స్ ఇవ్వరు. ఎందుకంటే టోకెన్స్  ఒకరోజు ముందు ఇస్తారు కాబట్టి. అంటే ఈరోజు అర్థ రాత్రి ఒకటికి / రెండుకు రిపోర్టింగ్ ఉంటే మనం ఈరోజు మధ్యాహ్నం టోకెన్ తీసుకోవాలి అన్నమాట. ఇక్కడ కూడా ఆధార్ ఉండాలి. ఆధార్ పెట్టాక లోకల్ వాళ్ళు  గొడవ చేస్తున్నారు అన్నట్టు తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి తమ గుడి అన్న భావన సహజంగా ఉంటుంది కదా ! మిగతా వాటితో పోల్చుకుంటే అంగ ప్రదక్షిణ సేవ గురించి ఎక్కువమందికి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆధార్ వల్ల ఒకసారి అంగ ప్రదక్షిణ చేసుకుంటే మళ్ళీ  ఒక నెల వరకు అవకాశం ఇవ్వరు. ఇంక ఐతే అక్కడ కావలిసినవి ఆధార్ లేకపోతే ఒక్క పాస్పోర్ట్ మాత్రం ఒప్పుకుంటారు. ఆన్లైన్ లో ఐతే వీటిలో ఒకటి ఖచ్చితంగా కావాలి. ఆ వివరాలు అవి తెలుసుకుని నేను అంగ ప్రదక్షిణ టోకెన్ తీసుకున్నాను. అంగ ప్రదక్షిణ టోకెన్ వస్తే ఇంక దర్శనం వచ్చినట్టే (స్వామి దయ వున్నట్టే). సుప్రభాత సేవ లక్కీ డిప్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే నాకు పాజిటివ్ సూచనలు వస్తున్నాయి కానీ వేరే, కొంచెం చిత్రంగా డీకోడ్ చేసేలాగా సూచనలు రావటం లేదు. తిరకాసుగా వుంది కానీ పాజిటివ్ అని ఐతే అనిపించింది. ఆ తరువాత డీకోడ్ అయ్యాక క్లియర్ పిక్చర్ వచ్చింది. అవేమిటో చెప్పే ముందు కొంచెం సేవలు గురించి నాకు తెలిసింది చెప్తాను వినండి.  

సేవలు సింపుల్ గా చెప్పాలంటే తిరుమల ఆలయంలో స్వామిని సర్వ  దర్శనం (కాలి నడకన వచ్చేవాళ్ళు), ప్రత్యేక దర్సనం (౩౦౦ రూపాయల టికెట్ - పంచె కట్టుకుని రావాలి కచ్చితంగా). ఇవి స్వామిని దూరం నుంచి దర్శనం చేయించి పంపించేవి.

రెండోవి లోపలకి తీసుకు వెళ్లి చేయించేవి (సుప్రభాతం / తోమాల / అష్టదళ పాద పద్మారాధన / అర్చన వంటివి). ఇప్పుడు ఈ సేవలకు లక్కీ డిప్ అమలు చేస్తున్నారు. ప్రతినెలా మొదటి శుక్రవారం  బుకింగ్ మొదలుపెడతారు. వారం రోజులు ఛాన్స్  ఇస్తారు. వారం రోజులలో మనం అన్నీ లేదా ఏదో ఒక సేవ ఎంచుకోవచ్చు. వారం తరువాత లక్కీ డిప్ లో మన పేరువస్తే మెసేజ్ వస్తుంది. అప్పుడు రెండు రోజులలో సేవా రుసుము చెల్లించాల్సి  ఉంటుంది. ఒకవేళ ఆలా చెల్లించని టికెట్స్  ఉంటే వాటిని మళ్ళీ లక్కీ డిప్ వేస్తారు అన్నమాట. సాధారణంగా సేవల టికెట్స్  నాలుగు నెలల ముందుగానే విడుదల చేస్తారు. ఇపుడు ఉదాహరణకి ఫిబ్రవరి, 2018 టికెట్స్ కి నవంబర్, 2017 మొదటి శుక్రవారం ౩వ తేదీనాడు బుకింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి వారంలోపు మనం రిజిస్టర్ చేసుకోవాలి. లక్కీ డిప్ లో వస్తే ఫిబ్రవరిలో సేవకి అవకాశం కల్పిస్తారు. ఒక్క సేవ మాత్రమే ఇస్తారు. మళ్ళీ  ఆరు నెలలు వరకు ఇవ్వరు. కల్యాణోత్సవం / బ్రహ్మోత్సవం వంటి సేవలు వున్నా కూడా ఎక్కువ పోటీ ఉండదు వీటికి ఎందుకంటె ఆ సేవ ప్రధాన ఆలయం వెలుపలే ఉంటాయి. అవి పూర్తి అయ్యాక మిగతా భక్తుల వలె వేంకటేశ్వర స్వామిని బయట నుంచే దర్శనం చేపించి పంపేస్తారు కాబట్టి. ఆలయం లోపల ద్వారాలలోకి పంపరు. ఒక అవగాహన ప్రకారం సుమారు 6 వేల టికెట్స్ కు 80  వేల మంది రిజిస్టర్ చేసుకుంటారు. కాబట్టి సేవ అనేది పూర్తిగా ఆ తిరుమల స్వామి సంపూర్ణ అనుగ్రహం మేరకే అన్నది గుర్తుపెట్టుకోవాలి. 

ఇంతకు ముందు సేవలు తత్కాల్ తరహాలో ఉండేవి. ఎవరి ఇంటర్నెట్ కనెక్షన్ బాగుంటే వాళ్ళకి వచ్చేవి. అందుకే ఆ సిస్టం తీసివేసి లక్కీ డిప్ పెట్టారు. ఇది బావుంది. పాపం 2g /3g లు వాడేవాళ్లు కూడా స్వామి భక్తులే కదా మరి :). అందరికీ అవకాశం ఉండాలి కదా మరి ! 

సేవలు, గదులు మిగతా వివరాలు కావాలంటే టి. టి. డి. వాళ్ల సైట్ చూడండి. 
https://ttdsevaonline.com/

తిరుమల న్యూస్ గురించి కావాలంటే అంటే నిన్న ఎంత మంది స్వామి వారిని దర్శించుకున్నారు, భక్తుల రద్దీ, కార్యక్రమాలు కావాలంటే ఈ సైట్ చూడండి. 
http://news.tirumala.org/

గూగుల్ ప్లేస్టోర్ ఐతే గోవిందా అని యాప్ వుంది. చూడగలరు. 

వరాహ స్వామి దర్శనం తరువాతనే వేంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి అని చాగంటి కోటేశ్వర రావు గారు తమ ప్రవచనాలలో  తరచుగా చెబుతుంటారు. క్షేత్ర దర్శన సంపూర్ణ ఫలితం కలగాలి అంటే మనం క్షేత్ర నియమాలు పాటించాల్సిందే. ప్రత్యేక పరిస్థితులలో తప్ప మినహాయింపులు వుండవు అని నేను అనుకుంటున్నాను. 

వరాహస్వామి ఆలయం, తిరుమల ప్రధాన ఆలయానికి ఉత్తరాన వున్న పుష్కరిణి పక్కగా ఉంటుంది. పుష్కరిణి, ప్రసాదం ఇచ్చే కౌంటర్లు దగ్గరే కదా ఉండేది. ముందు పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకుని, ఆ తరువాత తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. 

ఇక్కడ వున్న పుష్కరిణి కూడా మాములు పుష్కరిణి కాదు. మహా మహిమోపేతమైనది. సరస్వతి దేవి గంగ కంటే పవిత్రంగా మార్చాలి అని మహోగ్ర తప్పస్సు  ఫలితంగా కొంచెం మార్పుతో భూమి మీద వున్న సరస్సులన్నిటికన్నా పవిత్రమైనదానిగా వరం పొందబడిన పుష్కరిణి ఇది. అందుకే తప్పనిసరిగా మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ పుష్కరిణి లో స్నానం చేసి వరాహ స్వామిని దర్శనం చేసుకుని అక్కడనుండి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. 

ఇక మేము సాయంత్రం 6 గంటలకి లక్కీ డిప్ మెసేజ్ వచ్చేలోపు పుష్కరిణిలో స్నానం చేసుకుని వరాహస్వామి దర్శనం చేసుకుందామనుకుని సంకల్పం చేసుకుని పుష్కరిణి చేరుకున్నాము. 

నిజంగా వైదిక క్రియలన్నిటికి గోచిపోత పోసుకోవాలి అదే గోచి కట్టుకోవాలి అని చాగంటి వారు చెబుతుంటారు. గోచి కాకపోయినా మనం కనీసం పంచె అయినా కట్టుకోవాలి అని పంచెతోనే పుష్కరిణి స్నానం చేసాము. చెప్పాలంటే శాస్త్రం ప్రకారం మూడు మునకలు వేసాము అనటం సరిగ్గా ఉంటుంది. ఆ తరువాత పంచెలు ఆరబెట్టుకుని, ఒకరు తరువాత ఒకరం వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. ఈలోపు లక్కీ డిప్ లో సెలెక్ట్ కాలేదు అన్న మెసేజ్ వచ్చింది. స్వామి పాజిటివుగానే అవుతుంది అని చెప్పాడే మరి ఇలా ఎందుకయింది అని ఆలోచనలో బడ్డాను. వెనుక జేబులో చిన్న చూపుతో పెట్టుకున్న అంగ ప్రదక్షిణ టోకెన్ పెద్ద మనస్సుతో కనపడి మన అహంకారం బీటలు వాడింది అని చెప్పింది. సరే అని అక్కడ దర్శనాలు పూర్తి చేసుకుని యాత్రా సదన్ కు   చేరుకున్నాము. 

ఇక్కడ ఉండేది హాలు కాబట్టి ఎవరికి వారు వచ్చి పడుకుంటున్నారు. సామాను భద్రపరిచే గది, టాయిలెట్స్, స్నానపు గదులు అన్నీ వున్నాయి ఇక్కడ. అస్సలు ఇలాంటివే ఇంకొన్ని పెడితే సరిపోతాయి అనిపించింది నాబోటి వారి కోసం. చాపలు లేవు ఇక్కడ. అందువల్ల భక్తులు దుప్పట్లు తెచ్చుకున్నవారు మినహా, మిగతావారు నేలమీద పడుకుని ఇబ్బంది పడుతున్నారు.    

మేము ఇంక రిపోర్ట్ చేసే సమయం దగ్గర పడింది అని రాత్రి 11:30 కల్లా బయలుదేరాము. 

వైకుంఠం 'Q' కాంప్లెక్స్ దగ్గర సుప్రభాతం అని, అంగప్రదక్షిణ అని లైన్స్ వున్నాయి. ఐతే అంగప్రదక్షిణ వాళ్ళు  తప్పనిసరిగా తడిబట్టలతోనే లైన్ లోకి రావాలి. తడి బట్టలతో అంటే పంపు కింద చెయ్యమని కాదు. పుష్కరిణిలో స్నానం చేసి రావాలి అని. మేము అంతకు ముందు సాయంత్రం చేసాము అండి పరవాలేదా ! అని అక్కడ వున్నవాళ్ళతో అడిగితే వాళ్ళు , లేదండి లైన్లోకి వచ్చేముందు పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే రావాలి, తనిఖీ కూడా చేస్తారు అని స్పష్టంగా చెప్పినట్టు గుర్తు. 

మాములుగా ఐతే వరాహస్వామి గుడి పక్కకు వెళ్లి పుష్కరిణి స్నానం చెయ్యాలి. మిగతా గేట్లు ఎక్కడా తెరచి వుండవు. కానీ, ఆ సమయంలో ప్రధాన ఆలయం పక్కన వున్న గేట్ తెరిచి వుంచారు . అది అంగ ప్రదక్షిణ / ఆ సమయంలో పుష్కరిణి స్నానం చేసేవారి కోసం చేసిన ఏర్పాటులాగా వుంది. నిజంగా చాలా సమయం, ప్రయాస తగ్గిపోయింది. నిర్వాహకులు (?) చేసిన చాలా మంచి పని అనిపించింది. మన ఇమ్మ్యునిటీ పవర్ తెలిసిందే కదా ! సంకల్ప శక్తే కానీ శారీరక శక్తి లేనివాళ్ళము. తింటే గాని పూజకు సహకరించని శరీరాలు :p (నా బోటి వాళ్ళ గురించి చెప్తున్నా :) ) 

సరే అక్కడ ముగించుకుని సమయం దగ్గర పడుతుంది అని పరుగుపరుగున సుపథం వాళ్లు రిపోర్ట్ చేసే స్థలం దాటుకుంటూ షార్ట్కట్ లో వైకుంఠం 'Q' కాంప్లెక్స్ చేరుకున్నా. అప్పటికే మా వాడు సుప్రభాతం 'Q' లైన్ లోకి వెళ్ళిపోయాడు. నేను మా లైన్ లోకి వెళ్లాను. ఇక్కడ ఒక గమనిక - ఒక్క అంగప్రదక్షిణ వాళ్ళకే తడిబట్టల నియమం. మిగతా సేవల వాళ్ళకి లేదు తడిబట్టల నియమం లేదు కానీ పంచె కట్టుకోవాలిసిందే. అదేదో పెద్ద బ్రహ్మ విద్య  అనుకోకండి. జస్ట్ తువ్వాలు / లుంగీలాగా కట్టేసుకోవటమే. తక్కువ చెయ్యాలి అని నా ఉద్దేశ్యం కాదు గాని ఈ ఒక్క కారణంతో మా రూమ్మేట్ ఒక బెంగాలీ బాబు బుక్ చేసుకుని  చివరి నిమిషంలో తెలిసి వెళ్ళటమే మానేసాడు. వున్న పాపాలు చాలవన్నట్లు ఇవొకటి మధ్యలో. అందుకే పెద్దలన్నట్లు ఒక్కోసారి ఏదైనా చెప్పాలన్న ఎలా తీసుకుంటారో అని భయంతో చెప్పాలా వద్దా అనే ధర్మ సందేహంలో పడిపోతాము.  

అస్సలు విషయం చెప్పలేదు కదా ! అస్సలు ఈ ట్రిప్ మొదలవ్వటానికి కారణం - మా వాడికి సుప్రభాతం సేవ రాబట్టే. ఎవరూ తోడు లేరనిపించి, నాకు కూడా ఒకసారి దర్శనం అందుతుందేమో అని భావించి బయలుదేరాను. సర్వ , ప్రత్యేక, సుప్రభాత అస్సలు ఏ దర్శనానికి అవకాశం లేక చివరి ప్రయత్నంగా అంగ ప్రదక్షిణ దర్శనం అనుకున్నా గానీ, అంగ ప్రదక్షిణ సేవ మాత్రం అద్భుతం అని చెప్పవచ్చు.

అంగప్రదక్షిణ సేవ లైన్, ఒక గంట నిరీక్షణ తరువాత వదిలారు. కంపార్ట్మెంట్ లోపల ఒక 20-30 నిముషాలు నిరీక్షించాము. తరువాత ప్రధాన ఆలయం దగ్గర మిగతా సేవల వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా లోపలకి తీసుకుని వెళ్లి అంగ ప్రదక్షిణ చేయించారు.

అక్కడ పడుకుని గిరా గిరా అంగ ప్రదక్షిణ చేస్తుంటే, ఒక పక్క స్వామి నామం చెబుతూ మరో పక్క  ఆ అనుగ్రహానికి పొంగిపోతూ, ఆలయ స్పర్శ  ఒళ్ళంతా తడుముతుంటే, ఒంటికేదొ ఒక దివ్యత్వం వస్తునట్లు, మురిసిపోతూ, మైమరచిపోతూ, వాహ్! ఆ అనుభూతి చెప్పేది కాదు అండి జీవితానికో శివరాత్రి అంటారు కదా ! అలా వుంది. చాలా అద్భుతమైన అనుభవం. 

ఆ తరువాత ఒక గుడి లోపల నుంచి ఒక ప్రదక్షిణలాగా పంపించి ఈసారి స్వామి దర్శనం కోసం ఒక లైన్ లో పెట్టారు. ఈలోపు సుప్రభాతం వారికి దర్శనాలు చేపించినట్లు వున్నారు. లైన్ లో వున్న మాకు తోమాల సేవ జరుగుతున్నట్లు తెలిసింది. ఆ తరువాత మాకు స్వామి దర్శనం చేయించి ఒక చిన్న లడ్డు ప్రసాదం చేతిలో పెట్టారు. అవి అంతకు ముందు మాలో కొందరికి మోసే అదృష్టం పట్టింది. స్వామి కార్యం అంటే హనుమంతులవంటి వారే సై అంటే ఇంక మన బోటి వాళ్లు యెగిరి గంతు వెయ్యాలి. 

నా జీవితంలో ఒక పది రూపాయలు అద్భుతంగా వినియోగించిన సందర్భం ఏదైనా వుంది అంటే అంగ ప్రదక్షిణ సేవ అని నిశ్చయంగా చెప్పగలను. ఎందుకంటే అంగ ప్రదక్షిణ, స్వామి దర్శనం, ఒక చిన్న లడ్డు ప్రసాదం, కౌంటర్లో కూడా ఒక లడ్డు ప్రసాదం ఇచ్చారు. అన్నింటికీ కలిపి అంగ ప్రదక్షిణ టికెట్ వెల పదు రూపాయలు మాత్రమే. పదికే ఇవ్వన్నీ. మనకి జాబ్ లేదు అన్న విషయం ఆయనికి తెలిసిందే కదా ఎందుకంటే అయన 'సర్వజ్ఞః'.    

అక్కడ దర్శనం అయ్యాక, నేను మా స్నేహితుడు ప్రసాదం కౌంటర్ దగ్గర కలిసుకున్నాము. ప్రసాదం స్వీకరించి అక్కడ నుండి బసకి బయలుదేరాము. 

చెప్పడం మరిచాను ఆర్.టీ.సి. వాళ్ళు  తిరుమల ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారు. 300 టికెట్ తో కలిపి. మీకు టికెట్ దొరకనప్పుడు ఇంక స్వామిని చూడాలిసిందే అనుకున్నపుడు ఆ ఆప్షన్ కూడా ట్రై చెయ్యండి అని నా మనవి. 

మొత్తానికి ఆ ఏడుకొండలవాడి దయతో మా యాత్ర పూర్తి అయి బెంగళూరుకు వచ్చేసాము.  

నోట్: అంగ ప్రదక్షిణ సేవకి పంచె కట్టుకుంటేనే అనుమతిస్తారు. పాస్పోర్ట్ / ఆధార్ రిజిస్ట్రేషన్ టైములో కావాలి. సేవ సమయానికి రిపోర్టింగ్ 'క్యూ' లో అవసరం లేదు. టోకెన్ ఒకటి సరిపోతుంది. నేను డబ్బులు, ఆధార్ అవీ తీసుకుని ఒక కవర్ లో పెట్టుకుని వెళ్ళాను. అంగ ప్రదక్షిణ టైంలో కవర్ తో పాటు అంగ ప్రదక్షిణ చెయ్యాల్సి  వచ్చింది :). 

కొసమెరుపు చెప్పలేదు కదా !  అదేమిటంటే కింద ఫోటోలలో వున్న మబ్బులలో మా స్వామి పని మీద వెళుతున్న ఆంజనేయ స్వామి కూడా, మా స్వామితో పాటు వున్నాడు. చూసుకోండి మరి. వుంటాను :).

రవి ప్రకాష్