Wednesday, January 24, 2018

తిరుచెందూర్ సుబ్రహ్మణ్యుని, కన్యాకుమారి భగవతి మరియు అనంతపద్మనాభుల దర్శనములు

జ్ఞానసంబందర్ పసివాడుగా వున్నపుడు ఒకానొక సందర్భంలో జ్ఞాన సంబందర్  తండ్రి తనని గట్టున ఉంచి స్నానానికి వెళ్ళితే జ్ఞాన సంబందర్ ఆకలిగొని పాలకై ఏడుస్తాడు. అది చూసిన పరమేశ్వరుడు ఆకీటబ్రహ్మజనని అయినా అమ్మవారిని పసిపిల్లవాడు పాలకై ఏడుస్తుంటే చూస్తావేం స్థన్యం ఇవ్వమని చెబుతాడు. విశ్వజనని అయిన అమ్మవారు ఆశ్చర్యంతో స్థన్యం తీసుకున్న మరుక్షణం ఆ పిల్లవాడికి విశ్వ మాయ తొలిగిపోయి శివజ్ఞానం వచ్చేస్తుంది కదా అని అంటుంది. పరవాలేదన్న తన స్వామి ఆదేశంతో పాలకై ఏడుస్తున్న బిడ్డకి పాలు పడుతుంది. ఇక ఆ తరువాత జ్ఞాన సంబందర్ అరవై మూడు మంది నాయనార్లలో ముఖ్యుడిగా స్థానము పొంది, ఎంత గొప్ప జ్ఞాని, శివ భక్తుడు తమిళ శైవ భక్తి సాహిత్యంలో ఎలాంటి ముద్ర వేశాడో చెప్పనవసరం లేదు అనుకుంటా !!!

   సుదీర్ఘ నిరీక్షణ తరువాత దర్శనమయ్యే క్షేత్రాలు, దైవ దర్శనాల విషయం పరికించి చూస్తే కర్మ విషయం అవగతమవుతుంది. మనకున్న కర్మ బంధాలు, అడుగు ముందుకు పడకుండా వెనక్కి  లాగే పాప కర్మలు, విసిగి వేసారి చివరి ప్రయత్నం కూడా చేసి ఇంక మనవల్ల కాదు దర్శనం చేసుకోవడం అని నిశ్చయించుకుని మానేసిన పుణ్య క్షేత్రాలు / గుడులు లేక మరొకటో ఇదే విషయాన్ని సూచిస్తాయి.కాని అదే కర్మ బంధాలు తాడు కట్టి తెచ్చి పడినట్టు సమయం వచ్చినపుడు వాటికవే ప్రేరణ ఇచ్చి దర్శనం చేయించటం కర్మ సూత్రంగా, దైవ అనుగ్రహంగా భావించవచ్చు.

    తిరుచెందూర్ దర్శించాలి అని భగత్ ప్రేరణ పొంది, అనేక అడ్డంకుల నడుమ రమారమి 2 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత దర్శనం అయినప్పుడు నా మానసిక స్థితి కూడా అదే. ఒకసారి ఫ్లైట్, బస్సు  బుక్ చేసుకున్న తరువాత వెళ్లే వీలు పరిస్థితిలో నెట్టబడి డబ్బులు కూడా నష్టపోయినప్పుడు కర్మ ఎంత బలమైనదో అనిపించింది. ఒక్క అడుగు వేస్తే మాయ తొలిగిపోతుంది అన్న పరిస్థితి నుండి మాయలోకి పూర్తిగా నెట్టబడటం మాయ రూపంలో అమ్మవారు చేసే వింత లాగా అన్నమాట.  

    సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఎట్టకేలకు నాపై  ప్రసరించి నేను దర్శించవలసిన ఆఖరి క్షేత్రం ఆరుపడైవీడు క్షేత్రాలలో మొదటి క్షేత్రం అయిన "తిరుచెందూర్" దర్శనం చేయించాడు. "తిరుచెందూర్" - సుబ్రహ్మణ్య స్వామి వారి 'ఆరుపడైవీడు'గా తమిళనాట ప్రఖ్యాతిగాంచిన ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి మరియు మొదటిది.

    స్వామి వారు సూరపద్ముని, తారకాసుర సంహారంకోసం ఇక్కడనుంచే సన్నాహాలు మొదలుపెట్టారని క్షేత్ర కథనంలో భాగంగా తెలుస్తుంది. సూరపద్ముడు ఒక మామిడి చెట్టురూపంలో వస్తే వాడి కోరిక మేరకు రెండు భాగాలుగా సంహరించి కుక్కుటము, నెమలి రూపంలో తీసుకుంటాడు. అంతేకాదు మిగతా ఏ క్షేత్రంలో అయినా స్వామి కొండమీద దర్శనమిస్తే ఇక్కడ స్వామి సముద్రపు వొడ్డున కొండపై దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు. 

    సమస్త గ్రహ, నాగ దోషాలను పరిహరించగల అత్యంత శక్తివంతమైన స్తోత్రముగా పెద్దలు చెప్పే 'సుబ్రహ్మణ్య భుజంగం' ఆది శంకరాచార్యులవారు ఇక్కడ కూర్చునే ధ్యానంలో స్వామి దర్శనం ఇస్తే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సముద్రమనే సంసారం నుంచి తరింప చేసేవాడు అని సూచన స్ఫురించేలాగా స్వామి సముద్రపు ఒడ్డున దర్శమిస్తాడు. ఇదే విషయం ఆదిశంకరులు భుజంగ స్తోత్రంలో తెలిపినట్టు తెలుస్తుంది.  

     మరిన్ని అద్భుత విషయాలకు మోహన్ కిషోర్ గారి ఈ క్రింది బ్లాగ్ చూడగలరు. 

(ఒక్కోసారి అంతర్జాల సమాచారం చూస్తే మన అజ్ఞానానికి సిగ్గుపడటం, వినమ్రమతో నమస్కారం చెయ్యటం తప్ప ఏమీ చెయ్యలేకపోతాము. అందుకే నేరుగా లంకెలు ఇవ్వటం ).

    ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే 'వల్లీ కూగై టెంపుల్' కి దారి అన్నట్టుగా ఇంగ్లీష్ లో  మనం ఆలయంలోపలికి వెళుతుంటే ఎడమ పక్క గోడలమీద కనపడుతుంది. అటు వెళ్ళితే ఒక చీమలపుట్టలా వున్న ఒక ఆలయం కనిపిస్తుంది. అది ఆది ఆలయం అన్నట్లు అక్కడ దర్శనం చేసుకుని ఆ తరువాత ప్రధాన ఆలయం దర్శనం చేసుకోవాలి అన్నట్టుగా ఒక స్నేహితుడు చెప్పాడు.

నేను ప్రధాన ఆలయం తరువాత చేసుకున్నాను. మీరు ఆ పొరపాటు చెయ్యకండి. తెలియనితనం, హడావుడి, కంగారు ఏమైతేనేం అసలు ఒక్కోసారి క్షేత్ర నియమాలు పాటించలేము. క్షేత్ర దర్శన సంపూర్ణ ఫలితం రావాలంటే ఆయా క్షేత్రాల దర్శన విధి తెలుసుకుని ఆచరించటం ఉత్తమం.

తిరుచెందూర్లో అభిషేకం పదిహేను వందల రూపాయలు. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు వెళ్లేముందు. 

 నేను ఒక పదినిమిషాలు లేట్ గా వెళ్ళటం వల్ల స్పెషల్ దర్శనం మాత్రం తీసుకున్నా. విభూతి అభిషేకం అద్భుతంగా జరుగుతుంది అని తెలిసింది. అంతేకాక ఇక్కడ ఇచ్చే విభూతి ప్రసాదంతో దీర్ఘవ్యాదులు కూడా తొలిగిపోతాయి అని భక్తుల విశ్వాసం. కనుక మీరు కూడా ప్రయత్నం చెయ్యండి.  

మొత్తానికి ఆ 'గురుగుహ'  - సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో తిరుచెందూర్ క్షేత్ర దర్శన ప్రాప్తి జరిగింది. మొత్తం ఆరుపడైవీడు క్షేత్రాలలో స్వామిని దర్శించే అనుగ్రహం కలిగింది.
ఈ జన్మకి అంత అనుగ్రహం ప్రాసాదించిన ఆ దండాయుధపాణికి సదా కృతజ్ఞుతుడిని (ఈరోజు ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చెయ్యటం, ఈరోజే తిరుచెందూర్ లో వున్న అదే స్వామి గురించి రాయటం, అంతకు ముందు రోజే రాద్దామనుకుంటే "లాప్ టాప్"   క్రాష్ కావటం కాకతాళీయం కాదు. అంత ఎందుకు కొన్నిరోజుల నుంచి స్వామి ఎందుకు అన్ని సార్లు 'ఘాటీ' కి రమ్మని పిలిచారో ఇప్పుడు అర్థం అవుతుంది).

 బహుశా ప్రపంచం ఆధ్యాత్మికత అనే నివురుగప్పిన నిప్పుతో కట్టబడి వుంది. ప్రతివారు సమయం వచ్చినప్పుడు వారి భూతి తొలగించుకుని, నిప్పు బయటపడి వాళ్ళ  జ్ఞాన జ్యోతులు వెలిగించబడతాయి. ఫీనిక్స్  పక్షిలాగా భగవంతుని వైపు ఎగురుతున్నారు. కాకపొతే ఫీనిక్స్ పక్షి సూర్యునికి చేరే మార్గంలో తన రెక్కలు కాల్చుకుంటే, మనం మన అజ్ఞానాన్ని కాల్చుకుని జ్ఞాన ప్రకాశాన్ని ఆ సూర్యమండలవర్తి అయిన నారాయణుని నుంచి పొందుతున్నాం. ఆ జ్ఞాన ప్రకాశం మిగతావారి దారికి కూడా వెలుగునిస్తుంది.

తిరుచెందూర్ స్వామి దర్శనం అయిన తరువాత నాగర్ కోయిల్ వెళ్ళాను. నాగర్ కోయిల్ లో ప్రఖ్యాతి గాంచిన నాగరాజ స్వామి దేవాలయం వుంది. నాగర్ కోయిల్ అన్న ఊరి పేరుకూడా ఈ ఆలయం వల్లనే వచ్చినట్టు తెలుస్తుంది. కృష్ణుడు, సర్ప రాజు వాసుకి ఇక్కడ ముఖ్య  దైవతాలుగా దర్శనమిస్తారు. బస్సు స్టాండ్ నుంచి ఆటో పట్టుకుని ఆలయం చేరుకున్నాను. ఒక కిలోమీటరు ఉంటుంది. 

ఆలయం బయట ఆలయ కోనేరు, పక్కన రావి చెట్టుదగ్గర నాగ ప్రతిమలు, విఘ్నేశుని ఒక చిన్న ఆలయం కనిపించాయి. పసుపు ప్యాకెట్ మరియు మగ్ తో పాలు అక్కడ షాప్ లో అమ్ముతున్నారు. అందరు పసుపు వేసి పాలతో అక్కడవున్న ప్రతిమలను అభిషేకం చేస్తున్నారు. నేను కూడా అలానే చేసి దర్శనానికి వెళ్లాను. నాగరాజ స్వామి ఇక్కడ అయిదు తలలతో దర్శనమిస్తాడు. దర్శనం చేసుకుంటున్నపుడు తెలుగువారు చాలామంది కనపడ్డారు. కాస్త ఒక్కడినే యాత్రకి బయలుదేరి రావటం వల్ల వాళ్ళని పలకరించడం సంతోషమయ్యింది. అక్కడ ఆలయ దర్శనం అంతా బానే జరిగింది కాని వచ్చేటప్పుడు చెప్పులు స్టాండ్లో మరిచిపోయి వచ్చేసాను.  మిగిలిన యాత్ర చెప్పులు లేకుండా అన్నమాట :). 

నాగర్ కోయిల్ లో దర్శనాదులు ముగించుకుని అక్కడనుంచి నేరుగా కన్యాకుమారి వెళ్లాను.  

కన్యాకుమారి అనగానే ప్రకృతి ప్రేమికులకు, సౌందర్య ప్రియులకు, భావుకులకు సముద్రంనుంచి ఎర్రని పండులాగా కనిపించే మన సూర్యమూర్తి రూపమే గుర్తుకువస్తుంది. అదేవిధంగా సముద్రంలో అస్తమించే మన స్వామిని దర్శించటానికి జనం బారులు కడతారు.

కన్యాకుమారి త్రివేణి సంగమ క్షేత్రం ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు అరేబియా సముద్రం ఇంకోవైపు హిందూ మహాసముద్రం వెరసి త్రివేణి సంగమ క్షేత్రం అయింది. వారణాసి పరమశివుని నివాసస్థలమైతే కన్యాకుమారి పార్వతీ అమ్మవారి నివాసస్థలమని స్థానికుల విశ్వాసం. 

ఆలయ స్థలపురాణం ప్రకారం ఆలయంలో కొలిచే కుమారి అమ్మవారుపరమశివునితో వివాహంకై సిద్ధపడిందట. ముహూర్త సమయానికి కూడా పరమశివుడు రాకపోయేసరికి విందుకు సిద్దంచేసిన బియ్యం, ఇతర పదార్ధాలు అలానే ఉంచేశారు అంట. అవే కాలక్రమేణా అక్కడ మనం సముద్ర తీరంలో చూసే బియ్యంను పోలిన ఇసుక రాళ్లు అని చెబుతారు. వివేకానంద రాక్, తిరువళ్ళువర్ విగ్రహం, గాంధీజీ స్మారక మందిరం, కుమారి ఆలయం ప్రత్యేక ఆకర్షణీయ ప్రదేశాలు. మరిన్ని విషయాలకు వికీపీడియా చూడగలరు. 

కన్యాకుమారిలో కూడా ఇతర క్షేత్రాలలో వలే ఒక్కరికి రూము ఇవ్వనున్నారు. షేరింగ్ బేసిస్ అయినా పరవాలేదన్నా కుదరదు అని అన్నారు. ఏమైనా సత్రాలు వుంటాయేమో హాలులో పడుకుని ప్రొద్దునే దర్శనం చేసుకుని వెళదామనుకున్నా వీలు లేకుండా పోయింది. దిక్కులేనివాడికి ఆ దేవుడే దిక్కు అంటుంటారు కదా.  ఐతే దిక్కులే 'అంబరాలుగా' కలిగిన 'దిగంబరుడు' మా స్వామి. మరి నాకు దిక్కులేకుండా చేస్తాడా !!!
అసలు ఆయన మేజిక్ ఇంకా మొదలవ్వలేదేమిటి చెప్మా అని భయంగా, కంగారుగా, ఓపికగా  రూమ్ కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నా. మా వాళ్ళ  సత్రం ఉండేది అన్నారు. వాళ్ళు  ఇచ్చిన అడ్రస్ లో చాలా వెతికాను కాని దొరకలేదు.మొత్తానికి ఒక లాడ్జి వాడు మా నాన్నగారితో మాట్లాడిస్తే రూమ్ ఇస్తాను అన్నాడు. అలా మాట్లాడించి రూమ్ పట్టుకున్నా. స్వామి దయ వల్ల ఆ రాత్రి అలా గడిచింది.

కన్యాకుమారిలో ముందురోజు తిరుచెందూర్ దర్శనం అయ్యాక, సాయంత్రానికి చేరుకున్నాక మొదట భగవతి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అమ్మవారి ముక్కెర గురించి ఎందుకు అంతలా చెబుతారో ఆ క్షణం దర్శనంలో అర్థం అయింది. రెండు దీపాలు వెలుగుతున్నట్లు కనిపిస్తాయి. చూసి తీరవలసిన అద్భుతం అది. 

పూర్వపు రోజులలో లైట్ హౌస్ లు ఉండేవి కావు కదా ! అమ్మవారి ముక్కెర నుంచి వచ్చే వెలుగులు చూసి సురక్షిత దీవి అనుకుని వచ్చే నావికుల నావలు అక్కడ సముద్రంలో వుండే రాళ్ళని ఢీకొని ధ్వంసం అయ్యేవి. అందుచేతనే ఆలయం తూర్పుకు అభిముఖంగా వున్నా గాని, దర్శనం మాత్రం ఉత్తర ద్వారంనుంచే చేయిస్తారు. సంవత్సరానికి ఒక నాలుగు సార్లు మాత్రమే తూరుపు ద్వారం తెరిచి ఆ ద్వారం గుండా ప్రవేశం చేయిస్తారు అంట. దర్శనం చేసుకున్నప్పుడు మీ కళ్ళతో మీరే దీపపు శిఖలులుగా కనపడే ఆ అద్భుతాన్ని చూడవచ్చు. 

ఇక నా విషయానికి వస్తే ఆ రాత్రికి లాడ్జిలో రూమ్ దొరికింది అని చెప్పాను కదా ! యాత్రకి ముందే స్వామి పరీక్ష సిద్ధంచేస్తాడు అనుకుంట. బట్టలు పెద్దగా లేవు. పంచె, ఒక షర్ట్ తో పడుకుని, అదే పంచెతో ప్రొద్దునే ఆలయం పక్కనే వున్న సముద్రపు ఒడ్డున వున్న స్నానపు గదులలో స్నానాదులు ముగించుకుని పక్కనే సముద్రంలో మళ్ళీ సముద్ర స్నానం చేసి వందలాదిగా గుమిగూడి వున్న అయ్యప్పలు, స్కూలు పిల్లలు, భక్తులు, పర్యాటకులు, అందరితో కలిసి నేను కూడా సూర్యోదయానికై ఎదురుచూస్తున్నా. 

ఎంతసేపు ఎదురుచూసినా స్వామి దర్శనం అవ్వటంలేదు. వర్షాకాలం మబ్బులుపట్టి వున్నాయి. అస్సలు స్వామి వస్తాడో లేదో అన్న సందేహం, నిరాశా, నిస్పృహ ఒకపక్క, వస్తాడు అన్న ఆశ, నమ్మకం మరోపక్క. 

గూగుల్ వాడు ఇచ్చిన సూర్యోదయం సమయం ఎప్పుడా అని చూసా. అది కూడా దాటిపోయింది. ఉండాలో, వెళ్లాలో అర్థంకావటం లేదు. మరో పక్క ఆలస్యం అయిపోతుంది. వెళ్లిపోదామనుకునే సమయంలో ఎలావచ్చిందో తెలియదు కాని "శిశిర నాశకః" - రోజు పఠించే ఆదిత్య హృదయ స్తోత్రం నుంచి స్ఫురణకు వచ్చింది. వెంటనే ఆదిత్య హృదయం పఠించటం మొదలు పెట్టా. అంతే అద్భుతం ఆవిష్కరణ అయింది. స్వామి దర్శనం ఇచ్చాడు. అక్కడ చేరిన కేరింతలతో, అరుపులతో కోలాహలంతో సందడి వచ్చేసింది. ఫోటోల ఫ్లాష్లు , సెల్ఫీలతో అక్కడ ప్రపంచమే మారిపోయింది.  నాకు మాత్రం మనసంతా సంతోషం నిండి బరువెక్కిపోయింది. దర్శన మిచ్చిన స్వామిని మనసారా ప్రార్థించి, మరోసారి నా నమ్మకాన్ని పెంచావు కృతజ్ఞతలు తెలుపుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాను. 

(మన గొప్పతనం అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఉండదు. మంత్రాధిష్ఠాన దేవత మంత్రానికి ఎలా కట్టుబడుతుందో అలా అగస్త్యుడు, శ్రీరాముడికి రామరావణ యుద్ధంలో ఆదిత్య హృదయం ఉపదేశించటం, రాముడు మూడుసార్లు ఆచమనం చేసి పఠించటం రావణుడిని యుద్ధంలో గెలవటం, ఆ స్తోత్రం పఠించేవారికి స్తోత్రంలో చెప్పినట్టు సకల మంగళాలు జరుగుతాయి అని పునః పునః నిరూపించటానికి స్వామి ఈ అద్భుతాన్ని చేసాడు. అంతేకాని నా బోటి వాడి భక్తో, ప్రతిభో కాదు అని విన్నవించుకుంటున్నా)

ఇక ఆ సముద్రపు వొడ్డున వేరే పక్క వెళ్ళితే త్రివేణి / సముద్ర సంగమం అని బోర్డు ఉంటుంది అని చెప్పాడు స్నేహితుడు. ఆ హడావుడిలో కుదరలేదు. కనుక తోచినవిధంగా సముద్రస్నానం, సూర్యనారాయణ స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం అలా జరిగిపోయాయి.

అమ్మవారి దర్శనం అయ్యాక, లాడ్జికి వెళ్లి పంచె తీసి వున్న ఒక ఉతికిన జత కట్టుకుని,  అమ్మవారి టెంపుల్ / సముద్రపు ఒడ్డున  బోటింగ్ టికెట్ తీసుకుని పెద్ద బోట్ మీద అందరితోపాటు నేను కూడా సముద్ర మధ్యంలో వున్నా వివేకానంద మెమోరియల్ రాక్ మరియు తిరువళ్ళువార్ రాక్ చూద్దామని బయలుదేరాము. 

సమయం ఎక్కువలేకపోవటం వల్ల ఆరోజు ఒక్క వివేకానంద మెమోరియల్ మాత్రం చూపించి తీసుకొచ్చేసారు. స్పెషల్ టికెట్ అన్నారు కాని అది కేవలం లైన్ లో శ్రమపడి పోకుండా తొందరగా బోట్ వద్దకి రావటానికి మాత్రం పనికివస్తుంది అని చెప్పారు. అందుకని అది తీసుకోలేదు. 

మా పెద్దమ్మ గారి అబ్బాయి వాస్తు, జ్యోతిష్యంతో పాటు మహా శివభక్తుడు. ఆయన ఆ కొండమీద వున్న ధ్యానమందిరంలో ఒక మంత్రం చెప్పి పఠించమంటే అలానే చేశాను. 

ఆ మంత్రార్థం నవగ్రహాలకు తల్లివైన అమ్మవారికి నమస్కారం అని. చాలా శక్తివంతమైనది అని చెప్పాడు. 

అక్కడ ముగించుకుని తిరిగి లాడ్జికి వచ్చేసాను. అక్కడ నుంచి త్రివేండ్రం బయలుదేరాను. త్రివేండ్రం అక్కడికి దగ్గరే. త్రివేండ్రము ఎందుకంటె భారతదేశంలో వున్న ఆలయాలు అన్నిటిలోకి ధనవంతమైన ఆలయంగా మారి ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న 5 వేల సంవత్సరాల చరిత్ర వున్న అనంత పద్మనాభ ఆలయం వున్నది అక్కడే కాబట్టి. అనంతపద్మనాభుడు అక్కడే దర్శనమిచ్చేది 

అనంత పద్మనాభ స్వామి, తిరువనంతపురం.

అనంత పద్మనాభ స్వామి వారు శేషుని మీద యోగనిద్రలో ఉన్నట్టు ఆలయంలో భక్తులకు దర్శనమిస్తారు. అంతేకాదు అనంతపద్మనాభ స్వామి ఆలయం ఆళ్వారులు తమ దివ్య ప్రభంధాలలో కీర్తించిన 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఒకానొక క్షేత్రం. అనంత పద్మనాభుడి గురించి, అయన సంపద గురించి, దానికి రక్షణగా వున్న నాగ బంధం గురించి, ట్రావెంకూర్ సంస్థానం గురించి దేశమేమిటి, ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నది అనటం అతిశయోక్తి కాదు. 

మనం గుడి బయటకి వస్తుంటే ఒక నీళ్ల పంపు కనిపిస్తుంది. చూడండి. రాజకుటుంబంవారు ఆలయంలో దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేటప్పుడు కాళ్ళు కి అంటుకుని వున్న ఇసుక కూడా రాకుండా జాగ్త్రతగా కడుక్కుని వచ్చేవారు అంట. స్వామి వారి సంపద అంటే వారికున్న భయ,భక్తులు అలాంటివి అన్నమాట. ఇప్పటి రోజుల్లో పరిస్థితి ఏమిటో ఆ పెరుమాళ్ళకే ఎరుక. 

అసలు కేరళ రాష్ట్రము రాజధాని తిరువనంతపురం పేరు వచ్చిందే ఈ ఆలయం వల్ల అని తెలుస్తుంది. అనంతపురం, శయనంతపురం అనే ఇతర పేర్లు కూడా ఉన్నట్లు తెలియవస్తుంది. తిరు అనంతపురం అంటే దేవుడైన అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని తెలియవస్తుంది. 

గుడిలో ప్రవేశం హిందూ దర్మం మీద విశ్వాసం వున్నవారికి మాత్రమే అన్న ప్రకటన దర్శన మిస్తుంది లోనికి వెళ్లే సమయంలో. 

సాంప్రదాయ వస్త్ర ధారణ కచ్చితంగా వుండాలిసిందే. వంద రూపాయలు లోపే పంచె దొరుకుతుంది. అక్కడ పక్కన వున్న షాప్ వాళ్ళు పిలిచి మరీ అమ్ముతుంటారు. దేవాలయం వారి కౌంటర్ లో కూడా దొరుకుతుంది. 

(ఇక్కడో విషయం చెప్పాలి. పంచె కట్టుకోవటం తెలియక, మా రూమ్మేట్ తిరుపతి ప్యాకేజీ మాట్లాడుకుని కూడా వెళ్ళటం మానేసాడు :(. ఒక్కోసారి ఏది చెబితే ఎలా తీసుకుంటారో అని శ్రీ చాగంటి వారు చెప్పేవారు. నాకు అది మా రూమ్మేట్ వల్లన అనుభవం అయింది. అదేంటి ఇలా కూడా వుంటారా అని అడగకండి. ఎవడి భయాలు, బలహీనతలు వాడివి. ఆ సూర్య నారాయణమూర్తే సాక్షి. 

సరే ఇంతకీ పంచె కట్టుకోవటం మీకు రాకపోతే దయచేసి అదేదో పెద్ద బ్రహ్మ విద్య అనుకోకండి . మీరు టవల్ లేదా లుంగీ ఎలా చుట్టుకుంటారో అలానే చుట్టుకోండి చాలు. గోచిపాత పెట్టుకోమని ఎవరూ అడగరు. వందలో పది మంది కూడా గోచి పెట్టుకోరు. ఇంత చిన్న విషయం గురించి మా బెంగాలీ రూమ్మేట్ తిరుపతి ప్రయాణం మానేసాడు (తిరుమల వాసుని దర్శనం వాడి చిన్నప్పటి మొక్కు అంట. కాలం కర్మ కలిసి రాకపోతే ఇంతే కాబోలు) 

సరే విషయానికి వస్తే, 

అనంతపద్మనాభ స్వామి ఆలయం పక్కనే డ్రెస్ మార్చుకోవటానికి రెండు గదులు ఏర్పాటు చేసారు. ఆడవారు చీర లేదా సాంప్రదాయ వస్త్రధారణ చెయ్యవచ్చు. నేను వెళ్ళినప్పుడు విజయవాడ అమ్మాయిలు ఇద్దరు కనపడ్డారు. ఒకామె ఎలానో కష్టపడి చీర చుట్టుకుంది. వేరే ఆమె పంజాబీ డ్రెస్ లో వచ్చేసరికి వెనక్కి పంపారు. ఒక పిల్లవాడిని కూడా వెనక్కి పంపారు. నిబంధన కచ్చితంగా అమలుచేస్తున్నారు. 'భక్తి ఉంటే చాలు' అని లుంగీలు, నైట్ ఫాంటులు, నిక్కర్లు వేసుకుని వస్తుంటే అటు వైవు నుంచి కూడా సంప్రదాయం, సంస్కారం, నియమాలు, నిబంధనలు లాంటివి వస్తాయి అనుకుంటా. అది వస్తే ఇది కూడా వస్తది మరి :).      

నేను కన్యాకుమారి నుంచి బస్సు  పట్టుకుని తిరువనంతపురం వెళ్తున్నప్పుడు కేరళ సరిహద్దు వూరులో ప్రవేశించేసరికి  కేరళ పోలీసులు పైపైన బస్సు  ఎక్కి తనిఖీ చేసారు. 

బస్సు స్టాండ్ లో దిగి ఆలయానికి ఒక ఆటో పట్టుకుని వచ్చాను. ఆటో అతనితో మాట్లాడుతుంటే తాను అర్థం చేసుకుని ఇంగ్లీష్ లో తోచిన ప్రయత్నంతో మాట్లాడి తెలిసినది చెప్పాడు. ఆలోచిస్తే దేశమో, ప్రపంచమో అందరివీ వేరే వేరే వేష, భాషలు కాని మనుషులు, కుటుంబం, మంచితనం వంటి ఏ విషయంలోను పెద్ద బేధాలు వుండవు ఏదో సినిమాలో చెప్పినట్టు బేసిక్ గా మనిషంటేనే మంచోడు అని అనిపించింది ఆ క్షణం.  

అంతకు ముందు తిరువనంతపురం బస్సు స్టాండ్ లో కేరళ 'టీ' తాగే ప్రయత్నం చేసాను. పరిమాణం ఎక్కువ, డికాషన్, వేడి అన్నీ ఎక్కువే కానీ పాలు మాత్రం తక్కువ అనిపిస్తుంది. కేరళ వారు ఎక్కువ మొత్తంలో (నాణ్యత కన్నా) తాగటానికి ఇష్టపడతారు అన్నట్టు ఫ్రెండ్ చెప్పాడు. ఎవరి గోల వారిది. మీరు పట్టించుకోకండి :). 

ఆలయంలో స్పెషల్ టికెట్ 250 రూపాయలు. పూజా సామాగ్రి వారే ఇస్తారు. ఆలయంలో స్పెషల్ టికెట్ తీసుకుని లోపలి వెళుతుంటే గైడ్ సర్వీస్ వాళ్ళు కనపడలేదు కానీ గైడ్ సెక్షన్ అన్నట్టు కనపడింది. 

ముందుకు వెళ్లి ఎడమపక్క గా వెళ్ళితే స్పెషల్ దర్శనం అని నేరుగా తీసుకెళ్లి ప్రధాన దైవం దగ్గర వున్న సాధారణ లైన్లో కలిపేశారు. అయ్యప్పలు దర్శనం లైన్లో చాలా మంది వున్నారు. నన్ను కలిపేటప్పుడు అయ్యప్పలతో స్పెషల్ దర్శనం అని చెప్పి వారి ముందు లైన్లో ప్రవేశబెడితే కొంచెం మనస్సు  బాధ పడింది. అయ్యప్ప అని పిలుస్తున్నాము అంటే పిలుపే కాదు కదా ! స్వామి మన ముందు వున్నట్టే అందుకే అయ్యప్ప మాలధారి కనిపిస్తే నమస్కారం చేసేది. కాని ఏమి చేస్తాము స్పెషల్ టికెట్ తీసుకున్నదే బస్సు  దాటిపోతుంది. ఇక్కడ ఎంత సమయం పడుతుందో తెలియక అని. పైగా టికెట్ కూడా ఇంకా బుక్ చేసుకోలేదు. స్వామికి నా పరిస్థితి వివరించి (అయన తెలియనిది ఏముంది ఆయన ఒకానొక నామం "సర్వజ్ఞః") క్షమాపణ కోరుకోవటం తప్ప. 

అంతరాలయం ప్రవేశించిన వెంటనే స్వామి మనకి మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటిద్వారంలో స్వామి ముఖం దర్శనమిస్తే, రెండవ ద్వారంలో స్వామి నాభి, మూడవ ద్వారం గుండా స్వామి పాదాలు దర్శనమిస్తాయి. 

చాలా పెద్దగా, శయన రూపంలో దర్శనమిస్తాడు. చిటుక్కున అయిపోయినట్టు వుంది. బయటకు వచ్చేటప్పుడు ఎవరో నిధులు వున్న గదులు అన్న విషయం వచ్చి, ఇంతకీ ఎక్కడ అవి అని ఒక అబ్బాయిని అడిగితే స్వామి దర్శనం చేసుకుని కిందకి దిగుతుంటే నేలమీద విభూతి తుడిచినట్టు కనిపిస్తుంది కదా అక్కడే తలుపులు వున్నాయి అవే అవి అన్నట్టు చెప్పాడు. మరి అతనికి నిజంగా తెలిసో లేదో నాకు మాత్రం తెలియదు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. దర్శనం పూర్తి చేసుకున్నాక ఆలయంలో వచ్చేటప్పుడు ప్రదక్షిణాలు చేసుకుంటూ శివాష్టోత్తర స్తోత్రం చదువుకుంటుంటే మాత్రం, అబ్బో  ఆ ఆనందమే వేరప్పా !!!  చెప్పేది కాదులే, అనుభవైకవేద్యమవ్వాలి !!!.

ప్రదక్షిణ ముగించుకుని వస్తుంటే ఎడమపక్క  గణపతి వుపాలయం అనుకుంటా. అక్కడ  కూడా దర్శనం ముగించుకుని బుక్స్  మరియు స్వామి వారి ఫోటోలు అమ్మే షాప్ ఒకటి కనపడింది ఎగ్జిట్ లో. అక్కడ చూసుకుని బయటకు వస్తుంటే నీళ్ల పంపు కనపడింది. ఇందాక చెప్పను కదా ! ఈ పంపు గురించి. అక్కడే ఏవో తినుబండారాలు అమ్ముతున్నారు. భక్తులు అవి తిని, అక్కడ చేతులుకడుక్కోవటం మాత్రం కనిపించింది. మాములుగా దైవదర్శనం తరువాత కాళ్ళు కడుక్కోవటం అంటే పెద్ద తప్పు. రాజకుటుంబీకులు చేసినట్టు ఎవరైనా ఇపుడు చేస్తున్నారు ఏమో అని చూసాను. ఎవరు ఆలా చెయ్యటం లేదు. కనుక దేశ,కాల నియమాలుననుసరించి నేను కూడా వెనక్కి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోలేదు. 

పంచెలు చాలా తక్కువ రేట్ ఇక్కడ. ఆలయం వారి ఉద్దేశ్యం భక్తులకు తక్కువ ధరకి ఇవ్వాలి అని అనుకుంటా. పంచె వున్న నేను ఇంకొక పంచె కొందామనుకుని డిస్కౌంట్ రూపంలో స్వామి వారి సొత్తు పొందినట్టే అవుతుందేమో అని అనిపించి తీసుకోలేదు. లేకపోతె మంచి చౌక బేరమండి :). ఇలా ఆలోచిస్తే మేము బతకలేము అంటే మీకో నమస్కారం చెయ్యటం తప్ప నేను చెప్పేదేమీ లేదు అన్నమాట :P.

ఇక ఆలయం బయటకు వచ్చి ఒక ఆటో ఎక్కి బెంగళూరు బస్సులు పోయే దగ్గరలో వున్న పాయింటు తీసుకుని వెళ్ళామన్నా. ఆటో అతను టూర్ ఆపరేటర్స్  వున్న ఏరియాలో ఒకచోట దింపాడు. 

ఒక స్లీపర్ బస్సు  టికెట్ మాత్రం వుంది. ఆ టికెట్ నా కోసమే అనిపించింది. ఎందుకంటె నాకు మైల వచ్చిఅప్పుడు టికెట్ మిస్ అయ్యింది. ఇప్పుడు దొరికింది. ఏదో కర్మ సూత్రం లంకె దొరికినట్టు అనిపించింది. దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆలా యాత్ర అనుభవాలు తలుచుకుంటూ, ముగించిన ఆనందంతో బెంగళూరు చేరిపోయాను. 

కొసమెరుపు చెప్పలేదు కదా ! అటు చేసి, ఇటు చేసి నా 'లాప్ టాప్' రిపేర్ కి వెళ్లి రేపటితో ఈ ఆర్టికల్ రాయటం ముగించేలా వుంది. రేపు (బుధవారం) చూస్తే జగత్తును తన సప్త కిరణాలతో పోషించే ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన మన స్వామి సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు అయిన "రథ సప్తమి" !!!









సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఇక్కడ నుంచే వెళ్ళేది


గుడిలోకి ప్రవేశ ద్వారం



 గుడిలోకి తిన్నగా వెళ్ళండి ఇక్కడ నుంచి 



వెళుతుంటే కుడిపక్క నుంచి మరొక దారి కూడా వుంది అది ఇలా ఉంటుంది. 


వల్లీ గుహ (Kugai) అని చెప్పాను కదా ! వెళుతుంటే ఎడమపక్క గోడ మీద ఇలా కనిపిస్తుంది.




ఎడమపక్క చూడగానే ఇలా కనిపిస్తుంది.


నెమలి కనిపించిందా ???











 ప్రధాన ఆలయం లోపలి దారి. ఇక్కడే టికెట్ కౌంటర్లు ఉంటాయి.


ఈసారైనా నెమలి కనిపించిందా ???


నాగర్ కోయిల్ వచ్చే దారిలో వాతావరణం చూడండి. ఎంత అద్భుతంగా వుందో !!!











 నాగర్ఆ కోయిల్ ఆలయంలో ఇక్కడే మనం పసుపు, పాలు పోసేది.


ఆలయం బయటకు వస్తుంటే 


ఇక్కడ నుంచి కన్యాకుమారి 

ఫోటోలు   









సూర్యోదయ సమయం 

















ఇదే మనం ఎక్కబోయేది




























ఎడమపక్క వివేకానంద స్మారక మండపం కుడిపక్క తిరువళ్ళువర్ విగ్రహం ఇవే నేను చెప్పింది.







తిరువనంతపురం వెళ్లే దారిలో





అనంతపద్మనాభ స్వామి గుడి






ఇక్కడే మనం పంచె కట్టుకునేది. రూంలున్నాయి :)