Saturday, October 18, 2014

సోమేశ్వర ఆలయం, హలసూరు, బెంగళూరు

 మునుపు పోస్టులో, బెంగళూరులో వున్న అత్యంత పురాతనమైన ఆలయాలు గురించి చెప్పినప్పుడు హలసూరు (లేదా హల్సూర్) సోమేశ్వర ఆలయం గురించి చెప్పాను కదా ! ఈరోజు ఆ ఆలయ దర్శనం లభించింది. ఇక్కడే రామకృష్ణ మఠం, మెట్రో కూడా వున్నది. ఇవన్ని దాదాపు దగ్గర దగ్గరగానే ఉంటాయి. రామకృష్ణ మఠం చిరునామా కోసం ఇక్కడ చూడండి.

కెంపెగౌడ వేటలో భాగంగా అలసి, ఒక చెట్టు క్రింద నిద్రపోయినప్పుడు, కలలో సోమేశ్వరుడు దర్శనమిచ్చి, అక్కడే పడుకున్న చోటే నిధి వున్నట్టు, అది తీసి సోమేశ్వర ఆలయం నిర్మించమని ఆదేశించినట్టు స్థల పురాణం చెబుతుంది. దీనికే వేరొక వెర్షన్ కూడా వున్నది యలహంక నాద ప్రభుగా  పేరు గాంచిన రాజు జయప్ప గౌడకే ఈ అనుభవం జరిగింది అని, ఈ ఆలయ పునరుద్దరణ చెయ్యమని సోమేశ్వరుడే కలలో ఆదేశించినట్టు చెప్తారు. వివరాలు వికీపీడియా లో ఇక్కడ చూడండి.

జనాలు పల్చగానే వున్నారు. దర్శనం బాగా జరిగింది. అభివృద్ధి పోకడలు పెద్దగా సోకకపోవటం కూడా బానే వుంటుంది అనిపించింది. రంగులు అవి పెద్దగా లేకుండా పురాతన కట్టడాల లాగా బావుంది. రంగులు అవి ఆగమా శాస్త్రం వప్పుకుంటుందో లేదా తెలియదు కాని మూల ప్రయోజనం దెబ్బతినకుండా (ఆ స్థాయి జ్ఞానం, మేదస్సు ఇప్పటి తరాలకు వుంటే :) ) అభివృద్ధి పరచవచ్చు అనిపించింది.

ఇక్కడ సోమేశ్వరుడు, అమ్మవారితో పాటు, భీమేశ్వర, మారుతి, గణేశ ఇతర వుపాలయాలు వున్నవి.

ఆలయ ప్రాంగణంలో పావురాలు అవీ వున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఎప్పుడో ఒకసారి బస్సులో ఒక వ్యక్తి పరిచయం అయినపుడు, మాటల సందర్భంలో ఏలిన నాటి శని దశ ప్రస్తావన వచ్చింది. ఆయన దినచర్యలో బాగంగా ఎపుడూ కూడా నల్ల చీమలకు పంచదార అవి వేస్తూ వుండటం కొన్ని సంవత్సరాల పాటు ఆయన చేసినట్టు చెప్పారు. ఏలిన నాటి శని దశలో ఆయన కేవలం ప్రతీ రోజు ఆఫీసుకు దూర ప్రయాణం, శ్రమ మినహా మరే బాధలు పడకుండా గడచి పోయినట్టు చెప్పారు. చిన్న చిన్న సత్కర్మలు కూడా దినచర్యలో బాగంగా చేసుకుంటూ పొతే ఒకనాటికి అవి పెద్ద ఫలాలుగా చేతికి అందివస్తాయి. మంచికి మంచి, చెడుకు చెడు కర్మ ప్రాథమిక సిద్దాంతం కాబోలు !

మా స్నేహితుడు అక్కడ పూజారి గారితో మాట్లాడి, కొంత మేత షాప్ లో కొనివేస్తుంటే దేవాలయ సిబ్బంది వారించారు. పరిశుభ్రత మంచిందే. సాధారణ భక్తులకు అది పెద్ద విషయంలా కనిపించకపోయిన, దేవాలయ పరిశుభ్రత అత్యంత శ్రమతో కూడుకున్నది. పావురాలకోసం ఆలయం లో ఒక పక్కగా ఏదైనా ఏర్పాటు చేసివుంటే బావుండును అనిపించింది. దేవాలయం బయట మిగతా మేత వేసి సోమేశ్వరుడిని స్మరించుకుంటూ ఇంటి ముఖం పట్టాము.  చిరునామా గురించి అడిగితే సోమేశ్వర ఆలయం,
హల్సూర్ అని చెప్తే అందరికి తెలుస్తుంది అని చెప్పారు. మా ఆటో అతనికీ అదే చెప్పాము బయలు దేరేటప్పుడు :).




















No comments:

Post a Comment